పవిత్ర బంధానికి తూట్లు.. ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య!
ఏడు అడుగులు వేసి, జీవితాంతం తోడుంటానని బాస చేసిన భార్యే కాలయముడిగా మారింది. పరాయి వ్యక్తి మోజులో పడి, కట్టుకున్న వాడినే కడతేర్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు "గుండెపోటు" నాటక మాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బట్టబయలైంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే ...
అశోక్,పూర్ణిమ దంపతులు... వీరికి పిల్లలున్నారు. బోడుప్పల్, ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసముంటు న్నారు. వి.జె. అశోక్ (45) శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య జె. పూర్ణిమ (36) ప్లే స్కూల్ నడుపుతోంది. పైకి అన్యోన్యంగా కనిపిస్తున్న వీరి కాపురంలో 'అక్రమ సంబంధం' చిచ్చు రేపింది. అదే కాలనీలో నివాసం ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ (22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడి, అది వివాేహేతర సంబంధానికి దారితీసింది.భార్య తీరుపై అనుమానం వచ్చిన అశోక్, ఆమెను పలుమార్లు మందలించారు. తన ఆనందానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన పూర్ణిమ.. ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
ఆ రాత్రి జరిగింది ఇదే..
డిసెంబర్ 11, 2025 సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన అశోక్‌పై, పథకం ప్రకారం మాటు వేశారు. మహేష్ తన స్నేహితుడు సాయి కుమార్ (22) సహాయం తీసుకున్నాడు. అశోక్ ఇంట్లోకి రాగానే మహేష్, సాయి ఆయనను పట్టుకోగా.. కట్టుకున్న భార్య పూర్ణిమ భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. అనంతరం మహేష్ మూడు చున్నీలతో అశోక్ మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు.
అనుమానం రాకుండా హైడ్రామా..
హత్య అనంతరం నిందితులు అశోక్ బట్టలు మార్చి, రక్తపు మరకలున్న దుస్తులను, సాక్ష్యాలను మాయం చేశారు. డిసెంబర్ 12న పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త బాత్‌రూమ్‌లో పడిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్తే మృతి చెందాడని, గుండెపోటు వచ్చి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేసింది.
పోలీసుల చాకచక్యం..
మొదట సాధారణ మరణంగా కేసు నమోదు చేసినా, దర్యాప్తులో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. అశోక్ మృతదేహంపై బుగ్గలు, మెడ భాగంలో గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ పుటేజీలు, టెక్నికల్ ఆధారాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. అశోక్ దిన దిశ కర్మ అయి పోయిన వరకు కూడా పూర్ణిమ చాలా చాకచక్యంగా వ్యవహరించింది ..అంతేకాదు పది రోజులపాటు తన భర్త లేడు అనే విషయాన్ని జీర్ణించుకో లేకుండా పోయింది.. ఒకవైపు భర్త లేడని నాటకం ఆడుతూనే మరోవైపు తన ప్రియుడితో నిత్యం చాటింగ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటి కప్పుడు చేరవేసింది..
తన భర్త తనను తన పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడని నిత్యం రోదించింది ..కానీ ఇదంతా నాటకం అని పోలీసుల విచారణలో బయటపడింది.. దీన దిశ కర్మ పూర్తి అయిన వెంటనే పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచి విచారించారు.. తనదైన స్టైల్ లో ఏమీ తెలియనట్టు బుకాయించే ప్రయత్నం చేసింది ..కానీ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో చివరికి నిజాన్ని బయటకు వెళ్ళ గక్కింది..
తన ప్రియుడుతో కలిసి తాను ఈ హత్య చేశానని పేర్కొంది ..ఈ వరకు ప్రియుడు అయిన మహేష్ తో పాటు పూర్ణిమనీ పోలీస్ లు అరెస్టు చేశారు.. క్షణికావేశం, అక్రమ సంబంధాల మోజులో పచ్చని కాపురాన్ని కూల్చుకుని, కటకటాల పాలైన పూర్ణిమ ఉదంతం స్థానికులను విస్మయానికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఛేదించి సంచలన హత్యకేసును వెలికితీసిన మేడిపల్లి పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు