'బాద్షా' బాక్సాఫీసు వద్ద రికార్డుల వేట
ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాద్షా సినిమా ఈ రోజు విడుదలయింది. అలాగే సినిమా మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకొని, సినీ విమర్శకుల దగ్గర మంచి మార్కులు కూడా రాబట్టుకోవడంతో అటు సినిమా యూనిట్ ఇటు నందమూరి అభిమానులు హాయిగా ఊపిరి తీసుకొన్నారు.
ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడానికి ప్రధానంగా చెప్పుకోవలసిన విషయాలు దాదాపు అందరూ ఊహించినవే. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యన్టీఆర్ మార్క్ యాక్షన్+కామెడీ, బ్రహ్మానందం+ఎం.ఎస్ నారాయణల కామెడీ.
మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన యన్టీఆర్ తనపవరేమిటో మరోమారు చూపింఛి అదుర్స్ అనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ డెలివరీ, కామెడీ ట్రాక్స్ లో అతని అద్బుతమయిన టైమింగ్, ఫస్ట్ ఆఫ్ కి సెకండ్ ఆఫ్ కి ఆతను నటనలో స్పష్టంగా చూపిన తేడా, ఫైట్స్, డ్యాన్సులు అన్నీ వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉన్నాయి. సీనియర్ యన్టీఆర్ చేసిన జస్టిస్ చౌదరి సీన్లు, సంగీత్ లో ఆయన పాటలకి వేసిన స్టెప్పులు ఊహించిన దానికంటే చాలా బాగా వచ్చాయి. ఇక మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇక అదేవిధంగా ఇన్స్ పెక్టర్ పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మానందం, డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వర రావు పాత్రలో ఎం.ఎస్ నారాయణ ఇద్దరూ కూడా దాదాపు సినిమాని తమ భుజాల మీద వేసుకొని నడిపించేరని చెప్పవచ్చును. వారినిద్దరినీ ఎలా వాడుకోవాలో బాగా తెలిసున్న శ్రీను వైట్ల వారి నుండి కామెడీ ఎంత పిండుకోవచ్చో అంతా పిండేసుకొన్నాడు. ఒకో సమయంలో సినిమాలో హీరో యన్టీఆరా లేక బ్రహ్మానందమా అనే రీతిలో సాగిపోయింది వారి కామెడి.
బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకొంటే బాద్షా లేకుంటే జఫ్ఫా అవుతాడని చెప్పవచ్చును జూ.యన్టీఆర్, బ్రహ్మానందం కలిసి చేసిన అదుర్స్ సినిమా తరువాత మళ్ళీ అంతకు ఏమాత్రం తీసిపోని రీతిలో. వారిద్దరు ఈ సినిమాలో గొప్పకామెడీ పండించారు. ఇక నాజార్, జూ.యన్టీఆర్, బ్రహ్మానందంల మద్య వచ్చే కామెడీ సీన్లు కూడా చాలా బాగా పండాయి.
హీరోయిన్ కాజల్ పాత్ర మాత్రం షరా మామూలుగానే హీరోతో ఆడి పాడుకోవడానికే తప్ప ఆమె ప్రత్యేకంగా చేయవలసిన, కష్టపడవలసినదేమి లేదనే చెప్పవచ్చును కాకపోతే ఆమె పరిధి మేరకు చక్కటి నటన, గ్లామర్, డ్యాన్సులు చక్కగా చేసిందని మాత్రం చెప్పవచ్చును. సైరో సైరో, రంగోలి రంగోలి, బంతిపూల జానకి, వెల్ కమ్ కనకం సాంగ్స్ చాల బాగా వచ్చాయి. ఇక సినిమాలో సింగల్ లయిన్ పంచ్ డైలాగులు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమన్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
ఇక ప్రతీ సినిమాకి ఉన్నట్లే ఈ సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సినిమా చూస్తునంత సేపు వైట్ల పాత సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. కానీ, శ్రీను వైట్ల తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మరిపించి వారిని మరేమీ ఆలోచించుకోనీయకుండా తన కామెడీ సీన్లతో కట్టిపడేసాడు. జూ.యన్టీఆర్, బ్రహ్మానందం, నాజర్, ఎం.ఎస్ నారాయణల పాత్రలను తీర్చి దిద్దడంలో చూపిన శ్రద్ధ జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, తనికెళ్ళ వంటి వారి పాత్రలపై చూపలేదేమోనని అనిపిస్తుంది. అలాగని వారెవరూ తమ పాత్రలను తేలికగా తీసుకోలేదు. సిద్దార్థ్ తో సహా అందరూ కూడా తమ పాత్రలలో చాలా చక్కగా నటించారు.
సినిమా మొత్తంగా చూస్తే కామెడీ, యాక్షన్ ప్రధానంగా సాగిందని చెప్పవచ్చును. రెండూ కూడా సమపాళ్ళలో పడ్డాయి గనుక బాద్షా ఇక బాక్సాఫీసు బద్దలు చేయడానికి డిసయిడ్ అయిపోయినట్లే.