నిర్మాతలతో ఫైట్స్ చేస్తున్న స్టంట్ మాస్టర్స్
తెలుగు టీవీ చానళ్ళలో డబ్బింగ్ సీరియళ్ళు నిలిపివేయాలని స్థానిక కళాకారులు చేసిన దీక్షలు ఉద్యమాలు ఇంకా చల్లారక ముందే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానిక స్టంట్ మాస్టర్లను, ఫైటర్లను తీసుకోకుండా ఇతర రాష్ట్రాలకి చెందిన వారిని తీసుకొంటున్నారని ఆందోళన మొదలయింది. గతంలో నిర్మాతల మండలి తమతో చేసుకొన్నఒప్పందం ప్రకారం 70 శాతం స్థానికులను 30 శాతం ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర స్టంట్ మాస్టర్స్ యూనియన్ ఆందోళన మొదలుపెట్టింది.
కానీ, వారిని నిర్మాతలు పట్టించుకోక పోవడంతో సినిమా షూటింగులను అడ్డుకోవడం ప్రారంభించారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాకు, గ్రీకువీరుడికి, కార్తి, హన్సిక జంటగా నటిస్తున్న బిర్యాని సినిమాల నిర్మాతలకి ఈ స్టంట్ మాష్టార్లతో స్టంటులు తప్పలేదు. తమిళ ప్రొడ్యుసర్ జ్ఞానవేలు రాజ నిర్మిస్తున్న సినిమాకు కూడా ఈ సెగ తగలడంతో అతను తెలివిగా తన షూటింగ్ కార్యక్రమాలను హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసుకొని సమస్యనుండి బయట పడ్డారు. మరికొందరు చిన్న పెద్ద నిర్మాతలు కూడా మళ్ళీ చెన్నై దారి పడుతున్నట్లు సమాచారం.
అయితే, స్థానికంగా దొరికే వారిని కాదనుకొని ఇతర రాష్ట్రాల వారికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నకు నిర్మాతలు నేరుగా జవాబు చెప్పకపోయినా, స్థానిక ఫైటర్స్ తమిళ ఫైటర్స్ వలే ఎక్కువ రిస్క్ తీసుకొని ఫైట్స్ చేయరని, యూనియన్ సభ్యులుగా ఉన్న కొందరయితే అసలు నేరుగా స్టంట్ సన్నివేశాలలో పాల్గొనకుండా గుంపులో ఒకరిగా నటించడానికే మొగ్గుచూపుతారని కొందరు నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
కోట్ల రూపాయలు పోసి తీస్తున్న సినిమాలో ఇటువంటి వారిని ఏవిధంగా భరించగలమని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు సరయిన నైపుణ్యం ప్రదర్శిస్తే తాము రెట్టింపు ఖర్చులు భరిస్తూ ఇతర రాష్ట్రాల నుండి స్టంట్ మాస్టర్లను ఎందుకు తెచ్చుకొంటామని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఇతర రాష్ట్రాల స్టంట్ మాస్టర్లను, ఫైటర్లను రప్పించి సినిమాలు తీసుకోవలసివస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ, స్థానిక స్టంట్ మాస్టర్లు వేరే విధంగా చెపుతున్నారు. తాము ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, ఎంత రిస్కు తీసుకొని ఫైట్స్ చేసినప్పటికీ తామంటే మన నిర్మాతలకు దర్శకులకు ఎప్పుడూ చిన్న చూపేనని, ఇతర రాష్ట్రాల నటీనటులు, ఫైటర్స్, స్టంట్ మాస్టర్స్ పట్ల చూపే గౌరవం, ఆదరణలో పదో వంతు కూడా తమపై చూపారని ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం ఇతర రాష్ట్రాల స్టంట్ మాస్టర్ లను స్థానిక సంఘంలో పేరు నమోదు చేయించుకోమని చెప్పినప్పటికీ వినేవారు లేరని వారు ఆరోపిస్తున్నారు.
కోలివుడ్ లో జరిగే తమిళ సినిమా షూటింగులకి కేవలం స్థానికులనే తీసుకోవడానికి అక్కడి నిర్మాతలు మొగ్గు చూపుతున్నపుడు, హైదరాబాద్ లో జరిగే తెలుగు సినిమా షూటింగులకి స్థానికులని తీసుకోవడానికి నిర్మాతలకి అభ్యంతరం ఏమిటని నిలదీస్తున్నారు. స్థానిక కళాకారులు పని లేక పస్తులు పడుకొంటే, మన నిర్మాతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల నుండి స్టంట్ మాస్టర్లని తీసుకువస్తున్నారని ఆరోపించారు. వారు న్యాయ బద్దంగా స్థానికులకు అవకాశం ఈయకపోతే తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.