హల్లో మిస్.. అది ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్!
posted on Jul 6, 2024 @ 10:32AM
మన ఇండియాలో ఎర్రబస్సు ఆపాలంటే ఏం చేస్తాం? ఆ బస్సుకి ఎదురుగా నిలబడి చెయ్యి ఊపుతాం.. అప్పుడు ఆ బస్సు ఆగుతుంది.. మనం బస్సు ఎక్కుతాం. అయితే, ఈమధ్య ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఒక లేడీ... మనం ఎర్రబస్సు విషయంలో ఏం చేస్తామో.. ఆమె ఎయిర్‌బస్సు విషయంలో అలా చేసింది. కదులుతున్న విమానం ముందుకు వెళ్ళి ఆపండి.. ఆపండి అన్నట్టుగా చేతులు ఊపింది. టేకాఫ్‌కి రెడీ అవుతున్న పైలెట్ విమానానికి ఎదురుగా వచ్చిన ఈ లేడీని చూసి బిత్తరపోయి ఫ్లైట్ ఆపేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి, ఆమెని అరెస్టు చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆ లేడీ ఆ ఫ్లైట్లోనే ఎక్కాల్సి వుంది. అయితే ఆమె ఎయిర్‌పోర్టుకి ఆలస్యంగా వచ్చింది. అప్పటికే విమానం డోర్లు క్లోజ్ చేశారు. టేకాఫ్ అవడానికి విమానం కదిలింది కూడా. తాను ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోతూ వుండేసరికి ఆ లేడీ కంగారుపడిపోయింది. లేడిలాగా రన్‌వే మీదకి దూసుకెళ్ళింది. ఎయిర్ పోర్టు స్టాఫ్ బిత్తరపోయి ఆపేలోపే ఆమె విమానం ముందుకు వచ్చేసి ‘స్టాప్.. స్టాప్..’ అని అరిచింది. పైలట్ అలెర్ట్ అయి విమానాన్ని ఆపేశాడుగానీ, లేకపోతే ఈ లేడీ పచ్చడైపోయేదే.