ప్రపంచంపై జ్ఞానాన్ని పూయించే బుద్దపూర్ణిమ!
posted on May 13, 2022 @ 9:30AM
దుఃఖం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే దుఃఖం కలగడానికి కారణాలు ఏమిటి అంటే కోర్కెలు పుట్టడం. కోర్కెలు మనిషి జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుతాయి. కోర్కెలను జయించడం మనిషికి ఎంతో కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. ప్రపంచాన్ని దుఃఖం నుండి బయటపడమని పిలుపునిచ్చిన వారిలో బుద్ధ భగవానుడు ఒకరు. ఈయన భోధనలు దాదాపు భగవద్గీతను సారానికి దగ్గరగా ఉంటాయి.
బుద్ధుడి జననం, బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం, బుద్ధుడు నిర్యాణం చెందడం ఇలా ఎంతో ముఖ్య ఘట్టాలు అయిన మూడు వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజే జరిగాయని చెబుతారు. అందుకే బుద్ధ పూర్ణిమ ఎంతో ప్రాశస్త్యం పొందింది.
సిద్ధార్థుడి నుండి బుద్ధుడు!!
పుట్టినప్పుడు ఈయనకు పెట్టిన పేరు సిద్ధార్థుడు. అయితే ఈయన తన పదహారు సంవత్సరాలు తరువాత యశోధరను పెళ్లి చేసుకున్నాడు రాహులుడు అనే కొడుకు కూడా పుట్టాడు. సుఖాలు అనుభవించడమే జీవితానికి పరమార్థం అని నమ్మి ఎప్పుడూ సుఖసంతోషాలు గడిపేవాడు. అయితే తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కపిలవస్తు నగరంలో విహారానికి వెళ్తున్నప్పుడు కనిపించిన నాలుగు సంఘటనలు అతడిని ఎంతగానో కలచివేశాయి. రోగాలను, మరణాన్ని, ముసలితనాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.
ఎన్నో సంవత్సరాలు ఎన్నో మార్గాలు అనుసరించి చివరకు గయలో ఒక భోది వృక్షం కింద ఆత్మజ్ఞానం పొందాడు. అప్పటినుండి జీవితంలో ఎన్నో విషయాలను తన భోధనలుగా చెబుతూ ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసినవాడు గౌతమ బుద్ధుడు.
మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అని అంటారు. బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తరువాత ఈ సంఘంలో చేరిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ బుద్ధుని బోధనలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ముందుకు కదిలింది.
వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే వస్సాన అని అంటారు. బుద్ధుడు ఐదవ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు.
బుద్ధుని నిర్యాణం!!
బుద్ధుడు తన ఎనభై సంవత్సరాల వయసులో తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిర్యాణం చెందడానికి ముందు తన శిష్యులను పిలిచి వారికి ఏమైనా సందేహాలు ఉంటే అడగమన్నాడు. చివరకు వారు ఎలాంటి సందేహాలు అడగకపోయేసరికి తన జీవితానికి ముగింపు ఇచ్చాడు.
ఈయన నేపాల్ ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల ఆ ప్రాంత వాసులు బుద్ధుడిని తమ దైవంగా భావిస్తారు.
బుద్ధుడు తన జీవితంలో ముఖ్యంగా యోగ, ధ్యానం, సన్యాసం మొదలైన విషయాలను ఎంతో ప్రాముఖ్యమైన వాటిగా భావించాడు. మనిషి అత్యాశతో బ్రతకడం వృథా అని భావించాడు. ఎప్పుడూ నిర్మలమైన ద్యానముద్రలో ఉండే బుద్ధభాగవానుడు ఎంతో గొప్ప శాంతియుత జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారు. దానిఫలితమే నేడు మానవ జీవితాల్లో కనిపించే ఒకానొక మౌన ప్రవాహపు తరంగాల జ్ఞాన పరిమళం.
ప్రపంచ శాంతి కోసం ఆరాటపడిన వాళ్లలో బుద్ధుడు కూడా ఒకరు. కేవలం ఆ బుద్ధుడి ధ్యాన స్వరూపాన్ని చూస్తూ పరిగెత్తే మనసును ఒకచోట నిలబెట్టచ్చు.
◆వెంకటేష్ పువ్వాడ.