పాలసీల స్థిరత్వమే పెట్టుబడుల ప్రవాహానికి బలం : మంత్రి లోకేష్
మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలకోపన్యాసం చేశారు. గతంలో ఏపీలో పీపీఏలను రద్దుచేయడంతో 2019–24 మధ్య అనేక కంపెనీలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఆయన అన్నారు. అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు, పాలసీల స్థిరత్వం అత్యంత కీలకమని ప్రజలు కూడా చైతన్యవంతులుగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర పరిపాలనలో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెనెన్స్ ద్వారా 36 శాఖలకు చెందిన వెయ్యికి పైగా సేవలను ప్రజలకు సులభంగా అందిస్తున్నామని చెప్పారు. ఏఐ ఆధారంగా స్కిల్ సెన్సస్, ల్యాండ్ రికార్డులను బ్లాక్‌చైన్‌పైకి తీసుకురావడం వంటి విప్లవాత్మక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ కంపెనీలు ఏపీపై చూపుతున్న నమ్మకానికి మూడు కారణాలున్నాయని చెప్పారు—నిరూపితమైన నాయకత్వం, వేగవంతమైన అనుమతి విధానం, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో పనిచేసే “డబుల్ ఇంజిన్” ప్రభుత్వం. పరిశ్రమలకోసం “లిఫ్ట్ పాలసీ” అమలు చేస్తున్నామని, టాలెంట్, నీరు, విద్యుత్ వంటి వనరులతో పాటు వేగవంతమైన అనుమతులు అందించడం వల్లే పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని వివరించారు.
క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్లు, రిన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్, ఎలక్ట్రానిక్స్ మొదలైన రంగాల్లో పెద్ద ఎత్తున ఎకోసిస్టమ్ నిర్మాణం జరుగుతోందని లోకేష్ తెలిపారు. రాజకీయ సంకల్పంతో, పారదర్శక విధానాలతో భారీ ఎఫ్‌డీఐలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం గెలుస్తుందనీ, ఇందుకోసం పాలసీల స్థిరత్వమే ప్రధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.