హెపటైటిస్ పై అవగాహన చాలా అవసరం!

మానవజీవితాన్ని ప్రస్తుతకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం అనారోగ్యం. ఎన్నో సమస్యలు మనిషిని ఒకపట్టాన ఊపిరితీసుకొనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటిలో కాలేయ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. కాలేయానికి వచ్చే సమస్యలలో చివరి వరకు బయటపడకుండా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే సమస్య హెపటైటిస్. ప్రపంచ హెపటైటిస్ అవగాహన దినోత్సవంను ప్రతి సంవత్సరం జులై 28వ తేదీన జరుపుతారు. దాని సందర్భంగా ఈ హెపటైటిస్ గురించి వివరంగా అందరి కోసం. అసలు హెపటైటిస్ అంటే ఏంటి? కాలేయం వాపుకు గురయ్యి దాని పరిమాణం పెరిగిపోవడమే హెపటైటిస్ గా వైద్య శాస్త్రంలో చెబుతారు. మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక మందులు వాడటం వల్ల కాలేయానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అన్నిటికంటే ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు హెపటైటిస్ సమస్యకు కారణమయ్యే అత్యంత సాధారణ సమస్య. హెపటైటిస్ సమస్యలో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది కూడా ఒకటి. ఈ సమస్య కాలేయ కణజాల నిర్మాణానికి ప్రతిరోధకాలను తయారుచేసేటప్పుడు ఎదురయ్యే సమస్య. హెపటైటిస్ సమస్యను దాని ప్రభావాన్ని, లక్షణాలను అనుసరించి  ఆరోగ్య నిపుణులు అయిదు వర్గాలుగా విభజించారు. వాటిలో హెపటైటిస్ A, B, C, D మరియు E అని ఉన్నాయి. వీటిలో ఒక్కో హెపటైటిస్ సమస్యకు ఒకో వైరస్ కారణమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 354 మిలియన్ల ప్రజలు హెపటైటిస్ B, మరియు హెపటైటిస్ C తో బాధపడుతున్నారు. ఇది చాలా దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది. ◆ హెపటైటిస్ A అనేది హెపటైటిస్ A అనే వైరస్ వల్ల వస్తుంది. ఇధి తీవ్రమైన సమస్య అయినా చాలా తక్కువకాలం మాత్రమే ఉంటుంది. ◆ హెపటైటిస్ B అనే వైరస్ కారణంగా హెపటైటిస్ B సమస్య వస్తుంది. ఇది చాలా దీర్ఘకాలిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ ప్రజలు దీనివల్ల బాధపడుతున్నారు. ◆ హెపటైటిస్ C అనే వైరస్ వల్ల హెపటైటిస్ సమస్య వస్తుంది. ఇది సాధారణంగా రక్తసంబంధ సమస్యలలో ఒకటి. అయితే దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది. ◆ హెపటైటిస్ D అనేది హెపటైటిస్ B సమస్యతో కలసి వచ్చే సమస్య. ఇది కాలేయ మంటను ఎక్కువగా కలిగిస్తుంది. ◆ హెపటైటిస్ E అనేది హెపటైటిస్ E వైరస్ వల్ల వస్తుంది. ఇది పారిశుద్ధ్యం సరైన విధంగా లేకపోవడం వల్ల అంటే కాలుష్య ప్రాంతాలలో నివసించేవారిలో కనిపిస్తుంది. ఇది సాధారణమైన సమస్యగా అనిపించినా గర్భిణీలలో చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. హెపటైటిస్ లక్షణాలు! హెపటైటిస్ B మరియు C ఉన్నవాళ్ళలో లక్షణాలు బయటకు కనిపించవు. మిగిలినవి వెంటనే లక్షణాలను కలిగి ఉంటాయి. అలసట, జ్వరం, జలుబు, మూత్రం రంగు మారటం, మలం పలుచగా ఉండటం అంటే విరేచనాలు అవుతున్నట్టు. ఆకలి లేకపోవడం, పొత్తికడుపు నొప్పి, చెప్పలేనంతగా బరువు తగ్గిపోవడం, చర్మం రంగు మారడం (కొందరు ఈ లక్షణం చూసి పచ్చకామెర్లు అనుకుంటారు). హెపటైటిస్ నిర్ధారణ చేయడానికి వైద్యులు చాలా రకాల పరీక్షలు చేస్తారు. శారీరక పరీక్ష రక్త పరీక్షలు కాలేయ సమస్య పరీక్షలు బయప్సి  అల్ట్రా సౌండ్ పరీక్ష  పైన చెప్పుకున్న పరీక్షల ద్వారా హెపటైటిస్ సమస్యను వైద్యులు నిర్ధారిస్తారు. హెపటైటిస్ కు దూరంగా ఉండటం ఇలా! హెపటైటిస్ A కు దూరంగా ఉండటానికి వ్యాక్సిన్ తీసుకోవచ్చు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళవరకు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. వ్యాప్తిని తగ్గించుకోవడం మరొక ముఖ్యమైన జాగ్రత్త. తీసుకునే ద్రవపదార్థాలు, నీరు ఇతర ద్రవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ లకు గురయ్యే అవకాశాన్ని రానివ్వకూడదు. హెపటైటిస్ A మరియు E సంక్రమించకుండా ఉండటానికి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ నీరు, ఆహారం, చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. హెపటైటిస్ B,C,E వైరస్ లు వీటి ద్వారా ఇన్ఫెక్షన్ సృష్టిస్తాయి. పైన చెప్పుకున్నట్టు హెపటైటిస్ అనేది బయటకు తెలియకుండా ప్రమాదంగా మారే సమస్య. దాని నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

ఎమోషన్స్ ని ఎడిట్ చేసుకుంటే మంచిది

మనుషులమండి మానులం కాదు. అసలు తొణకకుండా ఎలాంటి భావాలు బయట పెట్టకుండా ఉండలేం. మనుషుల్లో కలిగే సహాజ స్పందనలు, ప్రతిస్పందనలను ఎమోషన్స్ అని పిలుచుకుంటాం. అయితే నేటి కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో ఈ ఎమోషన్స్ కూడా ఒక భాగంగా చేరిపోయాయి.  నవ్వొస్తుంది నవ్వేలేం, ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారని ఏడుపోస్తుంది ఏడవలేం, ఎందుకంటే సమాజం ఏడ్చేవాళ్లను ఇంకా ఏడిపిస్తుందని కోపం, బాధ, ఆవేశం, ఈర్ష్య, అసూయ, పొంగుకొచ్చే దుఃఖం ఇవన్నీ ఎమోషన్స్ లో భాగమే. అయితే మనుషులు కోపాన్ని, బాధను, ఆవేశాన్ని చాలా తొందరగా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు. దీనివల్ల చాలా తొందరగా నష్టం జరిగిపోతుంది. ముఖ్యంగా మానవసంబంధాలు చాలా దెబ్బతింటాయి. క్షణాలు నిమిషాల్లో జరిగిపోయే ఆ బీభత్సం వల్ల కొన్ని బంధాలు తెగిపోవచ్చు, మరికొన్ని బుజ్జగింపులు ద్వారా తిరిగి పెనవేసుకున్నా ముందున్నంత ఆప్యాయత ఉండకపోవచ్చు. అసలు ఎంత తొందరగా కలుస్తున్నాయో అంతే తొందరగా తెగిపోతున్నాయి ఈమధ్య కాలంలో బంధాలు. కారణాలు బోలెడు. అభిప్రాయాలు కలవకపోవడం, తమకు కాకుండా మరొకరికి ప్రాధాన్యత ఇవ్వడం, తాము ఎంతో ఆశ పడిన సందర్భం విషయంలో సరైన స్పందన రాకపోవడం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు వాటి తాలూకూ మనిషి స్పందనలు, ప్రతిస్పందనలు మాత్రం ఎమోషన్స్ గా మారిపోయి మనిషిలో ఉన్న ప్రశాంతతను అగ్గిపుల్లతో కాల్చినట్టు ఉండదూ.  ఎందుకీ ఎమోషన్స్ ప్రతి ఎమోషన్ ఎక్కడ ఎలా ఉద్భవిస్తుంది అంటే ఎప్పుడైతే మనిషి దేనిమీద అయినా ఎక్ప్పెక్టేషన్స్ పెట్టుకున్నపుడు. తరువాత కారణం ఆశించినపుడు. ఆ తరువాత కారణం తాను ప్రత్యేకం అనే భావం మనసులో పెట్టుకుని అదే విధంగా అందరూ చూడాలని అనుకోవడం. మనుషుల ప్రశాంతతను చంపే పెద్ద కారణాలు ఇవే. చాలామంది విషయంలో ఇవి ప్రాథమికంగా ఉంటాయి. ఇవి కాకుండా చాలా సహజమైన విషయాలు కూడా ఉంటాయి. చేయాల్సిన పనులు వేళకు చేయలేకపోవడం, కలవాల్సిన వాళ్ళు కలవకుండా వెళ్లిపోవడం, తమకు చెప్పకుండా ఇంట్లో వాళ్ళు ఏదో చేసారని, తమకు తగినంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని. ఇట్లా అన్నిటినీ బుర్ర మీద రుద్దుకోవడం వల్ల ఎమోషన్స్ కాక మరింకేం వస్తాయి. ఎమోషన్ ఈజ్ ఎనిమి నమ్మండి నమ్మకపొండి ఈ ఎమోషన్ అనేది మనిషి జీవితానికి పెద్ద బద్ధ శత్రువు. మనిషిని మెల్లిగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లే భూతం ఇదే. మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసి, జీవితం మీద చాలా ఘోరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంతగా అంటే జీవితం మొత్తం తలకిందులు అయ్యేలా. ఆ తరువాత జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడం ఎంతో కష్టతరమైన పని.  ఎలా అధిగమించాలి?? భూతం అనుకుంటే భూతం, కాదు అదేదో పొగ అని అనుకుని నోటితో ఊదేస్తే మటుమాయం. ఇదంతా కూడా మనిషి మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో గొప్ప పరిపక్వత కలిగిన వాళ్ళు కూడా ఒకోసారి కొన్ని విషయాల పట్ల బలహీనులుగా ఉంటారు. బలహీనతను బలంగా మార్చుకున్నపుడే మనిషి నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు శక్తివంతంగా తయారు అవుతాడు. ఈ ఎమోషన్స్ ను అధిగమించాలంటే మొదట చేయవలసింది ఇతర విషయాలకు అతిగా స్పందించకూడదు. కేవలం కాస్తాడటం, ఏదైనా వందశాతం పూర్తి శ్రద్ధ పెట్టి చేయడం ఇవి మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి అన్ని మనసుకు తీసుకోవడం ఆపేయాలి. ఇక స్నేహితులు,  కొలీగ్స్, ఇతరులు వీళ్ళందరూ కేవలం తెలిసిన వాళ్ళు మాత్రమే. వీళ్ళలో స్నేహితులతో బాండింగ్ ఎక్కువగానే ఉంటుంది కానీ వల్ల నుండి కూడా ఆశించడం అనేది మానుకోవాలి. దీనివల్ల స్నేహితులు అవాయిడ్ చేస్తున్నారనో, ఇతరులు తక్కువ చేస్తున్నారనో ఫీలవ్వాల్సిన  సందర్భం రాదు.  కేవలం తమ పని తాము చేసుకుంటూ పోవడమే పెద్ద పరిష్కారం. ఇతరుల  విషయాలు ఏవీ మనసుకు తీసుకోకుండా ఉంటే ఎమోషన్స్ ను దూరంగా పెట్టేయచ్చు. ఒక్కమాట మాత్రం నిజం. ఎమోషన్స్ ను పెంచుకోకండి. టాబ్లెట్స్ వేసుకోగానే మోషన్స్ తగ్గిపోయినంత సులువు కాదు వాటి తాలూకూ డిప్రెస్ భూతాన్ని తగ్గించడం. ◆ వెంకటేష్ పువ్వాడ

వాల్మికి జీవితాన్ని మార్చేసిన రెండు ప్రశ్నలు ఇవే..!

  భారతీయ ధర్మంలో ఎందరో మహర్షులు, మరెందరో ఋషులు ఉన్నారు.  వారిలో వాల్మికి మహర్షి చాలా ప్రత్యేకమైన వారు.  రామాయణాన్ని రచించిన వాల్మికి మహర్షి ఎంత గొప్పవాడో.. ఆయన జీవితాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అంతే ఆశ్చర్యం వేస్తుంది. ఒక దొంగ ఒక మహర్షిగా ఎలా మారాడు అనే విషయం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా రెండు ప్రశ్నలు వాల్మికిని మహర్షిగా మారడానికి నాందిగా మారాయని చెబుతారు.  అవేంటో తెలుసుకుంటే.. మహర్షి వాల్మికి అసలు పేరు రత్నాకర్.  ఈయనను చిన్నతనంలోనే ఒక వ్యక్తి ఎత్తుకుపోయాడు.  అతను దొంగతనాలు, దోపిడి చేసే వాడు కావడంతో రత్నాకర్ చిన్నతనం వాటి మధ్యనే గడిచింది.  రత్నాకర్ పెరిగి పెద్దవాడు అయ్యాక వివాహం చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.  కుటుంబ పోషణార్థం  అతను కష్టపడకుండా ధనం సంపాదించడం కోసం దొంగతనాలు, దోపిడిలు చేసేవాడు. ఒకరోజు దోపిడి కోసం దారి పక్కన కాపు కాసిన రత్నాకర్ కు నారద మహర్షి ఆ దారిలో వెళుతూ కనిపించాడు.  నారద మహర్షి ఎవరో తెలియని రత్నాకర్ నారదుడి దగ్గర విలువైన వస్తువులున్నాయే అని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే నారదుడు రత్నాకర్ ను రెండు ప్రశ్నలు అడిగాడు.   ఎందుకు దోపిడి చేస్తున్నావు అని అడిగాడు.. కుటుంబ పోషణార్థం దోపిడి చేస్తున్నానని రత్నాకర్ సమాధానం ఇచ్చాడు. ఇలా దోపిడి చేస్తే పాపం వస్తుంది.  కుటుంబ పోషణార్థం ఈ పాపపు పనులు చేస్తున్నావు కదా.. దీని వల్ల నీకు వచ్చే పాపంలో నీ కుటుంబ సభ్యులు కూడా భాగం తీసుకుంటారా అని అడిగాడు. రత్నాకర్ ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులతో దోపిడి కారణంగా తనకు చేకూరే పాపంలో కుటుంబ సభ్యులు కూడా భాగం పంచుకుంటారా అని అడిగాడు. కుటుంబ సభ్యులు ఆ పాపాన్ని భాగం పంచుకోమని స్పష్టంగా చెప్పేశారు. దీంతో రత్నాకర్ కు తను చేస్తున్న పనుల మీద విరక్తి పుట్టింది. తాను చేసిన పాపపు పనులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు. దీనికోసం నారదుడిని ఆశ్రయించాడు. నారదుడు రత్నాకర్ తో రాముడి నామాన్ని జపించమని చెప్పాడు.   ఆ రోజు నుండి రత్నాకర్ రామ నామాన్ని జపిస్తూ కూర్చొన్నాడు. అలా సంవత్సరాల పాటు రామ నామ తపస్సు చేస్తూనే ఉన్నాడు.  ఆయన చుట్టూ చెద పురుగులు పుట్టను కూడా కట్టేశాయి. కానీ ఆయన మాత్రం రామ నామాన్ని ఆపలేదు. రత్నాకర్ తపస్సుకు సంతోషించి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ప్రాయశ్చిత్తం చేకూర్చాడని,  రత్నాకర్ కు మహర్షిగా వరం ఇచ్చాడని కథనం.    తన చుట్టూ పుట్ట ఏర్పడటం ద్వారా  ఈయనకు వాల్మికి అనే పేరు వచ్చిందట.  

మహిళలూ జాగ్రత్త!!

ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన ఆడపిల్ల గురించి దారుణాలు వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ దుర్ఘటన తాలూకూ అనుభవాల నుండి ఏదో ఒక చట్టాన్ని చేస్తూనే ఉంది. ఎన్ని చట్టాలు చేసినా ఆడపిల్లల మీద అమానుష సంఘటనలు మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో గొంతు చించుకొని ఎంత ఆవేదన వెలిబుచ్చినా అదంతా గాలిగీతంలా క్షణానికే మాయమవుతోంది. మరి ఇలాంటప్పుడు ఆడపిల్లలు బయటకు ఎక్కువ వెల్లకపోవడం మంచిదని చాలామంది చెబుతారు. కానీ భవిష్యత్తును వదులుకోవడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది మరి. అయితే అమ్మాయి బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి రావడం అనేది ప్రతి తల్లిదండ్రిలో ప్రతీరోజును ఒక భయానక కాలంగా మార్చేస్తోంది. అలా కాకుండా తమ ఇష్టాలను లక్ష్యాలను  ఏమాత్రం విడిచిపెట్టకుండా, ఇంట్లో వాళ్లకు భరోసా ఇవ్వగలిగే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఎలాంటి చీకు చింతా ఉండవు. దగ్గరగా…. దగ్గరగా….. చదువుకునే పిల్లల నుండి ఉద్యోగం చేసే అమ్మాయిలు, మధ్యవయసు ఆడవాళ్లు ఇలా అందరూ చూసుకోవాల్సిన మొదటి ఎంపిక స్కూల్ లేదా కాలేజి లేదా ఆఫీసు వంటివి దగ్గరలో ఉండేలా వాటికి దగ్గరలో ఇల్లు, లేదా హాస్టల్ చూసుకోవడం. దీనివల్ల అక్కడ కాస్త ఆలస్యం అయినా ఇంటికి చేరుకునే సమయం తక్కువే కాబట్టి పెద్దగా భయపడనవసరం లేదు.  కొంచం టచ్ లో ఉంటే బాగుంటుంది దూరబార ప్రయాణాలు, సిటీ లోనే కాలేజ్ లు, స్నేహితులతో ఎక్కడికైనా దూరం వెళ్లడం వంటి సందర్భాలలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అంతేకాదు రాత్రి పూట తప్పనిసరి అయి ఆటో లు, క్యాబ్ లు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. నమ్మకానికి ఆమడదురం ఈ కాలంలో ఎవరిని నమ్ముతాం పూర్తిగా. కాలమే మారిపోతూ ఉంటుంది అలాంటపుడు మనుషులు మారకుండా ఉంటారా. అలాగని ఎప్పుడూ అనుమానంతో ఉండమని కాదు. అతినమ్మకం ఉండకూడదు అని. కాబట్టి ఎవరిని వారు పూర్తి విమర్శ చేసుకుని అప్పుడు అవతలి వారిని నమ్మాలి. ఏదో మోహమాటానికి పోయి సమస్యలలో చిక్కుకోవద్దు సుమా!! స్వీయ రక్షణే కొండంత భరోసా ఇప్పటికాలం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ వంటి విద్యలు నేర్పడం వల్ల శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా ప్రమాదంలో ఉన్నపుడు అవే కొండంత భరోసా ఇస్తూ తమని తాము కాపాడుకునేలా చేస్తాయి.  అంతే కాదండోయ్ ఆడపిల్లలు ఆటలలో చురుగ్గా ఉంటే వారు ఎంతో దృఢంగా తయారవుతారు. అదే వారికి స్వీయ రక్షణ గా తోడ్పడుతుంది కూడా. డోంట్ టచ్…. ఇప్పట్లో మొబైల్స్ ను చాలా సులువుగా హాక్ చేసేస్తారు. వాటి ద్వారా, బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే కెమెరా ఆక్టివేట్ చేసి అమ్మయిల ఫొటోస్, వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజుతూ పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా  తక్కువగా బయటపడుతుంటాయి. కాబట్టి తెలియని వాళ్లకు ఫోన్ ఇవ్వడం వంటివి చేయకూడదు. ఎవరైనా మీ వస్తువులను ముట్టడానికి ప్రయత్నం చేసినా సున్నితంగా డోంట్ టచ్ అని చెప్పేయండి. ఒకవేళ హెల్పింగ్ నేచర్ ఉన్నా తెలియని వ్యక్తులు అడిగినప్పుడు ఒక చిన్నపాటి కీప్యాడ్ మొబైల్ ఇవ్వడం ఉత్తమం.  సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో చెడు కూడా చేస్తుంది. కాబట్టి తెలివిగా దాన్ని ఉపయోగించుకోగలగాలి. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ లాంటివి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. రాత్రి పూట ప్రయాణాలలో వీలైనంతవరకు నిద్రను అవాయిడ్ చేయాలి. ప్రయాణం చేసి బస్ లేదా ట్రైన్ వంటివి దిగే  సమయానికి ఆయా స్టాప్ లలో కుటుంబసభ్యులు లేదా స్నేహితులు, లేదా చుట్టాలు ఇలా ఎవరో ఒకరు అక్కడికి చేసురుకుని రిసీవ్ చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి.  దేన్నీ నిర్లక్ష్యంగా చూడద్దు. అమ్మాయిలు బయటకు వెళ్లినప్పటి నుండి తిరిగి ఇంటికి చేరుకునేదాకా స్పృహతో ఉండాలి. పరిసరాలను గమనిస్తూ ఉండాలి.  కాలంతో పాటు ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మహిళల విషయంలో సమాజం దిగజారిపోతోంది. కాబట్టి జగరూకత ఎంతైనా అవసరం. ◆ వెంకటేష్ పువ్వాడ

పెళ్ళికి ముందు జంటలు ఈ ఒక్క పని తప్పక చేయాలి..!

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప దశ. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత జీవితం గురించి చాలా మార్పులు స్పష్టంగా ఉంటాయి.  ఊహకు కూడా అందని విధంగా పెళ్లి తరువాత ఇద్దరి వ్యక్తుల జీవితాలకు మార్పులకు లోనవుతాయి.  అంతేకాదు.. పెళ్లికి ముందు ప్రతి జంట మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి.  అవి వివాహం తరువాత ఆర్థిక పరిస్థితులు కావచ్చు,  పిల్లల ప్లానింగ్ కావచ్చు,  పిల్లల భవిష్యత్తు కావచ్చు.. కాబోయే జంట ఎన్నో విషయాలలో ఎలా ఉండాలనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలాగైతే పెట్టుకుని ఉంటారో.. అదే విధంగా  అవి సరిగా జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో కూడా ఉంటారు.  ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఎలా సాగుతుందో.. భాగస్వామి తమతో ఎలా ఉంటారో అనే విషయాలలో కూడా బోలెడు సందేహాలు ఉంటాయి.  అందుకే పెళ్లికి ముందు కాబోయే జంట కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు. అపరిచితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలసి ఒక జంటగా ఏర్పడి జీవితాన్ని కొనసాగించడం బోలెడు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. ఒకరి మీద ఒకరికి ఎన్నో సందేహాలు,  మరెన్నో అంచనాలు ఉంటాయి.  అదే ఇద్దరూ కలసి కౌన్సెలింగ్ తీసుకుంటే భార్యాభర్తల బంధం మీద ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో.. ఏ విషయాన్ని అయినా ఎలా సంభాషించాలో అర్థం అవుతుంది. ఒక బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యునికేషన్ ప్రదానమైనది.  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్  సాగాలంటే ఇద్దరు ఒకరికి ఒకరు గౌరవం ఇవ్వాలి.  ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు శ్రద్దగా వినగలగాలి.   పెళ్లికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల  భార్యాభర్తలు వైవాహిక జీవితంలో తమకున్న అంచనాలను చర్చించుకుని తెలుసుకునే అవకాశం ఉంటుంది.  పెళ్లి తరువాత ఈ అంచనాలకు తగ్గట్టు ఒకరికొకరు సర్దుబాటు కావచ్చు.  జీవితంలో ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి.  ప్రతి ఒక్కరి భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు ఉంటాయి.  పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తీసుకుంటే వీటి గురించి ఇద్దరికీ ఒక అవగాహన వస్తుంది. ఇద్దరూ కలిసి జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. కౌన్సెలర్ ముందు కాబోయే జంట తమ అభిప్రాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు వివరించడం వల్ల కాబోయే జంటకు భవిష్యత్తు గురించి, తాము ఇద్దరూ చేయాల్సిన విషయాల గురించి ఒక అవగాహన వచ్చేస్తుంది. మనసులో ఉన్న చాలా సందేహాలకు అక్కడే సమాధానాలు దొరుకుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబోయే జంటలో ఎవరికైనా ఎవైనా బలహీనతలు,  సమస్యలు, లోపాలు ఉంటే వాటిని కౌన్సిలింగ్ లో బయట పెట్టడం ద్వారా భాగస్వామి తోడు, భరోసాను పెళ్లికి ముందే స్పష్టం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తరువాత కొన్ని భయాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత,  వైవాహిక జీవితంలో సంతోషం సాధ్యమవుతుంది.                                               *రూపశ్రీ.

పరులకు ఉపకారం చెయ్యడం ఎందుకంత గొప్ప??

జీవితాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. అన్నీ సానుకూలంగా అమరిన భద్రమైన జీవితాలు చాలామందికి అసాధ్యం. అలాంటి వారి సమస్యల్లో 1ఏ ఒక్కటైనా మనం తీర్చే ప్రయత్నం చేసినప్పుడే మనకు అసలైన ఆత్మసంతృప్తి లభిస్తుంది. కళాశాలలో చదువుకునే రోజుల్లో, తన తోటి విద్యార్థులకు ఫీజు డబ్బులు లేనప్పుడు స్వామి వివేకానంద తనే ముందుండి ఆ సమస్యను తీర్చేవారు. ఎదుటి వారి ఏ చిన్న కష్టాన్నైనా తనదిగానే భావించి తపించిపోయేవారు. మరొకరి కాలికి ముల్లు గుచ్చుకుంటే, తన కంటిలో గుచ్చుకున్నంత విలవిల్లాడిపోయేవారు. అందుకే ఆయన మహానుభావులయ్యారు. ఇప్పటికీ కొంతమంది యువతీ యువకులు తమ జీతంలో కొంత మిగుల్చుకొని, అనాథలకు, అభాగ్యులకు సహాయపడుతూ ఉంటారు. తమ సరదాలను కొన్నింటిని త్యాగం చేసుకొని, అవసరమైన చిన్నారులకు, ఆర్తులకు పంచుతూ ఉంటారు. వారు నిజంగా అభినందనీయులు, ధన్యులు! ఇలాంటి పునాదిరాళ్ళయిన యువతరంపైనే నవసమాజం నిర్మాణమవుతుంది. ఆధారం లేక అలమటించే వారికి ఏ కొంత చేయూతనిచ్చి, వారి ముఖాన చిరునవ్వులు చిందింపజేసినా అది మంచి మనస్సులకు చిరాయువు నిస్తుంది. అందుకే రాల్ఫ్ వాడో ఎమర్సన్ Make yourself necessary to somebody' అంటారు. మనకున్నదాన్ని ఒకరితో పంచుకోవడానికి, మనస్సు ముందు కాస్త గింజుకుంటుంది. అయినా ఇవ్వడంలోని ఆనందాన్ని మనస్సుకు అలవాటు చేయాలి. ఆనక అది పొందే ఉల్లాసాన్ని అనుభూతి చెందమనాలి.    ఊపిరున్నప్పుడే ఇచ్ఛగా నీవు ఇవ్వగలిగినంతా ఇచ్చేయ్. ఇవ్వలేనని పిడికిట్లో దాచుకొని కూర్చుంటే, మృత్యువు బలవంతంగా నీ మణికట్టు పట్టుకొని పిడికిలి విడిపించి మరీ ఇప్పించేస్తుంది అంటోంది దివ్య ఖురాన్, ఇలా బాధగా ఇవ్వడం కన్నా ఇష్టంతో ముందే నలుగురికి పంచి ఇవ్వడంలో ఎంతో ఆనందం దాగి ఉంటుంది. ఒకరి నుంచి మనం ఏదైనా స్వీకరిస్తున్నప్పటి కన్నా, ఒకరికి మనం ఇస్తున్నప్పుడే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆనందం కలుగుతాయని.. ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఒకరికి ఇవ్వకుండా, తామొక్కరే దాచుకొని తినే అలవాటు భవిష్యత్తులో ఒక రకమైన మానసిక వ్యాధికి కూడా దారితీస్తుందని వైద్యులు తమ పరిశీలనలో తేల్చారు. మన మనుగడలో విలువైన, చెప్పుకోదగ్గ సందర్భాలు, గుర్తుచేసుకొని గర్వపడే సంఘటనలు ఏవైనా ఉన్నాయంటే, అవి కేవలం ఇతరులకు మనం సహాయపడ్డ క్షణాలే! భగవంతుడు కూడా పరిగణనలోకి తీసుకునేది ఆ మంచి పనుల్నే! అయితే మితిమీరుతున్న మన ఆశలు దేనినీ వదులుకోనీయడం లేదు. కాస్త కూర మిగిలినా ఫ్రిజ్లో పెట్టుకొని రేపు తిందామనీ, పాతబట్టలుంటే స్టీల్ సామగ్రికి మార్చుకుందామనేంత కక్కుర్తికి దారితీస్తున్నాయి. ఇలాంటి ధోరణి మనల్నే కాదు, ఇంట్లో మనల్ని గమనిస్తున్న చిన్నారులను కూడా సంకుచిత స్వభావులుగా మార్చేస్తుంది. మనకు సరిపడ్డాకనైనా ఇతరులకు ఇద్దామన్న దయాగుణం, పరోపకార తత్త్వం మనకు లేకపోతే మనల్ని చూసి మూగజీవాలు కూడా తలదించుకుంటాయి. మన సనాతన ధర్మం పరోపకారానికి ప్రముఖమైన స్థానాన్ని కల్పిస్తూ...  పరోపకారః కర్తవ్యః ప్రాణై రపి ధనై రపి|  పరోపకారం పుణ్యం న స్యా త్రతు శతై రపి ॥  'కష్టపడి సంపాదించిన ధనమిచ్చి అయినా, చివరకు ప్రాణమిచ్చి అయినా పరోపకారం చేయాలి. నూరుయజ్ఞాల వల్ల కలిగే పుణ్యం కూడా పరోపకారంతో సమానం కాదు'అని హితవు పలుకుతోంది.                                       *నిశ్శబ్ద.

మీ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ మూడు చిట్కాలు ఫాలో అవ్వండి!

ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాం. మొదలు పెట్టిన పని సగంలోనే ఆగిపోతోంది. లేదంటే అసంపూర్తిగా మిగులుతుంది. అయితే చాణక్యుడు తన చాణక్యనీతిలో కష్టమైన పనిని సులభం చేసేందుకు మూడు చిట్కాలను పేర్కొన్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో ఒక వ్యక్తి తను చర్యలకు అనుగుణంగా మంచి, చెడు ఫలితాలను అనుభవిస్తాడని తెలిపారు. మానవసంబంధాల గురించి కొన్ని ముఖ్యవిషయాలను ప్రస్తావించారు. జీవితంలో కొన్ని ఆలోచణల గురించి పేర్కొన్నారు. మనం చివరి శ్వాసతీసుకునే వరకు మనల్ని ఆలోచనలు విడిచిపెట్టవు. ఆ ఆలోచనలు ఒకవ్యక్తి తనకు వచ్చిన కష్టమైన పనిని సులభంగా పూర్తిచేయగలడు. మన పనులు చాలా సులువుగా పూర్తిచేసేందుకు చాణక్యుడ చేసిన సింపుల్ టిప్స్ తెలుసుకుందాం. 1. జ్ఞానం:  జ్ఞానం అనేది కఠినమైన గోడను ఛేదించి విజయాన్ని సాధించే ఆయుధం వంటిది. జ్ఞానాన్ని మించిన స్నేహితుడు మరొకరు లేరు.  తెలివైన వ్యక్తి తన పనులన్నింటినీ సులభంగా పూర్తి చేస్తాడు. జ్ఞానం ఉన్న వ్యక్తికి తను చేసే పని ఒప్పో, తప్పో తెలుసు. దాని ఆధారంగా తన పని తాను చేసుకుంటాడు. 2. విజయం గౌరవానికి చిహ్నం: జ్ఞానం ఒక వ్యక్తి  విజయానికి దారితీసినట్లే, విజయం కూడా వ్యక్తి  గౌరవానికి ప్రధాన కారణమవుతుంది. అలాంటి గౌరవం మీ జీవితాంతం మీతోనే ఉంటుంది. అంటే, జ్ఞానం నుండి పొందిన విజయం ఎప్పుడూ లోపించదు. 3. మతం: డబ్బు కంటే మతం గొప్పదని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. మతం మనిషిని జీవితంలోనే కాదు, మరణానంతరం కూడా వదిలిపెట్టదని తన చాణక్య నీతిలో పేర్కొన్నారు. మన మతాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ఒక వ్యక్తి మతానికి కట్టుబడి ఉండటమే అతని విజయానికి కారణమని చెప్పాడు. ఎంత పెద్ద కార్యమైనా భక్తిశ్రద్ధలతో పనిచేస్తే అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ధర్మాన్ని అనుసరించి దాని మార్గంలో నడిచేవాడు పుణ్యఫలాలను పొందుతాడు. ధర్మాన్ని అనుసరించేవాడు ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పినట్లుగా పై మూడు ఆలోచనలను మనసులో ఉంచుకుని ఆ ప్రకారం నడుచుకుంటే ఎంత పెద్ద వారైనా నిస్సందేహంగా వాటన్నింటిని తొలగిస్తాడు. అతని ముందు ఎంత పెద్ద పని వచ్చినా అతను ఎదుర్కొనే సమస్య. వీటిని మనం నిత్య జీవితంలో పాటించడం చాలా ముఖ్యం.

లక్ష్మీ రావే మా ఇంటికి!

లక్ష్మీ అంటే మహావిష్ణువు భార్య, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపదలుంటాయి. ఆమె వెళ్లే ప్రతి చోట డబ్బు తిరగడుతూ ఉంటుంది. అందుకే పెద్దలు ఆంటారు డబ్బును, లకహ్మి దేవిని వేరు వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తారు. డబ్బు అంటే లక్ష్మీదేవినే అని అంటారు. డబ్బు దగ్గరుంటే ఈ కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కమర్షియల్ జీవితాల ప్రపంచంలో డబ్బు లేకుండా బతకడం కష్టమే కదా!! కాదని కొందరు వాదించవచ్చు. కానీ ఇలా బతకడం అలవాటు పడిపోయిన మనిషికి డబ్బు లేకపోతే ఏమీ తోచదు. అందరికీ మనసులో ఉంటుంది బోలెడు డబ్బు దగ్గరుండాలని. ఆ డబ్బుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎన్నో నచ్చినవి, అవసరమైనవి తీసుకోవాలని. కొన్ని కలలను తీర్చుకోవాలని. కానీ డబ్బులు ఏమీ చెట్లకు కాయవు కదా!! మరి డబ్బు మనదగ్గరకు ఎలా వస్తుంది?? కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడం లేదని, కష్టానికి తెగగా ఫలితం లేదని చెప్పేవాళ్ళ కోసం కొన్ని డబ్బులు చేతిలో ఒడిసిపట్టే చిట్కాలు!! అనవసరపు ఆడంబరాలు వద్దు!! కొన్ని విషయాల్లో పిసినారితనంగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది. కొన్నిసార్లు లేనిపోని మోహమాటాలతో కొన్ని ఆడంబరాలు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాలను సున్నితంగా ఏదో ఒక పని చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ రూపాయి కూడా చెయ్యి చాచి ఇచ్చేవాళ్ళు లేరండి. సగటు మధ్య మరియు దిగువ తరగతి మనిషికి ఆడంబరాలు నెత్తిమీద కొండంత బరువులా ఉంటాయి.  సింప్లిసిటీ!! నిజం చెప్పాలంటే ఈ సింప్లిసిటీ మనిషిని కమర్షియల్ గా ఎదిగేలా చేస్తుంది. ప్రతిదాంట్లో అతిగా ఉండకపోవడం ఎన్నో ఖర్చులను అవుతుంది. కట్టు బొట్టు నుండి, తిండి విషయం వరకు. వాడే వస్తువుల నుండి ఎక్పెక్ట్ చేయడం వరకు అన్నింటిలోనూ సింప్లిసిటీ ఉన్నవాళ్లు ఖర్చుపెట్టడంలో కూడా అనవసరమైన వాటికి సున్నితంగా దూరం వెళ్ళిపోతారు. పొదుపు సూత్రాలు!! నిజానికి పొదుపు అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలసి చేసే ప్లాన్. అయితే ఒక రిలేషన్ లోకి వెళ్లే ముందు నుంచే పొదుపు ప్లాన్ చేయడం వల్ల రిలేషన్ తరువాత చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతకాలంలో పని చేయకుండా ఇంటిదగ్గరే ఉండే ఆడవాళ్లు చాలా తక్కువ. కాబట్టి పొదుపు చేయడం కూడా సులభమే. నిజానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే పొదుపు విషయంలో ముందుంటారు. అయితే ఆడవాళ్లు చేసే ఖర్చుల గురించి మాత్రం మాట్లాడకూడదు సుమా!! ఇన్వెస్ట్మెంట్!! చాలామంది బంగారం కొనడం, భూములు కొనడం ద్వారా తమ డబ్బును పెంచుకుంటారు. బంగారం, భూములు ఈ వేగవంతమైన కాలంలో అవి కూడా వేగంగా తమ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. బంగారం కేవలం పెట్టుకోవడానికి మాత్రమే కాదు ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక భూములు కూడా క్రమంగా ధర పెరిగేవే. అపార్టుమెంట్లు తప్ప గతిలేని ఈ కాలంలో భూములు బంగారం పండించకపోయినా డబ్బులను పుష్కలంగా సమకూరుస్తాయి. వ్యాపారాలు!! ప్రజలు ఎక్కువగా ఆధారపడే ఏ విధమైన వ్యాపారం అయినా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సంపాదించడానికే తమ సమయాన్ని వినియోగిస్తూ కనీసం వండుకోలేని మనుషులున్న కాలంలో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో మంచి రాబడి పొందుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆడవాళ్లు అయితే తమకు రుచికరంగా వండటం వస్తే ఏదైనా బిజినెస్ గా మార్చేయచ్చు. రుచి దొరకక జనాలు చచ్చిపోతున్నారండి బాబు.  పైన చెప్పుకున్నట్టు కొన్ని పాటిస్తే లక్ష్మీ రావే మా ఇంటికి అని మరీ బతిమలాల్సిన అవసరం లేదు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

యుద్దాలకు, ఘర్షణలకు ముగింపు పలకాలంటే ఇదే మార్గం..

  ఇద్దరు వ్యక్తులు, రెండుకుటుంబాలు, ఇరుగు పొరుగు, గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు ఇలా ఏ రెండింటిని గమనించినా ఖచ్చితంగా ఏదో ఒక అభిప్రాయ భేదం, లేదా ఏదో ఒక అపార్థం ఉండనే ఉంటుంది. ఈ అపార్థాలు సహజంగా సమసిపోతే సమస్యే లేదు. కానీ అవి కాస్తా క్రమంగా పెద్ద సమస్యలుగా మారితే అన్ని రకాల నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇద్దరు మనుషుల మధ్య సంఘర్షణ మితిమీరితే అది ఘర్షణకు దారితీసినట్టు, రెండు ప్రాంతాలు, దేశాలు మధ్య సంఘర్షణ పెరిగితే అది యుద్దాలకు దారితీస్తుంది.  మొన్నటిదాకా జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్దమైనా, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దమైనా దీనికి ప్రధాన కారణం సంఘర్షణే. సమస్యలను ఆరోగ్యకరమైన రీతిలో పరిష్కరించుకుంటే  అవి నష్టాలకు దారితీయకుండా సమసిపోతాయి. ఆరోగ్యకరమైన పరిష్కారాలకు ఎప్పుడూ శాంతి అవసరం అవుతుంది. శాంతి ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన సంఘర్షణ పరిష్కార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రాముఖ్యత, దీని చరిత్ర, దీని వెనుక కృషి మొదలైన విషయాలు తెలుసుకుంటే.. చరిత్రలో ఏముంది? సంఘర్షణ పరిష్కార దినోత్సవం అనేది శాంతి మార్గంలో సంఘర్షణలను పరిష్కరించే దిశగా అవగాహన పెంపొందించడం. దీన్ని ప్రపంచం యావత్తు జరుపుకుంటారు. అసోసియేషన్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్  రిజల్యూషన్ దీన్ని 2005లో స్థాపించింది. దీని ప్రధానఉద్దేశం  సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా అహింసా మార్గంలో పరిష్కరించడం. ఈ పద్దతుల మీద అవగాహన పెంచడం. పాఠశాలలు, కార్యాలయాలు, న్యాయవ్యవస్థ, కుటుంబం మొదలైన సాధారాణ జీవనశైలిలో కూడా దీన్ని భాగం చేయడం. కూర్చుని, మెల్లగా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయనే మాట చాలామంది వినే ఉంటారు. అదే దీనికి అన్వయించవచ్చు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతియుతంగా సమస్యలను పరిష్కరిస్తే ఈ ప్రపంచంలో ఎన్నో పెనుముప్పులను ఆపవచ్చు. ఈ ఆలోచనతోనే మహాత్మాగాంధీ, మేరీ క్యూరీ, హోరేస్ మాన్, డోలోరెస్ హూర్టా వంటి మహోన్నత వ్యక్తులు  అహింసా మార్గంలో సమస్యల పరిష్కారానికై  తమ జీవితాన్ని వెచ్చించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఈ తరహా మార్గం వైపు ప్రజలను ప్రోత్సహించడం, తాము ఆ మార్గంలో ప్రయాణిస్తూ ప్రజలను నడిపించడం ఎంతో అవసరం. ఏం చేయొచ్చు.. సమస్య దేశాల మధ్యా, లేదా మనుషుల మధ్య అనే విషయం కాదు. తమకు దగ్గరలో ఎవరైనా హింసా పద్దతిలో వెళుతుంటే వీలైనవరకు వారి సమస్యను పరిష్కరించడం ద్వారా పెద్దగొడవనే అపవచ్చు. మా సమస్య మాది నీకెందుకు అని చెప్పేవారు కొందరు ఉంటారు. అలాంటి వారికి తమ కుటుంబ సభ్యుల నుండి తమ పిల్లల వరకు ఆయా గొడవల వల్ల కలిగే నష్టం, మానసికంగా ఏర్పడే అభిప్రాయాలు ఎలాంటివో తెలియజెప్పాలి. సామాజిక విషయాలను ఎప్పుడూ వ్యక్తిగత అంశాలలోకి తీసుకుని అర్థం చేసుకోకూడదు. వ్యక్తిగత కోపాలు,  గొడవలు ఏమున్నా వాటిని సమాజం మీద రుద్దకూడదు. దీనివల్ల సమాజం మీద ప్రభావం పడుతుంది. ఎంతో కొంత సమాజంలో నివసించే పౌరులకు కూడా నష్టం కలుగుతుంది. అహింస అనేది నాలుగు వ్యాసాలు, రెండు పుస్తకాలు, పది స్పీచ్ లు వింటే అలవాటు అయ్యేది కాదు. ఆలోచిస్తే వచ్చేది. శాంతి ద్వారానే అహింస స్వభావం మనిషిలో అలవడుతుంది. కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రేమ, జాలి, దయ వంటి గుణాలు శాంత స్వభావాన్ని పెంచుతాయి. కోపం, ద్వేషం, అహంకారం, అసూయ వంటి గుణాలకు దూరంగా ఉండాలి.                                                       నిశ్శబ్ద.

నిన్ను నువ్వే రక్షించుకోవాలంటాడు చాణక్యుడు..!!

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. అతని జ్ఞానం, సామర్థ్యాలు భారతదేశ చరిత్రను మార్చాయి. మానవుల సంక్షేమం కోసం తన విధానంలో ఎన్నో ఆలోచనలను ఇచ్చారు చాణక్యుడు.  అవి నేటికీ ప్రసిద్ధి చెందాయి. మీరు ఈ సూత్రాలను పాటించినట్లయితే మిమ్మల్ని విజయాల మెట్లు ఎక్కకుండా ఎవరూ ఆపలేరు. అంతే కాదు, వారి సూత్రాలను అవలంబించడం ద్వారా మనం రోజువారీ జీవితంలో జరుగుతున్న అన్ని కష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవడానికి చాణక్యుడి ఎలాంటి సూత్రాలు పాటించాలి..? మీ ప్రసంగం మధురంగా ఉండాలి: చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, ప్రసంగం మధురంగా ఉండే వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. కఠినమైన మాటలు మాట్లాడే వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమే అంటాడు చాణక్యుడు. డబ్బును ఎప్పుడూ విస్మరించవద్దు: చాణక్యుడి విధానం ప్రకారం, ఏ వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పకూడదు. మీరు చాలా డబ్బు సంపాదించి ఉంటే లేదా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అలాంటి ఆలోచనలను మీలో ఉంచుకోండి. పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు. ఇది మీకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ తప్పు చేయవద్దు: మీరనుకున్న విజయాలను సాధించాలంటే...మీ ప్రణాళికల గురించి ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలని చెబుతాడు చాణక్యుడు.  ఎందుకంటే మీరు మీ ప్లాన్ గురించి ఎవరికైనా చెబితే, వారు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల మీరు విజయవంతం కాకపోవచ్చు. ఎల్లప్పుడూ ఓపికతో పని చేయండి: ఏది జరిగినా సహనం కోల్పోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, వారు ఎల్లప్పుడూ తమ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. మనం ఏమీ చేయలేము అని అనుకుంటే అది మన వల్ల జరగదు. ఈ పనిని మనం చేయగలమనే పాజిటివ్ ఆలోచనతో మొదలు పెడితే...ఈ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎక్కువ ఖర్చు పెట్టకండి: చాణక్య విధానం ప్రకారం, ప్రతి వ్యక్తి డబ్బును పొదుపు చేయాలి. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో, డబ్బు మీ గొప్ప మిత్రుడిగా పనిచేస్తుంది. చేతిలో డబ్బు ఉందని ఫిర్యాదు చేసే బదులు వీలైనంత ఎక్కువ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి.

కుటుంబం ఇలా ఉంటే ఆ ఇంటి పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారట..!

  జీవితంలో ప్రతి వ్యక్తికి కుటుంబం చాలా కీలకం. మనిషికి కుటుంబం ఆర్థికంగానే కాదు.. వ్యక్తిత్వ పరంగా,  విలువల పరంగా చాలా నేర్పుతుంది. కుటుంబం గురించి, కుటుంబం ఎలా ఉంటే పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారు అనే విషయం గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు.  సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు.  దీని గురించి తెలుసుకుంటే.. 'మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసఞ్చితం'              దమ్పత్యేః కల్హో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః । ఒక ఇంట్లో మూర్ఖులను గౌరవించడం కంటే ఆ ఇంట్లో మంచి వారిని,  మంచి గుణం కలిగిన వారిని గౌరవిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట. ఇలాంటి కుటుంబంలో ఉన్న వారు జీవితంలో అబివృద్ది చెందుతారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా ఏమన్నారంటే.. యస్య పుత్రో వశిభూతో భార్యా ఛన్దానుగామినీ । విభవే యశ్చ సతాంసతస్య స్వర్గం . చాణక్య నీతిలో పొందుపరిచిన ఈ శ్లోకం ప్రకారం..  ఎవరి కొడుకు అయితే నియంత్రణలో ఉంటాడో.. ఏ ఇంట్లో అయితే మహిళలు కూడా తమ కోరిక,అభివృద్ది మేరకు విద్య, ఉద్యోగం విషయాలలో ఉండగలుగుతుందో,  ఏ ఇంట్లో అయితే తాము సంపాదించుకున్న డబ్బుతో తృప్చిగా ఉంటారో.. అలాంటి కుటుంబంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. అలాంటి ఇళ్లలోనే ఆనందం కూడా ఉంటుందట. తే పుత్రా యే పితుర్భక్తాః సా పితా యస్తు నూత్రికాః । తన్మిత్రం యస్య విశ్వాసః స భార్యా యత్ర నిర్వృత్తిః । చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటారో.. ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట పాటిస్తారో ఆ ఇంటి పెద్ద ఎప్పడూ సంతోషంగా ఉంటాడట. తండ్రి మాటను పాటించే కుటుంబం ఎప్పుడూ ఆనందంతో,  సంతోషంతో ఉంటుందట. నీతిజ్ఞః శీలమ్పన్నా భవన్తి, కులపూజితః. బాల్యంలో చదివిన విద్యను బట్టి పిల్లలు అభివృద్ధి చెందుతారని చాణక్య నీతిలోని ఈ శ్లోకం అర్థం.  అందుకే పిల్లలకు చిన్నతనంలోనే మంచిదారిలో తీసుకువెళ్లాలి.  వారికి మంచి చెడుల గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే చెప్పాలి.  అలాంటి పిల్లలు పెద్దయ్యే కొద్ది ఉత్తమ పౌరులుగా అబివృద్ది పథంలో దూసుకుపోతారు.                         *రూపశ్రీ.  

గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేస్తుంటారా? ఈ నిజాలు  తెలుసా?

సిట్టింగ్ వర్క్ ఈ కాలంలో చాలా సాధారణం.  ప్రతి ఒక్క చోట ప్రతి పనికి కంప్యూటర్లు ఉపయోగిస్తున్న కారణంగా అధిక శాతం మంది సిట్టింగ్ వర్క్ మోడ్ లోనే ఉంటారు. కేవలం కార్పోరేట్ ఆఫీసులు,  సంస్థలలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు,  ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులలో కూడా ఇదే విధానమే ఎక్కువగా ఉంటోంది.  అయితే ఇలా సిట్టింగ్ పొజిషన్లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఏం జరుగుతుందో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పని చేయడం అంటే అనారోగ్యాలకు వెల్కమ్ చెబుతున్నట్టేనట.  ఇది శరీరం పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే.. మెడ నొప్పి.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే వెన్ను పాముపై ఒత్తిడి పడుతుంది.  ఇది కాస్తా వెన్నునొప్పికి,  మెడ నొప్పికి దారితీస్తుంది. భుజాలు.. చాలామంది భుజాలు బిగుసుకుపోయినట్టు ఉన్నాయని ఫిర్యాదు చేస్తుంటారు.  సిట్టింగ్ వర్క్ ఎక్కువ చేసే వారి నుండే ఈ ఫిర్యాదు ఎక్కువ ఉండటం కూడా గమనించవచ్చు. మొదట్లో భుజాలు బిగుసుకుపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినా సిట్టింగ్ వర్క్ బాగా అలవాటు అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ  ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది శాశ్వత సమస్యగా మారుతుంది. ఊబకాయం.. ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల మనిషి శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి.  ముఖ్యంగా ఆఫీసు సమయాలలో ఆహారం తీసుకున్న తరువాత వెంటనే కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో కేలరీలు ఎక్కువగా పేరుకుపోయి  బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది కాస్తా కాలక్రమంలో ఊబకాయానికి కారణమవుతుంది. టెన్షన్.. ఎక్కువసేపు సిట్టింగ్ వర్క్ చేసేవారిలో మానసిక ఒత్తిడి సమస్య వస్తుంది.  ఇది క్రమంగా టెన్షన్ కు దారితీస్తుంది.  ఈ కారణం వల్లనే సిట్టింగ్ వర్క్ చేసే చాలామందిలో  టెన్షన్ ఎక్కువగా ఉండటం గమనిస్తుంటాం. పరిష్కారాలు.. సిట్టింగ్ వర్క్ ఎక్కువగా చేసేవారు తమ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండకూడదు అంటే పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు  తీసుకోవడం వల్ల పని నుండి రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీర కదలికలకు కూడా అవకాశం ఉంటుంది.  చిన్న విరామం సమయంలో ఆఫీసు లేదా ఇంట్లో అయినా కనీసం ఒక వంద అడుగులు అయినా నడుస్తుండాలి.  బాత్రూమ్ కు వెళ్లి రావడం, మంచి నీరు తెచ్చుకుని తాగడం, ఏదైనా సందేహం కారణంతో దూరంగా ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్ళి రావడం వంటివి చేయవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ సేపు వర్క్ చేసేవారు తాము కుర్చునే కుర్చీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు 7 నుండి 8 గంటల సేపు కూర్చుని వర్క్ చేస్తుంటారు కాబట్టి మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి.  నడుము, వీపు, భుజాలు, మెడ మొదలైన వాటికి సపోర్ట్ ఉండేలా ఉన్న కుర్చీ ఎంచుకుంటే చాలా వరకు శరీర సమస్యలను అధిగమించవచ్చు.                                                        *రూపశ్రీ.

మూగజీవాల మనుగడ కోసం మానవుడి స్వరం..

    ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.

గాంధీజి చేసిన ఈ ఉద్యమాలు చూసి బ్రిటీష్ ప్రభుత్వం భయపడిందట..!

    మహాత్మాగాంధీ పేరు చెప్పగానే చిన్న పిల్లలు కూడా జాతిపిత అని పిలుస్తారు. గాంధీ ఫొటో కానీ గాంధీ గురించి ఉపన్యాసం కానీ లేకుండా ఏ జాతీయ పండుగ ముగియదు. ఇక అక్టోబర్ 2న వచ్చే గాంధీ జయంతిని జరుపుకోవడం తప్పనిసరి.  అయితే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం చేసిన 40 ఏళ్ల పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రధాన ఉద్యమాలకు న్యాయకత్వం వహించారు. ఈ ఉద్యమాలు బ్రిటీష్ పాలకులను, బ్రిటీష్ ప్రభుత్వాలను భయపెట్టడమే కాకుండా భారతదేశంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానలు బలోపేతం చేసిన ఈ ఉద్యమాలు ఏంటంటే.. సత్యాగ్రహం.. 1906 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షా పూరిత విధానాలకు వ్యతిరేకంగా గాంధీజి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. చంపారన్ ఉద్యమం.. 1917లో బీహార్ లోని చంపారన్ రైతుల దోపిడీకి, నీలిమందు విధానానికి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఖేడా సత్యాగ్రహం.. 1918లో బ్రిటీష్ ప్రభుత్వం పన్ను వసూలుకు వ్యతిరేకంగా గుజరాజ్ లో గాంధీజి రైతుల ఉద్యమానికి న్యాయకత్వం వహించారు. దీన్నే ఖేడా సత్యాగ్రహం అంటారు. స్వదేశీ ఉద్యమం.. గాంధీజి స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టి దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇది 1920 లో జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం.. 1920-22 సంవత్సరాలలో మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. చౌరీ చౌరా.. 1922లో చౌరీచౌరా హింసాత్మక సంఘటన చోటుచేసుకుంది.  దీని కారణంగా గాంధీజి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముగించారు. ఉప్పు సత్యాగ్రహం.. 1930లో బ్రిటీష్ ప్రభుత్వం ఉప్పు పన్ను విధించింది.  దీనికి వ్యతిరేకంగా గాంధీజి దండిలో పాదయాత్ర చేసి ఉప్పు తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు.   శాసనోల్లంఘన ఉద్యమం.. 1930 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి దాని నిబంధనలను పాటించక పోవడం,  పికెటింగ్ ప్రదర్శన, సమ్మెలు చేయడం వంటివి చేశారు. ఇవన్నీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగాయి. దళిత ఉద్యమం.. మహాత్మా గాంధీ దేశంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమాన్ని 1933లో చేపట్టారు. క్విట్ ఇండియా.. 1942లో బ్రిటీష్ పాలనను అంతం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని గాంధీజి 1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.                                                  *రూపశ్రీ.  

పిల్లలు సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు  ఈ విషయాలలో ప్రవర్తన మార్చుకోవాలి..!

పిల్లల పెంపకం ఓ కళ అని అంటారు.  చాలా మంది పిల్లల పెంపకం విషయంలో ఫెయిల్ అవుతుంటారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను జాగ్రత్తగానే పెంచుతుంటాం అని అనుకుంటారు. కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యి వారు బాధ్యతగా మారాల్సిన సమయంలో వారి ప్రవర్తనలో ఉన్న తప్పొప్పులు తల్లిదండ్రుల దృష్టిలో పడుతుంటాయి.  కాలం గడిచిపోయాక పిల్లలను మార్చాలన్నా మార్చలేరు.  పిల్లలు చిన్నతనం నుండే సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. అలా చేస్తే పిల్లలు మంచి విలువలతో పెరుగుతారు. చాలా వరకు పిల్లలు తల్లిదండ్రుల నుండే అన్నీ నేర్చుకుంటారు.  వారికి ఇల్లే తొలి బడి అవుతుంది. తల్లిదండ్రులే మొదటి గురువులు,  మొదటి రోల్ మోడల్స్  అవుతారు.  అందుకే  తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. దయ.. తల్లిదండ్రులు ఆధిపత్య దోరణి వదులుకోవాలి.  పిల్లల పట్ల అయినా, బయటి వ్యక్తుల పట్ల అయినా ఆధిపత్య ధోరణిలో ఉండటం మంచిది కాదు.  తల్లిదండ్రులు ఆధిపత్య ధోరణిలో ఉంటే పిల్లలు కూడా దాన్నే అలవర్చుకుంటారు.   అందుకే ఆధిపత్య ధోరణికి బదులు ఇతరుల ముందు దయతో మాట్లాడాలి. ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి. ఇతరులకు సహాయం చేయాలి.  పిల్లలు కూడా ఇవే అలవాటు చేసుకుంటారు. షేరింగ్.. తమకు ఉన్నదాన్ని ఇతరులకు పంచడం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాల్సిన ముఖ్య లక్షణం. కుటుంబ సభ్యులతో అయినా,  బయటివారితో అయినా  షేరింగ్ అనే అలవాటు ఫాలో అవుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. లేకపోతే పిల్లలు కుటుంబం,  పాఠశాల నుండి పెద్దయ్యే కొద్దీ ఎవరికీ ఏమీ పంచుకోవడం అనేది లేకుండా స్వార్థంగా తయారవుతారు. ఇది వారి జీవితానికి చాలా నష్టం చేకూరుస్తుంది. అందుకే తల్లిదండ్రులు షేరింగ్ ను అలవాటు చేసుకోవడం ద్వారా పిల్లలకు కూడా దాన్ని అలవాటు చెయ్యాలి. ఎమోషన్స్.. తల్లిదండ్రులు కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి భావోద్వేగాలను వదిలేయాలి.  పిల్లల ముందు వీటిని ఎప్పుడూ బయట పెట్టకూడదు. భావోద్వేగాలను ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు బయటపెట్టకుండా వాటిని నియంత్రించుకుంటూ ఉంటే పిల్లలు కూడా భావోద్వేగాల పట్ల నియంత్రణలో ఉండగలుగుతారు.   భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల వారి జీవితంలో చాలా విషయాలు సవ్యంగా సాగిపోతాయి.   వినడం.. తల్లిదండ్రులు పిల్లలు అయినా, ఇతరులు అయినా చెప్పేది శ్రద్దగా,  ఓపికతో వినాలి. అలా వింటూంటే పిల్లలు కూడా ఏ విషయాన్ని అయినా శ్రద్దగా వినడాన్ని అలవాటు చేసుకుంటారు.  లేకపోతే తనకు అవసరమైనది, తాను చెప్పాలనుకున్న విషయం పట్ల మాత్రమే పిల్లలు దృష్టి పెడతారు.  ఇది పిల్లలకు మంచిది కాదు. థాంక్స్.. ఇతరులకు కృతజ్ఞత చెప్పడం చాలా గొప్ప గుణం.  చిన్న సహాయం అయినా, పెద్ద సహాయం అయినా ఎదుటివారికి కృతజ్ఞత చెప్పడం వల్ల పిల్లలు కూడా దాన్నే అలవాటు చేసుకుంటారు.  ఇది వారిలో గొప్ప విలువలు పెంచుతుంది.                                                    *రూపశ్రీ.

పనిభారం వల్ల అలసిపోతున్నారా...ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి!

  పనులు మనిషి జీవనశైలిలో భాగం. ఇంటి వద్ద అయినా, బయటకు వెళ్లి అయినా,  వృత్తిలో భాగంగా అయినా ప్రతి ఒక్కరూ పనులు చేసుకుంటారు. ఈ రోజుల్లో విద్య,  ఉద్యోగం,  ఇంటి పనులు, వ్యాపారం.. ఇలా ప్రతి ఒక విషయంలోనూ ఒత్తిడి అనేది సర్వ సాధారణం అయిపోయింది.  ఈ ఒత్తిడి కారణంగా చాలామంది డిప్రెషన్, యాంగ్జిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  పని భారం తగ్గితే ఆటోమేటిక్ గా ఒత్తిడి కూడా తగ్గుతుంది.  ఇది మానసిక సమస్యల నుండి బయట పడటంలో సహాయపడుతుంది.  కొన్ని సింపుల్ టిప్స్ తో పనిభారాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. పనిని సమయానికి పూర్తీ చేస్తే.. పనిని సమయానికి పూర్తీ చేస్తే ఎలాంటి భారం ఉండదు. అదే పనిని వాయిదా వేసినా ఆలస్యంగా చేసినా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇతర కార్యకలాపాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.  ఇవన్నీ కలసి రోజును చాలా గందరగోళం చేస్తాయి. అందుకే ఏ పనిని అయినా ఒక నిర్ణీత సమయంలో పూర్తీ చేసేలా ప్లాన్ చేసుకోవాలి.   టైం టేబుల్ ఉండాలి.. ప్రతి రోజూ ఉదయాన్నే ఆ రోజు చేయవలసిన పనులేంటో మననం చేసుకోవాలి.  దానికి తగ్గట్టు సమయాన్ని, సమయ ప్రణాళికను,  పనుల విభజనను చేసుకోవాలి. ఇది పనులు పూర్తీ  చేయడాన్ని  సులభతరం చేస్తుంది.  ఒక పని నుండి మరొక పనికి మారడానికి కష్టం ఉండదు. తరువాత ఏం చేద్దాం అని ఆలోచించాల్సిన అవసరం అలలే ఉండదు.  ఒకదాని తరువాత ఒకటి ఒక ప్లో లో పూర్తీ చేయవచ్చు. అయితే మీ పనుల మీద ఇతరుల ప్రభావం, మీ సమయం పట్ల ఇతరుల ఆధిపత్యం లేకుండా చూసుకోవాలి. మార్నింగ్ రొటీస్.. చాలామంది మాకు సమయం సరిపోవడం లేదు అంటూ ఉంటారు.  దీనికి పెద్ద కారణం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం.  ఒకసారి ఉదయాన్నే కనీసం 5 నుండి 6 గంటల లోపు నిద్రలేచి పనులు మొదలు పెట్టి చూడండి.  చాలా పనులు సమయానికి అయిపోతాయి.  ఆఫీసుకు కూడా వేళకు వెళ్లవచ్చు. మొదట్లో ఉదయాన్నే లేవడం వల్ల రోజులో ఏదో ఒక సమయంలో నిద్ర వచ్చినట్టు ఉంటుంది. కానీ ఓ వారం రోజులు అలవాటు అయితే ఉదయాన్నే లేవడం వల్ల  రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు. మానసిక ఆరోగ్యం.. చాలామంది పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. శారీరక, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.  ఎక్కువ సేపు పని మీద ధ్యాస ఉంటే మెదడు, కళ్లు,  మనకు కూడా భారంగా ఫీల్ అవుతుంది. అందుకే ఎక్కువ సేపు పనులు చేసేవారు చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి.  ఆహారం.. శరీరం అలసిపోకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యం.  పనిలో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి తినాలి. పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి.  అదే విధంగా రోజుకు 7 నుంి 8 గంటల నిద్ర కూడా ఉండేలా చూసుకోవాలి.   లక్ష్యాలు.. పెద్ద లక్ష్యాలు సాధించాలని అందరూ అనుకుంటారు. తద్వారా గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు.  అయితే చిన్న చిన్న లక్ష్యాలు నిర్థేశించుకుంటూ వాటిని పెద్ద లక్ష్యాలకు దారిగా చేసుకోవాలి.   ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  విజయాన్ని ఒళ్లో వాలేలా చేస్తుంది. సహాయం.. పనులు చేసేటప్పుడు ఎవరి సహాయం అయినా అవసరం అయితే ఎలాంటి మొహమాటం,  మరింకే భయం లేకుండా సహాయం అడగాలి.  తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి.  తెలియని పనిని తప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. అది నేర్చుకునే దశను నాశనం చేస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలి.  దీనికోసం వ్యాయామం, యోగా ఫాలో అవ్వాలి.  అలాగే మానసిక  ఆరోగ్యం దెబ్బతినకుండా ధ్యానం,  ప్రాణాయామం వంటివి చేయాలి.  ఒక వేళ ఒత్తిడి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నట్టైతే కౌన్సిలింగ్ అయినా తీసుకోవాలి.                                                *రూపశ్రీ.  

ఇంట్లో ఈ మొక్కలు పెంచితే  డబ్బుకు లోటు ఉండదట..!

డబ్బు మనిషికి తప్పనిసరి అయిపోయింది. మానవ కార్యకలాపాలలో డబ్బుదే కీలకపాత్ర. డబ్బు లేకుంటే మనిషికి గౌరవం లేకపోవడం మాట అటుంచిదే.. జీవనం దుర్బరంగా మారుతుంది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మంచి జీవితం, కన్న కలలు, సమాజంలో ఆర్ధిక హోదా వంటివన్నీ డబ్బుంటేనే నెరవేరుతాయి. అందుకే ప్రతి వ్యక్తి తమకు లోటు లేకుండా డబ్బు ఉండాలని అనుకుంటాడు. అందుకోసం కష్టపడి సంపాదించడమే కాకుండా ఇంట్లో ధనం నిలవడానికి చాలా పరిహారాలు, ప్రయత్నాలు, పూజలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని  మొక్కలు ఇంట్లో పెంచితే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదని అంటున్నారు. ఇంతకీ అవేం మొక్కలంటే.. వెదురు మొక్క.. వెదురు మొక్కను ఇంట్లో ఉంచితే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందట. ఈ మొక్క ఇంట్లో వారి జీవితాలలో ఆనందాన్ని,  కుటుంబ సభ్యుల శ్రేయస్సును పెంచుతుందట.  అందుకే వెదురు మొక్కను పెంచుకోవడం మంచిదంటున్నారు. మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో ఉండే మొక్క. ఈ మొక్క ఇంట్లో ఉంటే పేరుకు తగ్గట్టే ఆర్థికంగా బాగుంటుందని,  ఆ ఇంట్లో ధనం అభివృద్ది చెందుతూ ఉంటుందని అంటారు. అయితే మనీ ప్లాంట్ లో పసుపు రంగు ఆకులు ఉండకుండా చూసుకోవాలి ముదురు ఆకుపచ్చ ఆకులు మాత్రమే ఉండాలి.   పీస్ లిల్లీ.. పీస్ లిల్లీ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.  ఈ మొక్క ఇంటి పరిసరాలలోనూ, ఇంట్లోనూ గాలిని శుద్ది చేస్తుంది.  ఇంటి వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది.  ఇంటి ఆర్థిక అభివృద్దికి దోహదం చేస్తుంది. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్.. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ మొక్క ఆకులు పెద్దగా ఏనుగు చెవుల ఆకారంలో ఉంటాయి.  ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి కూడా ఈ మొక్క సహాయపడుతుందట. స్నేక్ ప్లాంట్.. స్నేక్ ప్లాంట్ మొక్క గాలిని శుభ్రపరుస్తుంది.  ఈ మొక్క  ఒకవైపు ఆరోగ్యాన్ని, మరొకవైపు ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ ను కూడా ఇస్తుంది. శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే మంచిది. చైనీస్ మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ భారతీయుల దగ్గర ఒక విధంగానూ, చైనా ప్రజల దగ్గర ఒక విధంగానూ ఉంటుంది.  చైనీస్ మనీ ప్లాంట్ కు ఆకులు గుండ్రంగా ముదురు ఆకువచ్చ రంగులో ఉంటాయి.  ఇవి ధన ఆకర్షణ కలిగి ఉంటాయని అంటారు. అదే విధంగా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయట. తద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. సిట్రస్ మొక్కలు.. నమ్మరు కానీ సిట్రస్ మొక్కలను ఇంట్లో పెంచుతుంటే అదృష్టం కలిసొస్తుందట. సిట్రస్ పండ్లు ఎలాగో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.  ఇక ఇవి పెరుగుతున్న ఇంట్లో ఆర్థికంగా మంచి అభివృద్ది ఉంటుందట.  సిట్రస్ మొక్కల నుండి వచ్చే సువాసన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.                                               *రూపశ్రీ.  

ఫోన్లో మాట్లాడే పద్ధతి

సుదూర ప్రాంతాలలో ఉన్నవారు క్షేమ సమాచారాలు తెలుసుకుని, వారితో కనెక్ట్ అవుతారని గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టారు . అయితే ఫోన్ మాట్లాడేటప్పుడు,  ఎటిక్వెట్టే పాటించాలి. Etiquette  అంటే సామాజంలో ఒక సమూహంలో మనం ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు. "పో బోడి నియమాలు పాటించడం అంత అవసరమా"అంటే అవసరమే. ఎందుకంటే మీరు ప్రవర్తించే తీరు అటువైపు మీతో మాట్లాడేవారు మీ పట్ల ప్రతికూల దృక్పథంతో చూసే అవకాశం ఉంది. మీ బంధాలు వీగిపోతాయి. ఏంట్రా బాబు ఈ సోది అని మీతో మాట్లాడాలంటే విసుగు చెందే అవకాశం ఉంది. నిజానికి కొన్ని దేశాల్లో చిన్న వయసు నుండే ఇటువంటి మర్యాదలను నేర్పిస్తారు. అందుకే మా అక్క లాంటివారీ కన్నా అక్కడి చిన్నపిల్లలు ఎంతో మెరుగ్గా, మర్యాదగా మాట్లాడుతారు. ముందుగా ప్రాథమిక మర్యాదల గురించి తెలుసుకుందాం. 1. మొదటి రింగ్ అయినప్పుడే ఫోన్ ఆన్సర్ చెయ్యడానికి ప్రయత్నించండి.  2. నంబర్స్ జాగ్రత్తగా చూసి డయల్ చేయండి.  3. ఒకవేళ రాంగ్ నెంబర్ కు డయల్ చేసినట్టు అయితే, సున్నితంగా మన్నించమని కోరండి. 4. స్పష్టంగా మాట్లాడండి కొందరు ఫోన్లో సరైన సమాధానం ఇవ్వరు. ఆ.. ఊ ల వరకే పరిమితం అవుతారు. వాళ్ళు అవునన్నారో.. కాదన్నారో తెలియక కన్ఫ్యూజన్. మరికొందరు అసలు సమాధానమే ఇవ్వరు. మనం ఎంత సేపు మాట్లాడుతున్నా మౌనంగా వింటూ ఉంటారే కానీ బదులు ఇవ్వరు. 5. ఎంత వీలు అయితే అంత తక్కువ సమయం మాట్లాడడానికి ట్రై చేయండి. 6. అవతలి వ్యక్తి అందుబాటులో, ఫ్రీగా  ఉన్నారా లేదా అని తరచి చూసి మాట్లాడండి.  మీరు ఖాళీగా ఉన్నారని, అందరూ పని పాటా లేకుండా ఉండరు కదా. వారు తమ నిస్సహాయత ను తెలియజేస్తే, నిండు మనస్సుతో అంగీకరించండి. 7. కాన్ఫరెన్స్ కాల్ చేసేటప్పుడు, అవతలి వ్యక్తి నుండి ముందుగా అనుమతి లేకుండా వేరే వ్యక్తులను కలపకండి. అలాగే మీరు కలపబోయే వ్యక్తికి కూడా కాన్ఫరెన్స్ లో ఎవరెవరు ఉన్నారో సూచించండి.  8. రాంగ్ నెంబర్ లకు మొరటుగా సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ సున్నితంగా చెప్పండి. కొన్ని సార్లు పెద్దవారు, చదువుకోని వారు, ఫోన్ ఎలా వినియోగించాలి అని తెలియని వారు, తప్పు నెంబర్లను అనుకోకుండా డయల్ చేస్తారు. ఒకవేళ మీకు అలాంటి కాల్స్ వస్తె సున్నితంగా సమాధానం ఇచ్చి, సాధ్యమైతే వారికి సహాయం చెయ్యండి. 9. కొత్త నెంబర్లతో ఫోన్ చేస్తే, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మాట్లాడండి.  మన వాయిస్ గుర్తుపడతారులే అని మీరేదో మాట్లాడితే, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాక నాలంటోల్లు జుట్టు పీక్కుంటారు. 10. మీరెందుకు ఫోన్ చేశారో గ్రహించి, క్లుప్తంగా, సరళంగా మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పండి.  అంతేగానీ మీకు బోర్ కొడుతుందని ఫోన్ చేసి, గంటలు గంటలు అవతలి వ్యక్తి సమయాన్ని తినకండి. వారు ఫ్రీగా ఉంటే మాట్లాడవచ్చు. అదీ వారి అనుమతితో మాత్రమే. ఇంకొందరు వారు చెప్పాలనుకున్న విషయం కాకుండా అన్నీ చెప్పేసి, అసలు విషయం మర్చిపోతారు. వారికోసం ఈ సలహా. 11. ఒక రెండు సార్లు డయల్ చేశాక ఎదుటివారు ఆన్సర్ ఇవ్వకపోతే, మళ్లీ మళ్లీ అదేపనిగా కాల్ చేయకండి. (అత్యవసరం అయితే తప్పదు)  ఇది నేను ఎక్కువగా ఎదుర్కునే సమస్య. నేను ఫోన్ do not disturb mode పెట్టుకున్నా , ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి, డిస్టర్బ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. అదీ పనికిమాలిన కబుర్లు కోసం. 12. చివరగా.. కాస్త బిగ్గరగా, స్పష్టంగా మాట్లాడండి.  మీలో మీరు గొణుక్కుంటూ మాట్లాడితే అవతలి వ్యక్తి మరోలా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు మీరు తర్టీన్ అని చిన్నగా చెప్పారు అది అవతలి వ్యక్తి కి తర్టి అని అర్థం అవ్వొచ్చు.. మీరు సింధు అని చెప్తే వారు హిందూ అనుకోవచ్చు.. అందుకే స్పష్టత అవసరం. కొన్ని రకాల ఫోన్ ముచ్చట్లు..ఇది చదివాక నేను చెప్పిన మర్యాదలు మీకే అర్థమవుతుంది. X: హెల్లో అండి! రాజు గారు ఉన్నారా? Y: లేరు (డబ్ మని వెంటనే ఫోన్ పెట్టేశారు) A: అత్తతో నాకు గొడవ అయ్యింది. రెండు రోజుల నుండి మాట్లాడటం లేదు B: అవునా ఎప్పుడు వెళ్లావ్. నాకూ చెప్తే నేనూ వస్తాగా A:  నేను చెప్పింది విన్నావా? B: sorry!! ఏం చెప్పావు??! X: Hello ఎవరూ? Y:  సమత నిద్ర పోయావా? X:  నేను గ్రీష్మ.. ఈ టైంలో ఎవరైనా పడుకుంటారు కదా అండి.. 🥱 A: Hello రాహుల్ మీతో మాట్లాడవచ్చా? B:  ఆ చెప్పండి.. A:  మొన్న మీరు రాసిన కథ చదివాను..  B:  అది బాలేదు వేరేది తీసుకో (గుసగుసగా).. హా కథల పోటీ ఫలితాలా.. ఎప్పుడు??(గట్టిగా) ఇలా ఉంటాయి అండి..కొన్ని సంభాషణలు.. అందుకే సభ్యత పాటించి, మన ఫోన్ సంభాషణ మర్యాదగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. ◆ వెంకటేష్ పువ్వాడ

ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటారు చాణక్యుడు..!!

చాణక్య నీతిలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రస్తావించారు. జీవితంలో  ఏది సరైనది...ఏది తప్పు అని నిర్ణయించుకోవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కానీ కొన్ని పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్య చెప్పారు. అవేంటో చూద్దాం.  ఆచార్య చాణక్యుడు మానవ ప్రవర్తనను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతను తన చాణక్య నీతిలో అనేక సూత్రాలను వ్రాసాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి  అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తన నీతి శాస్త్రంలో, ఒక వ్యక్తి ఎవరికీ సమాధానం ఇవ్వకూడదు..వాగ్దానం చేయకూడదు లేదా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మూడు పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. లేకుంటే ఆ వ్యక్తి దాని చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు వాగ్దానం చేయకూడదు? ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకంటే  సంతోషంగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలను ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ పరిస్థితిలో ఎవరికీ సమాధానం చెప్పవద్దు: మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల, మీకు కోపం వచ్చినప్పుడు ఓపికపట్టండి.  నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు, దాని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి, చాణక్య నీతి ప్రకారం, దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.