దండుపాళ్య౦ 100 డేస్

        కన్నడలో సూపర్ హిట్‌ అయి 25 కోట్ల రూపాయల షేర్‌ సాధించిన ‘దండుపాళ్య’ చిత్రం తెలుగులో ‘దండుపాళ్యం’గా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ అవడమే కాకుండా 18 సెంటర్స్‌లో యాభై రోజులు, 2 సెంటర్స్‌లో వంద రోజులను పూర్తి చేసుకుంది. యధార్థ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకుడు శ్రీనివాసరాజు, నిర్మాత వెంకట్‌, రచయిత దర్శకుడు కె.ఆర్‌.కె.రాజు, కెమెరామెన్‌ వెంకట్‌ ప్రసాద్‌, పబ్లిసిటీ డిజైనర్‌ సాయి, కో-డైరెక్టర్‌ రమేష్‌, పి.ఆర్‌.ఓ. బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. త వెంకట్‌ మాట్లాడుతూ – ”భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో ‘దండుపాళ్యం’ చిత్రం రెండు సెంటర్స్‌లో హండ్రెడ్‌ డేస్‌ పూర్తయి ఇదేరోజు వంద రోజుల ఫంక్షన్‌ జరగడం చాలా ఎగ్జైటింగ్‌గా వుంది భక్త సిరియాళ్‌, పోలీస్‌స్టోరీ చిత్రాల తర్వాత మా ‘దండుపాళ్యం’ చిత్రం వందరోజులు ఆడింది. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ – ”1913 మే 3కి ఇండియన్‌ ఫిల్మ్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ కంప్లీట్‌ అవటం ఈ అకేషన్‌లో మా సినిమా వందరోజులు ఫంక్షన్‌ జరగడం మంచి అవకాశంగా భావిస్తున్నాం. మంచి సినిమాతో నా ఎంట్రీ వుండాలనుకున్నా అని అన్నారు.

వేశ్యగా నటి హరిప్రియ

        సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకి ఎక్కువడంతో వారి నుండి వచ్చే పోటీని తట్టుకోవడానికి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి వెనకాడటం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం వేశ్య పాత్రలు వేస్తూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన శ్రేయ, ఛార్మి, వేద లాంటి వారు వేశ్య పాత్రలు చేస్తున్నారు. త్వరలో వీరు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక వీరికి పోటీగా మరో నాయిక వచ్చింది. తెలుగులో నాని సరసన ‘పిల్ల జమిందార్ ’ సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్న హరిప్రియ ప్రస్తుతం వేశ్య పాత్రలో నటిస్తుంది. ఈమె ‘అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్ ’ అనే సినిమాలో ఆ క్యారెక్టర్ చేస్తుంది. హీరో జీవితంలోకి ఓ వేశ్య ఎందుకు ప్రవేశించిందన్న అంశంపై సినిమా కథాంశం ఉంటుంది. మరి ఈ అమ్మడు ఇప్పుడున్న వేశ్యలకు ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి.

'గ్రీకువీరుడు' నాగ్ మూవీ టాక్

        టాలీవుడ్ కింగ్ నాగార్జున, నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్రీకువీరుడు' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమాకి 'ఎ' సెంటర్స్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. గత కొంత కాలంగా ఎక్స్ పరిమేంట్ మూవీస్ చేస్తున్న నాగార్జున, మళ్ళీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చేశారు. నాగార్జున ఎవర్ గ్రీన్ మన్మధుడు అనేది ఈ సినిమాలో మరోసారి నిరూపించారు. నాగ్ రొమాంటిక్ సినిమాలు చేస్తే ముందుగా ప్రస్తవించేది ఆయన గ్లామర్ గురించే. ఈ సినిమాలో కింగ్ యాక్టింగ్ సూపర్. నయనతార నటన కూడా బాగుంది. నాగార్జున, నయనతార కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ పాయింట్. బ్రహ్మానందం, చెవిటి మేళం పాత్రలో జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, ఎం.ఎస్ నారాయణలు సినిమాలో అక్కడక్కడా కాస్త నవ్వించగలిగారు. థమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఎక్కువగా ఉండడంతో, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవచ్చు.

రామ్ చరణ్ రెమ్యునరేషన్ 17కోట్లు!

        మెగా పవర్ స్టార్ టాలీవుడ్ లో తన పవర్ ని చూపిస్తున్నాడు. వరుస విజయాలతో టాప్ రేంజ్లో కి దూసుకుపోయాడు. రెమ్యునరేషన్ లో మహేష్, ఎన్టీఆర్ ని మించిపోయాడు. లేటెస్ట్ గా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న మూవీకి ఏకంగా 17కోట్లు పారితోషకం తీసుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. హీరో రెమ్యునరేషనే ఇంత భారీగా వుంటే సినిమా బడ్జెట్ మొత్తం ఏ స్థాయిలో వుంటుందో? ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టే మార్కెట్ చెర్రికి వుందా? ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత పరిస్థితి ఏంటని విశ్లేషకులు చర్చిస్తున్నారు. వరుస హిట్స్ కొడుతున్న బండ్ల గణేష్ కి ఇదో పెద్ద లెక్క కాకపోవచ్చు, కాని ఇదే ఫ్యాషన్ టాలీవుడ్ ఫాలో అయితే మాత్రం మంచిదికాదని అంటున్నారు.

‘ఇద్దరమ్మాయిలతో ’ ఆడియోలో అల్లు అర్జున్ ఉద్వేగం

        స్టైలిష్ స్టార్ అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా ఆడియో రిలీజ్ శిల్పకళా వేదికలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఆ ఆడియో వేడుకకు దర్శకుడు వి.వి. వినాయన్, రామ్ చరణ్ , దిల్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ కాస్త ఉద్వేగంగా మాట్లాడాడు. ఫ్యాన్స్ ఇంతగా మెగా ఫ్యామిలీ హీరోలను ఆదరించడం వల్లనే మేము ఇంత స్థాయికి వచ్చామని, ఇంతగా మాకు పేరు రావడానికి చిరంజీవి గారే కారణం. ఆయన తరువాతి స్థానం రామ్ చరణ్ తేజదే అని, రాబోయే పాతికేళ్ళు చరణ్ బిజీ హీరోగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ చక్కటి మ్యూ.జిక్ ఇచ్చాడని, పూరీ జగన్నాథ్ ఈ సినిమా కోసం చాలా శ్రమ పడ్డాడని 100 % ప్రేక్షకులకు నచ్చే చిత్రం అని అన్నాడు.

రామ్ చరణ్ తో 'మిర్చి' డైరెక్టర్ మూవీ

        యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మిర్చి తో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివకి మెగా ఛాన్స్ దక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమాను తెరకేక్కి౦చబోతున్నాడు. బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత. మే నెల రెండో వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో ‘జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో ‘తుఫాన్' పేరుతో విడుదల కానుంది. కాని ‘తుఫాన్' వివాదాల్లో ఇరుక్కోవడంతో 'ఎవడు' రిలీజ్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

మే12న గోపిచంద్ మ్యారేజ్

      టాలీవుడ్ హీరో గోపిచంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గోపిచంద్ వచ్చేనెల 12 తేదీన ప్రముఖ హీరో శ్రీకాంత్ అక్క కూతురు రేష్మ మెడలో మూడుముళ్లు వేయనున్నాడు.ఈ వివాహం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు పంచినట్లు తెలుస్తుంది. తొలివలపు చిత్రంతో హీరోగా పరిచయమయిన గోపిచంద్ జయం సినిమాతో విలన్ గా మారాడు. ఆ తరువాత నిజం, వర్షం చిత్రాలలో విలన్ గా నటించాడు. తరువాత యజ్ఞం చిత్రంతో మళ్లీ హీరోగా మారాడు. ఆ తరువాత ఆంధ్రుడు, రణం, లక్ష్యం, గోలీమార్ చిత్రాలు విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం ఈయన ఓ భారీ యాక్షన్ సినిమా అయిన ‘సాహసం ’ లో నటిస్తున్నాడు.

'షాడో' వెంకటేష్ మూవీ టాక్

      విక్టరీ వెంకటేష్ నటించిన స్టైలిష్ యాక్షన్ మూవీ 'షాడో' ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనే వెంకటేష్, ఈ సారి యాక్షన్ మూవీ తో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకి ప్రేక్షుకుల నుంచి వస్తున్న టాక్ ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు. ఈ సినిమా లో వెంకటేష్ నటన ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని అంటున్నారు. అయితే ఈ క్రెడిట్ అంతా మెహర్ రమేష్ కే దక్కుతుందని, వెంకటేష్ లాంటి నటుడు దగ్గర నుంచి ఇలాంటి నటన రాబట్టుకున్న ఘనత మెహర్ కే దక్కిందని అంటున్నారు. తాప్సీ అందాల ఆరబోతకే తప్ప, సినిమాలో చేయడానికి ఏమి లేదు. శ్రీకాంత్ కూడా చేయడానికి ఏమి లేదు. ఎంఎస్ నారాయణ సినిమాలో గంట సేపు వున్న ఐదు నిముషాలు కూడా నవ్వించలేకపోయాడు. తమన్ సంగీతం యావరేజ్ గా మార్కుని దాటాలేకపోయింది. ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే నిర్మాణ విలువలు మాత్రమే. నిర్మాత దర్శకుడు పై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

రాజమౌళి 'బహుబలి' లో నటి శ్రీదేవి

      ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల సుందరి శ్రీదేవి దాదాపు 15 సంవత్సరాల తరువాత ‘ఇంగ్లీష్ వింగ్లీష్ ’ సినిమాలో నటించి తనలోని నటనా ఏ మాత్రం చావలేదని నిరూపించింది. తాజాగా టాలీవుడ్ ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబళి ’ లో ప్రభాస్ కి తల్లిగా అందాల తార శ్రీదేవి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ల పేర్లను పరిగణలోకి తీసుకున్నాడట. అయితే వీరిద్దరిలో ఎవర్ని ఎంపిక చేయాలో రాజమౌళి తేల్చుకోలేక పోతున్నాడట. ఎందుకంటే వీరిద్దరు నటనలో, పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గరు. ఇద్దరు కోటికి పైగా డిమాండ్ చేస్తున్నారట. మొత్తంగా చూస్తే ఇటీవలే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. ఒకవేళ ఇదే గనుక కరెక్ట్ అయితే పెద్ద సెన్సేషన్ అవుతుందని అంటున్నారు.

సింహాను మించిన సినిమా తీస్తా: బోయపాటి

        నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సెకండ్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ..''సింహ తరువాత నందమూరి బాలకృష్ణ గారి తో సినిమా చేయబోతున్న, సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో తెలుసు. సింహ మించిన సినిమా తీస్తా..అని చెబితే తొందరపాటు అవుతుంది. కాని ఆ స్థాయికి మాత్రం తగ్గదు. బాలయ్య బాబు నుంచి అభిమానులు ఏమికోరుకుంటారో ..అవన్ని మేళవిస్తూ ఆయన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా..ఇందులో రాజకీయ అంశాలు ఉంటాయి కాని కథకు ఎంత వరకు అవసరమో అంతే ఉంటాయని'' అని చెప్పారు. బాలయ్యతో సినిమా అయ్యాక తాను చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' డైలాగ్

        యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ 'రామయ్యా వస్తావయ్యా'. గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ తరువాత ఎన్టీఆర్ తో హరీష్ చేస్తున్న మూవీ ఇదే కావడంతో దీనిపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ టిజర్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన హరీష్, ఇప్పుడు అదే ఫార్ములాను ఎన్టీఆర్ సినిమాకి రీపిట్ చేస్తున్నాడు. త్వరలో విడుదల చేయనున్న 'రామయ్యా వస్తావయ్యా' టిజర్ తో సినిమాపై మంచి క్రేజ్ ను క్రియేట్ చేయడానికి హరీష్ ప్లాన్ చేశాడట. అందుకోసం టిజర్ లో ''వస్తావా,వస్తావా అని క్వశ్చన్ చేయకు..వచ్చిన తరువాత ఎదురే ఉండదు'' అనే పవర్ ఫుల్ డైలాగ్ ను వదులుతున్నాడు. మరి ఈ డైలాగ్ నందమూరి అభిమానులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

యన్టీఆర్, చిరంజీవి మేటి నటులు: యన్డీ.టీ.వీ.

  ఈ నెల 21న భారతీయ సినీపరిశ్రమ 100సం.లు పూర్తిచేసుకొన్నశుభసందర్భంగా చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆసక్తికరమయిన విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిష్టాత్మకమయిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రముఖ బాలివుడ్ నటుడు ప్రాణ్ అందుకొనగా, సినీ పరిశ్రమలో 20మంది మేటి నటుల పేర్లను ప్రముఖ హిందీ చానల్ యన్డీ.టీ.వీ.ప్రకటించింది. వారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 6వ స్థానం పొందగా, మెగా స్టార్ చిరంజీవి 15వ స్థానంలో నిలిచారు. కానీ, ఈ చానల్ యాజమాన్యం ఉత్తరాదికి చెందినది కావడంతో దక్షిణాది సినీ రంగంలో స్వర్గీయ యస్వీ రంగారావు, జగ్గయ్య, అంజలీ దేవి, జమున, సావిత్రి, అక్కినేని నాగేశ్వర రావు, సత్యనారాయణ, గుమ్మడి వంటి అనేక మంది గొప్పనటులను విస్మరించింది. అదేవిధంగా దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్ర పరిశ్రమలకు సేవలందించిన మేటి నటీనటులను కూడా విస్మరించి, బాలివుడ్ కే ప్రాముఖ్యత ఇచ్చింది. ఆ చానల్ ఎంపిక చేసిన 20 మందిమేటి నటులలో ఒక్క మహిళానటి కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తుంది. యన్డీ.టీ.వీ.ప్రకటించిన ఆ 20మంది మేటి నటులు వీరే: బాలివుడ్ నటులు 1.దిలీప్ కుమార్; 2.రాజేష్ ఖన్నా; 3.అమితాబ్ బచ్చన్; 4.రజినీకాంత్(తమిళ్) ; 5.ప్రాణ్ శిఖండ్(హిందీ); 6.స్వర్గీయ యన్టీ.రామారావు(తెలుగు); 7.ఉత్తమ కుమార్, 8.స్వర్గీయ యమ్జీ. రామచంద్రన్(తమిళ్); 9.మోహన్ లాల్(మలయాళం); 10.నసీరుదీన్ షా(హిందీ); 11.స్వర్గీయ రాజ్ కపూర్( హిందీ); 12.కమల్ హాస్సన్( తమిళ్); 13.బలరాజ్ సహాని; 14.స్వర్గీయ ఉత్పల్ దత్(హిందీ); 15.చిరంజీవి( తెలుగు); 16.స్వర్గీయ రాజ్ కుమార్ (కన్నడ); 17.స్వర్గీయ శివాజీ గనేషన్ (తమిళ్); 18.మమ్మూట్టి (మలయాళం);19. షారుక్ ఖాన్ (హిందీ); 20.అమీర్ ఖాన్ (హిందీ).

అమెరికాలో కూడా గుండెలు గల్లంతే

  నితిన్ నిత్యా మీనన్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా ‘గుండె జారి గల్లంతయిందే’ రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలో సైతం పంపిణీ దారులకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు అమెరికా హక్కులు పొందిన గ్లోబల్ సినిమా మరియు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థవారు సినిమా విడుదలయిన మొదటి రోజునుండే చాలారోజుల వరకు అడ్వాన్స్ బుకింగులు అయిపోయాయని తెలిపారు. 23 కేంద్రాలలో విడుదల అయిన ఈ సినిమాకి వస్తున్న అపూర్వ ఆదరణ చూసిన తరువాత, త్వరలోనే లాస్ ఏంజల్స్ మరియు డెట్రాయిట్ నగరాలలో మరిన్ని ధియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు వారు ప్రకటించారు. సినిమా విడుదల అయిన మొదటి రోజు అంటే శుక్రవారం నాడు 23 ధియేటర్లలో33,337 డాలర్లు కలెక్షన్స్ రాగా, మరునాడు (శనివారం) అది రెట్టింపు అయ్యి మొత్తం 69, 678 డాలర్లు వసూలయ్యాయని వారు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ధియేటర్లలో విడుదల చేయనున్నందున ఇక తమ డాలర్ల పంట పండినట్లేనని పంపిణీ దారులు మురిసిపోతున్నారు. ఇంత మంచి ఆదరణ వస్తుందని తాము కలలో కూడా ఊహించలేదని, అందుకు తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెల్పుకొంటున్నామని వారు అన్నారు. ఈ అవకాశం కల్పించిన సినిమా నిర్మాతలకు, సినిమాను ఇంత చక్కగా మలిచిన దర్శకుడు విజయ్ కుమార్ కు, హీరో హీరోయిన్లకు మరియు నటీ నటులకు వారు పేరుపేరునా కృతజ్ఞతలు తెల్పుకొన్నారు.

'తడాఖా'లో రెచ్చిపోయిన తమన్నా

నాగ చైతన్య, తమన్నా నటిస్తున్న సెకండ్ మూవీ 'తడాఖా'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రంలో తమన్నా అందాలు ఓ రేంజిలో ఆరబోసి తన తడాఖా ఏంటో చూపించింది అంటున్నారు. నాగచైతన్య మాత్రం తన బెజవాడ, దడ సినిమాలు తిరగ్గొట్టిన ప్రజలందరికీ తన తడాకా చూపిస్తానని బెదిరిస్తున్నాడు. ఇటీవలే షూటింగు పూర్తి చేసుకొన్న అతని సినిమా పేరు ‘తడాకా.’ ఇది తమిళ్లో సూపర్ హిట్టయిన ‘వెట్టి’ అనే సినిమాకి తెలుగు రీమేక్. ఈ సినిమాలో చైతుతో పాటు కమెడియన్ సునీల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమాను బెల్లం కొండ సురేష్ తన శ్రీ గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.            

“గుండె జారి గల్లంతయిందే” నితిన్ ఫిల్మ్ రివ్యూ

  ఇష్క్ సినిమా తరువాత మళ్ళీ నితిన్, నిత్య మీనన్ కలిసి నటించిన ‘గుండె జారి గల్లంతయిందే’ సినిమా ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా విడుదల అయ్యింది. బహుశః ఈ సినిమా టాక్ గురించి నితిన్ కొంచెం టెన్షన్ పడే ఉండవచ్చును. ఎందుకంటే, చాలా రోజుల తరువాత అతని ఖాతాలో ఇష్క్ సినిమాతో తొలి హిట్ నమోదయింది. ఆ తరువాత విడుదలవుతున్న ఈ సినిమా హిట్ అవకపోతే నితిన్ పరిస్థితి మళ్ళీ మొదటికి రావచ్చును. కానీ, అదృష్టవశాత్తు ఈ సినిమా ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల దగ్గర నుండి కూడా మంచి మార్కులు సంపాదించుకొంది.   రాంగ్ నంబర్కి కనెక్ట్ అవడం అనే చాలా చిన్న పాయింటుతో సినిమా తీయడానికి చాలా దైర్యమే ఉండాలి. కానీ, ఆ పాయింటుని ఆధారం చేసుకొని ఇంత చక్కటి రొమాంటిక్ సినిమా తీయవచ్చునని దర్శకుడు విజయ్ కుమార్ తన తొలి ప్రయత్నంలోనే నిరూపించడం విశేషం.   కధ: ముందే చెప్పుకోన్నట్లు కధ చాలా చిన్న పాయింట్ మీద మొదలవుతుంది. కార్తీక్ (నితిన్) స్వతంత్ర భావాలు గల యువకుడు. తన స్నేహితుడు పండు (ఆలీ) పెళ్ళిలో శ్రుతి (ఇషా తల్వార్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. పండూ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ సంపాదిస్తాడు, కానీ పొరపాటున తప్పు నెంబరు నోట్ చేసుకొని కాల్ చేస్తాడు. కానీ ఆ నెంబరు శ్రావణిది (నిత్య మీనన్). గొప్పింటి బిడ్డయిన ఆమె తన డబ్బును కాక తనను మాత్రమే నిజాయితీగా ప్రేమించేవాడినే, ప్రేమించాలను కొంటుంది. కార్తిక్ మాటతీరు, పద్ధతి చూసి ఆకర్షితురాలయిన శ్రావణి క్రమంగా అతనితో ఫోన్లోనే ప్రేమలో పడుతుంది. ఆమె తను చూసిన శ్రుతే అనుకొంటున్న కార్తిక్ కూడా ఆమె తన ప్రేమ అంగీకరించినందుకు సంతోషపడతాడు.   అయితే వారిరువురు కలిసినపుడు ఆమె తన శృతి కాదని తెలిసి కార్తిక్ ఏవిధంగా స్పందిస్తాడు? అతను తనను వేరే అమ్మాయిగా భావించి ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు శ్రావణి ఏవిధంగా స్పందిస్తుంది? అనేది తెర మీద చూడవలసిన విషయం.   ఇష్క్ ఇచ్చిన విజయంతో నితిన్ ఈ సినిమాలో పూర్తి ఆత్మవిశ్వాసంతో తనదయిన శైలిలో దూసుకుపోయాడు. ఇక నిత్యా మీనన్ తను తప్ప మరెవరు ఆ పాత్రకి సరిపోరన్నంత బాగా నటించింది. కమర్షియల్ సినిమాలకి విరుద్ధంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరూ పోటాపోటీగా నటించి, సినిమా బాధ్యతను ఇద్దరూ సమానంగా స్వీకరించారు. వారిరువురు మద్య వచ్చే సున్నితమయిన ప్రేమ సన్నివేశాలు, మృదుమదురమయిన సంభాషణలు సినిమా చూస్తున్న యువత గుండెల్లో తీయని గుబులు పుట్టిస్తాయి. ఇక నిత్యామీనన్ కళ్ళతోనే పలికించే భావాలు చూస్తే యువకులు ఫ్లాట్ అయిపోవలసిందే. ప్రేమంటే ఇలాగే ఉండాలని, తమ ప్రేమికుడు, ప్రేమికురాలు ఇలాగే ఉండాలనే భావన యువతలో కలిగించేవిధంగా సాగిపోతుంది వారిరువురి ప్రేమ కధ. ఎంతో సహజంగా సాగి యువతను ఆకట్టుకొంటున్నఈ ప్రేమ కధ, పాసిటివ్ టాక్ రాబట్టుకోవడం కూడా చాలా సహజమే.   ఆలీకి సరయిన పాత్ర దొరికితే హాస్యం ఎంత బాగా పండిస్తాడో ఈ సినిమా మరోమారు రుజువు చేసింది. మిగిలిన వారందరూ కూడా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. అయితే, మొట్ట మొదటిసారిగా ఐటెంసాంగుతో వెండితెరపైకొచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలాగుత్తా ‘ఐటెం’ సంగతి దేవుడెరుగు ముందు కనీసం సరిగ్గా కాళ్ళు చేతులు కూడా కదపలేక, కేవలం తన వంపు సొంపుల ప్రదర్శనకు మాత్రమే వచ్చినట్లుంది. గమ్మతేమిటంటే ఆమెకే ప్రత్యేకమయిన ఆ ఐటెంసాంగులో ఆమె తప్ప మిగిలినవారందరూ బాగా చేశారు.   ఇక, దర్శకుడు విజయ్ కుమార్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ, (చాలా చిన్నపాయింటుతో) చాలా చక్కగా సినిమా తీసి తన ప్రతిభ నిరూపించుకొన్నాడు. పవన్ కళ్యాన్ ఇమేజ్ తో ఆయన స్వంత సినిమాలలే కాకుండా, ఈవిధంగా వేరే సినిమాలు కూడా చాలా చక్కగా ఆడించుకోవచ్చునని దర్శకుడు విజయ్ మరియు నితిన్ నిరూపించారు. నితిన్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో వారిద్దరు కలిసి అతని ఇమేజ్ ను పూర్తిగా వాడేసుకొని లాభపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలి ప్రేమ’ సినిమాలో ‘ఏమయింది ఈవేళ...’అనే రీమిక్స్ పాటను చాలా అద్భుతం గా చేసారు.   ఇక, ఈ సినిమాకి అనుప్ రూబెన్స్అందించిన సంగీతం, ఆండ్రూ చక్కటి కెమెరా పనితనం సినిమాలో ప్రేమానుభూతిని మరింత చక్కగా పండించాయి. హర్ష వర్ధన్ వ్రాసిన డైలాగులు కూడా చాలా బాగున్నాయి, కానీ ఆక్కడక్కడ ద్వందార్ధలతో పంట్లో రాయిలా ఇబ్బందిపెట్టాయి. అయితే, నేడు యువతీయువకులు ఇటువంటి వాటిని కూడా బాగా ఇష్టపడుతుండటంతో అవి కూడా సినిమాకు ఆకర్షణగా మారాయి.   ఇక సినిమా ఎడిటింగ్ వీటన్నికి మరింత వన్నెలద్దింది. పెద్ద సినిమాల నడుమ విడుదలయిన ఈ చిన్న సినిమాకి ఇక డోకా లేదని చెప్పవచ్చును. సినిమా మొత్తంగా చూసినట్లయితే, చిన్నచిన్నపొరపాట్లను, లోపాలను పట్టించుకోనవసరం లేదనే చెప్పవచ్చును. మండు వేసవిలో విడుదలయిన ఈ ప్రేమ కధా చిత్రం యువత గుండెలు జారి గల్లంతయ్యే ప్రమాదం నిజంగానే తెచ్చిపెట్టేట్లుంది.