మహాకుంభమేళాలో తొక్కిసలాట: 36 మంది మృతి

        మహాకుంభమేళాలో అనూహ్యంగా సంభవించిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. మౌని అమావాస్య పురస్కరించుకొని కుంభమేళాకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు పూర్తిచేసుకొని అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తిరిగి వచ్చిన సమయంలోనే రాత్రి 7 గంటలకు ఈ ఘటన జరిగిందని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ హరీందర్‌రావు తెలిపారు. 5, 6 నెంబర్ల ప్లాట్‌ఫారాల వద్దకు వేలాదిమంది యాత్రికులు ఒకేసారి చేరుకోవడంతో ఈ ఘటన సంభవించింది. ప్రత్యక్షసాక్షులు చెపుతున్న కథనం ప్రకారం, యాత్రికులు పెద్దసంఖ్యలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైకి చేరడంతో ఒక్కసారిగా అది 6వ నెంబర్‌ ప్లాట్‌ఫారంపై కూలిపోయింది. మూడు గంటల తర్వాత 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 10 మరణించినట్లుగా అర్ధరాత్రి అందిన సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 36 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.ఈ తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు భారతీయ రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఔనంటే కాదనిలే వద్దంటే ఇమ్మనిలే....

  రాబోయే ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని ఖాయం అయిపోయిన తరువాత, ఇప్పుడు అందరి కళ్ళు దాని ప్రత్యమ్నాయమయిన భారతీయ జనతా పార్టీ మీదనే ఉన్నాయి. ఆ పార్టీలో ప్రముఖంగా మోడీ, అద్వానీ పేర్లు వినిపిస్తున్నపటికీ, మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ప్రధాన మంత్రి పదవికి ఆశగా ఎదురు చూస్తున్నారు.   వీరికి అదనంగా యన్.డీ.యే. కూటమి నుంచి కూడా కొందరు మాక్కూడా ప్రధాన మంత్రి పదవికి ‘ఒకే ఒక్క చాన్స్!’ అంటూ తమ సహచారులద్వారా తమ గళం వినిపిస్తున్నారు. వారిలో సమైక్య రాష్ట్రీయ జనత దళ్ పార్టీ అధ్యక్షుడయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకరు.   మూడు రోజుల క్రితం శ్రీ లంక అధ్యక్షుడు రాజపక్స బీహారులోని బౌద్ధ గయకు వచ్చిన సందర్భంగా, ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్ళిన నితీష్ కుమార్ ను, పత్రికలవారు ఆయన పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి హరి కిశోర్ సింగ్ ‘నితీష్ కుమార్ ప్రధాన పదవికి అన్ని విధాల అర్హుడు’ అన్నమాటలను గుర్తు చేసి, ఆయన ప్రతిస్పందన కోరినప్పుడు, "ఇటువంటివన్నీ పనికిరాని మాటలు. నేను ప్రధాన మంత్రి పదవి రేసులో లేను. ఎందుకంటే నేను ఆ పదవికి యోగ్యుడినికానని భావిస్తున్నాను. మా యన్.డీ.యే. కూటమిలో భారతీయ జనతాపార్టీయే అతి పెద్దపార్టీ గనుక సహజంగా దానికే మొదటి అవకాశం ఉంటుంది. ఒకవేళ, అది ఆ అవకాశాన్నిఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడే, కూటమిలో ఇతర పార్టీలకు ఈ విషయంపై ఆలోచించే అవసరం ఏర్పడుతుంది. భారతీయజనతా పార్టీ త్వరలోనే తమ నాయకుడిని ప్రకటించే అవకాశం ఉందనుకొంటున్నాను. గనుక,ఆ పార్టీ తన నిర్ణయం ప్రకటించిన తరువాతే మా పార్టీ అభిప్రాయం చెపుతాము,” అని అన్నారు.   అయితే, “బీహార్ రాష్ట్రంలో ఆలూ (బంగాళ దుంపలు) ఉన్నంత కాలం, లాలూ కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడు” అని స్వోత్కర్ష (స్వంత డబ్బా) చేసుకొన్నఆయన  చేతిలోంచి అధికారం గుంజుకొని, తనదయిన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్ననితీష్ కుమార్ అంటే గిట్టని  లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఆయన మాటలను నమ్మడం లేదు.   నితీష్ కుమార్ తన అనుచరుల మాటలను మీడియా ముందు ఖండిస్తున్నపటికీ, తన అభ్యర్దిత్వంపై కూటమిలో మిగిలిన పార్టీల అభిప్రాయం తెలుసుకొనేందుకే, ఆయన స్వయంగా తన అనుచరుల ద్వారా ఈ చర్చలేవదీస్తున్నాడని లాలూ అభిప్రాయం వ్యక్తం చేసారు.   “ప్రధానమంత్రి పదవిపై నాకూ ఆశుంది, గానీ సాధ్యాసాద్యాలు కూడా చూసుకోవాలి కదా? ఆయన బీహార్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్నఅది దేశ ప్రధాని పదవి చెప్పటేందుకు ప్రత్యేక అర్హత కాబోదు కదా? ఒకవేళ నితీష్ కుమార్ అదే తన ప్రధాన అర్హత అని భావిస్తే నేనూ, నా భార్య రబ్రీ దేవీ కూడా బీహార్ ముఖ్యమంత్రులుగా చేసాము గనుక, ఆయన కన్నా ముందు మేమే ప్రధాన మంత్రి పదవికి అర్హులమని అనుకోవాల్సి ఉంటుంది,” అని లాలూ ప్రసాద్ అన్నారు.   మన దేశ ప్రధాన పదవికి ఇంతమంది అర్హులుండగా ఇక మనకేల చింత?

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రేప్

        సాఫ్టువేర్ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతికి ఆ సంస్థ యజమాని కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దిండుక్కల్ అలగానగర్‌కు చెందిన 25 ఏళ్ల యువతి ఓ సాఫ్టువేర్ సంస్థలో పని చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆ యువతికి ఆ సాఫ్టువేర్ సంస్థ యజమాని కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన ఆమెకు జరిగిన విషయాన్ని చెప్పాడు. తాను సదరు దృశ్యాలను చిత్రీకరించానని.. ఎవరికైనా చెబితే ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. పలుమార్లు ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. భరించలేక ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఓవైసీ బ్రదర్స్‌కు కిరణ్ మరో ఝలక్!

        కాంగ్రెస్ పార్టీతో పొత్తు వదులుకున్నాక ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరులకు షాక్ మీద షాక్ తగులుతున్నాయి. మిథాని వద్ద ఉన్న రెండున్నర ఎకరాల భూమికి సంబందించి గతంలో ఒవైసీ సోదరులకు ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ను కిరణ్ సర్కార్ రద్దు చేసింది. నిజానికి ఆ రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఒవైసీ ఆస్పత్రికి ఇవ్వాలనుకుంది. అప్పట్లో రాజకీయంగా మద్దతు ఇస్తుండటమే ఇందుకు కారణం. ఆ భూమిని ఇస్తానని నాటి ప్రభుత్వ పెద్ద హామీ ఇచ్చిన విషయాన్ని కూడా రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయి. ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకుంది. అనూహ్యంగా మిథానీ భూములపై స్టే ఉత్తర్వులను ఉపసంహరిస్తూ నాలుగు రోజుల కిందట రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వును అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడ 'ఇది ప్రభుత్వ భూమి' అనే బోర్డు ఏర్పాటు చేశారు. రాజకీయం మారితే భూములు కూడా అలా మారిపోతాయి!.  

దేశంలో ముందస్తు ఎన్నికలు

        దేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉన్నాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపిఏ అసమర్థ విధానాల వల్ల ద్రవ్యలోటు శాతం పెరిగిందన్నారు. త్వరలో పార్లమెంటుకు ఎన్నికలు వస్తాయన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నా థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు. ప్రజల ఒత్తిడితోనే పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన అప్జల్ గురును ఉరి తీశారన్నారు. అత్యున్నత న్యాయస్థానం విచారించి, దేశద్రోహికి సరైన శిక్ష విధించారన్నారు. పార్లమెంటు సిబ్బందిని హతమార్చినప్పుడు నోరెత్తని, పెదవి విప్పని కొందరు తీవ్రవాదిని ఉరి తీస్తే ప్రజా సంఘాల పేరుతో నిరసనలు తెలుపడం విడ్డూరమన్నారు.

డైరెక్టర్ మణిరత్నం ఇంటిని ముట్టడించిన బయ్యర్లు

        మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కడల్‌' చిత్రం తమను నష్టాల పాల్జేసిందంటూ చిత్ర బయ్యర్లు ఆందోళనకు దిగారు. ఈ సినిమా తమిళ వెర్షన్ బయ్యర్లకు భారీ లాసులు మిగిల్చిందని వార్త. దీంతో చిత్రంతో తమకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ బయ్యర్లు దర్శకుడు మణిరత్నం మీద పడ్డారు. ఈ సినిమాకు దర్శక, నిర్మాతగా వ్యవహరించిన మణి తమకు ఏదో ఒక దారి చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలోని మణి ఇంటి ముందు వారు ఆందోళనకు దిగారు.  ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయూమని బయ్యర్లు వాపోయారు. నష్టాన్ని భర్తీ చేయూలంటూ చెన్నై అడయార్‌లోని గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న మణిరత్నం ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. వారిని అదుపు చేయడానికి మణిరత్నం ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు.

వరవరరావు వితండ వాదన

  మేధావులుగా ముద్రలేసుకొని తిరుతున్న అనేక మందిలో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కూడా ఒకరు. కానయితే, ఆయనకీ ఆముద్ర జనం వేసారు గనుక ఎవరికీ అభ్యంతరం ఉండదు. పోలీసు ఎన్ కౌంటర్లో నక్సలైట్లు చనిపోతే అక్కడ తక్షణమే ప్రత్యక్షమయి మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే ఆయన, నక్సలైట్ల చేతిలో పోలీసులు, అమాయక గిరిజనులు, సామాన్య పౌరులు చనిపోతే మాత్రం ఆయన అటుపక్కకి రారు, ఆయనకీ ఏ మానవ హక్కులు అప్పుడు గుర్తుకు రావు.   మళ్ళీ ఈ మిస్టర్ మేధావిగారు పార్లమెంటు మీద దాడికి తెగబడిన అఫ్జల్ గురుని ఈరోజు ఉరితీసినందుకు నిరసన తెలియజేస్తూ వీదులకెక్కినప్పుడు మాత్రం జనం పకపకమని నవ్వుకొన్నారు. అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని ఖండిస్తూ ఆయన ఒక సభలో మాట్లాడుతూ “గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వందలమందిని మతకలహాలలో మట్టుబెట్టినప్పుడు, ప్రజలు ఆయనను మెచ్చుకొని ఆయనకే ఓటు వేసారు. అంతేకాక, అటువంటి వ్యక్తినే దేశప్రధాని కావాలని ఇప్పుడు కోరుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులు నక్సలయిట్లను బూటకపు ఎన్ కౌంటర్లలో హత్యలు చేస్తే వారికి మెడల్స్ ఇచ్చి మెచ్చుకొంటారు. గానీ, ఒక ఉద్యమకారుడయిన ముస్లిం వ్యక్తిని ఉరితీసేందుకు మాత్రం వెనుకాడరు. దీనిని అందరూ ఖండించాలి” అంటూ తన మేధసుని ఉపయోగించి బోడి గుండుకు మోకాలుకు ముడేసేప్రయత్నం చేసారు. ఒక దేశ ద్రోహికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో టాంక్ బ్యాండ్ వద్ద నిరసన కార్యక్రమం చెప్పట్టేసరికి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి లోపలేసారు.   గుజరాత్ ముఖ్యమంత్రి మీద, పోలీసుల మీద ఆయనకీ అభ్యంతరాలున్నపుడు, ఈవిధంగా సభలు పెట్టి పనికి రాని ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల మెదళ్ళుతినే బదులు కోర్టుకెళ్ళి కేసువేసి ఉంటే, ఆయనని ఎవరూ ఆపేవారు లేరు. అఫ్జల్ గురూకి ఉరిశిక్ష వేయకూడదనుకొంటే, దానికూడా కోర్టుకు వెళ్లి కేసువేసుకొని, తన మేధసుని ఉపయోగించి వాదించి విడిపించుకొని ఉండాల్సింది. గానీ, ఇటువంటి వ్యర్ధ ప్రసంగాలు చేసి మనదేశం సార్వభౌమత్వానికి చిహ్నమయిన పార్లమెంటు మీద దాడి చేసిన ఒక దేశద్రోహిని కమ్యునిస్టు భావాలుగల వరవరరావు సమర్దించడం చాలా అవివేకం.

బ్రదర్ అనిల్‌ చేసేవి దొంగ ప్రార్థనలే

        దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు అనిల్‌కు భక్తి లేదని, అన్ని దొంగ ప్రార్థనలే అని చంద్రబాబు ఆరోపించారు. అవినీతి సొమ్ముతో లోటస్‌పాండ్‌లో 70 గదుల ఇళ్లు కట్టారని, కుటుంబ సభ్యులు అంతా రెండు గదుల్లో ఉంటే, మిగిలిన రూముల్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌కు చెందిన నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జలయజ్ఞానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే, రూ.30 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ తేల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి అనుచరులు తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేస్తున్నారని, కబ్జాదారులపై తిరగబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఆయన తమ్ముళ్లు డబ్బులు వసూలు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో మరో 15 మంది మంత్రులు కూడా ఉన్నారని, వారిని సీఎం కాపాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు

      మాకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు. సమైక్య రాష్ట్రమే మంచిది. విడిపోతే తెలంగాణ ఇబ్బందులలో పడుతుంది” అని తెలంగాణలోని వరంగల్ నుండి కొందరు విద్యార్లులు నాకు ఫోన్ చేశారు” అని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సమైక్యాంద్ర జేఏసీ సమావేశంలో వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి దుగ్గల్ కూడా తెలంగాణ బాగా అభివృద్ది చెందిందని, తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఎంపీలకు విద్యార్థులు వత్తిడి చేయడంతో కేంద్రం మీద వత్తిడి తెచ్చారని, సమైక్యాంధ్రకు మద్దతుగా ఎనబైమంది ప్రజా ప్రతినిధులం వెళ్లి తమ వాదన వినిపించామని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ అస్సలు రాదని, రోశయ్య ప్రభుత్వం గొడవల మూలంగా ఐదువేల మంది చనిపోతారని చెప్పడంతో తెలంగాణకు అనుకూల నిర్ణయం కేంద్రం తీసుకుందని అన్నారు.సమైక్య రాష్ట్ర ఉద్యమానికి తాము మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణకు జానారెడ్డి ప్రధాన అడ్డంకీ: కోమటిరెడ్డి

        తెలంగాణకు ప్రథమ శత్రువు మంత్రి జానారెడ్డి అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. అందరూ రాజీనామాలు చేస్తామన్నా జానారెడ్డి సిద్ధపడటంలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు జానారెడ్డి ఆటంకంగా మారారని ఆయన అన్నారు. జానారెడ్డి నిత్యం పోలీసుల పహారాలో ఉండడం కాదని, జనంలోకి వస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఉరికించుకుంటూ జానారెడ్డిని కొడతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ యువకుల మరణాలకు తెలంగాణ కాంగ్రెసు నేతలు బాధ్యత వహిస్తారా, కేసులు వేయమంటారా అని ఆయన అడిగారు. ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణలో తిరిగి ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పదవులు, డబ్బు తప్ప ప్రజల అభీష్టం పట్టడం లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

అఫ్జల్ కు ఉరిశిక్ష, రాష్ట్రపతికి అభినందనలు

        అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించటంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శివసేన అభినందనలు తెలిపింది. పార్లమెంట్పై దాడి కేసు నిందితుడు అఫ్జల్కు ఉరిశిక్ష అమలుపై ప్రణబ్ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించింది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రణబ్ మాతృశ్రీకి వచ్చినప్పుడు అఫ్జల్కు ఉరిశిక్ష విధించాలని బాల్ఠాక్రే కోరారని శివసేన గుర్తు చేసింది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయటం సరైన నిర్ణయమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. చట్టప్రకారమే ఉరిశిక్షను అమలు చేశామని, ఉగ్రవాదులపై ఉన్న పెండింగ్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలని,  ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు దిగ్విజయ్ తెలిపారు.  

శ్రీవారిని దర్శించుకున్న రాజపక్సే

        శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. మహిందా రాజపక్సే శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకున్నారు. ఈ రోజు 97 మంది ప్రతినిధులతో కలిసి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆయనికి టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాజపక్సే మీడియాతో మాట్లాడారు. తన పర్యటన సంధర్బంగా వెల్లువెత్తిన్న నిరసనలపై స్పందిస్తూ.. ఇండియా ప్రజాసామ్య దేశమని, ఇక్కడ ఎవరైనా నిరసన తెలియజేసే హక్కు వారికి ఉంటుందని అన్నారు.         

అఫ్జల్‌ గురుకు ఉరి: కాశ్మీర్‌లో కర్ఫ్యూ

        తీవ్ర వాది అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేసిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జమ్మూ -కాశ్మీర్ సహా అఫ్జల్‌గురు స్వస్థలం కాశ్మీర్‌లోని బారాముల్లాలోనూ పోలీసులు కర్ఫ్యూ విధించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలహాబాద్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.   పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం 8 గంటలకు తీహార్ జైల్‌లో అధికారులు ఉరితీశారు. ఈ కేసులో అఫ్జల్‌గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. దాంతో అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేశారు.  

అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు

        తీవ్రవాది అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేశారు. పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం 8 గంటలకు తీహార్ జైల్‌లో అధికారులు ఉరితీశారు. ఈ కేసులో అఫ్జల్‌గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. దాంతో అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేశారు.   2001 డిసెంబర్ 13 న ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఈ దాడిలో అఫ్జల్‌గురు ప్రధాన సూత్రధారి. ఈ కేసులో అఫ్జల్‌గురుకు 2004లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకోవడంతో ఉరిశిక్ష నిలిచిపోయింది. గత నెలలోనే అఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలుకు కేంద్ర హోం శాఖ సిఫారసు చేసింది. ఉరి శిక్ష అమలును అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్‌గురును తీహార్ జైలుకు తీసుకువచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపమే రాజినామాలకు కారణమా?

  తెలంగాణా అంశం తేల్చేందుకు మరింత సమయం పడుతుందని గులాం నబీ ఆజాద్ తేల్చేసిన తరువాత, ‘కాంగ్రెస్ మీదనే ఇక మా యుద్ధం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో బొంద పెడతాము’ అంటూ ప్రకటించిన తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కేసీఆర్ ఇద్దరూ చేజేతులా తెలంగాణా కాంగ్రెస్ సభ్యులను దూరం చేసుకొన్నారు. ఆ తరువాత తెలంగాణా యం.పీ.లు రాజీనామాల అస్త్రంతో ముందుకు వెళ్ళినపటికీ, మళ్ళీ వారిలోఅభిప్రాయబేదాలు రావడంతో తెలంగాణా వేడి కొంత తగ్గింది.   బహుశః కాంగ్రెస్ అధిష్టానం వారికి తెలంగాణాపై తన ఆలోచనలను తెలియజేసి, తమకు దక్కవలసిన తెలంగాణా క్రెడిట్ ను, తమని, తమ పార్టీని, జాతీయ నాయకులను అవమానిస్తున్న తెరాసవంటి పార్టీలకు చేజేతులా అప్పగించడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అవుతుందని వారికి నచ్చజెప్పడంవల్ల వారు వెనక్కి తగ్గి ఉండవచ్చును.     కానీ, వారు వెనక్కి తగ్గిన తరువాత ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యులు రాజినామాలతో తెర మీదకి వచ్చారు. ఒక వైపు తెలంగాణా ఉద్యమాన్నిపక్కనపెట్టి, రాబోయే ఎన్నికలకి సిద్ధం అయిపోతున్న తెరాసను చూసిన తెలంగాణా కాంగ్రెస్ శాసన సభ్యులు, తమ రాజకీయ భవిష్యత్ గురించి తీవ్ర ఆందోళన చెందడం సహజమే. తెలంగాణా అంశంపై తాము ఎటువంటి పోరాటాలు చేయకుండా, పదవీ లాలసతో చేతులు ముడుచుకొని కూర్చోన్నమనే అభిప్రాయాన్ని, తెరాస ప్రజలో కలిగించి ఎన్నికలలో లబ్దిపొందుతుందని గ్రహించిన వారు, తాము సైతం తెలంగాణా కోసం అంటూ సోనియా గాంధీకి లేఖ, రాజీనామాలతో మీడియా ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే, వారిని కూడా కాంగ్రెస్ అధిష్టానం తన దారికి తెచ్చుకొంటుందని చెప్పవచ్చును.   ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస ఇప్పుడు పూర్తీ స్థాయి రాజకీయపార్టీగా ఎదగాలని ప్రణాలికలు రచిస్తుంటే, కాంగ్రెస్ ఊరకనే చూస్తూ కూర్చొంటుందని అనుకోలేము. రాబోయే ఎన్నికలలో తెలంగాణా అంశమే ప్రదానంగా చేసి లబ్ది పొందాలని చూస్తున్న తెరాసకు, సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణా పై కీలకమయిన ప్రకటనచేసి కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యను అదిగమించవచ్చును. తద్వారా తెలంగాణా లో తన ఉనికిని కాపాడుకోవడమే కాకుండా, తెరాసను శాశ్వితంగా నోరు మూయించవచ్చునని కాంగ్రెస్ ఆలోచన చేస్తూండవచ్చును.   అయితే, ఈ విషయాన్నీ తన తెలంగాణా నేతలందరికీ చెప్పకపోవడంవల్లనే ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చెప్పటిన తరువాత కూడా ఆ పార్టీ ఇంకా తన మూస ధోరణిలోనే ఆలోచనలు చేస్తూ, రాష్ట్ర స్థాయి నేతలను, వారి ఆలోచనలను, భయాలను, సలహాలను స్వీకరించకుండా తానే స్వయంగా అన్నీ చక్కబెట్టేదామనే ఆలోచనతో సమావేశాలు నిర్వహించుకోవడం వల్ల, స్థానిక నాయకులలో తమ రాజకీయ భవిష్యత్ గురించి చాలా భయాందోళనలు నెలకొన్నాయి. వాటిని దూరం చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానందే.   వారిని కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగి ఉండిఉంటే చీటిమాటికి రాజీనామాలంటూ మీడియా ముందుకు వచ్చే తన నేతలను కూడా ఆపగలిగేది, తెలంగాణా సమస్యని ఇంకా సులువుగా పరిష్కరించగలిగేదేమో. తన చెప్పుచేతల్లో ఉన్న అటు సీమంధ్ర, ఇటు తెలంగాణా నేతలను ఒక్క తాటిపైకి తేగలిగితే, సమస్య పరిష్కారం అవ్వడమే కాకుండా, తనకి రాష్ట్రంలో పెను సవాలు విసురుతున్న తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలను ధీటుగా ఎదుర్కోగలిగేది.   గానీ, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రనేతలని తన పరిగణనలోకి తీసుకోకుండా ఒంటిగా ముందుకు పోతోంది. అది ఆ పార్టీకే నష్టం కలిగిస్తుంది అని తెలిసినా ఎందువల్లనో అదే ధోరణిలో ముందుకు సాగిపోతోంది.    

పార్లమెంటులో తెలుగు కీర్తి రెపరెపలు

  తెలుగు సినీకళామతల్లి ముద్దు బిడ్డ, తెలుగు కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహం పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టించే అవకాశం ఉన్నపటికీ, గత దశాబ్ద కాలంగా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీల పరంగా విడిపోయి ఆ మహనీయుడి విగ్రహం పెట్టకుండా గొడవలు పడుతూ ఇంతకాలం కాలక్షేపం చేసారు. కానీ, ఆయన కుమార్తె శ్రీమతి పురందేశ్వరి చొరవ ఫలితంగా నేటికి నందమూరి విగ్రహం డిల్లీలో కొలువయ్యే అవకాశం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో దిల్ సుక్ నగర్ పరిధిలో కోదండరాం నగర్ లో తయారవుతున్న తొమ్మిది అడుగులు పొడవుగల నందమూరి వారి విగ్రహాన్ని పరిశీలించేందుకు ఈ రోజు పార్లమెంటరీ కమిటీ వచ్చింది. మరో రెండు నెలలలో విగ్రహ నిర్మాణం పూర్తీ అవగానే, పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టిస్తారు.

రేణిగుంట నుంచి తిరుమల చేరుకున్న రాజపక్సే, ఉద్రిక్తత

        శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు. రాజపక్సేను అడ్డుకుంటామని తమిళ ప్రజాసంఘాలు, పీఎంకే నేత వైగో హెచ్చరికలతో తిరుపతి, తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఆందోళనకు దిగిన కొంతమందిని అరెస్టు చేశారు.   మరోవైపు రాజపక్సే తమిళ ద్రోహి అని, ఆయన పర్యటనను అడ్డుకుంటామంటూ తమిళవాసులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. దాంతో రాజపక్సే తిరుమల పర్యటన ఉత్కంఠకు గురి చేస్తోంది.హెచ్చరికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో భారీగా తమిళనాడుకు చెందిన పార్టీల కార్యకర్తల వాహనాలు భారీగా కనిపిస్తున్నాయి. ఆయన పర్యటన ఈ రోజు ఉదయం నుండే ఉండాల్సి ఉంది. అయితే ఈ సాయంత్రానికి వాయిదా పడింది.  

వైఎస్ జగన్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను : శ్రీహరి

        ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో శ్రీహరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలోనే శ్రీహరి జగన్ పార్టీలో చేరతారని, ఆ విషయం జగన్ చెవిన వేసేందుకే ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచినట్లే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానని సినీనటుడు శ్రీహరి తెలిపారు.   జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్కే ఉందని శ్రీహరి తెలిపారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి చేస్తానని, జగన్ ఏది ఆశిస్తే అది చేస్తానని శ్రీహరి చెప్పారు.

పొన్నాల లక్ష్మయ్య కథ 21న విడుదల

        2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేవలం 236 ఓట్ల మెజారిటీతో జనగామ నుండి గెలుపొందారు. అయితే, తెరాసకు చెందిన ఆయన సమీప ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల కౌటింగ్ అధికారులను బెదిరించి తనకనుకూలంగా ఫలితాలు ప్రకటింపజేసుకొన్నారని ఆరోపిస్తూ, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించమంటూ హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ కేసు హైకోర్టు విచారణకొచ్చేసరికి పొన్నాల దాదాపు నాలుగు సం.లు పదవీ కాలం కూడా పూర్తి చేసేసుకొన్నారు. కేవలం మరో ఏడాది మాత్రం మిగిలి ఉన్నఈతరుణంలో, ఈరోజు ఆయన కేసును హైకోర్టు విచారణకు స్వీకరించడంతో తప్పనిసరిగా పొన్నాల కోర్టుమెట్లు ఎక్కవలసి వచ్చింది. దాదాపు రెండు గంటలపాటు ఇరుపక్షాల లాయర్ల మద్య జరిగిన వాదనలు విన్నతరువాత, న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుపై స్టే కోరుతూ పొన్నాల గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోవలసిన విషయాన్నీ తన వద్దకు తెచ్చినందుకు కోర్టు ఆయనను మందలించింది. అప్పటికే ఆ కేసు విచారిస్తున్న హైకోర్టు ‘ఈవీయం మెషిన్ల’ను తన అధీనంలో ఉంచుకొంది. ఈ రోజు వాదనలు పూర్తయినందున, బహుశః రేపు హైకోర్టు ఈవీయం మెషిన్లలో రికార్డ్ అయిన ఓట్లను మళ్ళీ లేక్కించమని ఆదేశిస్తే, పొన్నాలకు ఎన్ని ఓట్లు పడిందీ స్పష్టమయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా 236 ఓట్ల మెజారిటీ ఉన్నట్లు నిరూపితం అయితే పరువలేదు. కాని పక్షంలో, ఆయనకి పదవి పోవడమే కాకుండా, మోసానికి పాల్పడినందుకు, మోసపూరితంగా పదవిలో కొనసాగి రాజ్యాంగ అతిక్రమణకు పాల్పడినందుకు కొత్త కేసులు మెడకు చుట్టుకోక తప్పదు. అదే జరిగితే, ఇంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆయనకు, వచ్చే ఎన్నికలకు పోటీ చేసే అవకాశం కూడా కోల్పోవచ్చును. రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కేసు విచారణ అనంతరం ఈనెల 21వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2009లో ఎన్నికకు సంబంధించిన కేసులో ఐటీ మంత్రిగా ఉన్న పొన్నాల శుక్రవారం ఉదయం హైకోర్టుకు మరోమారు హాజరయ్యారు.ఈ కేసులో ప్రత్యర్థి తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నాల సమాధానం ఇచ్చారు. అలాగే, 2009 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి కోర్టుకు అందించారు. ఇరు వర్గాల తరపు వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణను 21వ తేదీకి వాయిదా వేశారు.