Read more!

కాబోయే భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఈ పనులు చెయ్యండి

ఎన్నో సంవత్సరాలు వేర్వేరు చోట్ల పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటిగా మారి ఒకేచోట నివసించడం మొదలుపెడతారు. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా వారిద్దరి మధ్య బంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. వాటిని పాటించాలి. భార్యాభర్తల బంధం దృఢంగా ఉంటే ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే..

కమ్యూనికేషన్

సాధారణంగా పెళ్లిచూపులు గడిచిన తరువాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ రోజే పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. అయితే నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య కాలంలో అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం అంటే చాలామంది తప్పుగా భావిస్తారు. కానీ ఈ సమయంలో వారిద్దరూ మాట్లాడుకోవడం వల్ల ఇద్దరూ ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకోగలుగుతారు.

ప్రశ్నలు, సమాధానాలు..

నిశ్చితార్థం, పెళ్లి మధ్య కాలంలో అమ్మాయి లేదా అబ్బాయి తమ మనసులో ఉన్న ప్రశ్నలు అడగడం, తాము చెప్పాలనుకునే విషయాలను కాబోయే భాగస్వామితో చెప్పడం వల్ల ఒకరి మీద మరొకరికి అవగాహన, గౌరవం కలుగుతాయి.

నమ్మకం..

పెళ్లికి ముందే భాగస్వాములు ఒకరిమీద మరొకరికి దృఢమైన నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం. ఇది పెళ్లి తరువాత  ఇద్దరి బంధం బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

కుటుంబాలతో సమన్వయం..

భాగస్వాములు ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకునే ఈ కొన్ని రోజుల కాలంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకోవాలి. దీనివల్ల మొత్తం కుటుంబాలు కూడా బంధుత్వంలో బలంగా ఉంటాయి.

వివాహానికి సిద్దమవడం..

ఇప్పట్లో కాబోయే జంటలు ప్రతి విషయాన్ని చర్చించుకుని మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. వివాహ వేడుకకు ఇద్దరూ కలసి మానసికంగా సన్నద్దమైతే వారి పర్సనల్ లైఫ్ కూడా ఆశాజనకంగా ఉంటుంది.

షాపింగ్..

పెళ్లికి చేసే షాపింగ్ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలసి చేయడం మంచిది. వారిద్దరూ ఒకరికొకరు ఎలా ఉంటే నచ్చుతారో, వారి అభిరుచులు ఏంటో ఇక్కడ తెలుస్తుంది. కాబోయే భాగస్వామికి నచ్చినట్టు ఉండాలని  వారు చేసే ప్రయత్నం కూడా ముచ్చటగా ఉంటుంది.

ప్రధాన్యతలు..

పెళ్ళి అనే బంధంతో ఓ వ్యక్తి జీవితంలోకి  వచ్చిన తరువాత ఇక జీవితంలో అన్నీ భాగస్వామికి నచ్చినట్టు ఉండాలని అనుకోకూడదు. ఎవరి ప్రాధాన్యతలు వారికి ఉండాలి. ఎవరి అభిరుచులు, ఇష్టాఇష్టాలు వారికి ఉండటం మంచిదే. సందర్బాన్ని బట్టి సర్ధుకుపోవాలి కానీ పూర్తీగా వ్యక్తిగత అభిరుచులు వదలక్కర్లేదు.  

ఉద్యోగం..

ఇప్పట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలను ఉద్యోగం మానెయ్యమని ఎవరూ చెప్పరు. కానీ చాలామంది అమ్మాయి ఉద్యోగం చెయ్యక్కర్లేదు అని అంటూ ఉంటారు. ఉద్యోగం విషయంలో ఇద్దరూ కలసి చర్చించుకోవడం మంచిది. అటు ఉద్యోగ జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఇద్దరూ కలసి ఆరోగ్యంగా బ్యాలెన్స్ చేసుకునేలా నిర్ణయం తీసుకోవాలి.

పిల్లల ఆలోచన..

ఉద్యోగం, ఇంటి బాధ్యతలు,  వ్యక్తిగత సంతోషంగా గడపడం మొదలైన విషయాల గురించి ముందుగానే చర్చించుకోవాలి. పిల్లలను కనే విషయంలో ప్లానింగ్ చేసుకుంటే ఆర్థిక సమస్యలను కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకు ప్లాన్ చేసిన తరువాత చాలావరకు మహిళలు ఒకటి రెండేళ్లు అయినా ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.

                                        *నిశ్శబ్ద.