పట్టు సాధించాలి అంటే పట్టుకోవడం రావాలి!

ఏ పని అయినా గ్రిప్ వచ్చిందంటే ఆ తరువాత చాలా సులభం అవుతుంది. కొంతమంది ఏదైనా మొదలుపెట్టి ఆ తరువాత నా వల్ల కాదు అని నీరసపడిపోయి వెనకడుగు వేస్తుంటారు. ఇది చాలా తప్పు. అలా చేస్తే అది మిమ్మల్ని మీరు సమస్యలోకి వెళ్ళకుండా చేస్తుందేమో కానీ జీవితంలో గొప్ప ఎదుగుదలను తుంచేస్తుంది.  విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత విషయాలు ఇలా వర్గం ఏదైనా ప్రతి మనిషి కృషి లేనిదే మంచి స్థాయికి వెళ్లలేరు.  కొంతమందికి కష్టపడాలి మంచి స్థాయికి వెళ్ళాలి అని ఉన్నా ఆ స్థాయికి చేరుకునే సరైన మార్గం తెలిసి ఉండదు. ఒక చెట్టు ఎక్కాలి అంటే దాని మీదకు సూపర్ మాన్ లాగా రాకెట్ స్పీడ్ తో ఎగిరి చెట్టు మీద కూర్చోలేమ్ కదా!! దానికి ఎక్కడ పట్టుకోవాలో, ఏ కొమ్మ మీద అడుగుతూ పెడుతూ ఇంకొంచెం పైకి ఎలా వెళ్ళాలో తెలిసి ఉండాలి. గోల్డ్ స్పూన్ తో పుట్టిన మహామహులు అయినా వాళ్ళ స్థాయిని తగ్గిపోకుండా కొనసాగించాలంటే కొన్ని తెలిసి ఉండాలి.  వాటిని స్కిల్స్ అనచ్చు లేదా ఫార్ములాస్ అనచ్చు అదీ కాకుంటే మనపెద్దోళ్ళు చెప్పినట్టు బుద్ధి ఉపయోగించడం కావచ్చు. కానీ ఖచ్చితంగా కొన్ని అవసరం. విద్యార్థులకు! అవగాహన ఉండాలి. తాము చదువుతున్న వాటిలో తమకు ఇష్టమైన సబ్జెక్ట్, కష్టమైన సబ్జెక్ట్ అనేవి మాత్రమే కాకుండా ప్రస్తుత కాలంలో డిమాండ్ ఉన్నది, జీవితంలో తమకు ఎంతో గొప్ప తృప్తిని ఇవ్వగలుగుతుంది అనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకదానితో సురిపెట్టుకోవాలనేమి లేదు కదా. కాబట్టి ఆల్ రౌండర్స్ అవ్వచ్చు. చదువుతున్నాం అంటే చదువుతున్నాం అన్నట్టు కాకుండా సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకుని చదివితే అందులో ఉన్న మాటర్ చాలా ఈసీ గా అర్థమైపోతుంది. అలాగే కొన్ని కొండగుర్తులు, షార్ట్ కట్ వేస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎప్పటిదప్పుడు కవర్ చేస్తుంటే ఎక్సమ్స్ టైమ్ లో ఒత్తిడి ఉండదు. ఉద్యోగం! ఉద్యోగంలో ఎదగాలి అంటే అవకాశాలను పట్టుకోవడం రావాలి. యాజమాన్యాలు చెప్పే ప్రాజెక్టు లు, ఇతర పనులలో ఎంప్లాయ్ తన సామర్త్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ ఉన్నవి ఉంటాయి. వాటిని నిరభ్యరంతంగా చేజిక్కించుకోవాలి. టీం వర్క్ లో చురుగ్గా ఉండాలి. వీలైన వరకు వర్క్ ను పెండింగ్ పెట్టకూడదు. ఒత్తిడిని పక్క ఉద్యోగుల మీద చూపించకూడదు. పర్సనల్ విషయాలను ఆఫీస్ లోకి తీసుకురాకూడదు. ఓవరాల్ గా ఎంత ఫ్రెండ్లీ గా అనిపిస్తారో వర్క్ విషయంలో అంతే సీరియస్ గా ఉండాలి. ఇలా ఉన్న వాళ్లే నేడు అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయిలకు చేరినవారు కూడా. వ్యక్తిగత జీవితం! చదువు ఉద్యోగానికి పూర్తిగా వ్యతిరేకమైనది వ్యక్తిగత జీవితం. ఇక్కడ తృప్తి కావాలి కానీ కమర్షియల్ కోణంలో ఎప్పుడూ ఆలోచించకూడదు. ముఖ్యంగా మన అనే ఫీలింగ్ ఉండాలి తప్ప నాది, నేను అనే అహంకారం పనికిరాదు. తల్లిదండ్రులు,  పిల్లలు, జీవిత భాగస్వామి, స్నేహితులు, చుట్టాలు ఇలా అందరికీ తగినంత సమయం అప్పుడప్పుడు ఇచ్చేయ్యాలి. ఫ్యామిలీ గొడవలు ఉన్నపుడు కాంప్రమైజ్ అయిపోవడం మంచిది. అహంతో సాగదీస్తే మనశాంతి పోతుంది. సమస్య ఎక్కువ ఉంటే ఆరోగ్యకరంగా డిస్కస్ చేసుకోవడం బెస్ట్. అంతేకానీ ఆ కొద్ధి సమయంలో ఒకరిమీద ఒకరు కంప్లైంట్ చేసుకోకుండా అందరినీ కలుపుకోవాలి. బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వీలైనంత వరకు అటెండ్ అవ్వడం బెస్ట్. ఆఫీస్ లో మీరు బెస్ట్ ఎంప్లాయీ అయితే తప్పకుండా మీకు పర్మిషన్ దొరుకుతుంది. అలాగని నెలకోసారి నాలుగురోజులు లీవ్ అడిగితే ఎవడూ ఇవ్వడు. కాబట్టి దేంట్లో అయినా పట్టు రావాలి అంటే పట్టుకోవడం తెలిసి ఉండాలి మరి!! ◆ వెంకటేష్ పువ్వాడ.

తృప్తికరమైన రోజు ఎలా సాధ్యమో తెలుసా?

సృష్టిలోని ప్రాణుల్లోకెల్లా మానవ జన్మ అత్యంత మహిమన్వితమైనది. మానవ జన్మ అనేది ప్రతి మనిషికీ ఒకే ఒక్క సారి వచ్చే పరమాద్భుత అవకాశం. ఈ విషయం అంద రికీ తెలిసికూడా ఎందుకు తమ జీవితాలను సార్థకత వైపుకు మళ్ళించలేకపోతున్నారు? ప్రపంచంలో ఉన్న 64 కళలను నేర్పడానికి మనకు రకరకాల విద్యాలయాలు, శిక్షణా శిబిరాలూ ఉన్నాయి. కానీ! జీవితమును జీవించడమనే మహాత్భుతమైన కళను నేర్పించడానికి ఎటువంటి శిక్షణాలయాలూ లేవు. ఎందుకంటే జీవితం ఎవరో ఉదాహరణలతో నేర్పించే పాఠం కాదు. నేర్చుకోవడానికి. ఒకమనిషి జీవితంలో ప్రతి ఒక్క రోజూ ఒక సరికొత్త నూతన అధ్యాయమే. ప్రతి ఒక్కరి జీవితమూఓ సరిక్రొత్త పుస్తకమే. ఎవరి జీవితమూ మరొకరి జీవితంలా ఉండబోదు. ప్రతి పుస్తకమూ మరొక పుస్తకంలా ఉండదు. సరిగ్గా, ఈ విషయాన్నే మనం అవగాహన చేసుకోవాలి. మనం ప్రతి రోజునూ, ప్రతి నిముషాన్నీ అరుదైన అనుభవాలనూ, అనుభూతులనూ ఆస్వాదించడానికే వచ్చాం. మనం జీవించాలే గానీ ప్రతి నిముషం ఓ సరిక్రొత్త అనుభవాన్ని చవిచూడవచ్చు. మీ ఒక్క రోజు జీవితాన్ని ఓ నాటకం లేదా ఒక సినిమా అని భావించుకుంటే, ఈ చ లన చిత్రంలోని ప్రతి సన్నివేశమూ ఎన్నో మలుపులతోనూ, ఎన్నో గెలుపు ఓటములతోనూ నిండి ఉంటుంది. ఒక చలన చిత్రాన్ని జనరంజకంగానూ. అబ్బురపరిచే కథనంతోనూ తెరకెక్కించడానికి దర్శకుడు ఎంతగానో కృషి చేస్తాడు. ప్రతీ సన్నివేశాన్నీ, కలకలిసిన అనుభవాలతో, ఉత్సాహాలతో, ఉల్లాసాలతో మేళవించి ఓ గొప దృశ్యకావ్యంలా మలుస్తాడు. ఇకపై మీరు మీ జీవితమనే చలన చిత్రానికి దర్శకులు, కథానాయకులుగా ఉండండి. ప్రతి రోజూ మీ చలన చిత్రంలోకి గమ్మతైన దృశ్యాలను తెరకెక్కించండి. ఒక క్షణం కూడా విసుగూ, చిరాకు లేని కథనాన్ని ఆవిష్కరించండి. ప్రతి సన్నివేశాన్నీ అత్యద్భుతంగా తీర్చిదిద్దండి. ప్రతి రోజునూ ఓ అద్భుతమైన చలన చిత్రంలా, ఓ అపురూప దృశ్య కావ్యంలా నిర్మించండి. కానీ! ఈ రోజు మీ చలన చిత్రం ఉన్నట్లు, రేపటి చలన చిత్రం ఉండకూడదు. రోజుకో క్రొత్తకథ, రోజుకో క్రొత్త అనుభూతి, రోజుకో క్రొత్త సంచలనాలతో మీ జీవితాన్ని విలువైన దృశ్య కావ్యాల్లా మార్చుకోండి. ఒక మనిషి రోజులోని 24 గంటల సమయాన్ని సంతృప్తిగా, లాభదాయకంగా జీవించడం నేర్చుకోవడమే జీవించే కళ అంటే.  మీ ప్రతి రోజునీ మీరు క్రొత్త జన్మలా భావించగలిగితే మీరు ఈ పనిని సులభంగా చేయగలుగుతారు. రోజులో ఉదయం పుట్టినట్టు, రాత్రికి మరణించినట్టు భావించాలి. ఇలా చేస్తే   సరిక్రొత్త  చావుపుట్టుకల మధ్యన ఉన్న విలువైన సమయాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతారు. ఇంతటి గొప్ప కాలాన్ని వ్యర్థంగా ఆవిరి చేసుకోకూడదని గ్రహిస్తారు. మనం ప్రతి నిముషాన్నీ  సంపూర్తిగా జీవించడానికే వచ్చామన్న సృహ కల్గి ఉండాలి.  పుట్టిన బిడ్డను పొత్తిళ్ళలోకెత్తుకొని తండ్రి ఆ బిడ్డను చూసి ఎంత మధురానుభూతిని పొందుతూ తన్మయత్వం చెందుతాడో, అలాగే మీ కోసం జన్మించిన మరో రోజును చూసి మీరు అలాంటి తథాత్మ్యాన్నే పొందడి. ప్రతి రోజునూ మీ చంటి బిడ్డగా భావించి, జాగ్రత్తగానూ, ప్రేమతోనూ పెంచిపోషించండి. మనకు ప్రతి దినం ఓ క్రొత్త జన్మ. ఈ 24 గంటల జన్మ కాలంలో మనం గ్రహించగల్గినంత సంవృద్ధిని ఈ ప్రకృతి నుండి గ్రహిద్దాం.. అనుభవించగల్గినంతటి క్రొత్త అనుభవాలను అనుభూతి చెందుదాం. లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించి మరింత జీవితపు ఉత్పాదకతను పెంచుకుందాం. ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఓ గొప్ప జీవితాన్ని జీవించామనే మహా తృప్తిని మనం పొందగల్గుదాం.                                                    ◆నిశ్శబ్ద.

రోజూ మనం చూస్తున్న విషయాల్లో దాచిన అద్భుతమైన రహస్యాలు

నిత్యం మనం అనేక వాటిని మన అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో కొన్ని ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. కానీ అవి మాత్రం అలానే ఉంటాయి. అసలు అవి అలా ఎందుకు ఉన్నాయి అనే ఆలోచనే తట్టదు. అవి మనకు పెద్దగా ఉపయోగపడకపోయినా ప్రతి ఒక్కదాని వెనుక ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అలాంటి నాలుగు విషయాల గురించి తెలుసుకుందాం. 1. లైన్‌లో సంతకం చేయాలా వద్దా. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు చెక్ బుక్ ను ఉపయోగింస్తాం. చెక్కుపై సంతకం చేసేటప్పుడు చాలా మంది తరచుగా లైన్ పైన సంతకం చేస్తున్నామా లేదా అనే గందరగోళానికి గురవుతూ ఉంటారు. అటువంటప్పుడు భూతద్దం ఉపయోగించి దగ్గరి నుండి చూస్తే మీకు రహస్యం తెలుస్తుంది. సంతకం చేసే చోట ఉంటే లైన్ గురించి అసలు ఆలోచించం. ఈ లైన్స్ ను  పదాలు రిపీట్ అయితే గుర్తించడానికి రూపొందించారు. ముద్రణ చాలా చిన్నగా ఉండటం వల్ల వాటిని కళ్లతో చూస్తే సాధారణ సంతకంలాగే కనిపిస్తుంది కానీ, మైక్రో టెక్నాలజీ అని పిలిచే దాన్ని భద్రతా ప్రయోజనాల కోసం రూపొందించారు. ప్రింటింగ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకవేళ జిరాక్స్ తెస్తే ఆ లైన్స్ బ్లర్ అయి అస్పష్టంగా కనిపిస్తాయి. 2. ఖాళీ పేజీలు. మీకు చదవడం ఇష్టమైతే, మీరు ఒక నవల లేదా ఏదైనా పుస్తక చదువుతూ ఉంటే పుస్తకాల చివరలో ఖాళీ పేజీలు చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి.ఆ పేజీలలో ఎక్కువగా పాఠకులు తమ కళాత్మక డ్రాయింగ్‌లతో లేదా ఇతర విషయాలతో నింపి వేస్తారు.  కానీ  వాస్తవానికి ఆ పేజీలు ఎందుకు ఖాళీగా ఉంన్నాయి అన్న విషయం ఎవరూ గమనించరు. ఈ కాలంలో పుస్తకాలు అన్నీ కూడా డిజిటల్‌ ప్రక్రియలో ముద్రిస్తారు. పెద్దగా ఉన్న కాగితపు షీట్లను పేజీలుగా మడిచి ముద్రిస్తారు. అలా ముద్రిస్తున్న వాటిని సిగ్నేచర్ పేపర్ అంటారు. వాటినన్నింటిని కూడా ఒకదానితో ఒకటి జతచేసి బైండ్ చేసి పుస్తకం రూపంలో తీసుకొస్తారు. డిజిటల్‌గా ముద్రించిన వాటిలో ఇలాంటి సిగ్నేచర్ పేపర్లు  2 నుండి 48 పేజీల వరకు ఉండవచ్చు.  ఇదంతా కూడా పుస్తకంలో మ్యాటర్ ఎక్కడితో ముగుస్తుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్ద ప్రచురణకర్తలు తమ పుస్తకాలను ముద్రించడానికి, రచయితలు తన స్వీయ రచనలను ముద్రించడానికి తేడా ఉంటుంది. సాధారణంగా ప్రచురణ కర్తలు పెద్ద కాగితంపైనే అనేక పేజీలను ముద్రిస్తారు. అటువంటి సందర్భాల్లో మీకు కొన్ని ఖాళీ పేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. 3. ట్రామ్ రైలు క్రిస్ - ఓవర్ హెడ్ లైన్ దాటడం. ట్రామ్‌లో లేదా ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు క్రిస్ క్రాస్ లైన్లను చూడవచ్చు.  ట్రామ్‌లు, కొన్ని రైళ్లు పాంటోగ్రాఫ్ కాటెనరీ వ్యవస్థపై నడుస్తాయి, ఇవి  విద్యుత్తును కాటెనరీ వైర్ నుండి లోకోమోటివ్‌కు మార్చబడుతుంది. స్లైడింగ్ స్ట్రిప్ కాటెనరీ వైర్‌తో విద్యుత్ సంబంధాన్ని ఉత్పత్తి చేస్తుంది. పాంటోగ్రాఫ్ స్ప్రింగ్ సిస్టమ్ ఏ వేగంతో ప్రయాణించినా కూడా దాని సంబంధం శాశ్వతంగా ఉండేలా చూస్తుంది. రాగి తీగలను తాకిన స్లైడింగ్ స్ట్రిప్ కోతకు గురవుతూ పైలాన్‌పై రాపిడీని కలిగిస్తుంది. వాస్తవానికి ఈ క్రిస్ క్రాస్ లైన్ల అసలు ఉద్దేశం రాపిడి కలిగిస్తూ విద్యుత్ ను వ్యాప్తి చేయడం. 4. స్నార్కెల్స్. స్నార్కెల్స్ అంటే నీటి అడుగున ఈత కొడుతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగించే పైప్ ను స్నార్కెల్స్ అంటారు. వీటికి స్క్యూబా ఎక్విప్మెంట్ కాగా ఆక్సిజన్ టాంకులు ఉండవు. ఈ స్నార్కెల్స్ నీటి బయటి వాతావరణం నుండి గాలిని పీల్చుకోవడానికి శ్వాసక్రియగా పనిచేస్తాయి. చాలావరకు ఈ స్నార్కెల్స్ 30  సెంటీమీటర్ల లోపల వరకు లేదా  40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వరకు పనిచేయవు. ఎందుకంటే ఇవి ఉపరితలానికి దగ్గరగా మనిషి ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఉపరితలానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ నీటిలో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసౌకర్యంగా ఉంటుంది. స్నార్కెల్ ద్వారా ఆక్సిజన్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు లంగ్స్ మీద కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ స్నార్కెల్ ఉపయోగించడం వల్ల కార్బన్ డి ఆక్సైడ్‌ను తిరిగి పీల్చుకోవడమే కాకుండా  సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.  

క్రెడిట్ కార్డులతో జర భద్రం తమ్ముడూ!

అప్పు ఆకర్శించని మనిషి ఎవరైనా ఉంటారా ? ఎవరూ ఉండరనే చెప్పాలి. దీన్నే ఆసరాగా చేసుకుని కార్పొరేట్ బ్యాంకులు, సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఇస్తుంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డుల వినియోగంలో సింహభాగం యువతదే! ఈ ప్రీ క్రెడిట్ వ్యామోహంలో పడి ఫైనాన్సిల్ మానేజ్మెంట్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది యువత. తద్వారా వడ్డీలు కట్టలేక ఒత్తిడికి లోనై కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మనం క్రెడిట్ కార్డ్ నుంచి వినియోగించుకున్న మొత్తం సొమ్ముని ఔట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి బిల్ జనరేట్ అయిన తర్వాత 20 నుంచి 25 రోజుల వ్యవదిలో కార్డుకి ఆ మొత్తాన్ని జమ చేయాలి. లేదా అలా మొత్తాన్ని కట్టలేని పక్షంలో మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. మినిమం డ్యూ అమౌంట్ కట్టమని ఉంటుంది. అంటే మనం వాడుకున్న మొత్తానికి ఇది వడ్డీ మాత్రమే! ఇక్కడే మనవాళ్ళు తప్పులో కాలేస్తుంటారు. కట్టాల్సిన అసలు వదిలేసి మినిమం డ్యూ అమౌంట్ తక్కువ ఉంది కదా అని ఆ పేమెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా కట్టడం ద్వారా తమ అసలు కట్టాల్సిన నగదు తగ్గుతూ వస్తుంది అనుకుంటారు. అలా ఎప్పుడూ జరగదు. మినిమం డ్యూ అమౌంట్ కడుతున్నంత కాలం కట్టాల్సిన అసలు మాత్రం అలానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలపై పెద్దగా అవగాహన లేని వారు ఇలా కొన్ని నెలలు చెల్లించాక గానీ విషయం గ్రహించరు. అప్పటికే వీలైనంత వరకు మన జేబుల్ని ఖాళీ చేస్తుంది క్రెడిట్ కార్డ్. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం నష్టమే కాదు లాభాలు కూడ ఉన్నాయి అని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో రుణ వేసులుబాటుని కల్పిస్తుంది. అయితే బిల్ జనరేట్ అయిన తర్వాత సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చార్జీలు ఉండవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ఆర్ధిక సంస్కరణలతో రుణ నిబంధనలు మార్చుకునే బ్యాంకుల పై కొంత అవగాహనతో మనం వీటిని వినియోగించుకోవాలి. ఇకనుంచి క్రెడిట్ కార్డ్ వినియోగించే ముందు పూర్తి కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి పూర్తి సమాచారంతో కార్డుని వినియోగిస్తే మంచిది. డబ్బుని సంపాదించడమే కాదు ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. దీన్నే ఆర్ధిక క్రమశిక్షణ అంటారు. క్రెడిట్ ఆకర్షణల్లో పడి అవసరం లేకున్నా అందుబాటులో ఉంది కదా అని వాడేస్తే కుదరదు. కార్పొరేట్లు వడ్డీలతో మనల్ని పీల్చి పిప్పి చేస్తారు. ఏ స్నేహితుడో పక్కింటివాడో అయితే కాస్త ఆలస్యం అయినా ఊరుకుంటాడు. కానీ ఇక్కడ బ్యాంకు ప్రతినిధిలు, యంత్రాలు ఫోన్లు చేసి మాట్లాడతాయి. నీ సమస్యలు, కష్టాలు ఇవేమీ పట్టవు వాటికి. చెల్లింపుల్లో మరింత ఆలస్యం అయితే కోర్ట్ నోటీసులు కూడా పంపిస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు కి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండండి. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంగానే దాన్ని వాడండి. ◆వెంకటేష్ పువ్వాడ  

ఆనందమే అందం

హాస్యం-అపహాస్యం!! నవ్వడం ఒక భోగం!! నవ్వించడం ఒక యోగం!! నవ్వలేకపోవడం ఒక రోగం!! అబ్బబ్బా ఏమైనా చెప్పారా జంధ్యాల. కేవలం చెప్పడంతో ఆగిపోలేదే, హాస్యాన్ని జోడించి, ఆ హాస్యంలో కూడా సమాజానికి కాస్తో, కూస్తో సందేశాలు ఇస్తూ సినిమాలు తీసి, నవ్వుల జల్లు కురిపించిన ఘనుడు ఆయన. ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా, ఎంతో ఆరోగ్యవంతమైన హాస్యాన్ని ప్రజలకు సినిమాల ద్వారా అందించినవారు జంధ్యాల. ఇదేమి జంధ్యాల గారి గురించి ఊదరగొట్టడానికి రాస్తున్నది కాదు కానీ ఉత్తమ హాస్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినవారు కాబట్టి చెప్పుకోవలసిందే.  అంతకు ముందు…. పాత సినిమాలు చూస్తే అందులో రేలంగి, రాజబాబు, పేకెటి రంగా, గిరిజ, రమాప్రభ వీళ్ళ నుండి హాస్యాన్ని దోసిళ్ళతో పట్టుకున్న రాజేంద్రప్రసాద్, ఆలీ, చంద్రమోహన్, శ్రీలక్ష్మి వీళ్ళందరూ ఉన్న సినిమాలలో ఎలాంటి భయం లేకుండా హాయిగా నవ్వుకుంటూ సినిమాలు చూసే వెసులుబాటు ఉండేది. ఆ తరువాత తరువాత తరువాత కాలం మారేకొద్ది కొత్తదనం పేరులో హాస్యాన్ని అపహాస్యం చేయడం  మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా హాస్యం పేరుతో అసభ్య పదజాలన్ని వాడుతున్నారు. వాటిని పిల్లల కోసం ప్రత్యేకం అన్నట్టు కవరింగ్ ఇచ్చి నిజంగా పిల్లల్ని కూడా అసభ్య పదజాలానికి అలవాటు చేస్తున్నారు. షోస్ లో ఏముంది?? టీవీ లో ప్రసారం అయ్యే ప్రతి చానల్ లో ఒక కామెడీ షో తప్పక ఉంటోంది. ఆ షో లలో పిల్లల్ని కూడా భాగస్వాములను చేసి వాళ్ళతో పెద్ద పెద్ద డైలాగులు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. అవన్నీ చూసే ఇంట్లో పిల్లలు కూడా వాటిని అలవాటు చేసేసుకుంటారు. చిన్నా పెద్దా లేకుండా పంచు డైలాగులు వేయడం అన్ని చోట్లా కామన్ అయిపోతోంది. అసలింతకూ అసలైన హాస్యం అంటే ఏమిటి?? అసభ్యత లేకుండా, ఒకరిని నొచ్చుకునేలా చేయకుండా, సరదాగా నవ్వించేది హాస్యం. అలా నవ్వించే వారు నిజంగా నవ్వుల రాజులు, కిలకిల రాణులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడెక్కడుంది అలాంటి హాస్యం. సాడిజంలో హాస్యం ప్రస్తుత టీవీ షోల పుణ్యమా అని ఒకరిని కొట్టడంలో, ఒకరిని తిట్టడంలో, ఒకరి ఇబ్బందిని ఎగతాళి చేయడంలో హాస్యం పాళ్లు పుష్కలంగా నింపేస్తున్నారు. ఫలితంగా ఇళ్లలో పిల్లలు కూడా వాటిలోని హాస్యాన్ని చూస్తూ వాటి ద్వారానే హాస్యాన్ని సృష్టిస్తున్నారు. ఒక అరభై సంవత్సరాల తాతయ్య తన పదేళ్ల మనవడితో ఒరేయ్ నువ్వు ఉద్యోగం చేసి,డబ్బు సంపాదించి నాకు మంచి బట్టలు కొనివ్వాలిరా అని అడిగితే, ఆ పదేళ్ల బుడ్డోడు తన తాతతో  నేను చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుని సంపాదించే వరకు నువ్వు బతికే ఉంటావా?? అప్పుడు నేను బట్టలు కొని నీ సమాధి మీద కప్పుతాలే అంటాడు. ఇలాంటివి ఈ కాలంలో ఎన్నో వింటున్నారు, చూస్తున్నారు.  పిలల్లో విలువల స్థాయి అంతకంతకూ తగ్గిపోతోంది, వాళ్ళు వయసును మించి మాట్లాడే ప్రతి మాటా బాల్యానికి ఉన్న అర్థాన్ని మార్చేస్తున్నాయి. ఏమి చేయాలిప్పుడు?? హాస్యం అంటే మనసారా నవ్వుకుంటూ పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉండాలి. ఆ కోవలోకి చెందినవే అక్బర్-బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, పంచతంత్ర కథలు మొదలైనవి. ఇవన్నీ పిల్లలకు నవ్వు తెప్పిస్తూనే అందులో నీతిని, విలువలను మెల్లగా మెదడులలోకి జోప్పిస్తాయి. అవన్నీ కూడా పుస్తకాల ద్వారా కాకపోయినా ఆడియో, వీడియో లు అందుబాటులో ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ పెట్టి, పిల్లలకు అసభ్య హాస్యాన్ని దూరంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాలి. పార్కులలో కూర్చుని ఊరికే గట్టిగా నవ్వుతూ నవ్వుతో ఆరోగ్యం అని చెప్పుకునే బదులు, కాసేపు చిన్నపిల్లల్లా మారిపోయి చిన్ననాటి కథల పుస్తకాల్లో పేజీలను తిరిగేస్తూ, వాటిలో నుండి మిమ్మల్ని మీరు వెతుక్కుంటే హాస్యం అపహాస్యం కాకుండా ఆరోగ్యమస్తు అని దీవించడం ఖాయం. కాదంటారా?? ◆ వెంకటేష్ పువ్వాడ

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా??

చాలా మంది జీవితాల్లో భిన్న సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ఒక్కోటి ఒకో విధంగా ఉంటాయి. ప్రతి మనిషీ తన జీవితంలో ఏదో ఒకటి ఆశించే ప్రతి పనీ చేస్తాడు. కొన్ని పనులలో స్వేచ్ఛ ఉంటుంది. అభిరుచి ప్రదర్శించే అవకాశం ఉంటుంది.  అయితే కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని నియమాలు లోబడి, కొన్ని పరిధులలో మాత్రమే ఉండి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవితంలో చాలా మంది విలువ ఇచ్చే విద్య,  ఉద్యోగం, జీవితాంతం తోడుండే భాగస్వామి, ఇంకా వ్యక్తిగతంగానూ, ఆర్థికంగానూ ఎదుగుతూ ఉండే విషయాలు. ఇలా అన్నింటిలో కూడా అన్నీ అనుకున్నట్టు జరగవు, అనుకున్నట్టుగా సొంతమవ్వవు అని అంటారు. అందుకే సర్దుకుపోవాలి అనే సూత్రాన్ని అందరి బుర్రల్లో జొప్పించేస్తూ ఉంటారు. అయితే అది నిజమేనా?? జీవితంలో దేన్నీ కోల్పోకుండా, ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకుండా జీవించడం సాధ్యమవుతుందా?? వాస్తవ కోణంలో…. నిజానికి చిన్నతనంలో భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్పింది, తల్లిదండ్రులకు నచ్చింది చేసుకుంటూ పోవడంలోనే జీవితాలు సగం అరిగిపోతున్నాయి. ఏమి చదవాలి, భవిష్యత్తులో ఏమి చేయాలి అని నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వరు తల్లిదండ్రులు. అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అలా ఉన్నవాళ్లు మంచి విద్యావేత్తలూ, సమాజాన్ని ఎంతో లోతుగా చూసి విశ్లేషించి పరిపక్వత కలిగిన వాళ్ళు అయిఉంటారు. కాబట్టి వాస్తవకోణంలో చూస్తే నీకేం కావాలి అని అడిగే తల్లిదండ్రుల కంటే ఇది తీసుకో, ఇదే తీసుకో అనే వాళ్ళు ఎక్కువ. అభిరుచులు, ఇష్టాలు, ప్రాధాన్యత!! చిన్నతనం నుండి ఏదో ఒక విషయంలో అధిక ఆసక్తి ఉండటం గమనించవచ్చు. అది క్రమంగా పెద్దవుతూ ఉంటే దానిలో నైపుణ్యం కూడా పెంచుకోవచ్చు. కానీ భారతీయ తల్లిదండ్రులలో భవిష్యత్తులో ఉద్యోగాలు చెయ్యాలి. అలా చేయాలంటే చదువే ముఖ్యం. అభిరుచులు గట్రా అన్నీ పనికిమాలినవి అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. దాని కారణంగా ఎంతోమంది సృజనాత్మకతను మొగ్గదశలోనే చంపేసుకుంటున్నారు. అలా ఆకాకుండా సృజనాత్మకతను విద్యకు ఉత్ప్రేరకంగా వాడుకుంటే ఎంతో గొప్ప భవిష్యత్తును చూడవచ్చు.  ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్యమే!! కొందరికి కొన్ని ఇష్టాలు, అభిరుచులు ఉంటాయి. ఆ ఇష్టాలు అభిరుచులు చాలా చిన్నవి అయి ఉంటాయి. కానీ వాటిని కాదని పెద్ద వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది జీవితంలో. బహుశా అవి ముఖ్యమైన విషయాలు కూడా కావచ్చు. కానీ ఆత్మతృప్తిని లేకుండా ఎంత పెద్ద పనులు చేసినా ఎంత ఎత్తుకు ఎదిగినా మనసులో ఏదో ఒక అసంతృప్తి ఉండనే ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఇష్టమైనవి ఆత్మతృప్తి కోసం చేసుకుంటూ, జీవితంలో ఎదగడానికి అవసరమైనవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినది ఆత్మతృప్తిని, ఆర్థిక ఎదుగుదలను పోల్చి చూడకూడదు. వాటిని మాత్రమే కాదు జీవితంలో ఏ పని ప్రాధాన్యత దానిది అని గుర్తిస్తే ఇది కావాలి ఇది వద్దు అనే ప్రసక్తి లేకుండా ఇష్టమైనవి అన్ని పొందవచ్చు. అవ్వా కావాలా?? బువ్వ కావాలా??  కాదు కాదు  మనసుకు నచ్చింది చేసుకుపోవాలి. నిజమే మరి మనసుకు నచ్చింది ఏదైనా వంద శాతం శ్రద్ధతోనూ, ఆసక్తితోనూ, ఇష్టంతోనూ చేస్తాము కాబట్టి జయం మనదేరా తృప్తి మనదేరా అనుకోవాలి. అవ్వా, బువ్వా ఒక్కటే తీసుకో అని అంటే ఎలాంటి సందేహం లేకుండా అవ్వతో బువ్వ పెట్టించేసుకోవడం లాంటిదన్నమాట. ◆ వెంకటేష్ పువ్వాడ   

ఆత్మన్యూనత అవసరమా?

  అనగనగా ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడన్న పేరుండేది. ఆ భిక్షువు దగ్గర ఎలాంటి సమస్యకైనా సలహా లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన దగ్గర తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు. ఆ సమస్యలకి భిక్షువు చెప్పే పరిష్కారాలు విని సంతోషంతో తిరిగి వెళ్లేవారు. అలాంటి భిక్షువు ఆశ్రమం ముందు ఒకరోజు రాచరికంతో ఉట్టిపడుతున్న గుర్రపుబగ్గీ ఆగింది. ఆ బగ్గీలోంచి ఆ దేశ సేనాపతులలో ఒకరు దిగారు. సేనాధిపతిని సకల మర్యాదలతో భిక్షువు దగ్గరకు తీసుకువెళ్లారు ఆశ్రమవాసులు.   భిక్షువుకి నమస్కరించిన సేనాపతి తన గోడునంతా ఒక్కసారిగా ఏకరవు పెట్టాడు- ‘స్వామీ! నేను గొప్ప వీరుడినని ఈ రాజ్యమంతా నమ్ముతుంది. ఆ నమ్మకానికి అనుగుణంగా నేను చాలా సాహసకార్యాలే చేశాను. ఎన్నో యుద్ధాలను ఒంటిచేత్తో గెలిపించాను. మరెన్నో ఆక్రమణలను తిప్పికొట్టాను. శత్రుదేశాల వారికి నేనంటే సింహస్వప్నం. రాజుగారికి నా మీద మహా అభిమానం. కానీ ఏం లాభం! నేనెందుకూ పనికిరానివాడినన్న ఆత్మన్యూనత నిరంతరం నన్ను వేధిస్తూ ఉంటుంది. నాకంటే శక్తిసంపన్నులైన రాజుగారిని చూసినా, నాకంటే తెలివితో ఉన్న మంత్రులను గమనించినా..... అంతదాకా ఎందుకు, దైవత్వం ఉట్టిపడే మీవంటి భిక్షువులను చూసినా నేను చాలా అధముడినన్న ఆలోచన బాధిస్తుంటుంది. దీనికి పరిష్కారమే లేదా?’ అంటూ బాధపడ్డాడు. సేనాపతి మాటలను చిరునవ్వుతో విన్న భిక్షువు- ‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. కానీ దీనికి జవాబుని వినేముందు నువ్వు కాస్త ఓపికపట్టాలి. ఇవాళ నాతో తమ బాధలను చెప్పుకొనేందుకు చాలామంది పౌరులు వచ్చారు. వారందరినీ పంపించాక తీరికగా నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఆ అతిథుల గదిలో విశ్రమించు,’ అంటూ సేనానిని పంపారు.   తన సమస్యకు భిక్షువు దగ్గర పరిష్కారం ఉందని తెలుసుకొన్న సేనాని అతిథి గదిలో నిశ్చింతగా విశ్రమించాడు. చుట్టూ ఉన్న ఆశ్రమ వాతావరణం, భిక్షువుల ఆధ్మాత్మిక సాధనలు, నిష్కల్మషమైన మనసుతో అక్కడికి చేరుకుంటున్నా పౌరులు... అతనిలోని అలజడిని కొంతవరకూ ఉపశమింపచేశాయి. ఇంతలో నిదానంగా చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆశ్రమమంతా వెన్నెల వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణంతో మైమరచిపోయిన ఉన్న సేనాపతి గదిలోకి భిక్షువు అడుగుపెట్టాడు.   ఉదయం నుంచి అలుపెరగకున్నా కూడా భిక్షువు మొహంలో ఎలాంటి అలసటా కనిపించలేదు. భిక్షువు గదిలోకి అడుగుపెడుతుండగానే ‘నా సమస్య సంగతి ఏం చేశారు స్వామీ!’ అంటూ ఆత్రంగా అడిగాడు సేనాని. ‘ఇవాళ పౌర్ణమి! ఆ నిండు చందమామ ఇచ్చే వెన్నెలతో పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా!’ అన్నారు భిక్షువు.   ‘నిజమే కానీ... ఆ వెన్నెల సంగతి కాస్త పక్కన పెట్టి నా సమస్య సంగతి చూడండి స్వామీ!’ అన్నాడు సేనాని అసహనంగా. ‘ఈ వెన్నెల మహా అయితే నెలకి ఓసారి వస్తుంది. అది కూడా తెల్లవారుజాముకల్లా సూర్యకిరణాల ముందు వెలవెలబోతుంది. చంద్రుడు ఎంత కాంతిని ఇచ్చినా అది సూర్యకాంతి ముందు దిగదుడుపే! అంతమాత్రాన చంద్రుడు పనికిరానివాడంటావా!’ అని అడిగారు.   భిక్షువు ప్రశ్నకి సేనాని నవ్వుతూ- ‘అలా ఎలా సాధ్యం గురువుగారూ! సూర్యడు, చంద్రుడు... రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న గ్రహాలు. దేని అందం దానిదే. దేని లక్షణం దానిదే. సూర్యడు మనకి జీవాన్ని అందిస్తే, చంద్రుడు రాత్రివేళ మనల్ని కాచుకుంటాడు. ఇక ఇలాంటి వెన్నెల రాత్రుల ముందు వంద సూర్యోదయాల అనుభూతి దిగదుడుపే కదా!’ అన్నాడు. ‘చూశావా! నీ సమస్యకి సమాధానం నీ నోటి వెంటే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుని నీ ఉనికిని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. మంత్రి నీలాగా కత్తిపట్టలేడు, రాజు నీలాగా సాహసాలు చేయలేడు. కాబట్టి ఇలాంటి పోలికలని కట్టిపెట్టి నీ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టు,’ అంటూ ముగించారు భిక్షవు. సేనాని జీవితంలో అది నిజంగా వెన్నెల కురిసిన రాత్రిగా మారింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

అనుభవం ఎలా వస్తుంది?

ప్రతి మనిషి తన జీవోతంలో ఏదైనా సాధించాలి అంటే అనుభవం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అనుభవం ఉన్న వారు పని చేసే విధానానికి, అనుభవం లేనివారు పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. స్వామి వివేకానంద లాంటి గొప్పవాడే అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని అన్నారు. అయితే అనుభవం ఎలా వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అనుభవం అనేది దానికది వచ్చేది కాదు. అనుభవాన్ని సంపాదించుకోవాలి. ప్రతి పనీ ఒక అనుభవాన్ని పరిచయం చేస్తుంది. అందుకే చాలామంది తమపనులు తాము చేసుకోవాలి అని అంటారు. అంటే ఆ పని అనుభవం వ్యక్తికి పరిచయం కావాలని వారి ఉద్దేశ్యమన్నమాట. అయితే నేర్చుకునే అలవాటు ఉంటేనే అనుభవం వస్తుంది. మనిషి ఎలా బ్రతకాలో అనుభవమే నేర్పిస్తుంది. బోధనలు, శాస్త్రాలు అనేవి వినడానికే బాగుంటాయి. వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకునేది అవగింజ అంత మాత్రమే. అందుకే  భోధనల ద్వారా నేర్చుకోవడం కొంతవరకే సాధ్యమవుతుందని,  అన్నీ చదివిన వారికంటే అనుభవం ఉన్నవారు ఎన్నో రెట్లు మేలని విజ్ఞానవంతులు చెబుతారు.. ఒక పనిచేయటంలో అనుభవం ఉన్న వారికి ఆ పనిలో ఉన్న మెళకువలు అన్నీ తెలుస్తాయి. తద్వారా వారు ఆ పనిని త్వరగా చేయగలరు. అదే కొత్తగా ఆ పని చేయడానికి వచ్చినవారు చేసేటప్పుడు తడబడుతూంటారు. అనుభవం గలవారి వద్ద ఉంటే మనం ఆ పనిని త్వరగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా వాడి దగ్గర నేను నేర్చుకునేదేమిటి నాకు నేనుగానే ఈ పనిని చేయగలను నేర్చుకుంటాను అనుకుంటే ఆ పనిని నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో మనకున్న అహం అనేది మనల్ని ఇబ్బందులపాలు చేస్తుంది.  అనుభవం అనేది ఒక పనిని మనం చేసినప్పుడో లేదా నేర్చుకున్నప్పుడో వస్తుంది. అంతేకానీ ఊరికే రాదు. మనం ఒక పనిని నేర్చుకుంటున్నపుడు ఆ పనిలో అనుభవం ఉన్న వారికి మన సందేహాలను చెప్పొచ్చు, వారి ద్వారా పరిష్కారాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఏ విషయంలోనైనా మంచి చెడ్డలు, లాభనష్టాలు దానికి సంబంధించిన అనుభవం ఉన్నవారికే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. అందువల్లే అనుభవాన్ని సంపాదించాలి. అనుభవం గలవారు చెప్పే మాటలు అప్పుడప్పుడూ కూడా వింటూ ఉండాలి. వారు అనుభవం కలవారు ఎందుకు చెప్తున్నారో అర్ధం చేసుకోవాలి.  పనిలోగానీ, ఉద్యోగంలోగానీ ఏ రంగంలోనైనా సరే అనుభవం సంపాదించటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటున్నాము మనం ఒక ఉద్యోగాన్ని మాని వేరే ఉద్యోగానికి వెళితే అనుభవం ఉందా అని అడుగుతారు. దానినిబట్టి మనకు ఉద్యోగం ఇవ్వాలా లేదా మనకు ఎంత జీతం ఇవ్వాలి అన్నది. ఆలోచిస్తారు. మనం ఒక పనిని లేదా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు దానిని మనం వృధా చేయకుండా కాలాన్ని వృధాగా గడవకుండా అనుభవం సంపాదించటం కోసమే పని చేయాలి. అనుభవం కోసం, పనిలో నైపుణ్యత సంపాదించడం కోసం పనిచేస్తూ పోతే ఖచ్చితంగా గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నవారిగా ఎదుగుతారు. జీవితంలో కావలసినవి అన్నీ ఆ అనుభవమే సమకూర్చుకునేలా సహాయపడుతుంది.                                        ◆నిశ్శబ్ద.

సెప్టెంబర్ 13,  శుక్రవారం వెనక ఉన్న ఈ నమ్మకాల గురించి తెలుసా?

  చరిత్రలో ప్రతి తేదీకి ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. వీటిలో కొన్ని మంచివి అయితే మరికొన్ని చెడ్డవి.  కొన్ని తేదీలు ప్రపంచ వ్యాప్తంగా,  మరికొన్ని కొన్ని దేశాలకు ప్రత్యేకంగా ఉంటే.. మరికొన్ని తేదీలు విషాదాన్ని,  చెడును సూచిస్తాయి. సెప్టెంబర్ 13, శుక్రవారం కూడా అలాంటిదేనట.  సెప్టెంబర్ 13,  శుక్రవారం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో చెడ్డ దినంగా పేర్కొంటున్నారు.  దీని వెనుక ఉన్న కారణాలేంటంటే.. సరిగ్గా గమనిస్తే కొన్ని భవనాలకు అసలు 13 సంఖ్యతో అంతస్తు ఉండదు. ఎందుకంటే 13 వ సంఖ్యను అశుభంగా పరిగణిస్తారు.  అందులోనూ 13వ తేదీ వచ్చిన శుక్రవారాన్ని అయితే మరీ అశుభప్రదమైనదిగా భావిస్తారు. భారతదేశంలో కాకుండా విదేశాలలో ఈ సెప్టెంబర్ 13వ తేదీ గురించి నమ్మకం ఎక్కువగా ఉంది.  ఇది పవిత్ర గ్రంథం బైబిల్ లో ప్రముఖంగా ప్రస్తావించబడింది. యేసు క్రీస్తు శుక్రవారం రోజునే సిలువ వేయబడ్డాడనే విషయం అందరికీ తెలిసిందే.. ఇదే విషయం బైబిల్ లో కూడా చెప్పబడింది. ఇది మాత్రమే కాకుండా ఆ నాడు చివరి విందులో 13 మంది ఉన్నారని,   ఈ 13మందిలో ఒకరు యేసును అప్పగించారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ కారణంగా 13 వ తేదీ అన్నా.. ముఖ్యంగా 13వ తేదీ వచ్చే శుక్రవారం అన్నా ఇష్టపడరు. రచయిత థామస్ విలియం లాసన్ 1907లో  రాసిన ఫ్రైడే ది 13త్ నవల కూడా ఈ మూఢనమ్మకం పెరగడానికి కారణంగా మారింది. ఇది మాత్రమే కాకుండా 1980లో విడుదల అయిన ఫ్రైడే ది 13త్ సినిమా కూడా ప్రజల్లో ఈ మూఢనమ్మకాన్ని మరింత బలపరిచింది. ఇది మాత్రమే కాకుండా ఫిన్లాండ్ లో సెప్టెంబర్ 13న వచ్చే శుక్రవారాన్ని జాతీయ ప్రమాద దినోత్సవంగా జరుపుకుంటారు.  తద్వారా ప్రజలు భద్రతా నియమాలను సరిగా పాటిస్తారు. ఇలాంటి అనేక కారణాల వల్ల సెప్టెంబర్ 13 వ తేదీ శుక్రవారం గురించి ప్రజలలో మూఢనమ్మకాలు చాలా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి. సామాన్య జీవితంలో పెద్దగా మార్పులు లేకపోయినా ఇప్పట్లో జరుగుతున్న సంఘటనలు ప్రజలలో ఈ మూఢ నమ్మకాలను మరింత పెంచుతున్నాయి.                                      *రూపశ్రీ.  

శారీరక స్థితి కలలకు కారణం అవుతుందా?

శారీరక ప్రవృత్తికి, అంటే వాత పిత్త శ్లేష్మ ధర్మాలకు, స్వప్నాలకు(కలలకు) సంబంధం  ఉంటుందని అధర్వణవేదం చెప్పింది. అంటే ఈ మూడు ప్రవృత్తులలో ఏదైన ప్రకోపించినప్పుడు అంటే ఎక్కువైనప్పుడు దాని ఫలితం కలలో వ్యక్తం చేయబడుతుంది. అలాగే శరీరంలో ఏవైన అంతర్గతంగా మార్పులు జరిగినప్పుడు ఆ మార్పులు కూడా కలలో కనిపిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే శరీరంలో జరిగే మార్పులు సరిగ్గా గమనించుకునే మనుషులే తక్కువగా ఉన్నారు ఈ కాలంలో.  అతిభుక్త సిద్ధాంతం అని ఒకటి ఉంది. అది కూడా ఈ కోవకే చెందుతుంది. ఒక రోజు రాత్రి ఎప్పుడైన అతిగా తినడం వలన కడుపులో సంభవించే మార్పులు ఆరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చే కలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎక్కువగా తిన్న పదార్థాన్ని అరిగించుకోవడానికి, జీర్ణమండలం ఎక్కువ రక్తాన్ని రప్పించుకుంటుంది. ఇందువల్ల  మెదడుకు పోవలసిన భాగం తగ్గిపోతుంది. ఇది కలల మీద ప్రభావం పడటానికి కారణం అవుతుంది.   ఇంతవరకు బాగానే ఉంది, అయితే ఒకే రాత్రి ఒకే ఆహారం తిన్న నలుగురు వ్యక్తులకు నాలుగు రకాల కలలు ఎందుకు వస్తాయో అంటే….. నలుగురు తిన్నది ఒకే పదార్ధం, కలలు మాత్రం వేరు వేరు. దీని గురించి ఆలోచిస్తే ఆ కలలు కనిన రోజు ఉదయం సమయంలో  వారు ఆయా విషయాలను గురించి చర్చించడమో, ఆలోచించడమో, ఆసక్తి చూపడమో జరిగి ఉంటుంది. అందువల్ల అవి వారి వారి స్వప్న విషయాలుగా మారి ఉంటాయి. అయితే శారీరక స్థితి కలకు మూలం ఎలా అవుతుందో తెలుసుకుంటే…...  ఒక రోజు బాగా తీపి పదార్థాలు తిని నిద్రపోవాలి. పడుకోబోయే ముందు దప్పిక అయినా, మంచినీళ్ళు త్రాగవద్దు. అంటే ఎలాగైనా సరే దప్పికతో నిద్ర పోవాలి. అలా నిద్రపోయినప్పుడు తప్పకుండా కల వస్తుంది. ఆ కలలో మీరు నీటినో, చమురునో, రక్తాన్నో లేక మరొక ద్రవ పదార్థాన్నో త్రాగుతూ ఉంటారు. అంటే మనిషి శరీరానికి అవసరమైన దాహం అనేది కలలో అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీనిని బట్టి శారీరక స్థితి, దప్పికగొన్న స్థితి, కలకు మూలమవుతుంది అనే విషయం నిర్ధారిత మవుతుంది. అలాగే లైంగికంగా దాహంతో ఉన్న వ్యక్తి విషయంలోను, శారీరకంగా ఆరోగ్యవంతుడైన యువకుడు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉంటే, ఆ విషయాలకు సంబంధించిన  కలలు కంటాడు. యువకులు తరుచు స్థలన స్వప్నాలకు గురి అవుతూ ఉంటారు. ఈ విషయం  తెలియనిదేం కాదు. శారీరక పరిస్థితి కల స్వభావాన్ని నిర్ణయించినా, కల ఎలాంటిది అనే  విషయాన్ని నిర్ణయించదు. కలలు మొత్తం మీద లైంగికాలే అయినా, అవి వేరు వేరు విధాలుగా ఉండవచ్చు. కలలకు శారీరక స్థితి ఆధారం అనడానికి మరొక కారణం కూడ చెప్పవచ్చు. మెదడులో కొన్ని ప్రదేశాలను ఎలెక్ట్రోడ్ తో గిలిగింతలు పెడితే కొన్నిసార్లు గిలిగింతలకు లోనైన వ్యక్తి కలగంటాడు. ఇది ఆ వ్యక్తి జాగ్రదావస్థలో ఉండగానే జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా పాతజ్ఞాపకాలు కలలో ఎందుకు పునరావృతం అవుతాయో వివరించవచ్చు. కలలు యాదృచ్ఛికాలని వీటికి మనోవైజ్ఞానిక ప్రాముఖ్యం ఏమీ లేదని, మెదడులో ఉద్దీపింపబడిన భాగాన్ని బట్టి ఆయా జ్ఞాపకాలు పునరావృతం  అవుతాయని చెప్పవచ్చు.  ఇలా మనిషి శారీరక స్థితిని బట్టి కలల ప్రభావం ఉంటుందని పరిశోధనల్లో నిరూపితమైంది కూడా.                                           ◆నిశ్శబ్ద.

ఈ ఐదు అలవాట్లకి దూరంగా ఉండండి

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా, టాయిలెట్ బౌల్ మరియు మన ఇంటి ఫ్లోర్ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండండి.   1 . బాత్రూం లో ఫోన్ వాడడం కొందరికి బాత్రూం లో ఫోన్ వాడడం అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనే విషయం మీకు తెలుసా?  టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్ మరియు కుళాయిలపై హానికరమయిన జెర్మ్స్ ఉంటాయి. వీటివల్ల మూత్రసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున, టాయిలెట్ లో మధ్య మధ్యలో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.   2 . హ్యాండ్ బ్యాగ్ తొలగించకపోవడం హ్యాండ్ బ్యాగ్ లు మరియు పర్సులు నిరంతరం మన చేతుల్లోనే ఉంటాయి. సాధారణ సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం ఏం ఉండదు. కానీ, బాత్ రూమ్ కి వాటిని మనకి తోడుగా తీసుకెళితే మాత్రం ఇబ్బందే. టాయిలెట్ కి వెళ్ళినపుడు ముందుగా హ్యాండ్ బ్యాగ్ ని అక్కడ ఉండే హుక్ కి తగిలించి వెళ్లడం బెటర్. తర్వాత బ్యాగ్ ని పై నుండి మరియు లోపల యాంటీ బాక్టీరియా క్లాత్‌తో తుడిచివేయడం మంచిది. తద్వారా హాని కలిగించే క్రిముల బారిన పడకుండా ఉండవచ్చు.   3 . షూస్ ఎక్కువ సేపు ధరించడం ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపు 40 % షూస్ డయేరియా కలిగించే బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. కాబట్టి ఆఫీస్ కి గానీ ఎక్కడికయినా వెళ్ళినపుడు మీ బూట్లు బయటే వదిలేసి వెళ్లడం మంచిది. అదే ప్రయాణంలో అయితే, ఒక శుభ్రమయిన సంచిలో తీసుకెళ్లడం బెటర్.   4 . రిమోట్ ని శుభ్రపరచకపోవడం మనం టీవీ రిమోట్ ని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తాం. అయితే, రిమోట్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వల్ల హానికారక బ్యాక్టీరియా నుండి ఉపశమనం పొందవచ్చు.   5 . స్పాంజిని సరిగ్గా పిండకపోవడం స్పాంజీలని వాస్తవానికి మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. అయితే అదే స్పాంజీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. కాబట్టి, స్పాంజీలని నెలకి ఒకసారి మార్చడమో లేదా వేడి నీటిలో ఉంచి పిండటమో చేస్తే క్రిముల బారి నుండి మనల్ని మనం రక్షించుకున్నవాళ్లమవుతాం.

ప్రతి మనిషి వినాయకుడి నుండి నేర్చుకోవలసిన విషయాలు

ఏకార్యాన్నైనా ప్రారంభించే ముందు ప్రథమంగా వినాయకుణ్ణి పూజించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించమని మానవులే కాదు దేవతలు కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారని పురాణాలు పేర్కొన్నాయి. వినాయకుణ్ణి పూజించడం వల్ల 'మహా' విఘ్నాత్ ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే...' 'మహా విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మహా దోషాలన్నీ అంతమై పోతాయి' అని 'గణపతి అథర్వశీర్ణోపనిషత్తు' వివరిస్తోంది. మదిలో తలచిన వెంటనే విఘ్నాలను తొలగించే దేవుడు. వినాయకుడు. అందువల్ల 'తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా దలచితినే హేరంబుని, తలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్' అంటూ వినాయకుణ్ణి ప్రార్థిస్తాం. ఎవరు ఏది కావాలని కోరుకుంటారో వారికి దాన్ని ప్రసాదించే సులభ ప్రసన్నుడు వినాయకుడు. సకల ఐశ్వర్యాలను కోరుకునేవారికి 'లక్ష్మీగణపతి'గా, సిద్ధులను  కోరుకునేవారికి 'సిద్ధగణపతి'గా విద్యలను కోరుకునే వారికి 'అక్షర గణపతి'గా... ఇలా గణపతిని ఏయే రూపాల్లో ఉపాసిస్తే  ఆయా ఫలితాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులకు ప్రియతముడు వినాయకుడు.  అందుకే జ్ఞానప్రదాత అయిన వినాయకుడు విద్యార్థులకు అత్యంత ప్రియతముడయ్యాడు. విద్యార్థులు వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిమ ముందు పుస్తకాలను ఉంచి, తమకు విద్యాబుద్ధులను ప్రసాదించమని  'కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి. గణాధిప నీకు మ్రొక్కెదన్' అంటూ భక్తి శ్రద్ధలతో గణనాథుణ్ణి ప్రార్థిస్తారు. అయితే మనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని అక్షర గణపతిని ప్రార్థిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. కానీ ఆ జ్ఞాననిధిని వృద్ధి చేయడానికి మన వంతు కృషి చేయాలి. ఏకాగ్ర చిత్తం..  ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ జ్ఞానాన్ని శీఘ్రంగా పొందాలంటే ఏకాగ్ర చిత్తంతో అధ్యయనం చేయాలి. ఏకాగ్రత లేని మనస్సుతో ఎన్ని గంటలు శ్రమించినా, ఎన్ని రోజులు కృషి చేసినా అది వేడి పెనం మీద పడిన నీటి చుక్కలా వెంటనే ఆవిరైపోతుందే కానీ ఎంతోకాలం నిలవదు.  మనస్సును ఒక విషయంపై ఒక్క క్షణమైనా ఏకాగ్రం చేయలేకపోతున్నవారు ఏకాగ్రత అంటే ఎలా ఉండాలో వినాయకుని జీవితంలోని ఓ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. మహాభారత కథను ప్రపంచానికి అందించాలన్న ఆలోచన వ్యాసుడికి కలిగింది. 'నేను చెబుతుంటే ఈ మహాగ్రంథాన్ని వ్రాయగల సమర్థులెవరైనా ఉన్నారా?' అని బ్రహ్మను అడిగాడు. 'నీ సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడు వినాయకుడు ఒక్కడే' అని బ్రహ్మ సలహా ఇచ్చాడు. వెంటనే వ్యాసుడు వినాయకుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తన విన్నపాన్ని తెలిపాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కానీ వ్యాసుడు, 'గణనాథా! నేను భారత కథను చెబుతూ ఉంటాను. మీరు ఆగకుండా వ్రాస్తూ ఉండాలి' అని షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు కూడా "నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే నా ఘంటం ఆగదు. కాబట్టి అలా ఆగకుండా కథను చెప్పాలి" అని షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, 'నేను చెప్పినదాన్ని అర్థం చేసుకుంటూ 'వ్రాయాలి' అని వినాయకునికి మరో షరతు పెట్టాడు. ఒకరి షరతులకు మరొకరు అంగీకరించిన తరువాత వ్యాసుడు మహాభారత కథను చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాశాడు. ఆ విధంగా 'పంచమ వేదం'గా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం మనకు లభించింది. వ్యాసుడు నిర్విరామంగా చెప్పిన భారత కథను అర్థం చేసుకుంటూ, నిరాటంకంగా వ్రాసిన వినాయకుని ఏకాగ్రతాశక్తి అనితర సాధ్యమైనది. ప్రశాంత చిత్తం.. జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రచిత్తం అవసరమే..  అయితే  మనస్సును ఏ విషయంపైన అయినా ఏకాగ్రం చేయాలంటే ప్రశాంతత అవసరం. అలజడితో అల్లకల్లోలమైన చిత్తాన్ని ఏ విషయం పైనా నిమగ్నం చేయలేం. చంచలమైన మనస్సుతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం. దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి.. వీరిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవాలని 'ముల్లోకాలలోని పుణ్యతీర్థాలను సందర్శించి, ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తాను' అని శివుడు ఓ పోటీ పెట్టాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై పయనమయ్యాడు. కానీ మూషిక వాహనంపై ముల్లోకాలను సందర్శించి రావడం వినాయకునికి అసాధ్యం. వినాయకుడు తన అసహాయతకు అలజడి చెందకుండా, మనోనిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించాడు. 'తల్లితండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల్లోని పుణ్యతీర్థాలను సందర్శించిన ఫలితం లభిస్తుంది. అన్న ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు. ఆదిదంపతులు వినాయకుని బుద్ధి కుశలతకు సంతసించి, గణాధిపతిగా నియమించారు. పరిశుద్ధ చిత్తం..  మనస్సు ఏకాగ్రతను సాధించాలంటే ప్రశాంతచిత్తంతో పాటు  పరిశుద్ధచిత్తం అవసరం. అందుకు మనస్సులో ఎలాంటి వికారభావాలూ కలగకుండా జాగ్రత్త వహించాలి. అది బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం వల్లనే సాధ్యమవుతుంది. ఒకసారి వినాయకుడు చిన్నప్పుడు ఆడుకుంటూ పిల్లిని కొట్టాడు. పిల్లికి ముఖంపై గాయమైంది. ఆట ముగించుకొని వినాయకుడు తన తల్లి పార్వతి దగ్గరకి వెళ్ళాడు. ఆమె ముఖంపై గాయాన్ని చూసి ఆశ్చర్యంతో 'అమ్మా! నీ ముఖంపై ఈ గాయం ఎలా అయ్యింది?' అని అడిగాడు. అందుకు పార్వతీదేవి, 'నాయనా! సర్వజీవుల్లో ఉన్నది నేనే. నువ్వు పిల్లి ముఖాన్ని గాయపరచడం వల్ల నా ముఖానికి కూడా గాయమైంది' అని చెప్పింది. సర్వజీవుల్లోనూ తల్లి పరమేశ్వరి కొలువై ఉందని తెలుసుకొన్నాడు వినాయకుడు. అలా సర్వజీవుల్లోనూ తల్లినే దర్శించిన వినాయకుని మనస్సులో ఎలాంటి అపవిత్ర భావాలూ కలిగేందుకు తావే లేదు. జ్ఞానసముపార్జనకు ముఖ్య సాధనాలైన ఏకాగ్ర చిత్తం, ప్రశాంత చిత్తం, పరిశుద్ధ చిత్రాలను ఆ వినాయకుడే ప్రసాదించగలడు. కాబట్టి ఆయన్ను శరణు వేడాలి.                                          *నిశ్శబ్ద.

నిజమైన ప్రేమకు అర్థం చెప్పే కథ!!

ఒక రాజు తను ఎంతగానో ప్రేమించిన భార్య మరణించింది. ఆయన ఆది తట్టుకోలేకపోయాడు. ఆమె తన ప్రాణంగా జీవించేవాడు. ఆమె మరణంతో అతను విలవిలలాడిపోయాడు. ఎన్నో ఏళ్ళు ఆమెనే తల్చుకుంటూ నిరంతర దుఃఖ స్రవంతిలో మునిగిపోయాడు. ప్రజల పాలనను, రాజ్యం యొక్క బాగోగులను మర్చిపోయాడు. ఎందుకంటే తన భార్య కంటే ముఖ్యమైనది, ఈ సృష్టిలో ఏదీ లేదని అతను భావించాడు. తిండి తిప్పలు మానేసి పిచ్చివాడిలా రోధిస్తూ ఉండేవాడు. ప్రజల పరిస్థితి దీనావస్థకు చేరుకుంది. శత్రువులు ఇష్టారాజ్యంగా దోచుకెళ్ళడం ప్రారంభించారు. సరైన సౌకర్యాలు లేక ప్రజలు అస్తవ్యస్తమైపోయారు. ఆ సమయంలో ఓ సాధువు పరిస్థితి గమనించి ఆ రాజు గారిని కలిశాడు.  "రాజా..... సుభిక్షంగా పాలించాల్సిన నీవే ఇలా అయిపోతే ఎలా?" అని అడిగాడు.  దానికి రాజు "ఈ రాజ్యం, ఈ ప్రజలు, ఈ సంపదలూ...... ఇవేవీ నా దుఃఖాన్ని దూరం చేయలేవు. నా రాణిని నాకు తిరిగి తెచ్చిపెట్టలేవు. ఆమె లేని ఈ జీవితమే వ్యర్థం. ఆమె కంటే ముఖ్యమైనది నాకేదీ లేదు" అని జవాబిచ్చాడు.  అందుకు సాధువు నవ్వి ఇలా అన్నాడు "ఓ రాజా.... ఇదంతా చూస్తుంటే.. నీ రాణిని నీవు నిజంగా ప్రేమించడం లేదేమో అనిపిస్తోంది! నీ ప్రేమ స్వచ్ఛమైనది కాదేమోననిపిస్తోంది…"అన్నాడు.  దానికి రాజు చాలా ఆగ్రహించాడు. "ఏంటీ. నాది స్వచ్ఛమైన ప్రేమ కాదా... ఏమి లేకపోయినా ఆమె జ్ఞాపకాలతో బ్రతికేయగలను. అయినా నాది  అని స్వచ్ఛమైన ప్రేమ కాదని మీరెలా అనగలరు?" అని అడిగాడు. దానికి సాధువు. "ఓ రాజా మీరు ఓ అందమైన, గుణవతి అయిన స్త్రీని మళ్ళీ వివాహం చేసుకోండి. ఒక  సంవత్సరం తర్వాత కూడా.... మీరిలాగే ఆమె జ్ఞాపకాలతో, దుఃఖంలో జీవిస్తున్నట్లు కన్పిస్తే...  అప్పుడు ఖచ్చితంగా మీ ప్రేమ ప్రపంచంలో కెల్లా స్వచ్చమైనదని అర్థం" అన్నాడు. రాజు తనది స్వచ్చమైన ప్రేమేననీ, దానిని నిరూపించడం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేననీ, మళ్లీ ఓ యువతిని వివాహం చేసుకోవడానికైనా సిద్ధమని సాధువుతో చెప్పి, కొంత కాలంలోనే ఓ అప్సరసలాంటి అనుకూలవతియైన వనితను వివాహమాడాడు. సంత్సరకాలం గడించింది. ఆ సాధువు మళ్ళీ ఆ రాజ్యంలోకి వచ్చి చూశాడు. ప్రజలంతా సర్వ సుఖాలతో, సుభిక్షంగా ఉండటం గమనించాడు. రాజు గారి దగ్గరికెళ్ళి చూడాలనుకున్నాడు. ఆ సాధువును చూడగానే ఆ రాజు  ఆనాడు తాను చెప్పిన మాటలను తల్చుకొని ఎంతో చిన్నబోయుడు. ఆ రాజు తన క్రొత్త భార్యతో, ఆనందడోలికల్లో మునిగి ఎంతో ఉల్లాసంగా ఉండటం సాధువు గమనించాడు. సాధువును చూడగానే రాజు ఇలా అన్నాడు. "స్వామీ.. నేను ఓడిపోయాను, నాది స్వచ్ఛమైన ప్రేమకాదని తెల్సుకొన్నాను. నేను మరో స్త్రీని పెళ్ళాడిన తర్వాత క్రమ క్రమంగా నా రాణి జ్ఞాపకాలను మరిచిపోయి ఆనందంగా ఉండగలిగాను...... కనుక నా రాణి పట్ల నాకు అంత స్వచ్ఛమైన ప్రేమలేదని తెలిసింది. నన్ను క్షమించండి" అని వివరణ ఇచ్చాడు.  దానికి సాధువు నవ్వుతూ "రాజా స్వచ్ఛమైన ప్రేమంటే ఒక వ్యక్తి కోసం కుమిలి కుమిలి రోధించడం కాదు, చనిపోయిన నీ భార్యని తలచుకుంటూ దుఃఖం అనే బానిసత్వంలో బంధీగా ఉండటం కాదు. నీవు నీ ప్రేమని. మరో వ్యక్తికి కూడా నిష్కల్మషంగా పంచగలిగావు. ఈ రాజ్య ప్రజల ప్రేమకు పాత్రుడవగలిగావు. నీ విధిని గుర్తించి మేలుకొని కర్తవ్యపాలన చేశావు. ప్రేమ కంటే బాధ్యత గొప్పది, బాధ్యత లేని ప్రేమ ఓ ఎండమావి లాంటిది. అయినా నీది స్వచ్ఛమైన ప్రేమే.  ప్రేమ అంటే స్వేచ్ఛ, ప్రేమ అంటే స్వచ్ఛత. ఎప్పుడైతే నీవు దుఃఖం, జ్ఞాపకాలు అనే బానిసత్వంలో ఉండినావో..... సమస్తం నీకు చీకటిగానే కన్పించింది. నీవు మళ్లీ మరో స్త్రీని నీ జీవితంలోకి ఆహ్వానించడంతో  ఆనందంగా గడపగలిగే మరో అవకాశాన్ని పొందగలిగావు. అప్పుడు నీవు దుఃఖంలో ఉండి అందరినీ సంతోషాలకు దూరం చేశావు. మళ్ళీ మరో ఆనందాన్ని వెదికి పట్టుకొని ప్రజలందరి సంతోషాలనూ తిరిగి తెచ్చి పెట్టగలిగావు. నిజమైన ప్రేమంటే ఆనందమే, నిరంతరం దుఃఖంలో ఉండటం నిజమైన ప్రేమకు నిదర్శనం కాదు. ఇతరుల కోసం ఏ త్యాగానికైన సిద్దపడటం, వారి కోసం జీవించడమే ప్రేమ అన్పించుకొంటుంది" అని సాధువు హితబోధ చేశాడు.                                       ◆నిశ్శబ్ద.  

పంచమవేదం అయిన మహాభారతం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు..?

మహాభారతాన్ని పంచమవేదం అని అంటారు. ఇందులో ఉన్న పాత్రలు అనేకం.  ప్రతి పాత్రా ఇందులో ప్రత్యేకమే.. ప్రతి పాత్ర నుండి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. చిన్ననాటి నుండే పిల్లలకు మహాభారతం, రామాయణం, భగవద్గీత వంటివి చదవడం అలవాటు చేయాలని వీటి వల్ల పిల్లలలో వ్యక్తిత్వ విలువలు మెరుగవుతాయని పెద్దలు చెబుతారు.  మహాభారతం నుండి పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకోగల కొన్ని విషయాలు తెలుసుకుంటే.. లక్ష్యం.. అర్జునుడు అంటే అందరికీ ఇష్టం. ఒక లక్ష్యాన్ని సాధించడంలో అర్జునుడిని మించిన యోధుడు లేడని అంటారు. లక్ష్యం పై దృష్టి పెడితే అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయవచ్చని అర్జునుడిని చూసి నేర్చుకోవచ్చు. జ్ఞానం.. ఎప్పుడూ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటేనే జీవితంలో మెరుగ్గా ఉండగలం. జ్ఞాన సంపాదన ఉన్నవారే విజయం సాధించవచ్చని మహాభారతం చెబుతుంది. కర్ణుడు.. కర్ణుడు మహాభారతంలో గొప్ప యోధుడు.  బాగా కష్టపడితే ఎలాంటి కష్టమైన పరిస్థితుల నుంచి అయినా బయట పడవచ్చని కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు.  సాధారణ వ్యక్తి నుండి ఒక  రాజ్యానికి రాజుగా ఎదిగిన తీరు అమోఘం. ఆకర్షణలు.. విద్యార్థులు చాలా విషయాలకు తొందరగా ఆకర్షితులు అవుతారు. కానీ ఆకర్షించే విషయాల నుండి దూరంగా ఉండాలని,  అలా చేస్తేనే తమ బాధ్యత తాము సంపూర్ణంగా నెరవేర్చగలరని  మహాభారతం చెబుతుంది. దుర్యోధనుడు.. మహాభారతంలో దుర్యోధనుడు చాలా చెడ్డవాడు.  నిజానికి దుర్యోధనుడు చెడు సావాసం వల్లే చెడ్డవాడిగా మారాడు. చెడు స్నేహాలు చేస్తే దుర్యోధనుడిలా చెడిపోతారని,  చెడు సావాసాలు పతనానికి దారి తీస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి. పాండవులు.. ఐకమత్యమే మహా బలం అని పిల్లలు చదువుకుంటూనే ఉంటారు.  పాండవులు అందరూ కలసి కట్టుగా ఉండటం వల్లే ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి విజయం సాధించారని అర్థం చేసుకోవాలి. ధర్మరాజు.. ధర్మరాజు ఉన్నత వ్యక్తిత్వం గలవాడు. వ్యక్తిత్వం మంచిగా ఉంటే మనిషికి విలువ కూడా అదే వస్తుందని ధర్మరాజు వ్యక్తిత్వం నుండి తెలుసుకోవాలి. దృఢ చిత్తం.. దృఢచిత్తం మనిషి ఏదైనా సాధించేలా చేస్తుంది.  దృఢచిత్తం వల్లనే పాండవులు అజ్ఞాతవాసం చెయ్యాల్సి వచ్చినా అందులో విజయం సాధించారని విద్యార్థులు తెలుసుకోవాలి. సహనం.. సహనం ఎంతటి కష్టాన్ని, బాధను అయినా అధిగమించేలా చేస్తుంది. సహనం కోల్పోకుండా ఉంటే విద్యార్థులు తమ జీవితంలో విజయాలు తప్పకుండా అందుకుంటారు. భీష్ముడు.. మహాభారతంలో భీష్ముడు చాలా కీలకం. మనసును ఎప్పుడూ చెప్పుచేతల్లో ఉంచుకోవడం భీష్ముడికే చెల్లింది.  అంత గొప్ప యోధుడు కూడా తన కర్తవ్యాన్ని ఏ నాడు నిర్లక్ష్యం చేయలేదు.                                                 *రూపశ్రీ.

మీరు వాడే సెంటుకీ ఉంటుందో వ్యక్తిత్వం!

  మన వ్యక్తిత్వం ఎలాంటిదో... మనం ఎంచుకునే వస్తువులు కొంతమేరకు ప్రతిబింబిస్తాయి. పెర్‌ఫ్యూమ్‌కి (perfume) కూడా ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మన మనసుకి దగ్గరగా ఉన్న పరిమళాలనే ఎన్నుకొంటామని వాదిస్తున్నారు. Paul Jellinek అనే ఆయన ప్రాచీన గ్రంథాలన్నీ తిరగతోడి పరిమళాలను నాలుగు రకాలుగా విభజించారు.   AIR:-  నిమ్మ, జామాయిల్ వంటి చెట్ల నుంచి తయారుచేసే పరిమళాలు ఈ విభాగానికి వస్తాయట. ఇలాంటి పరిమళాలు మనలోని సృజనకు పదునుపెడతాయంటున్నారు. మానసికంగా దృఢంగా ఉండేవారు, నలుగురిలో కలిసే చొరవ ఉన్నవారు ఇలాంటి పరిమళాలను ఎన్నుకొంటారట. ఇలాంటివారు కొత్తదారులను వెతుకుతారనీ, తమ మనసులో మాటని నిర్భయంగా పంచుకుంటారనీ చెబుతున్నారు. ఇతరులని మందుకు నడిపించడంలోనూ, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడంలోనూ వీరు ముందుంటారట. FIRE:- ముక్కుపుటాలు అదిరిపోయేలా ఘాటైన పరిమళాలు ఈ విభాగం కిందకి వస్తాయి. ఈ తరహా పరిమళాలను ఎన్నుకొనేవారు కొత్త కొత్త ఆలోచనలతో ముందకెళ్తుంటారు. కానీ ఒకోసారి తమ సామర్థ్యాన్ని మించిన లక్ష్యాన్ని ఎన్నుకొని భంగపడుతూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ... ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అనే పట్టింపు కానీ, ఇతరుల దృష్టిని ఆకర్షించాలన్న తపన కానీ వీరిలో కనిపించవు.   WATER:- గులాబీలవంటి సున్నితమైన పరిమళాలను ఇష్టపడేవారు ఈ విభాగానికి చెందుతారు. మానసికంగా ఎప్పుడూ సందిగ్ధావస్థలో ఉండేవారు ఇలాంటి పరిమళాలను ఇష్టపడతారట. వీరి స్వభావం, నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ప్రవహించే నీటిలాగా వీరు దేనినీ పట్టించుకోనట్లు కనిపించినా... తమ కుటుంబాలు, పిల్లలకు మాత్రం చాలా ప్రాధాన్యతని ఇస్తారట.   EARTH:- తియ్యటి పదార్థాలను పోలిన పరిమళాలు ఈ కోవకి చెందుతాయి. ఇలాంటి పరిమళాలను ఇష్టపడేవారు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారట. గాలిలో మేడలు కట్టడం వీరి స్వభావానికి విరుద్ధం. లోకాన్నీ, తన వ్యక్తిత్వాన్నీ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే నైపుణ్యం వీరి సొంతం. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు వీరు సదా సిద్ధంగా ఉంటారు. ఇవీ Paul Jellinek చేసి తీర్మానాలు. ఆయన చెప్పినంత మాత్రాన మనం వాడే పర్‌ఫ్యూమ్‌ ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబిస్తుందని అనుకోలేం. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి ప్రజలు 1+1 ఆఫర్‌ ఉందనో, కొత్త పెర్‌ఫ్యూమ్‌ మార్కెట్లోకి వచ్చిందనో, పక్కవాళ్లు కొనుక్కున్నారనో... పెర్‌ఫ్యూమ్స్ వాడేస్తుంటారు. కాకపోతే సరదాగా కాసేపు బేరీజు వేసుకోవడం కోసం పైన పేర్కొన్న లక్షణాలని చదువుకోవచ్చు.           

నేర్చుకోవడం కష్టమేమీ కాదు!

కొత్త విషయాన్నో కొత్త పనులనో నేర్చుకోవాలంటే కొంతమంది చాలా కష్టమని, తమ వల్ల కాదని చేతులెత్తేస్తూ ఉంటారు. అయితే ఆ కష్టమంతా బుర్రలో నిండిపోయిన ఒకానొక నిరాశాభావమే అనేది అందరూ తెలుసుకోవలసిన విషయం. కొందరు కొన్ని నేర్చుకోవాలంటే బహుశా ఆ పని పట్ల సమాజం నుండి కాస్త హేళన ఎదురవ్వడం కూడా ఆ పని నేను నేర్చుకోలేను అని చెప్పే సాకు కూడా కావచ్చు. మొత్తానికి ఏదైనా నేర్చుకోవడం కష్టమేమీ కాదు అయితే కావాల్సిందల్లా కొన్ని రకాల లక్షణాలు.  నేర్చుకోవడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? లెర్నింగ్ ఈజ్ ఏ లైటింగ్ స్పాట్! నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఒకానొక కొత్త వెలుగును జీవితంలోకి తెస్తుంది. అది ఏదైనా కావచ్చు. నేటి కాలంలో కంప్యూటర్, అందులో బోలెడు కోర్సులు. సైకిల్ దగ్గర నుండి బైక్, కార్ వంటి వాహనాల డ్రైవింగ్, కుట్లు, అల్లికలు. ఫోటోగ్రఫీ ఇవి మాత్రమే కాకుండా ఇప్పట్లో గోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టే ఎన్నో రకాల గేమ్స్, ఇంకా డాన్స్, సింగింగ్ ఇలాంటి బోలెడు విషయాలు అన్నీ జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొస్తాయి. అవన్నీ కూడా జీవితాల్లో ఎంతో ఉపయోగపడేవే. ఆసక్తి! ఆసక్తి మనిషిలో నేర్చుకోవాలనే తపనను పెంచుతుంది. ఇది క్రమంగా మనిషిని ధైర్యవంతులుగా మార్చుతుంది. ఊహాగానాలు, అపోహలు అన్నీ వదిలిపెట్టి ఆసక్తి ఉన్న విషయం వైపు మనసు పెట్టి ఆ దారిలో వెళితే నేర్చుకోవడం ఎంతో సులువు అనిపిస్తుంది. అవసరం! అవసరం మనిషిని అడ్డమైన పనులు చేయిస్తుందని ఎంతోమంది జీవితాలను చూసి అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు సరదాగా, ఇష్టంతో నేర్చుకున్న విషయాలే అవసరానికి పనికొస్తాయి. అవసరం ఉన్నప్పుడు నూరు ఆరైనా, ఆరు నూరైనా దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి లేకపోతే ఎన్నో అవకాశాలు, మరెన్నో ఉంనత శిఖరాలు చేజారిపోతాయని అనిపించినప్పుడు డూ ఆర్ డై అనే రీతిలో అనుకున్నది సాధించేవరకు వెనకడుగు వెయ్యనివ్వకుండా చేస్తుంది అవసరం.  పట్టుదల! పట్టిన పట్టు విడవకపోవడం గొప్ప లక్షణం. మొదలుపెట్టిన పనిని మధ్యలో విడవకుండా ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా దాన్ని పూర్తి చేయడంలో ఎంతో గొప్ప ఓర్పు ఉంటుంది. అంతేకాకుండా ఆ పట్టుదల అనేది జీవితంలో ఎన్నో విషయాల్లో ప్రేరణగా ఉంటూ మరిన్ని నేర్చుకునేందుకు సహాయపడుతుంది. విజయం కాదు నేర్చుకోవడమే! చాలామంది ఏదైనా ఒక విషయం నేర్చుకోగానే దాన్ని తాము సాధించిన విజయంగా భావిస్తారు. కానీ నేర్చుకోవడం అనే విషయంలో గెలుపు, ఓటమి అనేవి ఎప్పుడూ ఉండవు. అవి నేర్చుకోవడం లేదా నేర్చుకోవడాన్ని ఆపేయడం అనే భావనలో చూడాలి. అలా చూసినప్పుడు ఆటోమాటిక్ గా నేర్చుకున్నాం అనే గర్వం కానీ నేర్చుకోలేకపోయాము అనే నిరాశ కానీ దరిచేరవు. ఇంకా ముఖ్యంగా నేర్చుకోవడం అనేది ఎప్పుడూ కొత్త అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండచ్చు. సాధన సాధ్యతే సర్వం! నేర్చుకోవడం అనేది ఒక అనుభవపూర్వక ప్రక్రియ కాబట్టి ఆ వైపు సాధన అనేది  ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుంది. నేర్చుకోవడంలో ఆసక్తి, పట్టుదల, అవసరం, అన్నిటికీ మించి దాన్ని ఒక అనుభవాత్మక పనిగా భావించడం వంటివి బుర్రలో పెట్టుకుని ఫాలో అయితే  కష్టమంటూ ఏదీ ఉండదు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

భక్తి అంటే ఏంటి?? భక్తి మంచిదేనా?? 

ఈ ప్రపంచమొక భక్తి సముద్రం.  ఆధ్యాత్మికత, ఆరాధన నిండి ఉన్న ప్రపంచంలో చాలా గొప్ప ప్రశాంత అనుభూతి పొందుతారు అందరూ. అయితే ఇదంతా కాయిన్ కు వన్ సైడ్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకొక సైడ్ చూస్తే దేవుడు, ఆరాధన, భక్తి ఇవన్నీ చాలా కమర్షియల్ గా ఉంటాయి, ఇవి కాకుండా మరొక విభిన్నమైన కోణం కూడా ఉంది. అదే మూఢంగా అన్ని నమ్మేయడం.  భక్తి గొప్పది, ఆ భక్తిని కమర్షియల్ గా చేసి దాన్ని కృత్రిమం చేయడం ఒక పనికిమాలిన చర్య ఆయితే ఆ భక్తిని పిచ్చిగా అనుసరించడం కూడా అలాంటిదే. భక్తిలో మూఢం ఉంటుందా?? అది పనికిమాలిన చర్య అవుతుందా?? అనేది ఎంతోమందికి కలిగే సందేహం.  భక్తి!! భక్తి అనేది మనిషిని ఉన్నతుడిగా, ఆ దేవుడికి దగ్గరగా తీసుకెళ్లే సాధనం. దేవుడెక్కడున్నాడు ఆయన దగ్గరకు వెళ్ళడానికి భక్తి ఎలా సహకరిస్తుంది అనే అనుమానం వస్తే, దేవుడు మనం చూసే ప్రతి ఒక్క వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ(మనుషులు, జంతువులు, పక్షులు ఇలా అన్ని రకాల ప్రాణులు) ఉంటాడు. అన్నిటినీ సమానంగా చూసిననాడు అన్నింటిలో ఆ దేవుడు ఉన్నాడని తెలుసుకున్ననాడు అన్ని విషయాల పట్లా భక్తిగా ఉంటారు. నిజానికి భక్తిలో క్రమశిక్షణ, బాధ్యత ఉంటాయి. అవి జీవితాన్ని ఒక సమాంతర రేఖ మీద ప్రయాణించేలా చేస్తాయి.  నేటి భక్తి!! ఇప్పటి కాలంలో భక్తి ఎలా ఉంటుంది??  కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దేవుడి దగ్గరకు వెళ్లి దేవుడిని కూడా సరిగ్గా చూడకుండా నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇస్తాను అని కొన్ని అగ్రిమెంట్లు మొక్కుల రూపంలో డిసైడ్ చేసి అక్కడ ప్రసాదాలు మెక్కి, షాపింగ్ లు చేసి తిరుగుప్రయాణం చేయడం.  ఇంకా కొన్ని వేరే దారుల్లో దేవుడి పేరు చెప్పి అన్నదానాలు అంటారు, వస్త్రదానాలు అంటారు, ఎన్నెన్నో హడావిడి పనులు చేస్తారు కానీ అక్కడ దేవుడి కంటే కొందరు మాహానుభావులను పొగడటానికి లేదా కొందరి చేత పొగిడించుకోవడానికి చేసే పనులు ఎక్కువ. దేవుడి కార్యంలో దేవుడు తప్ప మిగతా అంతా హైలైట్ అవుతుంది. మరి అక్కడ భక్తి ఎక్కడుంది??  మరొక వర్గం వారు ఉంటారు. వాళ్ళు మరీ మూఢంగా ఉంటారు. భక్తి అంటే అన్నింటిలో దేవుడిని చూడటం అనే విషయం మరచిపోయి భక్తి పేరుతో అందరినీ హింసిస్తూ ఉంటారు. కులం, మతం, వర్గం, భక్తిలో హెచ్చు తగ్గులు అబ్బో చాలా ఉంటాయి. వీటి కోణంలో మనుషులు ఒకరిని ఒకరు తక్కువ, ఎక్కువ చేసి చూసుకుంటూ దేవుడి పట్ల విశ్వాసంతో ఉన్నామని అనుకుంటారు  కానీ అందులో భక్తి తప్ప మనిషిలో అహంకారం, కోపం, ద్వేషం, అసూయ వంటివి అన్నీ ఉంటాయి. అదే భక్తి అనుకునేవాళ్ళు మూఢులు. ఇంకా అనవసరంగా ఉపవాసాలు చేస్తూ తమని తాము హింసించుకునేవారు మరొక మూఢ వర్గానికి చెందినవాళ్ళు. అందుకే నిజమైన భక్తి అంటే అన్నింటిలో దేవుడిని చూడటం, గౌరవం, ప్రేమ, మర్యాద కలిగి ఉండటం అని అంటారు. మనిషి ఎలా ఉండాలి?? నేటి కాలంలో ఉండే ఒత్తిడిని జయించడానికి మనిషికి ఆధ్యాత్మికత, యోగ, ధ్యానం ఎంతో ముఖ్యమైనవి. అవన్నీ స్వచ్ఛమైన భక్తిలో ఉంటాయి. ఏమీ ఆశించకుండా దేవుడి మీద భక్తితో పూజ, దేవుడి పేరుతో దానం, దేవుడిని తలచుకుని ఎలాంటి తప్పులు చేయకుండా గడిపే జీవితంలో ఎంతో ప్రశాంతత దాగి ఉంటుంది. తప్పులు చేసి దేవుడా నా పాపాలు పోగొట్టు అని ముడుపులు చెల్లిస్తే ఒరిగేది ఏమీ ఉండదు. దేవుడికి కావాల్సింది ముడుపులు కాదు సాటి భూతదయ కలిగి ఉండటం, నిస్వార్థంగా ఇతరులకు సహాయపడటం. కాబట్టి నిజమైన భక్తి అంటే ఏమీ ఆశించకుండా ఉండటమే. ఇతరులను గౌరవిస్తూ ప్రేమించడమే.                             ◆వెంకటేష్ పువ్వాడ.  

గతాన్ని మార్చివేసే కథ!

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ఏ విషయమూ నచ్చేది కాదు. ఎవరూ సరైనవారిగా తోచేవారు కాదు. కాలేజి నుంచి ఇంటికి వచ్చేసరికి అతని మనసులో ఎంతో అసంతృప్తి. మదిలో ఎన్నో ఆరోపణలు. ఆ కుర్రవాడి తండ్రి, పాపం రోజంతా కష్టపడి ఇంటికి చేరుకునేవాడు. కాసేపు తన కుటుంబంతో కాలక్షేపం చేద్దామనుకునేవాడు. ఈలోగా కుర్రవాడు తన మనసులో ఉన్న అసంతృప్తినంతా వెళ్లగక్కేవాడు. పదే పదే ఆ పగలు జరిగిన విషయాలన్నింటినీ తండ్రితో పూస గుచ్చినట్లు చెప్పేవాడు. కుర్రవాడికి ఎంతగా సర్దిచెప్పినా ఊరుకునేవాడు కాదు.   కుర్రవాడి మనస్తత్వంతో తండ్రి విసిగిపోయాడు. కానీ ఏం చేసేది. ఎంతగా అనునయించినా కుర్రవాడు తన మాట వినడం లేదు సరికదా... జీవితం మీద అతని ఆరోపణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తన బతుకు బతకడం మానేసి ఎదటివారి లోపాలనే అతను లెక్కపెడుతూ కూర్చుంటున్నాడు. ఆ కుర్రవాడని కనుక ఇలాగే వదిలేస్తే అతను ఎందుకూ పనికిరాకుండా పోతాడని తండ్రికి అర్థమైంది. దాంతో ఓ రోజు తన గురువుగారి దగ్గరకు వెళ్లి తన గోడునంతా చెప్పుకొన్నాడు.   కుర్రవాడి తండ్రి చెప్పిన మాటలను గురువుగారు చిరునవ్వుతో ఆలకించాడు. తర్వాత ‘నువ్వు రేపు ఉదయం నీ కొడుకుని నా దగ్గర విడిచిపెట్టి వెళ్లు. మళ్లీ సాయంత్రానికి వచ్చి అతన్ని తీసుకుపో!’ అని చెప్పాడు.   గురువుగారు చెప్పినట్లే తండ్రి తన కొడుకుని మర్నాడు ఉదయమే ఆయన ఆశ్రమంలో విడిచిపెట్టాడు. ‘బాబూ ఇవాళ మధ్యాహ్నం వరకూ నేను జపతపాలతో హడావుడిగా ఉంటాను. నువ్వు కాస్త ఆశ్రమంలో తిరుగుతూ కాలక్షేపం చేయి. మధ్యాహ్నం నీతో మాట్లాడతాను,’ అని తన గదిలోకి వెళ్లిపోయారు గురువుగారు.   గురువుగారి సూచన ప్రకారం కుర్రవాడు ఆశ్రమం అంతా కలియతిరగసాగాడు. యథాప్రకారం అతనికి అందులో చాలాలోటుపాట్లు కనిపించాయి. చాలామంది ప్రవర్తన కూడా అతనికి నచ్చలేదు. ఆ లోపాలన్నింటినీ గమనిస్తూ అతను మధ్యాహ్నం వరకూ గడిపేశాడు.   మధ్యాహ్నం గురువుగారు కుర్రవాడిని కలిశారు. ‘ఏం బాబూ నీకు ఇక్కడ ఎలా తోచింది!’ అని అడగడమే ఆలస్యం. తను చూసిన తప్పులన్నీ గురువుగారికి ఏకరవు పెట్టాడు కుర్రవాడు.   ‘మంచిది! నీకు ఇంత సునిశితమైన దృష్టి ఉందని నాకు తెలియదు. ఈ లోకం తీరుతో నువ్వు చాలా బాధపడినట్లు కనిపిస్తున్నావు. నీ బాధ తగ్గేందుకు నేను ఓ సరదా కథ చెబుతాను విను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ నవ్వు పుట్టించే ఓ అక్బర్‌ బీర్బల్‌ కథ చెప్పాడు. కుర్రవాడు ఆ కథని ఆస్వాదించినట్లే కనిపించాడు. కానీ ఓ పదినిమిషాల్లో మళ్లీ అతని మనసుకి ఏదో గతం గుర్తుకువచ్చిన మళ్లీ దిగాలుపడిపోయాడు. ‘అరెరే నువ్వు మళ్లీ దిగాలుగా కనిపిస్తున్నావు. ఉండుందు నీ మనసుని మళ్లీ గాడిలో పెడతాను. అందుకోసం ఓ సరదా కథ చెబుతాను విను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ ఇందాక చెప్పిన కథనే మళ్లీ చెప్పాడు గురువుగారు. రెండోసారి కూడా కుర్రవాడు ఆ కథని కాస్త ఆస్వాదించాడు. కానీ ఇంతకుముందే ఆ కథని వినేశాడు కదా! దాంతో కథ విన్న రెండు నిమిషాలకే అతని మనసు యథాస్థితికి చేరుకుంది. ‘అరెరే నువ్వు మళ్లీ దిగాలుగా కనిపిస్తున్నావు. ఉండుండు, నీకు కాస్త సంతోషాన్ని కలిగిస్తాను. పూర్వం అక్బర్ అనే రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో బీర్బల్‌ అనే మంత్రి ఉన్నాడు....’ అంటూ చెప్పిన కథనే మళ్లీ చెప్పాడు గురువుగారు. ఈసారి కుర్రవాడికి చిరాకెత్తిపోయింది. ‘మీకేమన్నా పిచ్చా! చెప్పిన కథనే మళ్లీ చెబుతారేంటి. ఒకసారి విన్న కథని వెనువెంటనే మళ్లీ ఎలా ఆస్వాదించగలను,’ అంటూ చిరాకుపడ్డాడు. కుర్రవాడి మాటలకు గురువుగారు చిరునవ్వుతో- ‘నాయనా ఒక చిన్న కథని మళ్లీ మూడోసారి వినడానికే ఇంత బాధపడుతున్నావే! నీ గతాన్ని అవతలివారు వందలసార్లు ఎందుకు వినాలి. నీ ఆరోపణలని పదే పదే ఎందుకు ఆలకించాలి. నీకు ఏదన్నా తప్పని తోస్తే ఖండించు, లేదా దాన్ని సరిదిద్దేందుకు నీకు తోచనిది చేయి. అంతేకానీ నిరంతరం నీకు కనిపించే ప్రతి చిన్న లోపాన్ని నీ భుజానికి ఎత్తుకొని ఎందుకు తిరుగుతున్నావు. నీ తోటివారికి కూడా ఆ బాధని రుద్దేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నావు. ఆ ప్రయత్నంలో నీ వ్యక్తిత్వాన్నే కోల్పోతున్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు,’ అని అడిగారు గురువుగారు. గురువుగారి మాటలకు కుర్రవాడి దగ్గర జవాబు లేకపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

సెక్స్ గురించి మీకు తెలిసిందేంటి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ఇదే!

భారతదేశంలో సెక్స్ అనే పదం ఎక్కడైనా పబ్లిక్ గా వినిపిస్తే చాలా పెద్ద చర్చలు, మరెంతో పెద్ద వార్తలుగా మారతాయి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఈ శారీరక సంబంధం గురించి అందరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పబ్లిగ్గా చర్చలు పెట్టడం వల్ల మార్పులు సాధ్యమవుతాయంటే ఇప్పటికి భారతదేశంలో ఎన్నో విషయాలు మార్పు చెంది ఉండాలి. వీటిలో లింగ సమానత్వం, అక్షరాస్యత, కనీస మానవహక్కులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాల్సినవే. కాబట్టి మార్పు అనేది ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడటం వల్లే రాదు.. చరిత్ర ఏమి చెప్పింది?? వాస్తవంలో ఏమి జరుగుతోంది?? వీటిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే కాలానికి తగ్గట్టుగా జరగాల్సిన మార్పులు ఏమిటి అనేది తెలుస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 9 వ తేదీని జాతీయ సెక్స్ డే లేదా లైంగిక సంబంధాల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి మనిషికి జీవితంలో తిండి, నిద్ర, నీరు వంటి కనీస అవసరాలు ఎలాగో అలాగే.. సెక్స్ కూడా ఒక కనీస అవసరం. వయసు వల్ల ఏర్పడే శారీరక స్పందనల నుండి శరీరాన్ని సహజస్థితిలోకి తీసుకురావడానికి సెక్స్ ఉపయోగపడుతుంది.  నిజానికి సెక్స్ అనే పదం విదేశీయులది అయినా దీన్ని కూడా కళాత్మకంగా చూపెట్టిన ఘనత భారతీయులకే దక్కింది. శృంగారం, సంభోగం పేర్లతో ఈ శారీరక అవసరం ఎన్నో వేల ఏళ్ల నుండి వ్యక్తుల మధ్య ఒక జీవనదిలా సాగుతోంది. పండితులు తృతీయ పురుషార్థంగా కామంను వర్ణించారు. ముఖ్యంగా వాత్సాయనుడు రచించిన కామసూత్రం, కొక్కోకుడు రచించిన కొక్కోక శాస్త్రం  మొదలైనవి వేల ఏళ్ల క్రితం నుండే ఉన్నాయి. కామసూత్రలో 64 విధాలుగా శృంగారాన్ని ఆ కాలానికే వర్ణించారంటే ఈ విషయం గురించి దేశ దేశాలు భారతదేశం నుండే ఎన్నో నేర్చుకున్నాయని చెప్పవచ్చు.  ఇవి అప్పట్లో రాజకుటుంబీకులు, పండితులకు మాత్రమే లభ్యమైనా క్రమంగా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.  ఇకపోతే సెక్స్ అనేది ఆరోగ్యకరమైన సంబంధంగా కొనసాగితే అది ఎంతో గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడి, శరీరం ఫిట్ గా ఉండటం దీని ద్వారా సాధ్యమవుతుంది. కేవలం పునరుత్పత్తికి ఇదొక మార్గమనే కోణంలో దీన్ని ఎప్పుడూ భావించకూడదు. ఇవి అర్థం చేసుకుంటే సెక్స్ అనేది ఎప్పుడూ బూతుగా కనిపించదు, అనిపించదు.                                      ◆నిశ్శబ్ద