పర్యావరణాన్ని ప్రేమిద్దాం!
posted on Jun 6, 2022 @ 9:30AM
ఈ ప్రపంచం ప్రకృతి మీద ఆధారపడింది. భారతదేశం అయినా అమెరికా అయినా చైనా అయినా ఇలా ప్రపంచంలో దేశాలు అయినా ప్రజలు లేని ప్రాంతాలు అయినా మొత్తం అణువణువు ఈ ప్రకృతి ఆవరించి ఉన్నదే. ఈ ప్రకృతిలో నివసించే మనుషులు, జంతువులు, వస్తువులు, వివిధ రకాల జీవులు, చెట్లు ఇలా అన్నిటినీ కలిపి పర్యావరణం అని అంటారు. అయితే ఈ పర్యావరణం కలుషితం అవుతూ ఉంటుంది. వీటికి కారణాలు చెప్పాలంటే బోలెడు ఉన్నాయి. కానీ ప్రధాన కారణం మాత్రం మనిషే. మనిషి చేసే పనులు వలనే పర్యావరణం కాలుష్యానికి గురి అవుతోంది. ప్రకృతి ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అందరూ దాన్ని పాటించరు.
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రణాళికలు, మరెన్నో స్లొగన్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి, ఉంటాయి. కానీ మనుషుల్లో ఆలోచన తద్వారా మార్పు రానప్పుడు ఎవరు ఎంత గీపెట్టి అరిచినా పర్యావరణం బాగవ్వదు, ప్రకృతి ప్రశాంతంగా ఉండదు. ఓజోన్ పొర దెబ్బతినడం, ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, భగభగ మండే ఎండలు, ఋతువులు అటు ఇటు అయిపోయి వాతావరణం గందరగోళం అవ్వడం, నీటి కొరత, పంటలు సరిగా పండకపోవడం ఇలా చెబితే ఈ పర్యావరణ కాలుష్యం ద్వారా జరుగుతున్న నష్టాలు కోకొల్లలు. విచిత్రంగా పర్యావరణ కలుష్యమని చెప్పేది, వాటి వల్ల నష్టాలు వస్తున్నాయని ఏడ్చేది, తిరిగి ఆ పర్యావరణానికి నష్టం కలిగించేది మొత్తం మనుషులే.
మొక్కల్ని పెంచాలి!!
ప్రకృతి పచ్చగా ఉండాలన్నా, వర్షాలు పడాలన్నా మొక్కల పెంపకం ముఖ్యమైనది. పెంచగానే కాదు వాటిని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలి అప్పుడే నిజమైన పచ్చదనం నిలబడుతుంది. మంచిగా వర్షాలు పడతాయి, ఋతువులు వాటి పని సరిగ్గా చేస్తాయి.
పొల్యూషన్ అరికట్టాలి!!
చేతిలో డబ్బులుండాలి అంతే ఎక్కడికైనా మోటార్ వెహికల్స్ వేసుకుని పోవడమే ఈకాలంలో అందరికీ తెలిసినపని. కనీసం నడుచుకుని వెళ్లి చేసే పనులకు కూడా బైకులు వాడే మహామహులున్నారు. భాగ్యనగరం, ముంబయ్ వంటి రాజధాని ప్రాంతాల్లో, ఇంకా అభివృద్ధి చెందిన పట్టణాల్లో వాహనాల ట్రాఫిక్ జామ్ లు చూస్తే పిచ్చెత్తి పోతుంది. జీవన శైలి దృష్ట్యా వాహనాల వాడకం తప్పనిసరి కావచ్చు. కానీ కొందరు అతిగా వాడటం, ముఖ్యంగా యూత్ తమా దూకుడు ప్రదర్శిస్తూ చేసే పనులు కూడా చాలా నష్టమే కలిగిస్తాయి.
ఇక ఫ్యాక్టరీల తలనొప్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని అరికట్టడం పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆవైపుగా ప్రభుత్వాలు అడుగులు వెయ్యాలి.
అడవులను రక్షించుకోవాలి, నీటిని పొదుపు చెయ్యాలి!!
చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారో, అన్నిటికీ ఇదే మాట చెబుతారేంటి వంటి ఆలోచనలు రావచ్చు. కానీ వినేవాళ్ళు వింటున్నారా ఏమైనా. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఎవరు వినిపించుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తారు, నీటిని కాలుష్యం చేస్తారు. అందుబాటులో ఉన్నాయని ఇష్టమొచ్చినట్టు వాడేస్తారు. జంతువులు నచ్చినంత తింటాయి, నచ్చిన్నత తాగుతాయి కానీ మనుషులే అన్నీ వృధా చేస్తారు.
ప్లాస్టిక్ వాడకం అరికట్టాలి!!
ఈ కలియుగంలో అతిపెద్ద నష్టం ఏదైనా ఉందంటే అది ప్లాస్టిక్ అనే రాక్షసినే. భూమిలో కలవక, కాలిస్తే గాలిని కాలుష్యం చేసే ఈ భూతం అతిపెద్ద సమస్య అయి కూర్చుంది. అన్ని దేశాలు ప్లాస్టిక్ ను నిషేధించి, కంట్రోల్ చేసి దాని నష్టాన్ని తగ్గించుకుంటూ ఉంటే భారత్ మాత్రం దానిమీద నియంత్రణను తీసుకురాలేకపోతోంది. మనుషులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు వాడేస్తారు.
ఇవి మాత్రమే కాకుండా పశువుల పెంపకం, పాడి, వ్యవసాయం ప్రకృతిని కాపాడే మార్గాలు. అభివృద్ధి దేశానికి ముఖ్యమే, కానీ పర్యావరణాన్ని నాశనం చేస్తూ జరిగే అభివృద్ది విపత్తులకు కారణం అవుతుంది. కాబట్టి పర్యావరణాన్ని ప్రేమించాలి సహజంగా ఉంచుకోవాలి.
◆వెంకటేష్ పువ్వాడ.