Read more!

రాం జెత్మలానీకి బిజెపి రామ్ రామ్

 

 

మొదట్నుంచీ రామ్ జెత్మలానీకి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాపులారిటీ అంటే కాస్త మక్కువ ఎక్కువే. పదునైన పదాలతో చురకత్తుల్ని విసిరేయడం, అవి దీపావళి టపాసుల్లా మారి తెగపేలుతుంటే సంబరపడిపోవడం జెత్మలానీకి ఆనందం కలిగించే విషయం. తనని మాట అనగలిగినవాళ్లు ఇంటాబైటా లేరన్న ధీమా కూడా జెత్మలానీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్నుంచీ దుందుడుక మాటలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సీనియర్ లాయర్ గారు బిజెపి నేతగా మారిన దగ్గర్నుంచీ నోటికొచ్చినట్టల్లా మాట్లాడి పార్టీని తెగ ఇరుకున పెడుతున్నారు.


జెత్మలానీ వ్యాఖ్యలతో తలబొప్పికట్టించుకున్న బిజెపి పార్టీ ఇకపై ఆయన్ని ఉపేక్షించే ప్రశ్నే లేదని నిర్ణయించుకుని అవకాశంకోసం కాచుక్కూర్చున్న తరుణంలో రామ్ మరోసారి వాడివాడి మాటలనే తూటాల్ని ప్రయోగించారు. సిబిఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా నియామకంపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాక, దమ్ముంటే నాపై చర్య తీసుకోండంటూ బిజెపి అధిష్ఠానానికి సవాల్ కూడా విసిరారు.


అడ్డగోలుగా మాట్లాడ్డం ఒక ఎత్తైతే, నాకంటే మొనగాడెవరూ పార్టీలో లేరన్నట్టుగా అర్ధం వచ్చేలా దమ్ముంటే నా మీద చర్య తీసుకోండి ఛాలెంజ్ అంటూ జెత్మలానీ విసిరిన సవాల్ నేరుగా గడ్కరీ గుండెల్లో గుచ్చుకుంది. చాలా రోజులుగా తనని ఏకి పారేస్తున్న జెత్మలానీమీద గుర్రుగా ఉన్న బిజెపి అధ్యక్షుడు గడ్కరీ.. ఘనత వహించిన లాయర్ గారిపై వేటు వేశారు.



మొదట్నుంచీ జెత్మలానీని వెనకేసుకొస్తున్న శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా వంటి నేతలకుకూడా ఇండైరెక్ట్ గా వార్నింగిచ్చేందుకే బిజెపి అధిష్ఠానం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయ్.. కానీ.. తనపై పార్టీ వేటువేసిన తర్వాత ఇంతవరకూ జెత్మలానీ నోరు విప్పనే లేదు. ఆయన సైలెన్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి మాటాలు దూసుకొస్తాయోనన్న ఉత్కంఠ జనంలో విపరీతంగా పెరిగిపోతోంది.