స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు

  తిరుమల  శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమ‌వారం  శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం. స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈవో  వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో ముర‌ళీకృష్ణ‌,  సీఈ సత్యనారాయణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

బల్క్ డ్రగ్ పరిశ్రమ పనులు నిలిపివేత

  బల్క్ డ్రగ్ పరిశ్రమ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. 16 రోజులుగా మత్స్యకారులు పరిశ్రమ ఏర్పాటు వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి వచ్చిన హోం మంత్రి అనిత కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని పరిశ్రమ పనులు ఆపేయాలని ఆందోళనలు చేయటంతో పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.  అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజ్యపేటలో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా  నిరసనలో సేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం హాస్యాస్పదమని అన్నారు. ప్రమాదకర అతి కాలుష్యకరమైన బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ వల్ల మత్స్య సంపద హాని కలుగుతుందని, పరిశ్రమ వ్యర్ధాలు వల్ల మత్స్య సంపద నాశనం అయిపోద్దని, గాలి,నీళ్లు, సహజ సంపద కలుషితం అవుతుందని అన్నారు. పరిశ్రమ నిర్మాణాన్ని అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. 

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  ప్రజలకు సద్దుల బతుకమ్మ సందర్బంగా మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూలను పూజించే  గొప్ప సంస్కృతికి తెలంగాణ నెలవని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లందరికీ ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధాననికి, ఐక్యతకు నిదర్మనమన్నారు.  బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటడానికి సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మందికి మహిళలతో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహింస్తుదని ఆయన తెలిపారు.  తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకొని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణ కు ప్రత్యేకమని చెప్పారు. కష్టాలన్నీ తొలగి, ప్రతి ఇల్లూ   సుఖసంతోషాలతో నిండేలా, ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు.

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల నక్షత్రం సందర్బంగా సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.  ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను కూడా ఆయన అమ్మవారికి అర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. సీఎం చంద్రబాబు రాకతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.  

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వీసీ సజ్జనార్

  టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున  సజ్జనర్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక కొత్త మార్పు శకం ప్రారంభమైంది. ఆర్టీసీ బ్రాండ్‌ను మళ్లీ ప్రజల్లో స్థాపించేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆయన అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ‘మన ఆర్టీసీ’ అనే నినాదం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపే ప్రయత్నం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసి, ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపరిచారు. ఆదాయ వనరులను పెంచే దిశగా సరుకు రవాణా సేవలను విస్తరించి, ప్రత్యేకంగా కార్గో సేవలను ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించారు.

రేపు హస్తినకు సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఆయన విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మధ్యహ్నం 12.30 గం.లకు బయలుదేరి 1.30 గం.లకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తిరిగి సాయంత్రం 5 గం.లకు సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని బడా పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడుపై ప్రసంగించనున్నారు. కాగా నేడు ముఖ్యమంత్రి విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకోని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

మిథున్ రెడ్డి కి కండీషన్డ్ బెయిలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఈ కుంభకోణం కేసులో ఏ4న ఉన్న మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ నెల 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి  కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసి అనంతరం రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 29) ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.   రెండు ష్యూరిటీలు, రూ. 2 లక్షల పూచీకత్తుతో ఆయనకు బెయిలు మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, వారంలో రెండు సార్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ షరతులతో కూడిన బెయిలుపై మిథున్ రెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 30) రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

నారా లోకేష్ కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

దుబాయ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఆసియాకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది.  ఆ విజయం కూడా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుపై. దాదాపు 41 ఏళ్ల తరువాత ఆసియాకప్ ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇదే తొలిసారి. అటువంటి కీలక మ్యాచ్ లో భారత్ చొమటోడ్చినా కంఫర్ట్ బుల్ గా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లినా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సరే అది పక్కన పెడితే ఈ విజయంలో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అత్యంత కీలక పాత్ర పోషించాడు. తొలి నాలుగు ఓవర్లలోనే అత్యంత కీలకమైన అభిషేక్ వర్మ, శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ ల వికెట్లు కోల్పోవడంతో టీమ్ ఇండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో గ్రూపు దశలోనూ, సూపర్ ఫోర్ లోనూ పాకిస్థాన్ తో రెండు సార్లు తలపడిన టీమ్ ఇండియా ఆ రెండు మ్యాచ్ లలోనూ అలవోకగా గెలిచింది. అయితే కీలకమైన ఫైనల్ లో తడబడుతోందా? అన్న ఆందోళన టీమ్ ఇండియా అభిమానుల్లోనూ వ్యక్తమైంది. అయితే తిలక్ వర్మ మాత్రం పట్టుదలతో ఆడి భారత్ కు అద్భుత విజయాన్ని అందించింది. నంబర్ 4గా బరిలోకి దిగిన తిలక్ వర్మ చివరి వరకూ క్రీజ్ లో నిలిచి, అజేయంగా 69 పరుగులు చేశాడు. జట్టుకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అటువంటి తిలక్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.ఇంతకీ తిలక్ వర్మ లోకేష్ కు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే.. అతడి క్యాప్.  లోకేష్ అన్నా.. ఇది నీ కోసమే అంటూ తన క్యాప్ పై రాసి సంతకం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేశారు. దీనిపై నారా లోకేష్ స్పందించారు.  తిలక్ వర్మ అభిమానం తనను ముగ్ధుడిని చేసిందంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొన్న లోకేష్ ‘తమ్ముడూ.. నీవిచ్చిన ఆ అపురూపమైన బహుమతిని నీ చేతుల మీదుగా అందుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులూ తెగ వైరల్ అవుతున్నాయి.  

రెండు గంటలకు రూ. 11 కోట్లు తీసుకున్నా : ప్రశాంత్ కిశోర్

  రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌  తన పార్టీ విరాళాల గురించి వస్తోన్న ఆరోపణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు కన్సల్టెన్సీ సేవలతో రూ. 241 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. వీటిలో రూ. 30.95 కోట్లు  జీఎస్టీ రూ. 20 కోట్లు , ఇన్‌కమ్‌ట్యాక్స్‌ చెల్లించి.. తన సొమ్మను పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు వివరించారు. తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకానొకదశలో రెండు గంటలకు రూ.11 కోట్లు తీసుకున్నా. ఇది ఈ బిహార్‌ కుర్రాడి శక్తి’’ అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేశారు.  డొల్ల కంపెనీల నుంచి విరాళాలు వస్తున్నాయని ఆరోపించిన వారికి మీడియా ఎదుట గట్టి కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి గురించి మాట్లాడుతూ.. 1995లో ఓ హత్య కేసులో ఆయన దోషిగా తేలారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తాను మైనర్‌నంటూ తప్పుడు పత్రాలు సమర్పించడం వల్ల ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు.   తాను సంపాదించిన నిధులు వృత్తిపరమైన ఫీజుల ద్వారానే వచ్చాయని, వాటిపై జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లించి పార్టీకి విరాళాలుగా ఇచ్చినట్లు వెల్లడించారు. ‘‘డొల్ల కంపెనీల నుంచి డబ్బులు వచ్చాయన్న ఆరోపణలు నిరాధారమని’’ మీడియా ఎదుట ప్రశాంత్ కిశోర్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి గురించి మాట్లాడుతూ.. 1995లో హత్య కేసులో ఆయన దోషిగా తేలినా, తప్పుడు పత్రాలతో శిక్ష తప్పించుకున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పదో తరగతి పూర్తిచేయని వ్యక్తి డిగ్రీ పట్టా పొందడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ రెండింటినీ ప్రశాంత్‌ తీవ్రంగా విమర్శించారు. ‘‘కాషాయ పార్టీ నేతలు లాలూ కంటే ఎక్కువ అవినీతి చేస్తున్నారు’’ అని ఆరోపించారు. లాలూ కుటుంబంపై విమర్శలు చేస్తూ.. ‘‘ప్రజలు పిల్లల భవిష్యత్తు ఎలా చూసుకోవాలో లాలూ నుంచి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వీ 9వ తరగతి కూడా పాస్‌ కాలేదు. అయినా ఆయనను బిహార్‌ ‘రాజు’ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సామాన్యుల పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినా ఉద్యోగం దొరకడం లేదు’’ అని పీకే దుయ్యబట్టారు.  

సమరానికి దేవరగట్టు సిద్ధం!

కర్రల సమరం అనగానే గుర్తుకు వచ్చే పేరు దేవరగట్టు. ఏటా దసరా పండుగ సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవం పేరిట కర్రల సమరం జరుగుతుంది. ఈ ఏడు కూడా ఈ సమరానికి సర్వం సిద్ధమైంది. దసరా పండుగ రోజు అర్ధరాత్రి జరిగే ఈ సంప్రదాయ సమరానికి ఒక చరిత్ర ఉంది.   పూర్వం దేవరగట్టు కొండ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసుకునేవారు. మణి, మల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునే రుషులను వేధిస్తూ నానా బాధలూ పెట్టే వారు.  దీంతో ఋషులు తమ గోడును పరమశివునికి మొరపెట్టుకోగా, ఆయన ఆ రాక్షసులను వధించి పురుషులను రక్షించారని స్థల పురాణం చెబుతోంది. ఈ సందర్భంగా అక్కడ వెలిసిన మాల మల్లేశ్వర స్వామిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా పండగ రోజు పూజించుకుంటూ ఉంటారు. అయితే స్వామివారు కొండ మీద వెలిసినప్పటికీ కిందికి వచ్చి భక్తుల  కోరిన కోరికలు తీరుస్తారని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,  నేరకిని, నెరకిని తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు కిందికి వచ్చిన మాల మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తొలతగా తమ గ్రామాలకు తరలించేందుకు కర్రలతో సమరం చేస్తారు.   దీనినే బన్నీ ఉత్సవం అంటారు. ఆయా గ్రామ ప్రాంతాల ప్రజలందరూ ఈ సమరంలో ఎంతో నియమ నిష్టలతో పాల్గొంటారు. అయితే ఈ ఉత్సవంలో దెబ్బలు తగిలిన రక్త గాయాలు అయినా కేవలం పసుపు మాత్రమే పూసుకుని తిరిగి బన్నీ ఉత్సవాల్లో పాల్గొంటారు. మరీ ప్రాణంతమైన గాయాలు అయితే తప్ప ఆసుపత్రులకు వెళ్ళరు. అయితే కొన్ని సందర్భాలలో ఈ కర్రల సమరంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో  బన్నీ ఉత్సవాన్ని ఆపేందుకు, కనీసం..  హింసకు తావు లేకుండా జరుపుకులా  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక దశలో పోలీసులు ఈ సాంప్రదాయ కర్రల సమరంపై నిషేధం కూడా విధించారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని వదులుకోబోమని తెగేసి చెప్పారు. పోలీసుల ఆంక్షలు, నిషేధం దారి నిషేధానిదే.. అన్నట్లుగా సంప్రదాయంగా జరిగే కర్రల సమరం యథావిథిగా జరుపుకుంటున్నారు స్థానికులు.  తీవ్రమైన పోలీసు నిర్బంధం   ఉన్నప్పటికీ అర్ధరాత్రి 12 గంటలకు దాటంగానే ఒక్కసారిగా వేలాది మంది కర్రలతో ఆ ప్రాంతాన్ని చేరుకొని తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు కానీ అధికారులు కానీ ఏమీ చేయలేక వారికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయవలసిన పరిస్థితి. దీంతో కర్రల సమరం సమయంలో ఎవరికి గాయాలైనా.. ఎటువంటి ప్రాణాపాయం  సంభవించకుండా అక్కడే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్సను అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కర్రల సమరంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా భారీగా బద్దవస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు.  ఇక ఉత్సవం సందర్భంగా పాటించే నియమాలు, నిష్టల విషయానికి వస్తే.. ఉత్సవానికి ముందు అమావాస్య నుంచి దీక్షను చేపట్టి కంకణ ధారణ చేసుకుంటారు. కంకణ ధారులైన వారు బన్నీ ఉత్సవం ముగిసే వరకు  కాళ్లకు చెప్పులు వేసుకోరు. మద్యం మాంసం ముట్టరు.  బ్రహ్మచర్యం పాటింస్తారు. ఇక దసరా రోజున అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని  తీసుకువెళ్లడానికి  నెరణికి, కొత్తపేట, నెరణికి తాండా తదితర గ్రామాల ప్రజలు  రెండు గ్రూపులుగా ఏర్పడి.. స్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లే  సమరం చేస్తారు.  ఉత్సవ విగ్రహం తిరిగి గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు అత్యంత నియమనిష్టలతో పాటిస్తారు.  ఈ విధంగా దేవరగట్టు బన్నీ ఉత్సవం అత్యంత కట్టుబాట్ల మధ్య, సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది .

విద్యుత్ వినియోగదారులకు ఆ డబ్బు వెనక్కు!

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్(ఏపీఈఆర్సీ) చరిత్రలో తొలి సారిగా విద్యుత్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు అంటూ రిఫండ్ ఇవ్వనుంది. వైసీపీ హయాంలో అత్యంత భారంగా మారిన విద్యుత్ చార్జీల కారణంగా నానా ఇబ్బందులూ పడిన విద్యుత్ వినియోగదారులకు రిఫండ్ ద్వారా గొప్ప ఊరట కలిగించనుంది. 1999లో ఈఆర్సీ ఏర్పడిన తరువాత ఇలా రిఫండ్ ఇవ్వడం ఇదే తొలిసారి.   2023లో  ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) విధానం కింద విద్యుత్ పంపిణీ సంస్థలు  వినియోగదారుల నుండి అధికంగా డబ్బు వసూలు చేశారని ఏపీఆర్ఈసీ నిర్ధారణకు వచ్చింది. . డిస్కమ్ లు యూనిట్‌కు 40 పైసలు వసూలు చేయడం ద్వారా దాదాపు 2,787 కోట్ల రూపాయలను రిఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రిఫండ్ ను యూనిట్ కు 13 పైసల చొప్పున నవంబర్ 2025, అక్టోబర్ 2026 మధ్య కాలంలో దశలవారిగా సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీ నిర్ణయించింది.   వైసీపీ హయాంలో  2021–22, 2023–24 మధ్య ట్రూ అప్ చార్జీల పేరుతో  విద్యుత్ వినియోగదారులపై దాదాపు  18,567 కోట్ల రూపాయల భారం మోపింది ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పట్లో జగన్ ప్రభుత్వం వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసిన అదనపు చార్జీలను రిఫండ్ చేయాలని నిర్ణయించింది.  దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజైన సోమవారం (సెప్టెంబర్ 29) ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. ఇక సాయంత్రం స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఇక  తిరుమల శ్రీ వేంకటేశ్వ రస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం (సెప్టెంబర్ 28) రాత్రి శ్రీ మలయప్పస్వామివారు     గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవలో వాహనం   ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త  బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తించారు.   వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడ వాహనంపై తిలకించి పులకించారు.   

క్రీడారంగంలో ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీ

ఆసియాకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై ఐదు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేైసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు, అభినందనలూ  వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ టీమ్ ఆండియాను అభినందిస్తూ  చేసిన ట్వీట్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం (సెప్టెంబర్ 29) రాత్రి పాకిస్థాన్ పై టీమ్ ఇండియా సాధికార విజయాన్ని నమోదు చేసి సంబరాలు జరుపుకుంటున్న వేళ.. ప్రధాని మోడీ పాకిస్థాన్ పై ఆసియాకప్ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ తో పోలుస్తూ ట్వీట్ చేశారు.   ఇండియా విజయాన్ని నమోదు చేసిన కొద్ది సేపటికే మోడీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆపరేషన్ సిందూర్ ను ప్రస్తావించారు. పహల్గామ్ దాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ తో ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్న ప్రధాని మోడీ.. ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయాన్ని క్రీడా రంగంలో ఆపరేషన్ సిందూర్ గా అభివర్ణించారు.  

వరద పరిస్థితిపై సీబీఎన్ సమీక్ష, రిజర్వాయర్లు, చెరువులూ నింపాలని ఆదేశం

గోదావరి, కృష్ణా నదులకు వరద, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో  వర్చువల్ గా సమీక్షించారు.  డైనమిక్ ఫ్లడ్ మేనేజ్ మెంట్, నీటి వనరుల సంపూర్ణ వినియోగంపై ఆయనీ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని రియల్ టైమ్ లో ఎస్టిమేట్ చేసి.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అదే విధంగా కురిసిన వర్షాన్ని రెయిన్ గేజెస్ ద్వారా గణించి... వరద యాజమాన్యం పకడ్బందీగా చేయాలని చంద్రబాబు ఆదేశించారు.  అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని, అలాగే చెరువులను నీటితో నింపాలన్నారు.   ఇలా ఉండగా  ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 6.57 లక్షల క్యూసెక్కుల వరద ఉందని అధికారులు తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి పంపుతున్నట్లు వివరించారు. ఇక సోమవారం (సెప్టెంబర్ 29) దాదాపు  7 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావొచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు.  శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు. అదే విధంగా  ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం  10.12 లక్షల క్యూసెక్కులు ఉందనీ, ఇది మరింత పెరిగి   11.50 లక్షల క్యూసెక్కు చేరే అవకాశం ఉందన్నారు.   చెరువులు నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అలాగే  వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనీ,  వరద ప్రభావిత ప్రాంతాల్లో  అన్ని శాఖల అధికారులూ  సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలన్నారు. 

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఈ సారి చర్చిలో

అమెరికాలో  మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిషిగాన్ లోని గ్రాండ్ బ్లాంక్ లో ఆదివారం (సెప్టెంబర్ 28)న ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చర్చిలో ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కారులో నేరుగా చర్చిలోకి దూసుకొచ్చి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో  ముగ్గురు మరణించగా, మరో తొమ్మండుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పులలో నిందితుడు కూడా హతమయ్యాడు.   కాగా దుండగులు కాల్పులు జరిపిన అనంతరం చర్చికి నిప్పుపెట్టాడు. దీంతో చర్చిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

ట్రోఫీ లేకుండానే టీమ్ ఇండియా సంబరాలు.. ఎందుకంటే?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో దాయాది దేశాన్ని టీమ్ ఇండియా మూడు సార్లు మట్టి కరిపించింది. కాగా ఈ టోర్నీ మొత్తం పాకిస్థాన్ జట్టు వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కనీస క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించకుండా పాకిస్థాన్ జట్టు,  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ వ్యవహరించిన   తీరు పట్ల క్రీడా పండితులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ అక్తర్ అయితే.. పాక్ జట్టు గెలవడం మరిచిపోయిందన్నారు.  అదలా ఉంచితే ఇండియాపై ఒక్క టోర్నీలోనే హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన పాకిస్థాన్.. ఫైనల్ లో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. ప్రజంటేషన్ సెర్మనీలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ రన్నరప్ గా నిలిచినందుకు అందించిన చెక్ ను తీసుకున్న వెంటనే పక్కకు విసిరేశాడు.  అంతకు ముందు మ్యాచ్ ముగిసిన తరువాత ప్రజంటేషన్ సెర్మనీకి చాలా చాలా జాప్యం జరిగింది. ఇందుకు కారణం పాకిస్థాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ చేతుల మీదుగా ఆసియా కప్ టోర్నీ విజేతలకు ట్రోఫీ అందజేయాలని ఐసీపీ తీసుకున్న నిర్ణయం. అయితే భారత్. పాకిస్థాన్ జట్ల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేని విషయాన్ని ప్రస్తావిస్తూ టీమ్ ఇండియా పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేమని నిర్వాహకులకు ముందుగానే తెలియజేసింది. ఈ విషయమై చర్చోపచర్చలు జరగడంతో ప్రజంటేషన్ సెర్మనీకి మ్యాచ్ పూర్తియిన తరువాత గంటకు పైగా సమయం పట్టింది. చివరకు ప్రజంటేషన్ సెర్మనీకి పీసీబీ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ వేదికమీదకు వచ్చారు.   సరే దీనికి ప్రతిగా భారత్ కూడా దీటుగా స్పందించింది. పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించింది. దీంతో ఆయన అలిగారు. ట్రోఫీతో సహా వేదికపై నుంచి వెళ్లిపోయారు. అయినా టీమ్ ఇండియా ఖాతరు చేయలేదు. ట్రోఫీ చేతులో లేకుండానే సంబరాలు చేసుకుంది.  

ఫైనల్ లో పాక్ పై విజయం.. ఆసియాకప్ విజేత టీమ్ ఇండియా

ఆసియాఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసి టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. దుబాయ్ లోని రింగ్ ఆప్ ఫైర్ స్టేడియంలో  ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్ లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియాకప్ చాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో  ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ కు అద్భుత ఆరంభం లభించింది. అయితే ఆ తరువాత టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని పాకిస్థాన్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. పాకిస్థాన్ ఓపెనర్లు భారత బౌలింగ్ అటాక్ ను సమర్థంగా ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ తొలి వికెట్ 84 పరుగుల వద్ద పడింది. 57 పరుగులు చేసిన ఫారన్ ను వరుణ్ వర్మ ఔట్ చేశారు. ఆ తరువాత పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కోల్పోయింది. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్: 4 వికెట్లు తీయగా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండెసి వికెట్లు తీసుకున్నారు. ఇక స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ ఇండియా త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. 20 పరుగులకే కీలకమైన అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. అయితే హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మకు సంజు శాంసన్, శివమ్ దుబెలు చక్కటి సమకారం ఇచ్చారు. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో భారత్‌ తొమ్మిదోసారి ఆసియాకప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.  ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడుసార్లూ భారత్ విజయం సాధించింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం పాకిస్థాన్ గట్టిగా పోరాడింది. మ్యాచ్ ను చివరి ఓవర్ వరకూ తీసుకు వెళ్లింది.  

కిక్కిరిసిన తిరుమల కొండ...ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ

  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. మాడ వీధుల గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడంతో మరింత మంది భక్తులను లోపలికి అనుమతించలేదు. దీంతో మేదర మిట్ట, నందకం, లేపాక్షి ప్రాంతాల వరకు భక్తులు బారులు తీరారు. అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా అలిపిరి ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. కార్లు, బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు కిలోమీటర్లకొద్దీ నిలిచిపోయాయి.  దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. భద్రతా పరంగా అలిపిరి టోల్‌గేట్ వద్ద టీటీడీ విజిలెన్స్, పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తున్నారు. ఈ చర్యలతో వాహనాల కదలిక నెమ్మదించినప్పటికీ, స్వామివారి సేవ కోసం భక్తులు ఓపికతో వేచి చూశారు. ఈ భారీ రద్దీని అదుపు చేసేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నాలుగు మాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. గరుడ సేవను సమీపం నుంచి చూడాలనే ఉత్సాహంతో వేలాది మంది భక్తులు శనివారం రాత్రి నుంచే గ్యాలరీలలో స్థానం దక్కించుకుని రాత్రంతా జాగారం చేశారు. చలి వాతావరణాన్ని పట్టించుకోకుండా ఎదురుచూస్తున్న వారికి టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు, తాగునీరు అందించారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మాడ వీధులలో శాంతిభద్రతలు కాపాడేందుకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది అధికారులు నియమించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కఠినమైన భద్రతా చర్యలు అమలు చేశారు.  

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు.ఇవాళ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఆయన ఎంపికను అధికారికంగా ప్రకటించారు. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తర్వాత ఈ పదవిని అలంకరించిన మూడో మాజీ క్రికెటర్‌గా 45 ఏళ్ల మన్హాస్ నిలిచారు. గత ఆగస్టులో రోజర్ బిన్నీ రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) నుంచి మిథున్ మన్హాస్ పేరు నామినేట్ చేయబడగా, చివరికి ఏజీఎంలో ఆయన అధికారికంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఇతర కీలక పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవాజిత్ సైకియా కొనసాగగా, సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. మన్హాస్ నియామకంపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఆనందం వ్యక్తం చేస్తూ, “జమ్మూకశ్మీర్‌లోని దూరప్రాంతం దోడాకు చెందిన మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చారిత్రక ఘట్టం” అని వ్యాఖ్యానించారు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున 147 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9,714 పరుగులు చేసిన మన్హాస్, అనంతరం జమ్మూకశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కోచ్‌గా కూడా సేవలందించారు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పుణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడిన ఆయన, తన అనుభవం, మృదుస్వభావం వల్ల భారత క్రికెట్‌కు కొత్త దిశనిస్తారని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.