"రాజాసాబ్" సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటీషనర్ తరఫున వాదించిన న్యాయవాది విజయ్ గోపాల్, నిబంధనలకు విరుద్ధంగా సినిమా టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హోంశాఖ కార్యదర్శికి టికెట్ ధరల పెంపుపై మెమో జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, హైదరాబాద్ పరిధిలో సీపీ మాత్రమే టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని వాదించారు.
నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేసిన అధికారిపై రూ.5 లక్షల జరిమానా విధించాలని కూడా కోర్టును కోరారు. అంతేకాకుండా గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియకుండానే టికెట్ రేట్ మెమోలు జారీ అయ్యాయని చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టు ముందు ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు, సినిమా టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అంతటా ఒకే రకమైన టికెట్ ధర ఉండేది. మేము కూడా సినిమాలకు వెళ్లాం, మాకు టికెట్ ధరలు తెలుసు” అంటూ వ్యాఖ్యానించింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది.
నిబంధనలు ఏమిటో మెమో జారీ చేసే అధికారికి తెలియదా అని కోర్టు నిలదీసింది. టికెట్ రేట్లకు సంబంధించిన మెమోలపై విచారణ జరగడం ఇదే మొదటిసారి కాదని, ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ ఆలోచనా విధానం ఎందుకు మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపిస్తూ, టికెట్ ధరల పెంపు వల్ల ఇబ్బందిపడేది ప్రైవేట్ వ్యక్తులే తప్ప, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు. ఇది కేవలం ఒక రిట్ పిటిషన్ మాత్రమేనని పేర్కొన్నారు.
సినిమా యూనిట్ కోరిన అన్ని సడలింపులకు ప్రభుత్వం అంగీకరించలేదని, కొన్నింటికే మాత్రమే అనుమతి ఇచ్చామని వివరించారు. అలాగే టికెట్ ధరల పెంపులో భాగంగా 20 శాతం లాభాలను సినీ కార్మికులకు ఇవ్వాలనే షరతు విధించినట్లు తెలిపారు. దీనివల్ల సినీ కార్మికులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే సినీ కార్మికుల అసోసియేషన్‌ను పార్టీగా చేర్చకుండా వారి వాదనలు వినకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై మరింత విచారణ అవసరమని భావించిన హైకోర్టు, తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది.