ఆ నరకం ‘వర్ణ’నాతీతం
అందాల అభినేత్రి అనుష్క పది సినిమాలు చేస్తే అందులో కేవలం ఒకటి మాత్రమే విజయం సాధిస్తున్నపటికీ తెలుగు చిత్ర సీమలో బాగానే నిలద్రోక్కుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆమె అందం, నటనలో లోపంలేకపోవడం వలననే ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చును. చాల రోజుల తరువాత ప్రభాస్ తో చేసిన మిర్చి సినిమా సూపర్ హిట్ అయింది గనుక, మళ్ళీ తన ఫ్లాప్ రికార్డ్ పదిలంగా నిలబెట్టుకొంటూ ‘వర్ణ’ చేసింది.
పది పంచ్ డైలాగులు, ఆరు పాటలు, నాలుగు ఫైట్స్, ఒక ఐటెం సాంగుకి బాగా ట్యూన్ అయిపోయిన జనాలని వేరే గ్రహం మీదకు తీసుకు వెళ్లాలని నిర్మాత చేత రూ.65కోట్లు ఖర్చు పెట్టించినా జనాలు మాత్రం వెళ్లేందుకు ఇష్టపడలేదు. పైగా దియేటర్లో ఈ నరకం ‘వర్ణ’నాతీతమని ట్వీట్ మెసేజులు ఫేస్ బుక్ మెసేజీలు పెట్టుకొంటూ ప్రేక్షకులు తమ స్నేహితులని ఈ సినిమా భారి నుండి కాపాడే ప్రయత్నం చేయడం విశేషం.
ఇక ఈ వర్ణ సినిమా గురించి క్లుప్తంగా వర్ణించుకొంటే, ఈ సినిమాలో అనుష్క, ఆర్య ఇద్దరూ సింగిల్ పెమెంట్ కి డబుల్ రోల్స్ చేసారు. ఒకటి మన మధ్యనే ఈ భూమీద మరొకటి వేరే గ్రహం మీద. భూమీద రమ్య (అనుష్క) డాక్టరుగా, మధు బాలకృష్ణ (ఆర్య) లెక్చరర్ గా మామూలు మనుషులే. కానీ వేరే గ్రహంలో వర్ణ (అనుష్క) ఒక గొప్ప యుద్దనారి, మహేంద్ర (ఆర్య) ఒక యువరాజు.
భూమ్మీద వీరిద్దరి లవ్ స్టోరీ మూడు పాటలేసుకొంటూ చాలా స్మూత్ గానే సాగిపోతుంది. కానీ వేరే లోకంలో మాత్రం వన్ సైడ్ లవ్ స్టోరీ. అంటే రామేశ్వరం వెళ్ళినా అన్నట్లు వేరే గ్రహం వెళ్ళినా మన కాన్సెప్ట్ మాత్రం మారదన్నమాట. అక్కడ యువరాజు గారు వర్ణని ప్రేమిస్తుంటాడు. అయితే భూమ్మీద ఉన్నఅర్యుడికి అర్జెంటుగా వేరేలోకం వెళ్ళవలసి రావడంతో చెప్పాపెట్టకుండా లిఫ్ట్ ఎక్కిపై అంతస్తుకి వెళ్ళినట్లు వేరే గ్రహానికి వెళ్ళిపోతాడు.
ఆ తరువాత అక్కడ లవ్ స్టోరీ ఏమయింది? అక్కడ ఎలాంటి ఫైట్స్ జరిగాయి? చివరికి ఈ రెండు జంటలు ఏవిధంగా కలిసాయి? అన్నదే దీని ఇష్టోరీ. భూమ్మీద అనుష్క, ఆర్యాలిద్దరూ బాగానే చేసినప్పటికీ వేరే గ్రహం మీద వెళ్లేసరికి అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువయిందో మరేమో కానీ
ఇద్దరూ తేలిపోయారు.
అసలు ఇటువంటి జమానాలో కూడా ఇంత వర్ణనాతీతమయిన నరకం చూపగల సినిమాను తీసిన దర్శకుడు శ్రీ రాఘవను, అతనిపై ఇన్ని కోట్లు కుమ్మరించిన ప్రసాద్ వి. పొట్లూరి దైర్యానికి ప్రత్యేక అవార్డులు ఈయవలసిందే. ఈ సినిమాలో ఏమి చెప్పాలనుకొంటున్నాడో దర్శకుడి తెలియదు. ఏమి చేస్తున్నారో నటులకీ తెలియదు. ఎందుకు సంగీత వాయించవలసి వచ్చిందో సంగీత దర్శకుడికి తెలియదు. ఏమి చూస్తున్నారో ప్రేక్షకులకి అర్ధం కాదు. కనుక అసలు ఈ సినిమా గురించి ఆలోచించి బాధపడటం అనవసరం. ఇంత చదివిన తరువాత కూడా ఈ సినిమాకి రేటింగ్ ఎంత?అని వెతికేమాటయితే, వెళ్లి ఆ సినిమా చూసి తెలుసుకోవడమే బెటర్.
బ్యానర్: పివిపి సినిమా నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి; కథ, కథనం, దర్శకత్వం: శ్రీ రాఘవ; తారాగణం: ఆర్య, అనుష్క, అశోక్ కుమార్ తదితరులు; నేపథ్య సంగీతం: అనిరుధ్;; సంగీతం: హారిస్ జైరాజ్; ఛాయాగ్రహణం: రామ్‌జీ