దర్శకేంద్రుడి పుట్టినరోజు

        తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు.. భక్తి, రక్తి, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ ఇలా ఆయన తెలుగు తెరమీద ఆవిష్కరించని సినిమానే లేదు.. ఎంత సాదించినా ఎంతటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినా ఎప్పుడూ మౌన ముద్రలోనే కనిపించే సినీ ముని ఆయన.. ఆయనే కె.రాఘవేంద్రరావు BA.. ఆయన జన్మదినం సందర్భంగా ఆ దర్శకేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆనాటి ఎన్టీఆర్‌ నుండి ఈ నాటి ఎన్టీఆర్‌ వరకు.. సూపర్‌స్టార్‌ కృష్ణ నుంచి మహేష్‌బాబు వరకు, దాదాపు మూడు తరాల హీరొలతో అత్యద్భుతమైన హిట్స్‌ అందించిన సినీ సృష్టికర్త ఆయన.. అందుకే ఆయన మూసగా సాగిపోతున్న తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులతో కలర్‌ఫుల్‌ టచ్‌ ఇచ్చాడు.. ఎంతో మంది హీరోలకు స్టార్‌డమ్‌ను అందిచిన దర్శకుడు. ఎన్టీఆర్‌, కృష్ణ, చిరంజీవి, శోభన్‌బాబు లాంటి హీరోలకు ఆయన దర్శకత్వంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ లభించాయి.. ప్రపంచంలో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది దర్శకుల్లో దర్శకేంద్రుడు ఒకరు.. తెలుగు తెరకి గ్లామర్‌ని తీసుకొచ్చిన దర్శకుడు కూడా ఆయనే, హీరోయిన్లను అందంగా చూపించడంలోను, స్క్రీన్‌ను అందమైన కాన్వాస్‌లా  మలచడంలోనూ, కే. రాఘవేంద్రరావు ని మించిన దర్శకులు తెలుగు లో లేరంటే అతి శయోక్తి కాదు. అందుకే అప్పుడు ఇప్పుడు  హీరోయిన్లు రాఘవేంద్రారవుగారి దర్శకత్వంలో ఒక్కసినిమా అయినా చేస్తే చాలు అనుకుంటారు..          ప్రేమ్ నగర్ వంటి అద్భుతమైన ప్రేమకథలను అందించిన ప్రకాశ్ రావు కుమారుడే మన కోవెలముడి రాఘవేంద్రరావు,  ఈయన 1942 మే 23 న జన్మించారు. తండ్రితో పాటు విక్టరి మదుసూదన్‌గారి దగ్గర శిష్యరికం చేసిన రాఘవేంద్రరావు.. 1975 లో వచ్చిన బాబు సినిమాతో డైరెక్టర్‌గా మారారు.. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఆఫ్‌ బీట్‌ సినిమాలు మాత్రమే తీసిన రాఘవేంద్రడు తరువాత తరువాత కమర్షియల్‌ పంథాకు మారాడు.. ముఖ్యంగా 1977లో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కించిన అడవిరాముడు సినిమాతో పూర్తి స్థాయి కమర్షియల్‌ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు.. ఆ తరువాత ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కించిన వేటగాడు, డ్రైవర్‌రాముడు, గజదొంగ, కొంటవీటి సింహం లాంటి సినిమాలు వరుస హిట్స్‌గా నిలిచాయి.. సూపర్ స్టార్ కృష్ణ ని సరికొత్త కోణంలో చూపించిన దర్శకుడు కూడా రాఘవేంద్ర రావే. వీరి కాంబినేషన్లో వచ్చిన అగ్ని పర్వతం సూపర్ స్టార్ పాపులారిటీని రెట్టింపు చేసింది. యన్.టి.ఆర్ తర్వత ఎక్కువగా కృష్ణ తోనే సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసారు రాఘవేంద్రరావు. మెగాస్టార్‌ చిరంజీవి, రాఘవేంద్రరావుల కాంభినేషన్‌లో భారీ హిట్స్‌ వచ్చాయి..అడవిదొంగ, ఘరానమొగుడు, రౌడి అల్లుడు, ఇద్దరు మిత్రులు లాంటి హిట్‌ చిత్రాలతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి మాస్టార్‌ పీస్‌ కూడీ వీరి కాంభినేషన్‌లో రూపొందిందే.. అంతేకాదు అతి ఎక్కువ మంది వారసులను టాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా రాఘవేంద్రరావే.. విక్టరీ వెంకటేష్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ లాంటి స్టార్లను వెండితెరకు అందిచిన ఘనత కూడా రాఘవేంద్రునిదే.. కమర్షియల్‌ సినిమాలతో భారీ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నా ఆయన ఆ సినిమాలతోనే ఆగిపోవాలనుకోలేదు.. అందుకే భక్తి రసాన్ని కూడా వెండితెర మీద పారించాడు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలో రాఘవేంద్రరావు, నాగార్జునల కెరీర్‌లోనే కాదు టాలీవుడ్‌ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి.. హింది ప్రేక్షకులకు కూడా రాఘవేంద్ర రావు సుపరిచితమే. తెలుగులో ఆయన తీసిన చాలా సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఆయనే స్వయంగా హిమ్మత్ వాలా వంటి బ్ల్లక్ బాస్టర్‌ను హింది చిత్రసీమకు అందించారు. ఈ సినిమాతో శ్రీదేవి హిందీలో స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగు తెరకు భక్తి, రక్తి రసాలను సమాపాల్లలో అందిస్తున్న దర్శకేంద్రుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరిన్ని హిట్‌ చిత్రాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ రాఘవేంద్రరావుగారికి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు..  

'బాహుబలి'లో నటించడం లేదు: రాజమౌళి

        టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు. ''తాను బాహుబలి లో నటించడం లేదని, ఈ ఫోటో మూడు సంవత్సరాలకు ముందు తీసింది. అప్పట్లో నేను సరదాగా నా గడ్డాన్ని ఆ స్టైల్లో మార్చుకున్నానని’' ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.

క్యాథరీన్ టాప్ లేపుతుందా!

'చమ్మాక్ చల్లో' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన క్యాథరీన్ థెరీసా, మొదటి సినిమా తో సక్సెస్ సాధించలేకపోయిన అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున సరసన 'ఇద్దరమ్మాయిలతో', నాని తో పైసా లో క్యాథరీన్ నటించింది. ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే 'టాప్ లేచిపోద్ది' లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంపికయిందని వార్తలు వస్తున్నాయి. ఇది కాక మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో క్యాథరీన్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. భవిష్యత్తుల్లో క్యాథరీన్ టాప్ లీగ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో వింత౦టే ఇదే మరీ! సక్సెస్ తో పని లేకుండా గ్లామరస్ హీరోయిన్ గా ముద్ర పడితే చాలు అవకాశాలు అవే వెతుకుంటూ వస్తాయి.  

బహుబలి లో రాజమౌళి కొత్త అవతారం

      డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. పైన కనిపిస్తున్న ఫోటో అదే. ఇక ఈయనలో గొప్ప నటుడు కూడా ఉన్నాడని గతంలో చాలా మంది హీరోలు కూడా చెప్పారు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలోని కొన్ని సీన్లను సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది. మరి తొలిసారి నటుడిగా మారుతున్న దర్శక ధీరుడు ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ధం అవుతుంది.

ఆలీతో పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్స్

        సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, నటులు రవిప్రకాశ్, అమిత్ కూడా అలీకి అభినందనలు తెలిపారు. అలీ మాట్లాడుతూ "బాల నటునిగా నా సినీ జీవితాన్ని ప్రారంభించాను. ఇన్నేళ్లుగా చిత్రసీమలో కొనసాగుతూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నందుకూ, ఐదేళ్ల నుంచీ మా నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకూ ఈ గౌరవ డాక్టరేట్ రావడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

బుడ్డోడ౦టే గుడ్డలూడతీసి కొడతా: జూనియర్ ఎన్టీఆర్

      యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్. ''ఎవడు పడితే వాడు బుడ్డోడు,బుడ్డోడు అని అంటే గుడ్డలూడతీసి కొడత..అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయ్యుండాలి'' ఈ డైలాగ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో హాట్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా జరుగుతుంది. 'బాద్‌షా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, 'గబ్బర్‌సింగ్' వంటి టాప్ గ్రాసర్ తీసిన హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.    

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌

        ఎన్టీఆర్‌.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌..   ఈ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కెరీర్‌పై ఓ లుక్‌..         నందమూరి వారసునిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఎన్టీఆర్‌ తన తొలి సినిమా నుంచి ఆ స్థాయిని కొనసాగించాడు.. బాల నటుడిగా సీనియర్‌ ఎన్టీఆర్‌ తెరకెక్కించిన హిందీ సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించిన ఎన్టీఆర్‌ తరువాత బాలరామయణం సినిమాలో శ్రీరామునిగా పూర్తి స్థాయి నటునిగా వెండితెరకు పరిచయం అయ్యాడు.. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎమ్‌ఎస్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో పౌరాణిక పాత్రలో నటించాలంటే నందమూరి వారే చేయాలని నిరూపించాడు..         పూర్తి స్థాయి హీరోగా ఎన్టీఆర్‌ నటించిన తొలి సినిమా మాత్రం నిన్నుచూడాలని.. తొలి ప్రయత్నంలో నిరాశ పరిచినా రెండో సినిమా స్టూడెంట్‌ నెంబర్‌ 1 తో మాత్రం భారీ సక్సెస్‌ అందుకున్నాడు..  ఈ సినిమాతోనే టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమా వీరిద్దరికి భారీ సక్సెస్‌తో పాటు స్టార్‌డమ్‌ను కూడా సాదించిపెట్టింది.         స్టూడెంట్‌ నెంబర్‌ 1 సినిమాతో యూత్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ మాస్‌ హీరోగా టర్న్‌ తీసుకున్న సినిమా ఆది.. దిల్‌ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న వివి వినాయక్‌ రెండో ప్రయత్నంగా తెరకెక్కిన ఈ సినిమాతో ఎన్టీఆర్‌ స్టార్‌ స్టేటస్‌తో పాటు మాస్‌ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు..         ఎన్టీఆర్‌ కెరీర్‌లో మరో మైల్‌ స్టోన్‌ సింహాద్రి.. స్టూడెంట్‌ నెంబర్‌ 1 సినిమాతో ఎన్టీఆర్‌కు తొలి సక్సెస్‌ అందించిన రాజమౌళి.. సింహాద్రి సినిమాతో స్టార్‌ హీరోల సరసన నిలబెట్టాడు.. అప్పటి వరకు తడబడుతూ నడిచిన ఎన్టీఆర్‌ కెరీర్‌ సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది..         సింహాద్రి సక్సెస్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌కు ఎంత ఉపయోగపడిందో అంతే నష్టం కూడా చేసింది.. సింహాద్రి లాంటి భారీ మాస్‌ యాక్షన్‌ క్యారెక్టర్ తరువాత మామూలు సినిమాల్లో ఎన్టీఆర్‌ ను చూడలేకపోయారు అభిమానులు.. దీంతో చాలా కాలం ఎన్టీఆర్‌ ఫ్లాప్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది..         అయితే అశోక్‌, రాఖీ లాంటి సినిమాలతో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు ఎన్టీఆర్‌.. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్‌లోని నటున్ని ఆవిష్కిరించినా భారీ కమర్షియల్‌ సక్సెస్‌ను మాత్రం అందించలేకపోయాయి.. దీంతో మరోసారి ఆ బాధ్యతను తీసుకున్నాడు రాజమౌళి.. యమదొంగ సినిమాతో మరోసారి ఎన్టీఆర్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించి హ్యాట్రిక్‌ సాదించాడు..         ఇక ఎన్టీఆర్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో సినిమా అదుర్స్‌ అప్పటి వరకు మాస్‌ అండ్‌ యూత్‌ స్టోరీస్‌ మాత్రమే చేసిన ఎన్టీఆర్‌ ఈ సినిమాతో కామెడీని కూడా ట్రై చేశాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ చేసిన చారి క్యారెక్టర్ ఆయన కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ది బెస్ట్‌ క్యారెక్టర్‌..         వరుసగా మాస్‌ సినిమాలు మాత్రమే చేసిన తన మీద ఆ ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డాడు ఎన్టీఆర్‌.. అందుకే కేవలం మాస్‌ సినిమాలే కాకుండా బృందావనం లాంటి ఫ్యామిలీ స్టోరితో కూడా మెప్పించి తను ఎలాంటి క్యారెక్టర్‌ అయిన చేయగలనని నిరూపించుకున్నాడు..         ప్రస్థుతం ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ టాప్ హీరోస్‌లో ఒకరు ఆయనతో సినిమా అంటే టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌లు కూడా క్యూలో ఉంటారు.. ఎన్టీఆర్‌ అన్న పేరుకు ఉన్న విలువను కాపాడుతూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ మరిన్ని విజయాలతో దూసుకుపోవాలి కోరుకుంటూ మరోసారి ఈ యంగ్‌ టైగర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేద్దాం..

'కిస్' టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

      పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.   'కిస్' అంటే 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. ప్రతిదాన్ని సరదాగా తీసుకునే యువకుడి పాత్రలో అడివి శేష్ కనిపించనున్నారు. తాను చేసిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని శేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో మరో హాట్ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. 'మిస్ కెనడా ఫోటోజెనిక్'గా పేరుబడిన ప్రియా బెనర్జీ నీ  'కిస్' తో టాలీవుడ్ పరిచయం చేస్తున్నాడు శేష్. ఆన్ స్క్రీన్ పై ప్రియా, శేష్ ల కెమిస్ట్రీ హాట్ గా ఉందని అప్పుడే వార్తలు కూడా వస్తున్నాయి. 'కిస్' తో ప్రియా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకోవడం ఖాయమని అంటున్నారు.    

150 కోట్ల భారీ ప్రయోగం

        గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌..    ఇటీవల కాఫీబార్‌ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీతాకృష్ణ ఇంతవరకు వెల్‌నోన్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో మాత్రం స్థానం సంపాదించలేక పోయాడు.. కాని ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం గీతాకృష్ణ మంచి అభిరుచి గల దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు..         సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌కి దూరంగా భిన్నమైన కథలతో ఆర్టిస్టిక్‌ సినిమాలను తెరకెక్కించే గీతాకృష్ణ, త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు.. అది కూడా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో.. సౌత్‌ ఇండియాలోనే ఫస్ట్‌ టైం ఇంత పెద్ద మొత్తంతో ఓ ప్రాజెక్ట్‌ తెరకెక్కించబోతున్నారు. .         అయితే గీతా కృష్ణ తెరకెక్కించే ఈ ప్రాజెక్ట్‌ సినిమా కాదట.. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ గ్రాడ్యుయేట్‌ అయిన గీతాకృష్ణ.. భారతీయ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, రాజకీయాలు, ఇతర విశేషాల నేపథ్యంలో ఓ డాక్యమెంటరీని తెరకెక్కిస్తున్నారు.. దీని కోసం ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షూటింగ్‌ చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు..         మై కంట్రీ ఇండియా టైం క్యాప్సుల్‌ పేరుతో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ ఫ్యూచర్‌ ఫిల్మ్‌ను తొమ్మిది భాగాలుగా విడుదల చేయనున్నారట.. అయితే పూర్తి భారతదేశ విశేషాలతో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ డాక్యుమెంటరీ ధర 9,999 రూపాయలుగా నిర్మించారు నిర్మాతలు.. ఈ ధర కాస్త ఎక్కువగా అనిపించినా పూర్తి ప్రాజెక్ట్‌ ఖర్చు 150 కోట్లు దాటుతుండటంతో ఆ మాత్రం ధర తప్పదంటున్నారు.. మరి సినిమాలతో పెద్దగా సక్సెస్‌లు అందుకోలేకపోయిన గీతాకృష్ణ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఎలాంటి రిజల్ట్స్‌ సాదిస్తాడో చూడాలి..  

‘అత్తారింటికి దారేది ’ లో పవన్ సాంగ్

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాట కూడా ఓ హైటెట్ గా చెబుతున్నారు. పవన్ సినిమా అంటే అభిమాన్లులో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు పవన్ పాట పాడుతున్నాడని తెలియడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా శరవేగంగా రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కుంది.

ఎప్పుడూ వాళ్లేనా..

        ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్‌లు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతులు.. హాలీవుడ్‌ స్టార్ల తళుకులతో రెడ్‌కార్పెట్‌ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..     ముఖ్యంగా ఆకట్టుకునే అందం తోపాటు భారీ స్టార్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఒకరు ఇద్దరు ఆర్టిస్ట్లు తప్ప నటులుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారతీయులకు ఇలాంటి వేడుకల నుంచి పిలుపు రాకపోవడం బాధాకరం..    ఇండియన్‌ సినిమా నుంచి అమితాబ్‌ లాంటి వాళ్లు అతి ఎక్కువ సార్లు కేన్స్‌ వేధిక మీద మెరవగా విశ్వసుందరి ఐశ్వర్య కూడా అంతర్జాతీయ వేదికల మీద బాగానే కనిపించింది.. వీళ్లతో పాటు అందాల ఆరబోతతో గుర్తింపు పొందిన మల్లికా షెరావత్‌ లాంటి వాళ్లు కూడా ఇలాంటి స్టేజ్‌ల మీద అలరించారు..         కాని భారతీయ సినిమాకు అవార్డుల పంట పండిచిన కమల్‌హాసన్‌, మమ్ముటి, మోహన్‌లాల్‌, ఓంపురి లాంటి అరుదైన అద్భుతమైన నటులకు ఇలాంటి వేడుకలకు ఆహ్వానాలు అందంటం చాలా అరుదు.         బాలీవుడ్‌ నటులు హాలీవుడ్‌కు కాస్త చేరువగా ఉండటంతో పాటు బాలీవుడ్‌ సినిమాలకు విదేశాల్లో కూడా మంచి ఆదరణ ఉండటంతో అక్కడి నటులకు మాత్రమే హాలీవుడ్‌ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.. సౌత్‌ స్టార్‌లు ఎంత గొప్ప వారయినా అంతర్జాతీయ వేదికల మీద తళుక్కుమనే అర్హత మాత్రం సాదించలేక పోతున్నారు..         ఇవి ఏ నటుల ప్రతిభకు కొలమానాలు కాకపోయినా వాళ్ల అభిమానులు మాత్రం అలా అంతర్జాతీయ వేదికల మీద తన అభిమాన నటులు కూడా పాలుపంచుకుంటే చూసుకోవాలని కోరుకుంటున్నారు    

'మాయాబజార్' ఇండియాస్ గ్రేటెస్ట్ మూవీ

        ఐబీఎన్ నిర్వహించిన లైవ్‌పోల్‌లో 'ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' కిరీటం మన 'మాయాబజార్'కు దక్కింది. అక్షరాలా 16,960 ఓట్లతో (23.91%) సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఐబీఎన్ నిర్వహించిన గ్రేటెస్ట్ యాక్టర్స్ పోల్‌లో మన ఎన్టీఆర్, శ్రీదేవి నంబర్‌వన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గొప్ప చిత్రం కీర్తి కూడా తెలుగు సినిమాకే దక్కడం విశేషం. కాగా, ఈ పోల్‌లో.. రజనీకాంత్ సూపర్ హిట్ సినిమా చంద్రముఖికి మలయాళ మాతృక.. 'మణిచిత్ర తాళు' 15,017 ఓట్ల(21.17%)తో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కూడా మలయాళ చిత్రానికే దక్కింది. ఆ సినిమా.. ఒరు వడక్కన్ వీరగాథ. 14,603 ఓట్ల(20.59%)తో ఆ సినిమా తృతీయస్థానంలో నిలిచింది. బెంగాలీలు గొప్పగా చెప్పుకొనే పథేర్ పాంచాలి (3902) నాలుగో స్థానంలో నిలవగా.. మణిరత్నం తీసిన నాయగన్ (3,854) ఐదో స్థానంతో సంతృప్తి చెందింది.

హాలివుడ్ లోకి తెలుగు సినిమా రీమేక్

  ఇంతవరకు మన తెలుగు సినిమాలు ఎక్కువగా దేశంలోనే ఏదో ఒక భాషలోకి రీమేక్ అవడం చూశాము. కానీ, మొట్ట మొదటిసారిగా మన తెలుగు సినిమా ఇంగ్లీషులో రిమేక్ చేయబడి హాలివుడ్ లో విడుదల కాబోతోంది. యస్వీ.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 1997లో విడుదలయిన ‘ఆహ్వానం’ సినిమాను ఇంగ్లీషులోకి ‘డైవోర్స్ ఇన్విటేషన్’ అనే పేరుతో రిమేక్ చేస్తున్నారు. గమ్మతయిన విషయం ఏమిటంటే, అందరూ హాలివుడ్ నటులే నటిస్తున్న ఈ సినిమాను మళ్ళీ యస్వీ.కృష్ణా రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, దానిని డా.వెంకట్ తన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ఈ రోజు లాస్ ఏంజల్స్ లో ప్రదర్శించబడుతోంది. దానికి దర్శక నిర్మాతలతో సహా అందరూ హాజరవుతున్నారు.   ఈ సినిమాలో హాలివుడ్ నటులు జోనాధన్ బెన్నెట్, జామీ-లైన్ సైగలర్, నదియ బ్జోర్లిన్, ఎల్లియట్ గౌల్డ్, లానిక్ కాజాన్ తదితరులు ముఖ్యమయిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కధ మరియు దర్శకత్వం యస్వీ.కృష్ణా రెడ్డి చేపట్టగా, సంగీతం లెన్ని ‘స్టెప్’ బన్న్ మరియు ఎడ్ బర్గరేన అందించారు. కెమెరా:బ్రాడ్ రషింగ్ ఎడిటింగ్: గ్యారీ డీ రోచ్ మరియు బ్లూ ముర్రే.   ఈ విధంగా తెలుగు సినిమా హాలివుడ్ స్థాయికి ఎదగడం, దానిని మన తెలుగు దర్శక నిర్మాతలే నిర్మించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఇంతవరకు హాలివుడ్ దర్శకులు, కధకుల చేతిలో ఒక రకమయిన మూస కధలకి అలవాటుపడిన విదేశీ ప్రేక్షకులకి మన ఆవకాయ, గోంగూర పచ్చడి వంటి కొత్త రుచులతో సరికొత్త రకం సినిమాని వడ్డిస్తున్న డా.వెంకట్ మరియు యస్వీ.కృష్ణారెడ్డిలకు అభినందనలు.

నటి అంజలి కేసులో కొత్త ట్విస్ట్

    ప్రముఖ సినీ నటి అంజలి కుటుంబ వివాదం కొత్త మలుపు తిరిగింది. తమను కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఇళ్లు, ఆస్తులు వదిలేసి చెన్నై నుండి వెళ్లిపొవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంజలి పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. కుటుంబం వివాదం నేపథ్యంలో ఐదు రోజుల పాటు అదృశ్యమయిన అంజలి వ్యవహారం సమసిపోతుంది అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదుతో మరింత రసకందాయంలో పడింది.   కొద్ది రోజుల క్రితం తనకు బెదిరింపు కాల్స్ రావడంతో తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నానని, ఇప్పుడు తన కుమారుడు, భర్తల సెల్ ఫోన్లకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఎలాంటి అనుమానాలు రాకుండా శాటిలైట్ ఫోన్ల నుండి ఫోన్లు చేస్తున్నట్లు అనుమానం వస్తుందని, చెన్నై వదలకుంటే చంపుతామని అంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు తమిళంలోనే మాట్లాడుతున్నారని అన్నారు.  

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ 'కోబలి'

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంస్థ నిర్మించే ఈ సినిమాకి 'కోబలి' అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పోరాట సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.