రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వైపు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా మితిమీరిన వేగంతో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి. అయినా ఓ ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటో నడుపుతూ  కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ వద్ద నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను యాచారం మండలం కురుమిద్దకు చెందినసత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25)గా గుర్తించారు. 

జలదిగ్బంధంలో ఎంజీబీఎస్

హైదరాబాద్‌లో   గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.  శుక్రవారం కురిసిన భారీ వర్షంతో మూసీనది వరదతో పోటెత్తింది. దీనికి తోడు జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్ లోని వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బస్టాండ్ నుంచి బయటకు వచ్చే మార్గంలేక బస్టాండ్ లోనే చిక్కుకుపోయారు. తాడు సాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు.  హైడ్రాతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు.  ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట గేట్లు ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.  మూసీ వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) అర్ధరాత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉండగా మూసీ వరద ఉధృతి ఒక్క ఎంజీబీఎస్ కే పరిమితం కాలేదు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో  200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి.  ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.  మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్ ప్రాం తంలో కూడా పలు పల్లపుప్రాంతాలు జలమయమయ్యాయి. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శనివారం (సెప్టెంబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 26) శ్రీవారిని మొత్తం 75 వేల 358 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  2 కోట్ల 58 లక్షల రూపాయలు వచ్చింది. 

మూసీకి భారీ వరద.. ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తున్నది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.   పురానాపూల్ ప్రాంతంలో మూసీ వరద రోడ్లను ముంచెత్తింది. జియాగూడ ప్రాంతంలో కూడా మూసీ ఉగ్రరూపం దాల్చింది. అక్కడ కూడా వరద నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలను నిలిపివేశారు. స్థానికులను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.    ఇక వికారాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో టంగుటూరు మోకిల రోడ్డును మూసి వేశారు.  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (సెప్టెంబర్ 26) అందజేశారు. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో 1994 బ్యాచ్‌కి చెందిన  ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.    శివధర్‌ రెడ్డి వచ్చేనెల1వ తేదీన రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.  పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన శివధర్ రెడ్డి తప కెరీర్‌లో గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు.  శివధర్ రెడ్డి ఐక్యరాజ్యస సమితి శాంతి పరిరక్షణ వింగ్‌లోకూడా పనిచేశారు.ప్రస్తుతం శవధర్ రెడ్డి తెలంగాణ  ఇంటలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నారు.   రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలే కలాన్‌ గ్రామానికి చెందిన శివధర్‌రెడ్డి. విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేసి ఆయన కొద్ది కాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో   అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఎఎస్పీగా పని చేశారు.  అలాగే గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా  పనిచేశారు.  2014-2016 మధ్య తెలంగాణకి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.    మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్ శివధర్ రెడ్డి హయాంలోనే జరిగింది.   

ఇండియాపై ట్రంప్ మరో దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై టారిఫ్ వార్ ను మరింత ఉధృతం చేశారు. తాజాగా భారత్ నుంచి దిగుమతి అయ్యే  ఔషధాలపై పై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.   గత ఏడాది  అమెరికా ఇండియా నుంచి దాదాపు 233 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను దిగుమతి చేసుకుంది కాగా  అమెరికాలోనే ఔషధాలను తయారు చేసే కంపెనీలకు ఈ టారిఫ్ నుంచి మినహా యింపు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం ఇండియన్ ఫార్మా కంపెనీలపై తీవర ప్రభావం చూపనుంది.  భారత్ నుంచి అమెరికాకు అధికంగా జెనరిక్ మెడిసెన్స్ ఎగుమతి అవుతాయి.  చాలా వరకూ ఇండియన్   ఫార్మాస్యూటికల్ కంపెనీలకు తమ మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతం  అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారానే వస్తున్నది.   దీంతో ఈ కంపెనీలపై ట్రంప్ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.  

నీరుకొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం

అమరావతిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా  అమరావతి సమీపంలోని నీరుకొండపై   భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. నీరుకొండ 300 అడుగుల ఎత్తు కలిగి ఉంది. విగ్రహ నిర్మాణం కోసం 100 అడుగుల ఎత్తున్న బేస్ నిర్మించి,  ఈ బేస్ పై 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అంటే మొత్తం 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందన్న మాట.  ఇక ఈ విగ్రహం   బేస్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రదర్శించే కళాఖండాలు, మ్యూజియం, మినీ థియేటర్,    కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం వద్దకు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహ నిర్మాణం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇలా ఉండగా  దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  స్మారకాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపొందిం చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆకాంక్షకు అనుగుణంగా..  నీరుకొండ ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు ఏర్పాటు కానుంది.   10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్ స్మారకాన్నిఏర్పాటు చేయనున్నారు.    

భారీ వర్షాలు.. రేవంత్ సమీక్ష

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్, ఉన్నతాధికారులతో శుక్రవారం (సెప్టెబర్ 26) సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే. శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ముసురుపట్టినట్లుగా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఈ రోజు సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే రెండు రోజులూ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే   అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం  చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుని ఆదేశించారు. 

జల సంరక్షణ.. దేశంలోనే తెలంగాణ టాప్

జలసంరక్షణలో  దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది.  కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల సంచాయ్ తాజాగా ప్రకటించిన ర్యాంకులలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.  2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 5,20,362 వాన నీటి సంరక్షణ పనులు చేపట్టింది.  వీటిలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ వంటి పనులు ఉన్నాయి. కాగా  జల సంచాయ్ జన భాగీదారి  ర్యాంకుల్లో భాగంగా దేశంలో 67 జిల్లాలను ఎంపిక చేయగా వాటిలో  తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాలలకు అవార్డులు లభించాయి. వీటిలో రెండు కోట్ల  రూపాయల రివార్డు విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాలు టాప్ లో ఉన్నాయి. అలాగే వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలకు కోటి రూపాయల రివార్డులు,  భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు పాతిక లక్షల రూపాయల రివార్డులు దక్కాయి.   కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డులను ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు గెలుచుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతోషం హర్షం వ్యక్తం చేశారు.  జలసంరక్షణలో ఈ మూడు జిల్లాలూ దక్షిణ భారతదేశంలోనే టాప్ లో ఉన్నాయని పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామి పనుల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ నిర్మించినందువల్లే కేంద్రం అవార్డుల వచ్చాయని   పంచాయతీరాజ్   సీతక్క చెప్పారు. అవార్డులు, రివార్డులు సాధించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, నల్లోండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ,మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ,జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా, మహబూబ్ నగర్ కలెక్టర్ విజేంద్రబోయి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ లను మంత్రి సీతక్క అభినందించారు.

తమిళనాడు విద్యావిధానమే తెలంగాణకు ప్రేరణ.. రేవంత్

దక్షిణాది రాష్ట్రాల విద్యావిధానాలకు తమిళనాడే ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  తెలంగాణలో అతి త్వరలో తమిళనాడులోలా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని అములు చేస్తామని చెప్పారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో  గురువారం (సెప్టెంబర్ 25) జరిగిన మహా విద్యా చైతన్య ఉత్సవ్‌కు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన దేశ చరిత్రలో తమిళనాడుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అన్నాదురై, కామరాజ్ నాడార్,  కరుణానిధి వంటి యోధులకు జన్మస్థలమైన తమిళనాడు రాష్ట్రం మాకు అదర్శమన్నారు. క‌రుణానిధి విజ‌న్‌ను  స్టాలిన్, ఉద‌య‌నిధిలు అనుసరిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ కామ‌రాజ్ ప్లాన్‌ అమలు చేశారన్నారు.  కామ‌రాజ్ త‌మిళ‌నాడులో తీసుకువ‌చ్చిన‌ విద్యా విధానాన్నే దేశం అనుస‌రిస్తున్నదన్న రేవంత్ రెడ్డి  త‌మిళ‌నాడు పేద‌ల‌కు సీఎం స్టాలిన్ అండ‌గా ఉన్నారని ప్రశంసించారు. ఇక సామాజిక న్యాయం అమలులో తెలంగాణ, తమిళనాడుల మధ్య సారూప్యతలు న్నాయన్నారు. మాజీ సీఎం కరుణానిథిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీల‌కు 42 శాతం, ఎస్సీ, ఎస్టీల‌కు 27 శాతం ఇలా మొత్తం 69 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.   

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 25) స్వామి వారిని మొత్తం 67 వేల 388 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం కోటీ 74 లక్షల రూపాయలు వచ్చింది. 

ఈడీ విచారణకు నటుడు జగపతి బాబు

సాహితీ ఇన్ ఫ్రా కేసులో  నటుడు జగపతిబాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.   గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఈడీ అధికారులు ఆయనను నాలుగు గంటలకు పైగా విచారించారు. ఇంతకీ విషయమేంటంటే.. సాహితీ ఇన్ ఫ్రా తరపున హీరో జగపతిబాబు పలు ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో జగపతిబాబు, సాహితీ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు   ప్రశ్నించారు.   సాహితీ ఇన్ ఫ్రాపై పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట   కొనుగోలుదారుల నుంచి  భారీ మొత్తం వసూలు చేసి చేసి మోసాలకు పాల్పడిందనీ, ఆ డబ్బులను అక్రమంగా తరలించిందన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది.  ఈ దర్యాప్తులో సాహితీ ఇన్ ఫ్రా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో  పోలీసులు సీజ్ చేసిన ప్రాపర్టీస్ తో పాటు  తన దర్యాప్తులో గుర్తించిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.   ఫ్రీలాంచ్ విల్లా, ఫ్లాట్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా దాదాపు 700 మంది కస్టమర్ల నుంచి 800 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.  ఇప్పటికే ఈ కేసులో పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా ఎండి లక్ష్మీ నారాయణ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.   ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడి అధికారులు ఈ కంపెనీ తరఫున పలు ప్రకటనలు ఇచ్చిన నటుడు జగపతి బాబుకు నోటీసులు ఇచ్చి గురువారం (సెప్టెంబర్ 25) విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే   జగపతిబాబు ఈడీ ఎదుట హాజయర్యారు. సాహితీ ఇన్ ఫ్రా ప్రకటనలలో నటించినందుకు జగపతి బాబు తీసుకున్న సోమ్ము ఎంత, ఆ సొమ్ము చెల్లింపు ఎలా జరిగింది అన్న విషయాలపై జగపతిబాబును ఈడీ విచారించినట్లు సమాచారం.  

ఆసియా కప్ ఫైనల్ లో దాయాదుల ఢీ

ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ భారత్ తలపడనున్నాయి. గురువారం (సెప్టెంబర్ 26) సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై 11 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది.  ఇప్పటి వరకూ పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్థాన్ ఫైనల్ కు చేరాలంటే చావో రేవో లాంటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై చెమటోడ్చి గెలిచింది.  ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 11 పరుగుల ఆధిక్యతతో పాకిస్థాన్ గెలిచి.. ఫైనల్ కు చేరుకుంది.  ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ లో భారత్ తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్ ల మధ్య ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 28) జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇది మూడో సారి అవుతుంది. గ్రూప్ స్టేజిలో ఒకసారి, సూపర్ ఫోర్ స్టేజిలో రెండో సారి ఇరు జట్లూ తలపడ్డాయి. ఆ రెండు సార్లూ కూడా భారత్ సునాయాస విజయాలను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.    ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను వరుసగా మూడోసారి ఓడించాలని చూస్తుంటే, మరోవైపు పాకిస్థాన్ గత ఓటములకు ప్రతీకారం తీర్చుకుని ఆసియా కప్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.   టీమిండియా ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలుచుకోగా, పాకిస్థాన్   2 సార్లు   ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది      ఆసియా కప్ 2025లో టీమిండియా ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ సాధికార విజయాలతో జోరుమీద ఉంది.  పాకిస్థాన్ అయితే మూడు మ్యాచ్ లలో విజయం సాధించి రెండింటిలో పరాజయం పాలయ్యింది.  

సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు ఊరట

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో  భారీ ఊరట లభించింది.   కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలో  ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పేరు కూడా ప్రస్తావించింది. దీనిపై స్మితా సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం (సెప్టెంబర్ 25)న సభా సభర్వాల్ పై నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యా తీసుకోవద్దంటూ ఆదేశాలుజారీ చేసింది.  ఇదేవిషయమై ఇప్పటికే  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వంటి నాయకులకు కూడా హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే.  తెలంగాణ ఆవిర్భావం తరువాత అధికారం చేపట్టిన   కేసీఆర్    అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయి. రేవంత్ రెడ్డి   నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం అక్రమాలపై విచారణకోసం జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్   ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచి చర్చించింది. ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, ఆర్థిక అవినీతి, టెక్నికల్ లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వంటి అనేక అంశాలని కమిషన్ నివేదికలో పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ  మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ సీ మురళీధర్ రావు వంటి అధికారులు ఈ అక్రమాలకు బాధ్యులని పేర్కొంది. బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించిన కీలక ఫైళ్లను క్యాబినెట్ ముందు పెట్టకపోవడం, బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించడం వంటి  విషయాలలో స్మితా సభర్వాల్ ను కూడా కమిషన్ నివేదికలో తప్పుపట్టింది.   ఈ నివేదికలో తన పేరు ప్రస్తావించబడటానికి వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ ఈ నెల 23న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   నివేదికలో తన పేరును తొలగించాలని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టకుండా  ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించి,  ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దనీ,  ఇప్పటికే దాఖలైన పిటిషన్‌లతో కలిపి స్మితా సభర్వాల్ పిటిషన్ ను కూడా విచారి స్తామనీపేర్కొంది.  

ఏంటీ ఆప‌రేషన్ నుమ్ ఖోర్?

భూటాన్ భాష‌లో నుమ్ ఖోర్ అంటే వెహిక‌ల్. అచ్చ తెలుగులో చెప్పాలంటే వాహ‌నం అని అర్ధం. మ‌న దేశంలోకి విదేశీ వాహ‌నాల దిగుమ‌తిపై నిషేధం ఉండ‌టంతో, ఈ వాహ‌నాల‌ను మొద‌ట భూటాన్ కి  త‌ర‌లించి.. ఆపై వాటిని సెకెండ్ హ్యాండ్ పేరిట భార‌త్ లోకి తెస్తుంటార‌న్న‌మాట‌. ఇలాంటి వాహ‌నాలు భార‌త్ లో సుమారు 120 వ‌ర‌కూ ఉన్న‌ట్టు గుర్తించారు. అందునా కేర‌ళ‌లో ఇవి 30కి పైగా ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. ఇక బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఒక నిషేధిత ల‌గ్జ‌రీ కార్లో తిరుగుతున్న‌ట్టు గుర్తించారు. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, పృధ్వీరాజ్ సుకుమార‌న్ వంటి సినీ న‌టుల ఇళ్ల‌లో విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు అధికారులు. వీరితో పాటు మ‌రికొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌లు, ఇత‌ర సంప‌న్నుల ద‌గ్గ‌ర కూడా ఈ ల‌గ్జ‌రీ కార్లున్న‌ట్టు గుర్తించారు అధికారులు. తిరువ‌నంత‌పురం, కొజికోడ్, మ‌ల‌ప్పురం, కుట్టిపురం, త్రిసూర్ వంటి ప్రాంతాల్లో.. సోదాలు నిర్వ‌హించిన అధికారులు.. ఎవ‌రెవ‌రి ద‌గ్గ‌ర ఎన్నేసి ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. వీటిని ఎక్క‌డి నుంచి త‌ర‌లించారు? ఆ వివ‌రాలేంట‌న్న ఆరా తీస్తూ  సోదాలు నిర్వ‌హించారు. దుల్క‌ర్ స‌ల్మాన్ నుంచి 2 కార్లు, అమిత్ చ‌ల‌క్క‌ల్ నుంచి 8 కార్ల‌తో స‌హా మొత్తం 36 కార్లు స్వాధీనం చేస్కున్నారు. ఈ లగ్జ‌రీ కార్ల‌కు విన్ అనే ఒక డిఫ‌రెంట్ కోడ్ ఉంటుంది. దీనిలో ఆ కారు చాసిస్ నెంబ‌ర్ ఉంటుంది. ఈ ప‌ద‌హారు అక్ష‌రాల కోడ్ లో కారు ఎక్క‌డ త‌యారైంది? దాని ఇత‌ర డీటైల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఈ కార్ల‌ను సీజ్ చేశారు క‌స్ట‌మ్స్ అధికారులు. తెలంగాణ విష‌యానికి వ‌స్తే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ కోవ‌లోకి వ‌చ్చే ల్యాండ్ క్రూయిజ‌ర్ కార్లో తిరుగుతున్న‌ట్టు ఆరోపిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. లగ్జ‌రీ కార్ స్కామ్ నిందితుడు బ‌స‌ర‌త్ ఖాన్ అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకున్న కారు కేటీఆర్ కుటుంబ కంపెనీ పేరిట ఎందుకు రిజిస్ట‌ర‌య్యిందో చెప్పాల‌న్నారు బండి సంజ‌య్. దీని కొనుగోలులో మార్కెట్ ధ‌ర చెల్లించారా?  లేదంటే త‌క్కువ ధ‌ర‌కే కొన్నారా? బినామీల పేరిట కొన్నారా? వంటి అంశాల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు బండి సంజ‌య్. ఎక్స్ వేదిక‌గా ఈ అంశానికి సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు బండి సంజ‌య్. బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎనిమిది కార్లను స్మగ్లింగ్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాల స్మగ్లర్‌ బసరత్‌ ఖాన్‌ అంగీకరించారు. ఆ వాహనాల నంబర్లనూ అధికారులకు బసరత్‌ ఖాన్‌ అందజేశారు. ఆ నంబర్లలో టీజీ00డి 6666 నంబరు గల ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాన్ని తన కాన్వాయిలో కేటీఆర్‌ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్‌ఖాన్‌ చెప్పారు. ఇలా దేశ వ్యాప్తంగా ల‌గ్జ‌రీ కార్ల స్కామ్ కి సంబంధించి ఒకేసారి బ‌య‌ట ప‌డ్డంతో.. ఇపుడీ వ్య‌వ‌హారం హాట్ టాపిగ్గా మారింది.

ఉచిత బస్సుల్లో సచివాలయానికి వచ్చిన అంగన్వాడీలు.. ఎందుకో తెలుసా?

అంగన్వాడీ టీచర్లు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన చేపట్టేందుకు వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని  వాడుకుని వచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సులలో సచివాలయానికి వచ్చిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. డిమాండ్లను నెరవేర్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన అంగన్వాడీ టీచర్చను అదుపులోనికి తీసుకుని వారు వచ్చిన ఫ్రీ బస్సుల్లోనే పోలీసు స్టేషన్లకు తరలించారు.  

తిరుమలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, చంద్రబాబు

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిసి తిరుమలలో పలు కీలక అభివృద్ధి పనులను గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన 'వేంకటాద్రి నిలయం' యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి, సీఎం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు, శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విజన్ బేస్డ్ స్టోరింగ్ మెషిన్‌కు ప్రారంభించారు.  అంతకుముందు వెంకటాద్రి నియలం  ప్రాంగణానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి, ముఖ్య మంత్రికి టీటీడీ అధికారులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసిన అనంతరం వారు భవనాన్ని కలియతిరిగి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను (ఐసీసీసీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ఆయన వెంట ఉన్నారు.  రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

నక్సల్ విముక్త భారత్ దిశగా వేగంగా అడుగులు?

మావోయిస్టుల‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. నిన్న ఇద్ద‌రు కేంద్ర క‌మిటీ స‌భ్యుల హ‌తం కాగా.. నేడు ఏకంగా 71 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  తాజాగా దంతెవాడ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టుల‌లో ఇర‌వై మందికి పైగా 64 ల‌క్ష‌ల రూపాయ‌ల రివార్డు ఉంది. లోంగిపోయిన వారిలో 21 మంది మ‌హిళ‌లు కాగా.. ఒక బాలుడు, ఇరువురు బాలికలు సైతం ఉన్నారు. మావోయిస్టులకు వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు చూస్తుంటే.. మావోయిస్టు ఉద్య‌మం ఉనికి ప్ర‌శ్నార్ధంలా క‌నిపిస్తోంది. ఒక స‌మ‌యంలో మావోయిస్టు నేత‌ జ‌గ‌న్ అన్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే..  ఇక‌పై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న వారి ప్రాబ‌ల్యం బాగా త‌గ్గి.. కేవ‌లం గిరిజ‌నులు మాత్ర‌మే మావోయిస్టుల్లో ఉంటార‌ని అన్నారాయ‌న‌. దీనంత‌టికీ కార‌ణ‌మేంటంటే.. తుపాకీ గొట్టం ద్వారా సాధార‌ణ యువ‌త ప్ర‌భుత్వాల‌తో తేల్చుకునే ప‌రిస్థితి బొత్తిగా క‌నుమ‌రుగవ్వడమే అంటున్నారు. వీరంతా స్టార్ట‌ప్ ల ద్వారా ఉద్యోగిత‌ను పెంచ‌డంలో బాగా బిజీగా ఉన్నారు. దీంతో నాగ‌రిక యువ‌త అడ‌వుల బాట ఇక‌పై క‌నిపించ‌క పోవ‌చ్చు. కొంద‌రు అమెరికా హెచ్ 1 బీ వీసా ఎంత క‌ష్ట‌త‌ర‌మైనా స‌రే సాధించ‌డానికి ముందుకొస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బెంగ‌ళూరుకు చెందిన త‌నూశ్ శ‌ర‌ణార్ధి అనే యువ‌కుడు మూడు సార్లు ట్రై చేసి ఎట్ట‌కేల‌కు అనుకున్న వీసా పొందాడు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి.. ఏఐపై ప‌ట్టు సాధించాన‌ని.. దీంతో త‌న‌కు 0- 1 వీసా అప్రూవ్ అయింద‌ని అంటున్నాడు శ‌ర‌ణార్ది. దీన్నే ఐన్ స్టీన్ వీసా అంటారు. ఇది ఎంతో టాలెంట్ ఉన్న వారికి త‌ప్ప సాధ్యంకాదు. ఇక పోతే.. ఈ ప్రపంచ గ‌తిని మార్చిన మూడు సీలు ఏంటంటే క్రీస్ట్, క‌మ్యూనిజం, కంప్యూట‌ర్. ప్ర‌స్తుతం క‌మ్యూనిజాన్నిక్రాస్ చేసి కంప్యూట‌ర్ జ‌మానాలో ఉన్నాం. వ‌చ్చే రోజుల్లో అది క్వాంటం కంప్యూటింగ్ లోకి వెళ్ల‌నుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ సిట్యువేష‌న్స్ లో.. యువ‌త అడ‌వుల్లోకి వెళ్లి త‌మ భ‌విష్య‌త్తును వెతుక్కోవాల‌ని భావించ‌డం లేదు. స‌రిక‌దా విండోస్ లోంచి క్లౌడ్ లోకి వెళ్లి స‌మ‌స్తం అక్క‌డి నుంచే పుట్టించేయ‌త్నం చేస్తున్నారు. దీంతో వారికి ఫ‌లానా అని ప్ర‌భుత్వాల‌తో గొడ‌వే లేదు. అస‌లు మావోయిజం బేసిక్ థియ‌రీ.. ప్ర‌భుత్వాల నుంచి అధికారం లాక్కుని.. దాని ఫ‌లాలు అంద‌ని వారికి అందించ‌డం. ఇటు ప్ర‌భుత్వం కూడా ఆ ఫ‌లాల‌ను అడ‌వుల్లోకి కూడా అందేలా చేస్తూ.. అక్క‌డా బ‌డి, రోడ్డు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తూ.. వారి వారి జీవితాల్లోనూ మార్పు వ‌చ్చేలా చేస్తోంది. కాబ‌ట్టి.. ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీల్లోనూ ప్ర‌స్తుతం విప్ల‌వంలోకి దిగాల‌న్న ఆలోచ‌న ఏమంత‌గా రావ‌డం లేదు. వారు సైతం జ‌న జీవ‌నంలోకి సులువుగా క‌ల‌గ‌ల‌సి పోతున్నారు. ఇక మిగిలింది అడ‌వుల్లోని మావోయిస్టు అవ‌శేషం మాత్ర‌మే. ఇదిగో ఇప్పుడు ఈ యువ‌త కూడా జ‌న‌జీవ‌నంలోకి అడుగు పెడుతుండ‌టంతో.. ఇక మిగిలింది చాలా  త‌క్కువ మొత్తంలోని వృద్ధ, కొస‌రు మాత్ర‌మే. వార్ని కూడా 2026 మార్చినాటికి ఏరి పారేయ‌నుంది.. కేంద్రం. దీంతో జీరో మావోయిజం ఇన్ భార‌త్ అన్న కేంద్ర ల‌క్ష్యం సాకారం కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే మావోయిస్టుల్లోనే చీలిక వచ్చింది. ఆయుధం వ‌దిలేద్దామ‌ని కొంద‌రు.. లేదు కొన‌సాగిస్తామ‌ని మరి కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాద‌న‌లు కూడా ఎక్కువ కాలం నిలిచేలా లేవు. దీంతో.. వ‌చ్చే రోజుల్లో రెండో సీల్లోని క‌మ్యూనిజం దాదాపు త‌న ఉనికి కోల్పోయేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జ‌న బాహుళ్యంలోని క‌మ్యూనిస్టు పార్టీలు జాతీయ హోదా కోల్పోయి రాష్ట్ర హోదాలోకి.. వ‌చ్చేసిన  రోజుల్లో అందులోంచి కూడా బ‌య‌ట‌కు రానున్న క్ర‌మంలో.. ఇక సెకండ్ సీ యొక్క ప్ర‌భావం పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యేలా తెలుస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు సామాజిక వేత్త‌లు. ఫైన‌ల్ గా మిగిలిన అర్బ‌న్ న‌క్సల్స్ పై కూడా ప్ర‌భుత్వం ఉక్కు పాదం మోప‌డంతో ఇక‌పై ఇటు న‌గ‌రంలో అటు అడ‌వుల్లో అన్న‌ల ప్ర‌స్తావ‌నే లేకుండా పోయేలా తెలుస్తోంది.