Shakeela

షకీలా పెళ్ళయిపోయిందా?

  సంచలన సినీ నటి షకీలా పెళ్ళి అయిపోయిందా? అవునంటూ బుధవారం నాడు ఇంటర్నెట్‌లో భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. షకీలాతోపాటు మరో యువకుడు ఉన్న ఫొటోను చూపిస్తూ ఇతనితో షకీలా పెళ్ళయిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే షకీలాకి గతంలో ఒకసారి పెళ్ళయింది. ఆ తర్వాత ఆ పెళ్ళి పెటాకులు అయిపోయింది. ఇప్పుడు ఆమె మరోసారి పెళ్ళిచేసుకుందన్న వార్తలు వచ్చాయి. అయితే షకీలా ఈ వార్తలను ఖండించింది. 38 ఏళ్ళ వయసున్న తాను 28 ఏళ్ళ వయసున్న ఆ కుర్రాడిని పెళ్ళి చేసుకున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవాలని షకీలా పేర్కొంది. అతను తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా కథానాయకుడని, అంతే తప్ప తన జీవిత కథానాయకుడు కాదని షకీలా స్పష్టం చేసింది. అతను తన తమ్ముడు లాంటివాడని, ఇలాంటి లేనిపోని పుకార్లు రేపి అతని జీవితంలో ఆడుకోవద్దని షకీలా విజ్ఞప్తి చేసింది. తన జీవితంలో ఇక పెళ్ళి అనే మాటే లేదని, పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని భూమి భారాన్ని పెంచడం తనకు ఇష్టం లేదని షకీలా స్పష్టం చేసింది.

Rajnikanth

రజనీకాంత్ వియ్యంకుడి అరెస్ట్‌కి వారెంట్!

  ప్రముఖ తమిళ సినీ నటుడు రజనీకాంత్ వియ్యంకుడు (నటుడు ధనుష్ తండ్రి) కస్తూరిరాజాకు చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం నాడు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన 2012 సం.లో చెన్నైలో షావుకారు పేటకు చెందిన ముకున్‌ చంద్‌ బోద్రా అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 65 లక్షలు అప్పు తీసుకొన్నారు. అందుకోసం కస్తూరి రాజా ఆయనకి రెండు చెక్కులు ఇచ్చేరు. కానీ ఖాతాలో సరిపోయినంత బ్యాలన్స్ లేకపోవడం వలన అవి బౌన్స్ అయ్యాయి.   అప్పటి నుండి ముకున్‌ చంద్‌ బోద్రా అనేకమార్లు తన డబ్బును వాపసు చేయమని కస్తూరిరాజాను కోరుతున్నప్పటికీ ఏవో కారణాల చేత ఆయన ఇంతవరకు తిరిగి చెల్లించలేకపోయారు. దానితో ఆయనపై బోద్రా చెన్నై జార్జ్‌టౌన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేయగా అది నిన్న విచారణకు వచ్చింది. కస్తూరిరాజా కానీ ఆయన తరపున లాయర్లు గానీ కోర్టుకు హాజరయ్యి సంజాయిషీ ఇవ్వకపోవడంతో కోర్టు ఆయన అరెస్టుకు వారెంట్ జారీ చేసింది.   ఈ మధ్యనే వన్ ఇండియా మీడియా సంస్థ తమ బాకీలు చెల్లించలేదంటూ రజనీకాంత్ ఆస్తులను స్వాధీనం చేసుకొంటామని ఒక బ్యాంక్ పత్రికలో నోటీసులు ఇచ్చింది. చాలా భారీ బడ్జెట్ తో నిర్మించిన కొచ్చాడియాన్ మరియు లింగా సినిమాలు రెండు కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఆయనపై మరింత ఒత్తిడి పెరిగిపోయింది. పాపం రజనీకాంత్ కి కష్టాలన్నీ ఒక్కసారే చుట్టుముట్టినట్లున్నాయి.

Rajamouli

బాహుబలి నిడివి మూడు గంటలు పైనేనట...అబ్బో!

  దర్శకుడు రాజమౌళి ప్రతిభ మీద ఎంతో నమ్మకంతో ఆర్కమీడియా సంస్థ వారు దాదాపు రూ.150 కోట్లు పైగా ఖర్చు చేసి బాహుబలి సినిమాను తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి నిర్మిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. అందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రభాస్ అయితే అప్పటి నుండి మరొక సినిమా తీయకుండా బాహుబలికే పూర్తిగా అంకితమయిపోయారు. రాజమౌళి ప్రతిభపై అందరికీ అంత నమ్మకం మరి. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ సినిమాను చాలా అద్భుతంగా శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నారు దర్శకుడు రాజమౌళి.   సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కానీ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉన్నట్లు తాజా సమాచారం. ఈరోజుల్లో అన్ని గంటల పాటు ప్రేక్షకులను ధియేటర్లలో కూర్చోబెట్టడం చాలా కష్టం అని సినీ పరిశ్రమ వారే అంగీకరిస్తున్నారు. కనుక దానిని రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందని సినీ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడు గంటల కొన్ని నిమిషాల పాటు సా.....గే ఆ సినిమాని మరికొంత సా.....గ దీసి మూడున్నర గంటలు చేసి దానిని రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తుంటే, రాజమౌళి ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.   సినిమా నిడివి పెరిగిపోయిందని దానిని రెండు భాగాలుగా విడుదల చేసేందుకే అనవసరంగా కధని సాగదీసినట్లయితే మొదటికే మోసం వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మొదటి భాగంపైనే ప్రేక్షకులు పెదవి విరిచినట్లయితే ఇక రెండవ భాగం విడుదల చేయవలసిన అవసరం కూడా ఉండదని ఎవరయినా చెప్పగలరు. అదీకాక రెండు భాగాలు చూస్తే తప్ప పూర్తి సినిమా చూసినట్లు ఉండదు కనుక ప్రేక్షకులు ఏవిధంగా స్పందిస్తారో కూడా ఎవరూ ఊహించలేరు. కనుక సినిమా నిడివి కొంత ఎక్కువే ఉన్నప్పటికీ మంచి కధనంతో, కేవలం హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కనిపించే భారీతనంతో ప్రేక్షకులను కట్టిపడేయవచ్చని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.   కనుక ఈ ఒకటా...రెండా? అనే ఈ ధర్మసందేహానికి దర్శక నిర్మాతలు ఒక సమాధానం కనుకొంటే గానీ బాహుబలి మన ముందుకు రాడేమో?

Brahmanandam

బ్రహ్మానందాన్ని పూరీ పక్కన పెట్టాడా?

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఆ సినిమా టైటిల్ 'టెంపర్' పేరు వింటేనే అదొక యాక్షన్ సినిమా అని అర్ధమవుతోంది. అందులో తను చాలా కసితో పనిచేశానని యన్టీఆర్ చెప్పారు. కానీ ఎంత కసిగా చేసినా ఇప్పుడు సినిమాలలో కామెడీ, అందునా బ్రహ్మానందం లేకపోతే అది ఎంత గొప్పగా ఉన్న ప్రేక్షకులను మెప్పించడం కష్టం. అందుకే అందరు దర్శకులు తమ సినిమాలలో కామెడీకి చాల ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ‘టెంపర్’లో బ్రహ్మానందాన్ని పక్కనబెట్టి యాక్షన్ హీరోగా పేరు పొందిన యన్టీఆర్ చేతనే కామెడీ కూడా చేయించేస్తున్నాడు పూరి.   యన్టీఆర్ యాక్షన్ హీరో అయినప్పటికీ అతను కూడా మంచి కామెడీ చేయగలదని తన ‘అదుర్స్’ సినిమాలో చూపించాడు. బహుశః అందుకే దర్శకుడు పూరీ జగన్నాథ్ పూర్తిగా యన్టీఆర్ మీదనే ఆధారపడి యాక్షన్, కామెడీ రెండూ కూడా చేయించేయాలని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ అదుర్స్ సినిమాలో ఒక్క యన్టీఆర్ వల్లనే కామెడీ పండలేదు. బంగారానికయినా గోడ చేర్పు అవసరమన్నట్లుగా యన్టీఆర్ పక్కన బ్రహ్మానందం అతని గురువుగారిగా వేయడంతో వారి కామెడీ అద్భుతంగా పండింది. ఇక వారిరువురికీ యం.యస్. నారాయణ, రఘుబాబు వంటి వారందరూ చేరి అత్యద్భుతంగా కామెడీ పండించారు. నిజానికి ఆ సినిమాకి అటువంటి గొప్ప కామెడీ ట్రీట్ మెంట్ ఇవ్వకపోయి ఉంటే అదొక పాత మూస సినిమాగా తేలిపోయి ఉండేది.   మరి కామెడీకి దానికి మారుపేరుగా ఉన్న బ్రహ్మానందానికీ ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసీ కూడా మరి పూరీ జగన్నాథ్ యన్టీఆర్ తో ఎందుకు ఆడుకొంటున్నాడో తెలియదు. కానీ ఈ సినిమా కూడా ఫెయిల్ అయితే ఇరువురికీ చెడ్డ పేరే వస్తుంది. పైగా ఫ్లాపులతో సతమతమవుతున్న వారిరువురికీ చాలా పెద్ద దెబ్బే అవుతుందని సినీ పండితులు అభిప్రాయ పడుతున్నారు.   ఇక బ్రహ్మానందాన్ని పక్కనబెట్టి యాక్షన్ హీరో చేత కామెడీ చేయించి అభాసుపాలయితే సినీ పరిశ్రమలో అది మరీ కామెడీగా ఉంటుంది. బ్రహ్మానందానికి డేట్స్ కుదరకనో, లేకపోతే ఆయన అడిగినంతా ముట్టజెప్పకపోవడం వలననో లేక మరే ఇతర కారణాల చేతనో ఆయనని పూరీ పక్కన బెట్టి ఉండవచ్చును. కానీ ఆయనకీ లక్కీ స్టార్ అని చెప్పుకొనే ఆలీని కూడా ఎందుకో పక్కనబెట్టేసారు ఈసారి.   మరి ఇదంతా ఎవరి ‘టెంపర్’ వల్ల జరుగుతోందో తెలియదు కానీ మళ్ళీ పూరీ-బ్రహ్మానందం-ఆలీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ప్చ్!

bapatla anjali kona venkat restaurant

అందాల అంజలి అదరహో...

  మొన్నామధ్య హీరోయిన్ అంజలి మీద లేనిపోని ఆరోపణలు వచ్చాయి. ఆమె పబ్బులో తప్పతాగిందని, నానా యాగీ చేసిందని గాసిప్స్ వచ్చాయి. అయితే పాపం అంజలిని చూస్తే మాత్రం అలా అనిపించదు.. కనిపించదు. ముద్దొచ్చే అమాయకమైన ముఖంతో ఇట్టే ఆకట్టుకునేలా అంజలి వుంటుంది. తనమీద వచ్చిన ఆరోపణలను అంజలి మర్నాడు ఖండించింది కూడా. తాను ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వకపోయేసరికి వాళ్లు ఈ రూమర్ పుట్టించారని అని వివరణ ఇచ్చింది. ఆమధ్య తన కుటుంబంతో కొన్ని వివాదాలు ఏర్పడినా, ఓ డైరెక్టర్‌తో గొడవైనా అంజలి క్రుంగిపోకుండా నిబ్బరంగా నిలబడింది. కొద్ది నెలల క్రితం లావుగా ముద్దపప్పులా తయారైన అంజలి తన ఫిజిక్‌కి కూడా ఈమధ్య కాలంలో అదుపులో పెట్టేసింది. శుక్రవారం నాడు బాపట్లలో రయితత కోన వెంకట్‌కి చెందిన ఒక హోటల్ ప్రారంభోత్సవానికి అంజలి వెళ్ళింది. అక్కడ అంజలిని చూస్తే అదరహో అనిపించేలా వుంది. హీరోయిన్‌గా ఇంకో పదేళ్ళ కెరీరైనా అంజలి అకౌంట్లో వుందనిపించేలా అంజలి వుందని అక్కడున్నవారు అనుకున్నారట.

USA University student

ఆ అందగత్తె లైబ్రరీలో ఏం చేసిందంటే....

  అమెరికాలోని ఒరిగాన్ స్టేట్‌లో ‘ఒరిగాన్ స్టేట్ యూనివర్సిటీ’ పేరుతో పెద్ద యూనివర్సిటీ వుంది. ఈ యూనివర్సిటీలో చదవటం అంటే చాలా గొప్ప విషయంగా అక్కడి విద్యార్థులు భావిస్తారు. ఈ యూనివర్సిటీలోనే ఓ పెద్ద లైబ్రరీ కూడా వుంది. ఈ లైబ్రరీలో ఏదో ఒక మూల ఏకాంతంగా సెటిలై విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటూ వుంటారు. అయితే ఇదే యూనివర్సిటీలో చదువుతున్న 19 సంవత్సరాల కేండ్రా సండ్రియాండ్ అనే అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే మీరు బిత్తరపోతారు. లైబ్రరీలో ఒక మూల సెటిలైంది. తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసింది. తన ఒంటిమీద వున్న బట్టల్ని మెల్లగా విప్పడం మొదలుపెట్టింది. జనం అటూ ఇటూ తిరుగుతున్నప్పడు మాత్రం బుద్ధిగా కూర్చున్నట్టు పోజు ఇస్తోంది. ఎవరూ లేకుండా చూసి టాప్ తీసేసింది.. రాయాలంటేనే సిగ్గేస్తోంది... ఇంకా చాలా చాలా చేసింది. అలా చేస్తూ ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. ఆ తర్వాత ఆ వీడియో ఫుటేజ్‌ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇంకేముంది.. యూనివర్సిటీ మొత్తం గగ్గోలయిపోయింది. వైస్ ఛాన్స్‌లర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంత వాళ్ళు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో వుంది. ఈ టీనేజ్ అందగత్తెకి ఎగ్జిబిషనిజం అనే మానసిక వ్యాధి వుందని  సైకియాట్రిస్టులు అంటున్నారు.

శ్రీను వైట్ల - కోన వెంకట్ మిలాఖత్...

  గతంలో కొన్ని చిత్రాలకు కలసి పనిచేసిన దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ ఆ తర్వాత ఇగో ప్రాబ్లమ్స్‌తో ఒకరినొకరు దారుణంగా విమర్శించుకుని విడిపోయిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ గొడవ పడిన తీరు చూసి ఇక జన్మలో వీరిద్దరూ కలవరని చాలామంది అమాయక ప్రజానీకం అనుకున్నారు. ఎవరూ ఊహించనిదే సినిమావాళ్ళు చేసి చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కోన వెంకట్ ప్రకటించారు. దర్శకుడు శ్రీను వైట్లతో వున్న విభేదాలను పక్కనపెట్టి రామ్‌చరణ్ సినిమా కోసం ఆయనతో కలసి పనిచేస్తున్నానని కోన వెంకట్ తెలిపారు. 2003 నుంచి 2013 వరకు శ్రీను వైట్లతో కలసి తాను పనిచేసిన సినిమాలు ఘన విజయాలు సాధించాయని, 2013లో శ్రీను వైట్లతో విభేదాలు రావడంతో తాను ఆయన నుంచి దూరమయ్యానని ఆయన చెప్పారు. హీరో రామ్‌చరణ్ కోరిక మేరకు తాను మళ్ళీ శ్రీను వైట్లతో కలసి పనిచేస్తున్నానని వెల్లడించారు. తమ సినిమాకు కథ, మాటలను సిద్ధం చేశామని చెప్పారు. కలిస్తే కలిశారుగానీ, మరోసారి తిట్టుకుంటూ మీడియాకి ఎక్కకండిబాబూ...

హవాయ్‌జ్యాదా రివ్యూ: వీర బోరు సినిమా

  ‘విక్కీ డోనర్’ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘హవాయ్‌‌జ్యాదా’ శుక్రవారం నాడు విడుదలైంది. విభు పురి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పల్లవి శ్రద్ధ, మిథున్ చక్రవర్తి ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా 1860ల్లో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన శివ్‌కర్ తల్పాడే అనే ఒక సైంటిస్ట్ కథ. అతను మనుషులు లేకుండా నడిచే విమానాన్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తూ వుంటాడు. అంటే, రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడానికి ఒక పది సంవత్సరాల ముందేనన్నమాట. ఈ పాత్రను మన హీరో ఆయుష్మాన్ ఖురానా ధరించాడు. ఇది నిజ జీవిత కేరెక్టర్ శివ్‌కర్ తల్పాడే అనే ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఈ ప్రయోగాలు చేశారు. ఆ వ్యక్తి పేరును ఉపయోగించుకుని కల్పిత కథతో రూపొందించిన సినిమా ఇది. ఇదేదో చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా అని వెళ్ళిన ప్రేక్షకుడికి చక్కలిగిలి పెట్టే ప్రయత్నం చేశారు. ఒక మామూలు ప్రేమకథకు విమానం సైంటిస్ట్ రంగులు అద్ది ఈ సినిమా తీశారు. ఒకపక్క విమానం తయారు చేసే ప్రయత్నాలు, మరోపక్క ప్రేమకథ.. విఫలం.. విమానం ప్రయోగాలు.. ఇలా సాగిన ఈ సినిమా ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో రూపొందిన వీర బోరు సినిమాల్లో ఒక సినిమాగా నిలిచిపోతుంది.