Read more!

మనిషిలో ఆలోచన ఎలా పెంపొందాలి??

మనిషికి జీవితంలో ఆలోకాహాన చాలా ముఖ్యమైనది. మంచిగా ఆలోచించడం, చెడుగా ఆలోచించడం ఆ మనిషి మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి ఆలోచనలో కూడా ఒక అంశం ఇమిడిపోయి ఉంటుంది. అదే ప్రేరణ. చాలామంది తమ ఆలోచనల్లో వ్యర్థమైన విషయాలు జొప్పించి ప్రేరణ కలిగించే విషయాలను అసలు తమ బుర్రలోకి రానివ్వరు. అయితే… ప్రేరణ కాని… ఆలోచన కాని అది ఇతరుల నుండి ఆశించడం చాలా పొరపాటు. 


ఈ కాలంలో ఎవరికి వారే ప్రేరణ కలిగించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం అమాయకత్వమే అవుతుంది. మీకు మీరు ప్రేరణ కలిగించుకోవాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు అభిమానించుకోవాలి. మీలోని లోపాలను అవకాశాలుగా భావించుకోవాలి. ఇదంతా జరగాలి అంటే… ముందు మీ స్థాయిని, మీ పరిస్థితిని వాస్తవిక కోణంలో అంగీకరించాలి. 


కులం, మతం, భాష ఏవైనా, శారీరకంగా మనిషి  పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, నలుపు, తెలుపు... ఎలా వున్నా భౌతిక రూపాన్ని మరియు ఆంతరంగిక మనసత్వాన్ని రెండింటిని కూడా ప్రేమించాలి. అదే మీలో ప్రేమించే, ప్రేరేపించుకునే తత్వాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరు అనుక్షణం అభినందించుకోవాలి. కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోనందుకు సంతోషించాలి.


ఒకరోజు ఇద్దరు స్నేహితులు దగ్గరలో ఉన్న పార్కుకు అలా నడకకు బయలుదేరారు. వారు అలా వెళ్లి కాస్త నడిచి ఒకచోట కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఎగురుకుంటూ పోతున్న పక్షులలో ఒక పావురం  రెట్టవేసింది. వెంటనే అతను చేత్తో తుడుచుకుంటూ పక్కనున్న స్నేహితుడితో "దేవుడు ఎంత గొప్పవాడు” అన్నాడు.


ఆ స్నేహితుడు ఆ మాటకు విస్తుపోయి. “మీద రెట్ట పడితే అలా అంటున్నావేమిటి?” అన్నాడు. 


అప్పుడు మొదటి స్నేహితుడు “నిజంగా దేవుడికి ఎంత దూరదృష్టి కదా?" అన్నాడు మళ్ళీ.


ఈసారి రెండో స్నేహితుడికి కాస్త వెర్రెత్తి   “నువ్వు చెప్పేదేమిటో నాకర్థం కావటం లేదు” అన్నాడు చిరాగ్గా. 


“పక్షులకు గాలిలోకి ఎగిరే శక్తి ఇచ్చిన దేవుడు నిజంగా ఎంతో అభినందనీయుడు" అన్నాడు రుమాలుతో తుడుచుకుంటూ.


రెండవ స్నేహితుడి కోపం నషాళానికి అంటించి. “నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నువ్వనేది ఏమిటి?” అన్నాడు స్నేహితుడు చిటపటలాడుతూ.


"అహా! నా ఉద్దేశ్యమేమిటంటే దేవుడు పక్షులకు మాత్రమే ఇలా ఎగిరే శక్తి ఇచ్చాడు. ఆవులకు, గేదెలకు ఎగిరే శక్తి ఇవ్వలేదు” అంటూ వాష్ బేసిన్ వైపు వెళ్ళాడు.


ఆ మాట విన్న రెండవ స్నేహితుడు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. పైన చెప్పనా సంఘటనలో వేరే వ్యక్తి అయితే “అంతా నా ఖర్మ” “ఆ దిక్కుమాలిన పావురం సరిగ్గా నా మొహం మీదే వెయ్యాలా?” “ఈరోజు లేచిన వేళావిశేషం బాగాలేదు” ఏదో అవుతుందని నాకు పొద్దున్నే అనిపించింది” లాంటి మాటలు చెప్పుకుని తనకు ఏదో పెద్ద ఉపద్రవం కలిగింది అన్నంతగా ఫీలైపోయి బాధలో మునిగిపోయేవాడు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మనకు ఇంతకంటే పెద్ద సమస్య రాలేదు కదా అని తనకు తాను చెప్పుకోవడంలో, అలా ఆలోచించడంలో ఎంతో గొప్ప పరిపక్వత ఉంటుంది. అలాంటి ఆలోచనను అందరూ పెంపొందించుకోవాలి.


                                    ◆నిశ్శబ్ద.