ఆహారమే మహాభాగ్యం!
posted on Jun 7, 2022 @ 9:30AM
మనుషుల శక్తివనరు ఆహారం. ఆహారం ద్వారానే అందరికీ శక్తి లభిస్తుంది. శక్తి ఉంటేనే మనిషి మనిషి తన పనులు తను చేసుకోగలడు. కేవలం ఒక్కరోజు ఆహారం లేకపోతేనే మనిషిలో నీరసం చోటు చేసుకుంటూ ఉంటుంది. అత్యవసర ప్రయాణాలలో ఆహారం దొరక్కపోయినప్పుడు, దేవుడి భక్తిలో భాగంగా ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఒక పూట తిండి తినకపోతేనో లేక ఒక రోజు తిండికి దూరంగా ఉంటేనో సాధారణ సమయాల కంటే చురుగ్గా ఉండలేరు. తిరిగి శరీరానికి తగిన మోతాదులో ఆహారం లభిస్తేనే కాసింత పుంజుకుంటారు. జంతువులకు, మనుషులకు, పక్షులకు సకల జీవరాశులకు ఆఖరికి మొక్కల పెరుగుదలకు కూడా ఎరువుల రూపంలో శక్తి అవసరమే. ఇలా ప్రపంచమంతా ఆహారం మీదనే బ్రతుకుతోంది. ఇంకా చెప్పాలంటే ఆహార సంపాదన కోసమే మనుషులు పనులు చేస్తారు కూడా. మరి అలాంటి ఆహారం విషయంలో ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నారు అందరూ?? ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు.
ఆహారపు అలవాట్లు!
చాలామంది అనారోగ్యం పాలవుతున్నది ఆహారం అలవాట్ల వల్లనే. ఈ ప్రపంచంలో అధిక రకాల ఆహారపదార్థాలను విభిన్న రకాలుగా వండుకుని తినే దేశం భారతదేశం అనే మాట వింటేనే తెలిసిపోతుంది. మన దేశంలో ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో. ఆదిమ కాలం నుండి అభివృద్ధి చెందిన దేశం వరకు మార్పులను గమనిస్తే ఆహారం విషయంలో చెప్పలేనని మార్పులు, లెక్కలేనన్ని రుచులు వచ్చి పడ్డాయి. చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఆరోగ్యాలు పాడుచేసుకుంటారు. ముఖ్యంగా రుచి కోసం చేసే ప్రయోగలలో ఆహారంలో ఉండే పోషకాలు నశించి కేవలం కడుపు నిండుతుంది తప్ప అందులో ఉండే పోషకాలు ఏమి లభించవు. ఇక ముఖ్యమైనది నిల్వ చేసుకోవడం. పచ్చళ్ళు ఉరగాయలు వంటివి ఆనాధిగా వస్తున్నవే వాటిలో ఆరోగ్యాన్ని నాశనం చేసే గుణాలు ఏమీ ఉండవు. వచ్చే చిక్కంతా పాత వంటకాలకు కొత్త మెరుగులు దిద్దుతూ వాటిని కలగాపులగం చేయడం వల్ల. అతి ఎప్పటికైనా నష్టమే అనే విషయాన్ని మరచి ఆ పచ్చళ్ళను కూడా ఇష్టం కొద్దీ తినేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఉంటాయి అంతే.
ఇవి తప్పిస్తే వండుకున్న పదార్థాలను నిల్వచేయడం, కూరలు పచ్చళ్ళు, అన్నం వంటి వాటిని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం, కృత్రిమ రసాయనాలు కలిపిన పళ్ళ రసాలు తాగడం, కృత్రిమ రంగులు జోడించిన పదార్థాలు తినడం సీజన్ దాటిపోయిన తరువాత లభ్యమయ్యేవి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పోకడలు ఫాలో అవుతూ అడ్డదిడ్డమైనవి అతి చల్లని పదార్థాలు తినడం చాలా సమస్యలు సృష్టిస్తాయి. వాటిలో పెప్సీ, థమ్సప్, కోలా వంటి యాసిడ్లు నిండిన శీతల పానీయాలు మనుషుల్ని దారుణంగా దెబ్బతీస్తాయి.
నిర్లక్ష్యం!
గంధపుచెట్లు విరివిగా పెరిగే ప్రాంతాలలో కొందరు ఆ గంధం చెక్కలను పొయ్యిలో పెట్టడానికి వాడతారట. అలాగే ఆహారం పుష్కలంగా లభ్యమయ్యే వాళ్లలో కొందరికి ఆహారం విలువ సరిగ్గా తెలియదు అని చెప్పుకోవచ్చు. ఆహారాన్ని వృధా చేయడం, అతిగా వండటం, దాన్ని కుళ్ళిపోయేలా చేయడం, చివరికి చెత్తబుట్టలోకి వేయడం ఒకరకం అయితే, పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లలో ఎన్నో రకాల పదార్థాలు హంగు కోసం వండి చివరికి వేస్ట్ చేస్తూ ఉంటారు. మనిషిలో ఉన్న ఆశ అనేది ఆహారం వ్యర్థం కావడానికి కారణం అవుతోంది. కాబట్టి ఆహారాన్ని చాలా పరిమితంగా జాగ్రత్తగా వాడుకోవాలి.
పరిష్కారం!
ఆహారం పొదుపు చేయడం అనేది ఎంత గొప్ప విషయమో అలాగే ఆహారాన్ని సృష్టించడం అనేది కూడా అంతే గొప్ప విషయం. ఈ విషయంలో రైతుల కష్టం ఎంతో గొప్పది. వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి. వాళ్లకు ఇచ్చే గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళు పండించే ఆహారాన్ని వృధా చేయకపోవడమే. కొన్ని దేశాల్లో మాంసాన్ని ఎండించి నిల్వ చేసుకుని తింటారు. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. పాడి, వ్యవసాయం, పంటలు అన్నీ బాగుంటాయి. మనుషులు చేయాల్సిందల్లా వీటిని సంరక్షించుకోవడమే. ఒక్క బియ్యపు గింజ పండాలి అంటే ఎంతో కష్టం చెయ్యాలి అనే విషయం గ్రహించాలి.
ఆహారాన్ని వృధా చేయకూడదు
తినే పదార్థాలను గౌరవించాలి
ప్రకృతికి దగ్గర ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి
భూమిని సంరక్షించుకోవాలి
పిల్లలలో ఆహారం గురించి అవగాహన పెంచాలి. ఆహారమే మహాభాగ్యం మరి!
◆వెంకటేష్ పువ్వాడ