టీడీపీ ఆఫీసుపై దాడి సూత్రధారుల గుర్తింపు!

జగన్ ప్రభుత్వం  అధికారంలో వున్న సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు మీద అధికార పార్టీకి చెందిన గూండాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అత్యంత అమానవీయంగా జరిగిన ఈ దాడి అప్పట్లో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇలాంటి గూండారాజ్యంలో మనం బతుకుతున్నామా అన్న ఆందోళన ప్రజల్లో కలిగించింది. జగన్ ఒత్తిడి మేరకు అప్పట్లో పోలీసులు ఈ కేసు మీద ధైర్యంగా దర్యాప్తు చేయలేకపోయారు. వైసీపీ రాక్షసపాలన ముగిసి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆనాటి సంఘటన మీద తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.  ఆరోజు టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లు అరోపణలు వినిపించాయి. ఈ కేసులో దాదాపు 150 మంది మీద కేసులు నమోదు చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. దాడి జరిపిన వారిలో గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే ఎక్కువ మంది వున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికల మీద పోలీసులు దృష్టి పెట్టారు. 

స్పీడ్ పెంచిన ష‌ర్మిళ‌.. జ‌గ‌న్ రాజ‌కీయ చాప్ట‌ర్ క్లోజ్‌?

మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డిన చందంగా త‌యారైంది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల్లో వైఎస్ పై ఉన్న అభిమానాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు.  2014 ఎన్నిక‌ల్లో విఫ‌ల‌మైనా.. 2 019 ఎన్నిక‌ల్లో  ఆయన నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది.   వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హాలో పాల‌న‌సాగిస్తాన‌ని సీఎం పీఠాన్ని అధిరోహించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకోలేక పోయారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో జగన్ హయాంలో ఏపీ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని ఎదురుచూస్తూ వ‌చ్చారు.  ఏ వ‌ర్గానికీ వైసీపీ ప్ర‌భుత్వంలో మేలు జ‌ర‌గ‌లేదు. ఏ వర్గమూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సంతృప్తిగా లేదు.  జగన్ ప్రభుత్వ వేధింపులకు గురి కాని వర్గమే లేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రైతుల‌కు, పేద విద్యార్థుల‌కు మేలు జ‌రిగింది. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం రైతుల అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌ పెట్టేసింది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో వేగంగా ముందుకు సాగిన ప్రాజెక్టుల నిర్మాణాలు జ‌గ‌న్ హ‌యాంలో ప‌డ‌కేశాయి. వైఎస్ త‌ర‌హాలో పాల‌న అందిస్తాడ‌ని సీఎం కుర్చీఎక్కిస్తే.. జ‌గ‌న్ మాత్రం కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే  తన ఐదేళ్ల అధికారాన్ని ప‌రిమితం చేశారు. దీంతో  ప్ర‌జ‌లు 2024 ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి బుద్ధి చెప్పారు. నీ సేవలింక చాలని ఇంటికి పంపేశారు. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే.. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి వైసీపీకి ఓట్లువేసిన వారు చాలా త‌క్కువ మంది అనే చెప్పాలి.  జ‌గ‌న్ గెలుపులో కీల‌క భూమిక పోషించింది ఏపీలోని వైఎస్ అభిమానులేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. వైఎస్ త‌ర‌హాలో పాల‌న సాగిస్తాడ‌ని భావించి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎం పీఠంపైకి ఎక్కించారు. కానీ, వైఎస్ లెగ‌సీని వాడుకున్న జ‌గ‌న్‌.. ఆయ‌న త‌ర‌హాలో   పాల‌న సాగించ‌లేదు. అయితే, తాజా ఓట‌మి త‌రువాత అస‌లు విష‌యాన్ని గుర్తించిన జ‌గ‌న్‌, మ‌ళ్లీ వైఎస్ జ‌పం చేసేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలోనే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ జీవితానికి చెక్ పెట్టేందుకు ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రంగంలోకి దిగారు. తాజాగా వైఎస్ జ‌యంతిని జ‌రిపే బాధ్య‌త‌ను ఆమె భుజానికెత్తుకున్నారు. వైఎస్ బిడ్డ‌గా ఆయన జ‌యంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన షర్మిల  విజ‌య‌వాడ‌లో ఈనెల 8న జ‌రిగే వైఎస్ఆర్‌ 75వ జ‌యంతి వేడుక‌ల‌కు రావాలంటూ తెలంగాణ, ఏపీలోని కాంగ్రెస్ నేత‌ల‌ను  స్వ‌యంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఈ ప‌రిణామం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌ని అంశంగా మారింది.  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైఎస్ ష‌ర్మిల ఇద్ద‌రూ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌స‌త్వ‌మే. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని  ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన జగన్, 2019 ఎన్నికల్లో వైఎస్ అభిమానుల సహకారంతో పాటు తన చెల్లి షర్మిళ, తల్లి విజయమ్మల ప్రచారంతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత   కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష నేతలను, తన విధానాలను వ్యతిరేకించిన ప్రజలను జ‌గ‌న్‌ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశాడు. దీంతో వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. జగన్ మోహన్ రెడ్డికి దూరమైన షర్మిల.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి కొన్నిరోజులు నడిపినప్పటికీ.. ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టారు. అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డిపై ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసిన ష‌ర్మిల‌.. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హా పాల‌న జ‌గ‌న్ కు చేత‌కాద‌ని.. వైఎస్ త‌ర‌హా పాల‌న మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. దీనికి తోడు విజ‌య‌మ్మ‌ సైతం ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో వైఎస్ అభిమానులు చాలా వరకూ వైసీపీకి దూర‌మ‌య్యారు. ఫ‌లితంగా జ‌గ‌న్ భారీ ఓట‌మిని చ‌వి చూశారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన షాక్ నుంచి తేరుకుంటున్న జ‌గ‌న్‌కు ష‌ర్మిల మ‌రోషాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మయ్యారు. జూలై 8న విజ‌య‌వాడ వేదిక‌గా వైఎస్  జ‌యంతి వేడుక‌ల‌ను భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు వైఎస్ ష‌ర్మిల‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్  నేత‌ల‌తో పాటు.. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు కూడా హాజరవ్వబోతున్నట్లు తెలుస్తోంది.  అదే జ‌రిగితే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీవైపు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే వైఎస్ త‌ర‌హా పాల‌న ఏపీలో రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ష‌ర్మిల ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. ఇప్పుడు వైఎస్ జ‌యంతిని పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డం ద్వారా వైఎస్ అభిమానులు పూర్తిగా కాంగ్రెస్ వైపు మ‌ళ్ల‌డం ఖాయ‌మ‌ని, త‌ద్వారా రాబోయే కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయ స‌న్యాసం త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా జ‌రుగుతుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కొంద‌రు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకోసం ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. మొత్తం మీద వైఎస్ జయంతి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడం ద్వారా షర్మిల తండ్రి లెగసీని పూర్తిగా జగన్ కు దూరం చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే రాజకీయంగా జగన్ చాప్టర్ క్లోజ్ అయినట్లేనని అంటున్నారు. 

వైకుంఠపాళి ఆటలో పెద్ద పాము కెసీఆర్ : కాంగ్రెస్ ట్వీట్ 

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.   తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది.. అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆయన కోరలు పీకి మూలకు కూర్చోబెట్టారని ట్వీట్ లో పేర్కొంది. అలాంటి పెద్ద పామే పాముల గురించి, తేళ్ల గురించి మాట్లాడటం విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలతో బీఆర్ఎస్ పార్టీ ఓ ట్వీట్ చేసింది. ‘కేసీఆర్ ముందే చెప్పిండు’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోలో ‘పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. కరెంటు కాటగలుస్తది.. కైలాసం వైకుంఠపాళి ఆటలో మళ్లీ పెద్ద పాము మింగినట్లైతది. మళ్లా మొదటికొత్తది కథ’ అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఈ వీడియోను పోస్ట్ చేయగా.. గంట వ్యవధిలోనే 20 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై స్పందించిన కాంగ్రెస్ వెంటనే కౌంటర్ ట్వీట్ చేసింది.

పాతగాయాలను కెలకడమెందుకు హరీష్!?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమై అధికారానికి దూరమైంది. ఉద్యమ పార్టీగా మొదలై అధికారం సాధించిన ఆ పార్టీ, ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రజాదరణ కోల్పోయి అధికారానికి దూరమైన తరువాత బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంటే అవసరమైంది. అధికారంలో ఉండగా పాండవులు తమ అస్త్రాలను జమ్మి జట్టుపై దాచినట్లు.. బీఆర్ఎస్ కూడా సెంటిమెంటు అస్త్రాన్ని రాజకీయం మాటున దాచేసింది. అవసరార్ధం ఇప్పుడు బయటకు తీయడానికి ప్రయత్నిస్తోంది.   తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో జరుగుతున్న ప్రయత్నాన్ని సెంటిమెంట్ అస్త్రంతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది.  ఔను.. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఈ పదేళ్లలోనూ విభజన సమస్యల సామరస్య పరిష్కారానికి ఇటువంటి ఒక ప్రయత్నం జరిగిన దాఖలాలు కనిపించవు. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయయుడు ఈ దిశగా చొరవ తీసుకుని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన రేవంత్ క్షణం ఆలస్యం చేయకుండా చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారు. ఇరువురూ ఈ నెల 6న ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలంటే పాతగాయాలను కెలుక్కోవడం కాదు... అగాధాలను పూడ్చుకుని రెండు రాష్ట్రాలూ ప్రగతి దారిలో ముందుకుసాగడానికి బాటలు పరచడం.  అయితే తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ మాత్రం ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల నెగడు రావణ కాష్టంలా రగులుతుంటేనే తమకు మనుగడ అని  భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు చంద్రబాబు, రేవంత్ ల భేటీని స్వాగతిస్తూనే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన చందంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.  విభజన సమస్యల పరిష్కారం కోసం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు రావడం మంచిదే అంటూనే హరీష్ రావు విలీన మండలాల ప్రస్తావన తీసుకువచ్చారు. తద్వారా తెలంగాణ సెంటిమెంటును రగల్చడానికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించే ముందు రేవంత్ రెడ్డి విలీన మండలాలను మళ్లీ  వెనక్కు ఇవ్వాలన్న షరతు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తు న్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకువచ్చి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించుకున్నారనీ, అప్పట్లో ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కూడా సమర్ధించారనీ గుర్తు చేశారు. ఏకపక్షంగా జరిగిన ఈ విలీనం తెలంగాణ సమాజం హర్షించలేదని ఇప్పుడు అంటున్నారు.   వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు విలీన మండలాలూ ముంపునకు గురౌతాయి. ఈ మండలాలు ఏపీలో విలీనం కాకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే అవకాశమే లేదు. అందుకే అప్పట్లో చంద్రబాబునాయుడు ఈ మండలాల విలీనం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కనుక ఆ పార్టీ కూడా ఏడు మండలాల విలీనాన్ని సమర్ధించింది. విలీనం జరిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమూ మొదలైపోయింది. ఇప్పుడు ఆ మండలాలను వెనక్కు ఇవ్వాలంటూ కండీషన్ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేయడం రాజకీయ లబ్ధి కోసమే కానీ మరొకందుకు కాదు. అది జరిగే పని కాదని ఆయనకూ తెలుసు. కానీ అధికారానికి దూరమై, ప్రజామద్దతు కోల్పోయిన బీఆర్ఎస్  మళ్లీ పుంజుకోవాలంటే విలీన మండలాల పేరుతో సెంటిమెంట్ రగల్చడమే మార్గమన్న భావనతోనే షరీష్ రావు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసలు తెలంగాణ అన్న పదాన్నే తన పార్టీ పేరు నుంచి తొలగించి... జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేయాలని కలలుగన్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని   పలుకుబడి సాధించాలని చేసే ప్రయత్నాలు ఫలించవని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను లేవనెత్తడం కొరివితో తల గొరుక్కోవడమే అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు, స్వామీజీలకు ఇచ్చిన ప్రాధాన్యతను జనం వారికి గుర్తు చేసి ఎగతాళి చేసే అవకాశాలున్నాయంటున్నారు.  

పాపం.. జగన్‌కి నిద్ర పడుతుందో.. లేదో!

ఎంత కోటీశ్వరుడికైనా, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు వున్నా, ఏ మనిషికైనా కావలసింది... కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. కడుపు నిండా తిండి ఎలాగైనా వస్తుందేమోగానీ, కంటి నిండా నిద్ర మాత్రం అంత ఈజీగా దొరికేది కాదు. నా దగ్గర బోలెడన్ని కోట్లు వున్నాయి.. నిద్రా.. రా.. అంటే నిద్ర వచ్చేయదు. పోనీ, డబ్బుంది కదా... నిద్రని కొనుక్కుందామా అంటే, అదికూడా సాధ్యమయ్యే విషయం కాదు.. నిద్ర గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జగన్మోహన్‌రెడ్డి మనలాగా సాధారణ పౌరుడు. మనం దేశ సరిహద్దుల్లో సైన్యం కాపలాగా వున్నారన్న ధైర్యంతో గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతాం. జగన్మోహన్‌రెడ్డి కూడా అంతే, తన ప్యాలెస్‌ చుట్టూ దాదాపు వెయ్యిమంది పోలీసులు కాపలాగా వున్నారన్న ధైర్యంతో హాయిగా నిద్రపోతూ వుంటారు. ఒక్క పోలీసులు మాత్రమేనా.. బోలెడన్ని చెక్‌పోస్టులు... వందలకొద్ది సెక్యూరిటీ పరికరాలు.. ఇంటి చుట్టూ చాలా ఎత్తుగా బారికేడ్లు... ఇక ఆయుధాల సంగతి సరేసరి. జగన్ ముఖ్యమంత్రిగా వుండగా తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ఈ సదుపాయాలు వుండేవి కాబట్టి ఆయన హాయిగా నిద్రపోయేవారు. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఆ సదుపాయాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి.. మరి... ఆయన ఇక హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోగలరా? గతంలో జగన్ ఇంటి ముందు నుంచి సాధారణ పౌరులు ప్రయాణించడానికి అవకాశం వుండేది కాదు.. ఇప్పుడు అలా కాదు.. జగన్ ఇంటి ముందు వున్న రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడని అధికారులు తొలగించారు. ఇప్పుడు  ఎవరైనా ఆ రోడ్డులో హాయిగా ప్రయాణించవచ్చు. హై సెక్యూరిటీ జోన్ వ్యవస్థలో భాగంగా వున్న ఆటోమేటిక్ పరికరాలను తొలగించారు. ఎవరైనా అనుమతి లేకుండా వాహనాలతో జగన్ ఇంటి చుట్టూ వున్న రోడ్లతో ప్రవేశిస్తే, వాటిని ఆపడానికి రెండు టైర్ కిల్లర్లు, నేలలో నుంచి పైకి లేచే నాలుగు హైడ్రాలిక్ బుల్లెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటినీ తొలగించారు. జగన్ ఇంటి దగ్గర భద్రతకోసం అన్నట్టుగా ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. జగన్ ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మొత్తం తీసేశారు. అలాగే, మొన్నటి వరకు జగన్‌కి సెక్యూరిటీగా వున్న దాదాపు వెయ్యిమంది పోలీసుల స్థానంలో 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే మిగిలింది. జగన్ ఇంటి పక్కనే సెక్యూరిటీ సిబ్బంది కోసం అనుమతి లేకుండా నిర్మించిన పక్కా గృహాలను, గవర్నమెంట్ ఖర్చుతో జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా త్వరలో తొలగిస్తారు. మరి, ఇంతకాలం ఇంత సెక్యూరిటీ, హడావిడి వుంటే తప్ప జగన్ నిద్రపోయేవారు కాదు.. మరి ఇకముందు జగన్‌కి ఎలా నిద్ర పడుతుందో ఏమో!

బైరెడ్డి శబరి ప్రసంగం.. లోక్ సభ స్పెల్ బౌండ్!

తొలిసారి ఎంపీ... అందునా మహిళ.. ఏముందిలే 543 మంది ఎంపీలలో ఆమే ఒకరు అనుకున్నారంతా. కానీ ఆమె లోక్ సభలో తన తొలి ప్రసంగంతోనే అదరగొట్టేశారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను బైరెడ్డి శబరి గట్టిగా తిప్పి కొట్టారు. ఆయన ప్రసంగంలోని తప్పులను ఎత్తి చూపారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో జగన్ సర్కార్ విధ్వంసాన్నీ ఎండగట్టారు. ఆమె అనర్గళంగా ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని సభ మొత్తం స్పెల్ బౌండ్ అయ్యి ఆలకించింది. చప్పట్లతో అభినందనలు తెలిపింది. ఇంతకీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు తన ప్రసంగంలో చంద్రబాబు ఈడీ కేసులో అరెస్టయ్యారనీ, అటువంటి వ్యక్తి మద్దతుతో మోడీ సర్కార్ మనుగడ సాగిస్తోందనీ అన్నారు. వెంటనే బైరెడ్డి శబరి చంద్రబాబును అరెస్టు చేసింది ఈడీ కాదు.. ఏపీ సీఐడీ అని కరెక్ట్ చేశారు. అలాగే చంద్రబాబును జగన్ సర్కార్ కేవలం కక్ష పూరితంగా అక్రమంగా అరెస్టు చేసిందని చెప్పారు. అలాగే చంద్రబాబు ఊతకర్ర కాదనీ, కత్తి అని చెబుతూ  ఆయనను  సీఐడీ నంద్యాలలో   అరెస్ట్ చేశారు, అందుకే నంద్యాల జిల్లా మొత్తంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు.  తన తొలి ప్రసంగంలోనే శబరి   హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి బాటలో పరుగులు తీయించిన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందనీ, వైసీపీ హయాంలో ఏపీ సర్వ విధాలుగా నాశనమైపోయిందని విమర్శించారు.  దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అంటూ విమర్శలు చేశారు.  వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగా ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఏపీ రాజధాని అమరావతికి అప్పట్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన విషయాన్ని శబరి తన ప్రసంగంలో గుర్తు చేశారు. అలాగే  వైసీపీ మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ను కూడా వైసీపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం హయాంలో  పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. వైసీపీ  ఐదేళ్ల పాలనలో ఒక్క శాతం పనులు కూడా చేయలేదని,  జగన్ హయాంలో  మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిచాయని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి బాట పడుతుందనీ, అందుకు కేంద్రం సహకారం అవసరమనీ తన ప్రసంగాన్ని ముగించారు.   

న్యాయ సంహిత కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై  తొలి కేసు 

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక రెడ్డిపై  ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా, జిల్లా పరిషత్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. అధికారులు, తోటి ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాజులు వేసుకుని వెళ్లారని, మీదో బతుకా అంటూ మండిపడ్డారు. ‘నువ్వెంత నీ కథ ఎంత.. ఎక్కువ రోజులు ఉండవ్.. పోరా బై పో’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైనా తిట్లదండకం చదివారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులపై రాళ్ల దాడి : వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దాష్టీకం 

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్  రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు. గతంలో వైసీపీ హయాంలో అడిగేవారు లేకపోవడంతో అక్రమ కట్టడం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారింది.. అక్రమ కట్టడాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్న సరే నేలమట్టం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో అధికారులు కాకినాడలో గల ద్వారంపూడి అక్రమ కట్టడం వద్దకు రాగా ద్వారంపూడి రెచ్చిపోయారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా కాకినాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆపుతున్నా అధికారులపైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకినాడ కార్పొరేషన్ కు చెందిన స్థలాన్ని ద్వారంపూడి అనుచరుడు ఆక్రమించాడు. ఆ స్థలంలో భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏం చేయలేక చేతులెత్తేసిన అధికారులు.. టీడీపీ అధికారంలోకి రావడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. ముందుగా నోటీసులు ఇచ్చి, ఆపై తొలగింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో భవనం కూల్చివేత మొదలుపెట్టారు. గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కూల్చివేతల విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. భవనం కూల్చివేతను ఆపాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా అధికారులపైకి దూసుకెళ్లే యత్నం చేశారు. కాగా, ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకు అడ్డుతగిలిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు విచారణను జులై 25కు వాయిదా వేస్తూ, ఆమె జ్యుడీషియల్ కస్టడీని కూడా ఆ తేదీ వరకూ పొడిగించింది.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మూడున్నర నెలలుగా ఢిల్లీ, తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత  ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసుకున్న రెండు బెయిలు పిటిషన్లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడంతో ఆమెకు ఇప్పటిలో ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. మరో వైపు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కవిత తండ్రి అయిన కేసీఆర్ కూడా చిక్కుల్లో ఇరుక్కున్నారు. విద్యుత్ కొనుగోలుపై విచారణకు బీఆర్ఎస్ డిమాండ్ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా తిరస్కరణకు గురైంది. దీంతో కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు తిరుగులేని నేతగా అధికారం చెలాయించిన కేసీఆర్ ఇప్పుడు అన్ని విధాలుగా చిక్కుల్లో పడ్డారు.  

ఎపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేశ్ చంద్రలడ్డా

ఏపీ సీఎంగా జూన్ 12న పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది.సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్‌ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం ఆయన స్థానంలో లడ్డాను నియమించింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్హా నియమితులయ్యారు. 1998 బ్యాచ్ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అనంతరం, ఆయనను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్హా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్‌ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ సీఆర్పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్ల పాటు పని చేసి తాజాగా ఏపీకి తిరిగొచ్చారు. 

4న జైలుకి జగన్!

ఈనెల 4న మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలుకి వెళ్ళబోతున్నారు. జగన్ జైలుకు వెళ్ళబోతున్నారు అంటే, ఆయన చేసిన నేరాలకు శిక్ష అనుభవించడానికి అనుకుంటున్నారా? కాదు.. దానికి ఇంకా కొంచెం టైమ్ వుంది. కాకపోతే, జగన్ ఈనెల 4న జైలుకు వెళ్ళబోతున్న మాట మాత్రం నిజం. జగన్ నెల్లూరు జైలుకు వెళ్ళనున్నారు. అక్కడ సెంట్రల్ జైల్లో వున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. జైల్లో మానసికంగా క్రుంగిపోయి వున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చి, ధైర్యం చెప్పనున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేయడం, పోలింగ్ సందర్భంగా అరాచకం సృష్టించడం వల్ల పిన్నెల్లి జైలుపాలయ్యారు. పిన్నెల్లి చేసిన నేరాలకు గాను పోలీసులకు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో్ జగన్ జైలుకు వెళ్ళిమరీ పిన్నెల్లిని కలవబోవడం చర్చనీయాంశమైంది. 

హస్తినకు చంద్రబాబు.. కేంద్రం సహకారం కోసం వినతులు.. జగన్ విధ్వంసంపై నివేదికలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం )జులై 3) హస్తినకు ఏగనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత చంద్రబాబు హస్తినకు వెళ్లడం ఇదే మొదటి సారి.     విజయవాడ విమానాశ్రయం నుంచి బుధవారం (జులై 3)న బయలుదేరి  ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం (జులై 4)  ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరలను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.   ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులతో  విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు,  పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు వంటి అంశాల్లో కేంద్రం సహకారాన్ని కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   అలాగే గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, జగన్ విధానాల కారణంగా కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చంద్రబాబు నివేదికలు ఇవ్వనున్నారు. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కూడా కేంద్రాన్ని చంద్రబాబు కోరనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట  మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా హస్తినకు వెడతారు. 

పట్టిసీమ ద్వారా గోదావరి జలాల విడుదల!

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు.  ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు నిండుకున్న జలాశయాలతో ప్రశ్నార్థకంగా మారిన కృష్ణా డెల్టా భవిష్యత్.. ఈ తరుణంగా గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కేవలం ఏడాది వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే డెల్టారైతాంగానికి ఆశాదీపంగా మారింది. గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో గోదావరి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ నడుంబిగించింది. బుధవారం ( జులై 3) ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టి సీమ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీరు రెండుమూడు రోజలలో ప్రకాశం బ్యారేజీ ఎగువన ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా జలాలలో కలుస్తుంది. పట్టిసీమ నీటి విడుదల కృష్ణా డెల్టా రైతుల సాగునీటి కష్టాలను తీర్చనుంది.   పట్టిసీమతో పాటు గోదావరి డెల్టాలోని తాడిపూడి, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులకు నీటి పంపింగ్‌ను మంత్రి రామానాయుడు ప్రారంభించారు. 2014లో ప్రారంభమైన పోలవరం కుడికాల్వ పనుల్ని ఏడాదిలోపే పూర్తి చేవారు. 2015లో తొలిసారి పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేశారు. తొలి ఏడాది అంటే 2015-16లొ 8.50టిఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించారు. 2016-17లో 55.60టిఎంసీలు, 2017-18లొ 105 టిఎంసిలను తరలించారు. 2018-19లో 26.88టిఎంసిలను తరలించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు పట్టిసీమ ప్రాజెక్టును వినియోగించలేదు.   పులిచింతల వద్ద కృష్ణా జలాలను నిల్వ చేసి గోదావరి నీటిని వాడుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారు. గత ఏడాది ఎగువ నుంచి నీటి విడుదల లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు. 2023-24లో 33టిఎంసిలను విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 11న పట్టిసీమ ఎత్తిపోతలతో నీటి తరలింపు ప్రారంభించినా నెల రోజులకే నిలిపివేశారు. గోదావరిలో పుష్కలంగా జలాలు ఉన్నా.. డెల్టాకు అవసరం ఉన్నా.. పట్టిసీమను పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకో లేదు.   పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తే.. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకు దక్కుతుందన్న దుగ్ధతోనే కృష్ణా డెల్టా ఎండిపోతున్నా జగన్ సర్కార్ చోద్యం చూసింది తప్ప.. రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని మాత్రం విడుదల చేయలేదు.  

రెండున్నర లక్షల దొంగ పింఛన్లు.. వైసీపీ హయాంలో ఇదో జగన్మాయ!

వైసీపీ హయాంలో కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా సాగింది. జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలలో దోపిడీ పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది.  జగన్ ఓటమి తరువాత అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మల సంక్షేమం కోసం తాను కోట్లు వెచ్చించాననీ, ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లన్నీ ఎక్కడకు పోయాయి. ఏదో కుట్ర ఉంది.. కానీ ఆధారాలు లేవు, ఏం చేయలేం అంటే నిర్వేదంగా మాట్లాడారు. కానీ జగన్ చెబుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారుల కంటే.. అనర్హులైన అస్మదీయులకే సింహభాగం అందాయని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.   సంక్షేమం పేరిగ జగన్ జలగలు యథేచ్ఛగా నొక్కేశాయని ఇప్పుడు బయట పడుతోంది. సంక్షేమం పేరిట జగన్ సర్కార్ అందించిన పింఛన్లూ పక్కదారి పట్టాయని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్  హయాంలో లబ్ధిదారులకు కోత పెట్టి మరీ దాదాపు రెండు లక్షల 50 వేల దొంగ పింఛన్లు  పంపిణీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కొలువుదీరిన తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం ఈ దొంగ పింఛన్ల వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్రంలో అనేక మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా జగన్ సర్కార్ తప్పుడు మార్గాల ద్వారా సొంత వారికి పెద్ద ఎత్తున ఈ సామాజిక పింఛన్లు అందించిందని తెలియవచ్చింది. ఆధార్ కార్డులో వయస్సు మార్చుకుని, దొంగ వికలాంగ సర్టిఫికెట్లతో అలాగే వితంగా, ఒంటరి మహిళ పింఛన్లను లక్షల మంది అక్రమంగా, అర్హత లేకపోయినా అందుకున్నారని. వీరికి పింఛన్లు అందజేయడం కోసం అర్హలకు కోత పెట్టారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనర్హులకు కాకుండా అర్హులకే పింఛన్లు అందేలా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమౌతోంది. ఈ విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. దొంగ పింఛన్ల విషయంలో బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.  మండల స్థాయినుంచీ ప్రక్షాళన జరగాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 

రేష‌న్ బియ్యం దందా.. ద్వారంపూడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

పేద‌ల‌కు అందాల్సిన రేష‌న్‌ బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంతోపాటు,  విదేశాల‌కు త‌ర‌లించి కోట్లాది రూపాయ‌లు దండుకున్న అవినీతిప‌రుల ఆట‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతోంది.  ఏపీలో తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి రాగానే రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా గుట్టు ర‌ట్ట‌వుతోంది. కాకినాడ కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత క‌నుస‌న్న‌ల్లో సాగుతున్న రేష‌న్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టేందుకు వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కాకినాడ తీరంలో అధికారులతో క‌లిసి గోడౌన్లు, మిల్లుల‌పై వ‌రుస దాడుల‌తో అవినీతిప‌రుల్లో వ‌ణుకు పుట్టిస్తున్నారు. ఇటీవ‌ల స్వ‌యంగా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆక‌స్మిక‌ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో భారీ మొత్తంలో బియ్యం అక్ర‌మ నిల్వ‌లు బ‌య‌ట‌ ప‌డ్డాయి. కాకినాడ యాంక‌రేజి పోర్టు ప‌రిధిలో విశ్వ‌ప్రియ ఎక్స్‌పోర్ట్స్ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ చేసిన 4 వేల 700 టన్నుల   రేషన్‌ బియ్యం గుట్టురట్టైంది. దీనికితోడు మిగిలిన మిల్లులు, గొడౌన్లలోనూ బియ్యం గుట్టలు కనిపించడంతో వాటిని కూడా అధికారులు సీజ్ చేశారు.  రేష‌న్ ద్వారా పేద‌ల‌కు ఇచ్చే చౌక‌ బియ్యం ప‌క్క‌దారి ప‌డుతోంద‌ని, అందుకు కాకినాడ కేంద్రంగా ఉంద‌ని చాలాకాలంగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాకినాడ కేంద్రంగా రేష‌న్‌ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతవుతున్న‌ట్లు,  దీనివెనుక వైసీపీ నేతల పాత్ర ఉందని గ‌తంలో తెలుగుదేశం, జ‌న‌సేన   నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి రావ‌డంతో కాకినాడ కేంద్రంగా వైసీపీ నేతల క‌నుస‌న్న‌ల్లో సాగుతున్న బియ్యం అక్ర‌మ ర‌వాణాపై కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ క‌నుసన్న‌ల్లో పెద్ద‌ మొత్తంలో బియ్యం అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంద‌ని ఆధారాల‌తో స‌హా వివ‌రాలు సేక‌రించిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్,  ఆ వివ‌రాల‌ను సీఎం చంద్ర‌బాబు ముందు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ద్వారంపూడికి ఉచ్చు బిగిసినట్లేనని ఏపీ రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. రేష‌న్ బియ్యం దందాకు సంబంధించి ఆధారాల‌తోస‌హా చంద్ర‌బాబు చేతికి చేర‌డంతో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌, ఆయ‌న అనుచ‌రుల‌తోపాటు వారికి స‌హ‌క‌రించిన అధికారుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ంటున్నారు‌. ఎప్పుడు ఎవ‌రు క‌ట‌క‌టాల‌పాలు కావాల్సి వ‌స్తుందోన‌ని వ‌ణికిపోతున్నార‌ని ఏపీ అధికార వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.  ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కాకినాడలో సాగుతున్న రేష‌న్ బియ్యం దందాపై దృష్టిపెట్ట‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయి. కాకినాడ‌లో ద్వారంపూడి కుటుంబ స‌భ్యుల క‌నుస‌న్న‌ల్లోనే బియ్యం అక్ర‌మంగా ఎగుమ‌తులు చేస్తున్నార‌ని ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్  గ‌తంలో ఆరోపించారు. ఆ స‌మ‌యంలో ద్వారంపూడి వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌ స్థాయిలో సాగింది. తాము అధికారంలోకి రాగానే బియ్యం దందాకు బ్రేక్ వేయ‌క‌పోతే త‌న పేరు  మార్చుకుంటాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌వాల్ అప్ప్టట్లో సవాల్ చేశారు. ఎన్నిక‌ల్లోతెలుగుదేశం కూట‌మి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను జ‌న‌సేన ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ కు అప్ప‌గించారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌వాల్ కు అనుగుణంగా అడుగులు వేశాడు. స్వ‌యంగా ఆయ‌నే కాకినాడ‌లోని మిల్లులు, గోడౌన్ వ‌ద్ద‌కు వెళ్లి త‌నిఖీలు చేశాడు. ఆ త‌నిఖీల్లో పెద్ద మొత్తంలో రేష‌న్ బియ్యం దందా వెలుగులోకి వ‌చ్చింది.  ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురం వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్  ఇదే విష‌యం  ప్ర‌స్తావించారు. కాకినాడలో బియ్యం దందాపై ప‌వ‌న్ మ‌రోసారి స్పందించ‌డం చూస్తే అక్రమార్కుల భరతం పట్టేంతవరకు వదిలే ప్రసక్తేలేదన్న సంకేతాలిచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో సివిల్ స‌ప్ల‌య్ మంత్రులుగా కొడాలి నాని, ఆ త‌రువాత కానుమూరి నాగేశ్వ‌ర‌రావు  ప‌నిచేశారు. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్, ఆయ‌న అనుచ‌రులు సాగించిన రేష‌న్ బియ్యం దందాలో మాజీ మంత్రుల ప్ర‌మేయం ఎంత ఉంద‌నే వివ‌రాలను సైతం ప్ర‌భుత్వ  పెద్ద‌లు కూపీలాగుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రేష‌న్ బియ్యం దందాకు సంబంధించిన గుట్టు ర‌ట్ట‌వుతుండ‌టం పట్ల సర్వత్రా  హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

ప్రజాశాంతి పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం?

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన బరువుని, తన నెత్తిన వున్న వైఎస్సార్సీపీ పార్టీ బరువుని ఏదైనా జాతీయ పార్టీ నెత్తిన పెట్టేసి, తన చుట్టూ వున్న కేసుల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలన్న ఆలోచనలో తన ప్రయత్నాలు తాను చేశారు. భారతీయ జనతా పార్టీని చాలామంది ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ అని వెటకారంగా అంటూ వుంటారు. ఎన్ని మరకలు వున్నప్పటికీ, బీజేపీలో చేరితే చాలు... ఆ మరకలన్నీ వాషింగ్ పౌడర్ నిర్మా వేసి ఉతికినట్టు మాయమైపోతాయి. మన జగనన్న అయితే మరకల మయం. ఆ మరకలన్నీ పోవాలంటే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడమే సరైన మార్గం అని జగన్ భావించారు. అయితే చాలామంది విషయంలో ‘మరక మంచిదే’ అని తనలోకి ఆహ్వానించిన బీజేపీ జగన్ విషయంలో మాత్రం ‘మరక ముంచేదే’ అని ఎంతమాత్రం ఇంట్రస్ట్ చూపించలేదు. ఎందుకంటే, జగన్ మరకలు వాషింగ్ పౌడర్ వదిలించగలిగేవి కావు.. చివరికి వాషింగ్ పౌడర్‌నే బలంగా పట్టుకునే మరకలు. అందువల్ల జగన్‌ పార్టీ విలీనం విషయం బీజేపీ నుంచి రెడ్ సిగ్నల్ వచ్చింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో స్నేహబంధం కూడా వుండటంతో వైసీపీని విలీనం చేసుకునే సాహసం బీజేపీ ఇప్పట్లో చేసే అవకాశం లేదు. దాంతో జగన్ పార్టీకి బీజేపీ వైపు ద్వారాలు మూసుకుపోయాయి. ఇక మిగిలిన ఒకే ఒక పార్టీ... కాంగ్రెస్! బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్ళిన జగన్, పనిలోపనిగా కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌ని కలిశారన్న వార్తలు వచ్చాయి. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న ప్రపోజల్‌తోనే శివకుమార్‌ని జగన్ కలిశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే జగన్ నన్ను కలవలేదు అంటూ శివకుమార్ నాలుగు రోజుల తర్వాత ఖండించినప్పటికీ, రాజకీయ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. జగన్ చెప్పిన ప్రపోజల్‌ని శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళారని, ఆ జగన్ కంప మనకి తగిలించుకోవడం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రిజెక్ట్ చేసిందని సమాచారం. దరిమిలా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ద్వారాలు మూసుకుపోయాయి. జగన్ తన పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జనం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అందులో చాలామంది బలంగా చేస్తున్న ఒక కామెంట్ అందరికీ నవ్వు పుట్టించేలా వుంది. జగన్ తన పార్టీని కేఏ పాల్ అధ్యక్షతన వున్న ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయడం ఒక్కటే మార్గమని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. కేఏ పాల్ నాయకత్వంలోకి జగన్ వెళ్ళడం వల్ల అంతర్జాతీయంగా సంబంధ బాంధవ్యాలున్న కేఏ పాల్ జగన్‌ని కాపాడే అవకాశం వుందని అంటున్నారు. ఇప్పుడు జగన్ వున్న పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీలో వైఎస్సార్సీపీని విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదని సూచిస్తున్నారు. ఈ నెటిజన్ల వెటకారం మామూలుగా లేదు కదూ?!

జగన్ మీద అంత చిరాకు ఎందుకో?!

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌కి ట్రబుల్ షూటర్‌గా పేరుంది. క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన రంగంలోకి దిగారంటే ఎదురుగా ఎవరూ నిలవలేరని అంటూ వుంటారు. రాజకీయాల్లో రాటుతేలడం కావచ్చు.. ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి కావడం వల్ల కూడా ఆయనకి ఈ ‘టాలెంట్’ వచ్చి వుండొచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్నీ డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఎన్నికల సమయంలో ఆయన హైదరాబాద్‌లోనే వుండి, అన్ని విషయాలూ దగ్గరుండి ‘చక్కబెట్టి’, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సహకారం అందించారు.  అలాంటి డీకే శివకుమార్‌ని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి బెంగళూరులో కలిశారని, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి శివకుమార్‌తో చర్చించారని ఈమధ్య వార్తలు వచ్చాయి. ఒక పత్రికలో అయితే శివకుమార్‌కి జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇస్తున్నట్టు ఫొటో కూడా ప్రింట్ చేశారు. దాంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వార్తల విషయంలో వైసీపీ వర్గాల నుంచి ఎలాంటి ఖండనలు లేకపోవడంతో దావానలం లాంటి వార్త అలా వ్యాపిస్తూ వెళ్ళీ వెళ్ళీ.. కాంగ్రెస్ అధిష్ఠానానికి, చివరికి శివకుమార్‌కే అంటుకుని చుర్రుమనిపించింది. వెంటనే శివకుమార్ ఒక ఖండన విడుదల చేశారు. జగన్ నను కలవలేదు, ఆయన మా పార్టీలో చేరబోవడం లేదు అని సింపుల్‌గా ఒక ఖండన ఇస్తే సరిపోయేది. కానీ, ఆయన ఆగ్రహంతో రగిలిపోతూ ట్విట్లర్లో పోస్టు పెట్టారు. ‘‘ఎవరో స్కౌండ్రల్ జగన్‌ నన్ను కలిసినట్టు ఫొటో పెట్టాడు. ఇలాంటి వార్తలు నమ్మవద్దు’’ అని ఘాటుగా పోస్టు పెట్టారు. ఇంత చిన్న విషయాన్ని ఆయన అంత ఘాటుగా ఎందుకు స్పందించారో చాలామందికి అర్థం కాలేదు. నిజానికి జగన్‌ని పార్టీలో చేర్చుకునే ఉద్దేశం సోనియాగాంధీకి గానీ, రాహుల్ గాంధీకి గానీ ఎంతమాత్రం లేదు. జగన్ ‘ప్రతిభ’ తెలుసు కాబట్టే, వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన వెంటనే జగన్ కుప్పిగంతులు వేస్తే కంట్రోల్ చేశారు. వాళ్ళకి జగన్ మీద మొదటి నుంచీ సదభిప్రాయం లేదు. లక్షల కోట్ల స్కాముల్లో ఇరుక్కుని, బీజేపీ సానుభూతిపరుడిగా వున్న జగన్ అలాంటి వ్యక్తిని డీకే శివకుమార్ ఎందుకు కలిశారంటూ కాంగ్రెస్ అధిష్ఠానం శివకుమార్ మీద సీరియస్ అయినట్టు సమాచారం. దాంతో శివకుమార్ నన్ను జగన్ కలవలేదు మొర్రో అని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ మాయదారి జగన్ వల్ల అధిష్ఠానానికి నేను సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చిందన్న చిరాకుతో డీకే శివకుమార్ అంత ఘాటుగా రియాక్ట్ అయినట్టున్నారు.