ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా

 

ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సెబాస్టియన్ నియమించిన కేబినేట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌కు సెబాస్టియన్ రాజీనామా అందించగా దాన్ని ఆమోదించారు. ఫ్రాన్స్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఆదివారం నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సెబాస్టియన్‌ కూర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన రాజీనామా చేశారు. అధ్యక్షుడు మెక్రాన్‌ ఆ రాజీనామాను ఆమోదించారు. బడ్జెట్‌ సంక్షోభం, ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా విధానాలతో ఏర్పడ్డ అంతర్జాతీయ గందరగోళం కారణంగా ఫ్రాన్స్‌ ఇప్పటికే కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇవన్నీ కలసి దేశంలో రాజకీయ అనిశ్చితి పెరగడానికి దారి తీశాయి. గడచిన రెండేళ్లలో సెబాస్టియన్‌తో కలిపి ఐదుగురు ప్రధానులు రాజీనామా చేయడం విశేషం.

పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

  తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని పేర్కొంది. రవికుమార్ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని , ఈ వ్యవహారంలో టీటీడీ, అధికారులకు నిబంధనలు పాటించలేదని తప్పుబట్టింది. బాధ్యలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఛార్జిషీటు వేసే వరకు కేసును స్వయంగా పర్యవేక్షిస్తామని స్ఫష్టం చేసింది.టీటీడీలో భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలను లెక్కించే విభాగమైన పరకామణి లో రవికుమార్ అనే పెదజీయర్ మఠం ఉద్యోగి చోరీ చేశాడు.   అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో పనిచేసే కొందరు సిబ్బంది, ఇతర వ్యక్తులతో కలిసి హుండీ నగదును అపహరిస్తూ దొరికపోయారు. అప్పట్లో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే  టీటీడీ విజిలన్స్ సిబ్బంది రాజీ చేసుకుని అతను ఇచ్చిన ఆస్తులను టీటీడీపై బదిలీ చేశారు. ఇలా దొంగ దొరికిపోతే రాజీ చేసుకోవడం.. ఏమిటని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అతనికి అంత పెద్ద మొత్తం ఆస్తులు ఎలా వచ్చాయి.. దొంగతనం ఎంత కాలం జరుగుతోందన్న అంశంపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముగ్గురు పోలీసుల పాత్ర కూడా బయటపడింది

దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనకు కేంద్రం నోటిఫికేషన్

  దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం(8-1-26) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం 30 రోజులపాటు ఈ ప్రక్రియను నిర్వహించనుంది. హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు.  దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తుస్తారు. కానీ కొవిడ్ కారణంగా.. ఈ ప్రక్రియను వాయిదా వేశారు. తాజాగా ఈ జనన గణన ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. ఇక రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  అందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేయనుంది. ఈ జనగణనతోపాటే కులగణనను సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి.. పూర్తి చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడుతుందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం

  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం ఊరటనిస్తూ బెయిల్  మంజూరు చేసింది. గతంలో ఈ కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితులతో పాటు శ్రవణ్ కుమార్‌కు కూడా నల్లగొండ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం.. శ్రవణ్ కుమార్ వయసును, ఆయన ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. వేర్వేరు కులాలకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృత వర్షిణిలు పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన కుమార్తె తక్కువ కులస్తుడిని పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించిన అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ను అంతం చేయడానికి కోటి రూపాయల సుపారీతో కిరాయి హంతకులను నియమించాడు. 2018 సెప్టెంబర్ 14న, గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె కళ్ల ముందే కిరాయి హంతకుడు ప్రణయ్ మెడపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. సిసిటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ కేసులో మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, హంతకుడు సుభాష్ శర్మతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ దశలో ఉండగానే, 2020 మార్చిలో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నిందితులకు నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది

రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత

  సంక్రాంతి పండుగ వేళ ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను పోలీసులు సీజ్ చేయగా, ఈ వ్యవహారంలో 143 మందిని అరెస్టు చేసి 103 కేసులు నమోదు చేశారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందోత్సాహాల వేళ. అయితే ఈ సంబరాలు మరొకరి ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన నైలాన్, సింథటిక్, మెటాలిక్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజాపై నగర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్లలో ఒకేసారి దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన, విక్రయానికి సిద్ధంగా ఉన్న మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్‌లో సీపీ సజ్జనర్ హెచ్చరిక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.“సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ. కానీ మన ఆనందం మరొకరి ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదు. చైనీస్ మాంజా వల్ల పిల్లలు, వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అందుకే ప్రభుత్వం చైనీస్ మాంజాపై సంపూర్ణ నిషేధం విధించింది.  నిషేధాజ్ఞలు ఉన్నా కొందరు అక్రమంగా వీటి విక్రయాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఎక్కడైనా చైనా మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం,” అని స్పష్టం చేశారు. దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయడంతో కొందరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అక్రమ విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  ఆన్‌లైన్‌లో చైనా మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉన్న మాంజా వల్ల విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలతో తయారైన మాంజాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా మాంజా విక్రయిస్తే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నగరవ్యాప్తంగా  దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్టు చేసి రూ.65.30 లక్షల విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేశారు. సౌత్ జోన్‌లో 27 కేసులు నమోదు చేసి, 35 మందిని అరెస్టు చేసి రూ.37.22 లక్షల విలువైన 1,861 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్‌లో 18 కేసులు నమోదు కాగా, 29 మంది అరెస్టు, రూ.6.02 లక్షల విలువైన 301 బాబిన్లు సీజ్ చేశారు.సౌత్ ఈస్ట్ జోన్‌లో 9 కేసులు, 10 అరెస్టులు, రూ.4.42 లక్షల విలువైన 221 బాబిన్లు స్వాధీనం అయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 6 కేసులు, నార్త్ జోన్‌లో 5 కేసులు, వెస్ట్ జోన్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి.ఈ మొత్తం ఆపరేషన్‌లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. మొత్తం నమోదైన కేసుల్లో 67 కేసులు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే నమోదు కాగా, 87 మందిని అరెస్టు చేసి రూ.68.78 లక్షల విలువైన నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనర్  అధికారులను, సిబ్బందిని అభినందించి నగదు బహుమతులు అందజేశారు. పండుగ వేళ ప్రజల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్యలు నగరవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. అవసరమైతే సంక్రాంతి ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ

పులికాట్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.  ఈ ఫెస్టివల్ నిర్వహణ తొలి సారిగా గత ఏడాది నిర్వహించినట్లు తెలిపిన ఆయన ఈ ఏడాది జనవరి 10, 11 తేదీలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు వివరించారు.   పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటక   అభివృద్ధి  లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్–2026 పక్షుల పండుగకు ఆహ్వానం పలుకుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురువారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. తిరుపతి  తారకరామ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని పలు ప్రధాన రహదారుల గుండా సాగింది.ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఫ్లెమింగో పక్షుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు

  అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్‌లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి జిల్లా కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం అంతా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపి మరీ తనిఖీలను కొనసాగించారు.  బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో అనంతపురం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బాంబు బెదిరింపునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు ఏలూరు కోర్టు కాంప్లెక్స్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 1:35 గంటలకు మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అలాగే బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు అందరినీ పోలీసులు బయటకు పంపించేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలపై దృష్టి సారించిన సిట్, కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురు నేతలను ప్రశ్నించిన సిట్, తాజాగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను విచారణ కు పిలిచింది. నోటిసీలకు స్పందించిన జైపాల్ యాదవ్ సిట్ ఎదుట హాజరై వివరాలు వెల్లడించారు.గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ యాదవ్ సిట్ విచారణకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.  అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలంతో పాటు తాజా విచారణలో వెల్లడైన అంశాలను సిట్ సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుప తన్నతో జైపాల్ యాదవ్‌కు ఎన్నికల సమయంలో ఫోన్ సంభాషణలు జరిగినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఆ కాల్స్  ఉద్దేశం, పరిస్థితులపై సిట్ లోతుగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఒక కేసుకు సంబంధించి భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యపై తిరుపతన్నతో జైపాల్ యాదవ్ మాట్లాడి నట్లు సిట్‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలు వ్యక్తిగత అంశాలకే పరిమితమా? లేక అధికార దుర్వినియోగం జరిగిందా? అనే కోణంలో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.  ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, కాల్ డేటా రికార్డులు, టైమింగ్, కాల్ వ్యవధి వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగు తున్న నేపథ్యంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో సిట్ అధికా రులు జైపాల్ యాదవ్ నుంచి విస్తృతంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.  కేసుకు సంబంధించిన అన్ని కోణాలను స్పష్టంగా తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.ఇదే సమయంలో బీఆర్‌ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు నేతలు, అధికారులు విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు.

అర్ధరాత్రి మాజీ ఐపీఎస్ ఇంటి ముందు యువకుడు హల్‌చల్

  హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి వి.కే.సింగ్ నివాసం ముందు ఓ యువకుడు నానా రచ్చ రచ్చ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారులు భారీ కేట్లను ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో తర్బీజ్ అనే యువకుడు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోడ్డు బ్లాక్ కావడంతో ఆగ్రహా నికి గురైన యువకుడు తర్బీజ్, మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి గేటును కొడుతూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. అంతేకాకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వికేసింగ్ గేటు ముందు హల్చల్ సృష్టిస్తున్న యువకుడిని భద్రతా సిబ్బంది గమనించారు. యువకుడు లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు.  ఈ సమయంలో తర్బీజ్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ భద్రతా సిబ్బంది వద్ద ఉన్న వెపన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలోనే యువకుడు తర్బీజ్, “500 మందితో నీ ఇంటిపైకి వస్తా” అంటూ మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్‌ను బెదిరించాడు.  అర్ధరాత్రి సమయంలో హడావుడి సృష్టించిన యువకుడు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ పర్సనల్ సెక్రటరీ జస్వంత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. యువకుడి ప్రవర్తన, నేపథ్యం, గతంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.  

ఆస్తులు పెరుగుదల అంటే వైసీపీ ఎంపీలదే!

  టీడీపీ ఎంపీల పనితీరు శాతంలో ఎంత పెరుగుదల ఉందో తెలీదు. కానీ, వారి వారి ఆస్తుల్లో మాత్రం భారీ పెరుగుదల ఉన్నట్టు కనిపించింది. వీరిలో టాప్ ఎవరు? బాటమ్ లో ఎవరున్నారని చూస్తే.. వైసీపీ నేత, రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 మధ్య కాలం వరకూ తన ఆస్తులకు సంబంధించిన లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. వాటి ప్రకారం చూస్తే 2014లో ఆయన పోటీ చేసినపుడు ఆస్తుల విలువ రూ. 22. 59 కోట్లు కాగా.. 2024 ఎన్నికల నాటికి వాటి విలువ అమాంతం పెరిగిపోయింది. రూ. 146. 85 కోట్లకు చేరుకుంది. అంటే ఈ పదేళ్ల కాలంలో మిథున్ రెడ్డి ఆస్తి రూ. 124. 25 కోట్ల వరకూ పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల జాబితాలో మిథున్ దేశంలోనే థార్డ్ ప్లేస్ లో నిలిచారు. 2014 నుంచి 19 వరకూ మిథున్ ఆస్తుల విలువ రూ. 44 కోట్లు పెరగగా.. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో రూ. 80 కోట్లకు పైగా పెరిగింది. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. రూ. 47. 54 కోట్ల చరాస్తులు రూ. 99. 30 కోట్లు స్థిరాస్తులున్నాయి. అదే సమయంలో 56. 09 కోట్ల వరకూ అప్పులు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో సమర్పించారు. మొత్తానికి ఈ పదేళ్లలో మిథున్ రెడ్డి ఆస్తులు సుమారు 550 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2024 వరకూ లోక్ సభ ఎన్నికల మధ్య తిరిగి ఎంపికైన ఎంపీల ఆస్తుల వివరాల విశ్లేషణ చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. దీని ప్రకారం చూస్తే.. అత్యధికంగా ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీల్లో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఒకరు. అవినాష్ ఆస్తులు 2014లో రూ. 7 కోట్ల మేర ఉండేవి. అదే 2019 నాటికి రూ. 18 కోట్లకు పెరిగాయి. ఇక 2024 నాటికి ఈ ఆస్తుల విలువ రూ. 40 కోట్లకు చేరాయి. ఆస్తుల వృద్ధి పరంగా చూస్తే ఈయన 15వ స్థానంలో ఉన్నారు. ఇక అవినాష్‌రెడ్డి ఆస్తుల పెరుగుదల శాతం 474గా ఉంది. ఇదిలా ఉంటే.. దేశంలోనే ఎంపీల ఆస్తుల శాతంలో టాప్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా 804 శాతంతో టాప్ లో ఉండగా.. 532 శాతంతో రెండో స్థానంలో ఉన్న పార్టీ వైసీపీ.  ఎంఐఎం పార్టీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు ఈ పదేళ్లలో 488 శాతం పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల ప్రకారం- 24వ స్థానంలో నిలిచారు అసద్. టీడీపీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి ఆస్తుల పెరుగుదల ఎలా ఉందో చూస్తే- 177 శాతం మేర పెరిగాయి. ఆస్తుల పెరుగుదల జాబితాలో రామ్మోహన్ 28వ స్థానంలో ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తుల విలువ పదేళ్లలో సగటున 110 శాతం పెరగ్గా, కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆస్తి మాత్రం తగ్గిపోయింది. గుజరాత్ లోని నవ్ సారీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి దేశంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వచ్చిన ఆయన ఆస్తి 2014లో 74. 47 కోట్లుండగా 2019 నాటికది రూ. 44. 06 కోట్లకు, 2024 నాటికి రూ. 39. 49 కోట్లకు పడిపోయింది. పదేళ్లలో ఆయన ఆస్తి 47 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. ADR రిపోర్ట్ ప్రకారం గత మూడు ఎన్నికల్లో బీజేపీ నుంచి వరుసగా గెలిచిన 65 మంది ఎంపీల ఆస్తులు సగటున 108 శాతం పెరగ్గా.. కాంగ్రెస్ కి చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 135 శాతం వృద్ధి చెందాయి. రాహుల్ ఆస్తుల విషయం చూస్తే.. రూ. 10. 99 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014లో రూ. 9. 40 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019 నాటికి రూ. 15. 88 కోట్లు పెరిగాయి. ఇవే ఆస్తులు 2024 నాటికి రూ. 20. 39 కోట్లకు చేరాయి. ఈ మొత్తం శాతంలో చూస్తే 117 పర్సెంట్ హైక్ కనిపించింది. ఆస్తులు పెరిగిన ఎంపీల లిస్టులో రాహుల్ 38వ స్థానంలో నిలిచారు. ఇక ప్రధాని మోడీ ఆస్తులు 82 శాతం మేర పెరిగినట్టు కనిపించింది. 2019లో రూ. 1. 65 కోట్లున్న మోడీ ఆస్తుల విలువ 2019నాటికది రూ. 2. 15 కోట్లకు, 2024నాటికది రూ. 3. 02 కోట్లకు పెరిగాయి. ఆస్తులు పెరిగిన ఎంపీల్లో మోడీ 94 వ స్థానంలో నిలిచారు. అత్యధిక ఆస్తుల విలువ పెరిగిన టాప్ టెన్ ఎంపీల్లో ఐదుగురు బీజేపీ వారే ఉండటం గమనార్హం.  

భరతమాత కాళ్ల వద్దకు తీసుకొచ్చి పడేస్తా… యూట్యూబర్ అన్వేష్ పై ఉక్రెయిన్ మహిళ ఆగ్రహం

భారత సంప్రదాయాలు, సనాతన ధర్మంపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారు తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విదాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళ మండి పడ్డారు.  తనకు అనుమతిస్తే యూట్యూబర్ అన్వేష్ ను  భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఉక్రెయిన్ మహిళ భారత సంప్రదాయాలు, సనాతన ధర్మానికి మద్దతుగా నిలబడటం విశేషం.  ఉక్రెయిన్‌లో జన్మించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడిన లిడియా లక్ష్మి   ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేశారు.   హిందూ ధర్మం, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ తనను ఎంతో ప్రభావితం చేశాయని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు.భారతీయ సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ, సనాతన ధర్మంపై అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అవగాహన లేకుండా, కేవలం వ్యూస్ కోసం చేసే వ్యాఖ్యలు భారతదేశ సంస్కృతిని కించపరు స్తున్నాయంటూ  అంటూ లిడియా లక్ష్మి యూట్యూబర్ అన్వేష్ పై మండిపడ్డారు. యూట్యూబ్ వేదికగా భారతీయ సంప్రదాయాలు, సనాతన ధర్మంపై అన్వేష్ చేసిన వ్యాఖ్యల పట్ల  దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిడియా లక్ష్మి.. “ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని వదిలిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రస్తుతం థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న లిడియా లక్ష్మి, అన్వేష్ మరో దేశానికి పారిపోయే అవకాశం ఉందనీ, అతడిపై సరైన సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు.  లిడియా లక్ష్మి  యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన చేసిన వీడియో   సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది. నెటిజనులు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు.  విదేశీ మహిళ అయినప్పటికీ భారతీయ సంస్కృతి పట్ల ఆమె చూపుతున్న నిబద్ధతకు ఫిదా అవుతున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ  డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై పెద్ద చర్చ మొదలైంది. విదేశీయులే సనాతన ధర్మ విలువలను గౌరవిస్తుంటే, దేశంలోనే కొందరు వాటిని కించప రచడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీనటి కరాటే కళ్యాణి నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.