ఇలా చేశారంటే చాలు అరటిపండ్లు ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయ్..!
posted on Jun 12, 2024 @ 9:30AM
అరటిపండ్లు పేదవాడికి కూడా అందుబాటు ధరలో ఉండే పండు. ఉపవాసాలు ఉండే వారి నుండి భోజనం తరువాత ఏదైనా పండు తినాలనుకునే వారి వరకు చాలామంది అరటిపండ్లు తినడానికే మొగ్గు చూపుతారు. రోజూ ఓ అరటిపండు తినాలని చాలామందికి ఉంటుంది. కానీ అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే నల్లగా మారి కుళ్లిపోతుంటాయి. ఇలాంటి పండ్లు తినబుద్ది కాదు. కానీ మార్కెట్లో మాత్రం అరడజను నుండి డజను మాత్రమే కొనుగోలు చేయగలం. అరటిపండ్లు కొన్న తరువాత ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలన్నా.. వాటిని తాజాగా తినాలన్నా ఈ కింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
అరటిపండ్లు తాజాగా ఉండాలన్నా, త్వరగా నల్లబడకుండా ఉండాలన్నా వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడా నల్లగా లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి. కొనుగోలు చేస్తున్న పండ్లలో ఏదైనా ఒక పండు మెత్తగా లేదా నల్లగా ఉన్నట్టు కనిపించినా వాటిని కొనకూడదు. ఎందుకంటే ఇలాంటి పండ్లు ఉంటే ఆ పండ్ల మొత్తాన్ని నిల్వ చేసినప్పుడు అవి త్వరగా పాడైపోతాయి.
అరటిపండ్లను అమ్మేవారు పండ్లను ప్లాస్టిక్ కవర్ లో ఇస్తుంటారు. వాటిని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే కొనుగోలు చేసిన ప్లాస్టిక్ కవర్ ను తొలగించాలి. అరటిపండ్లు వచ్చిన సంచిలో ఇథిలీన్ వాయువు పేరుకుని ఉంటుంది. పండ్లను కవర్ లోనే అలాగే ఉంచితే.. అరటిపండు పండే ప్రక్రియ వేగం పెంచుతుంది. అందుకే అరటిపండ్లను ఇంటికి తీసుకువచ్చి వేరొక కవర్ లోకి మార్చాలి.
అరటిపండ్లు నల్లగా, మెత్తగా కాకుండా ఉండాలంటే అరటి పండ్ల తొడిమ భాగాన్ని ప్లాస్టిక్ కవర్ తో కవర్ చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. . దీనివల్ల అరటిపండు త్వరగా పండదు, తాజాదనం అలాగే ఉంటుంది.
అరటి గుత్తి కాండంపై ప్లాస్టిక్ కవర్ ను కప్పే బదులు ఒక్కో అరటి కాండం విడివిడిగా చేసి వాటిమీద కప్పి ఉంచినా అరటి పండు పక్వానికి వచ్చే ప్రక్రియ మందగిస్తుంది. అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
అరటిపండ్లు మాత్రమే కాకుండా ఇతర పండ్లు కూడా ఎథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. పండ్లు అన్నీ ఒక్కచోట ఉండటం వల్ల చాలా పక్వానికి గురయ్యేది ఇందుకే. అందుకే అరటిపండ్లను ఇతర పండిన పండ్లతో ఉంచడం మానుకోవాలి. అరటిపండ్లను విడిగా ఉంచితే అవి త్వరగా పండవు, తాజాగా ఉంటాయి.
అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచే బదులు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఒక గిన్నెలో అరటిపండ్లను తలక్రిందులుగా ఉంచాలి. అరటిపండ్లను ఏ కంటైనర్ లో అయినా పెట్టి గట్టిగా నొక్కి ఉంచకూడదు. దాని బదులు వాటిపై గాలి ఉండే విధంగా వాటిని నిల్వ చేయాలి.
అరటిపండ్లను అంగళ్లలో అమ్మే వారిలాగా హుక్ కు వేలాడదీయబడం వల్ల అవి తొందరగా పక్వానికి లోను కావు. వీటికి గాలి బాగా తగులుతూ ఉంటుంది కాబట్టి అవి తొందరగా పక్వం చెందవు.
*రూపశ్రీ.