తెలుగు రాష్ట్రాలలో వానలే వానలు.. భయపెడుతున్న వాయుగుండం!
తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు బెంబేలెత్తించనున్నాయి. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి శుక్రవారం (సెప్టెంబర్ 27) నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావం ఈ నెల 30 వరకూ ఉంటుందని పేర్కొన్న వాతావరణ శాఖ అప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శుక్ర, శని (సెప్టెంబర్ 26, 27) వారాల్లో తెలంగాణ, కోస్తాంధ్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఉండగా గురువారం (సెప్టెంబర్ 25) కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాయలసీమలో ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే తెలంగాణ వ్యాప్తంగా గురువారం (సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శని వారాల్లో (సెప్టెంబర్ 26, 27) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా ఉండగా గురువారం దేశ వ్యాప్తంగా దాదాపు పది జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, "ఆంధ్రప్రదేశ్", జార్ఖండ్, కేరళ, గోవా , మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ.. ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.