మాస్టర్ కి డాక్టరేట్ వచ్చేసింది...!
తెలుగు, తమిళ,మలయాళం, కన్నడ అనే భాషాభేదం లేకుండా దాదాపు పది భాషల చిత్రాలకు, దాదాపు నలభై సంవత్సరాలుగా తన కొరియోగ్రఫీతో అదరగొడుతున్న శివశంకర్ మాస్టర్ కు బెంగుళూరు ఇంటర్నేషనల్ గ్లోబల్ ట్రస్ట్ పీస్ అనే ప్రసిద్ధ సంస్థ వారు గౌరవ డాక్టరేట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ... "నృత్య దర్శకులు డాక్టరేట్ అందుకోవడం చాలా అరుదు. అలాంటి అరుదైన డాక్టరేట్ నన్ను వరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ డాక్టరేట్ నాకే ఎందుకు ఇస్తున్నారని వారిని అడిగితే.."మీ డాన్స్ లో పవిత్రత ఉంటది. మీరు నృత్యం చేసేటపుడు మీ హావభావాలు అమోఘం" అని అన్నారు. నా కన్న తల్లిదండ్రులు, నా శ్రేయోభిలాషులు, నా దర్శక నిర్మాతలు, నటీనటుల ప్రోత్సాహం, దీవెనల వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. "మగధీర" చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నాను. నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నాకు ఈ డాక్టరేట్ ఇచ్చిన గ్లోబల్ ట్రస్ట్ వారికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అన్నారు.