వలసల జోరు... బీఆర్ఎస్ బేజారు!
posted on Jul 6, 2024 @ 2:42PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు.. రైతు బంధు, రుణమాఫీ తదితర అంశాలపై సభ వేదికగా విస్తృత చర్చకు సైతం సిద్ధమౌతోంది. అదే సమయంలో తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉనికి కోసం నానా పాట్లూ పడుతోంది. కనుసైగతో రాష్ట్ర రాజకీయాలను శాశించిన స్థితి నుంచి పార్టీ నుంచి వలసలను నిరోధించలేని దుస్థితికి చేరుకుంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కారు దిగి చేయందుకుని కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరింత మంది అదే దారిలో ఉన్నారన్న వార్తలు వినవస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా గళమెత్తే అవకాశాలు అంతంతమాత్రమేనన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అసలిప్పుడు బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్న సీరియస్ విషయమేమిటంటే ఈ సమావేశాలకైనా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరౌతారా అన్నదే. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికే కష్టపడాల్సి వస్తున్నది. గతంలోలా అధినేత మాటే శిరోధార్యం అనే పరిస్థితి లేదు. గతంలో తాను కలవాలని భావిస్తే తప్ప మంత్రులకు కూడా ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు కేసీఆర్. అటువంటిది ఇప్పుడు ఆయన స్వయంగా ఆహ్వానించినా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. అలా డుమ్మా కొట్టిన వారంతా బీఆర్ఎస్ ను వీడడానికి రెడీ అయిపోయారనీ, ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలా డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలలో మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. వీరంతా కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. వీరి బాటలోనే మరింత మంది నడిచే అవకాశాలనూ పరిశీలకులు కొట్టి పారేయడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే బీఆర్ఎస్ కు సభలో ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి వచ్చే అవకాశాలే ఉన్నాయంటున్నారు.
అంతే కాకుండా బీఆర్ఎస్ నుంచి వలసలు ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్పీ కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి కూడా పెద్ద సమయం పట్టదని అంటున్నారు. గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే విపక్షాల బలాన్ని తగ్గించేందుకు, అసలు విపక్షమనేదే లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారో అదే దారిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.