భక్తుల సౌకర్యాల విషయంలో నో కాంప్రమైజ్.. టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీ
posted on Aug 24, 2024 @ 9:47AM
తిరుమల ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం అస్సలు రాజీపడటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంపై ఒక పక్క కసరత్తు జరుపుతూనే తిరుమల పవిత్రత, పారిశుద్ధ్యం, భక్తులకు నాణ్యమైన సేవలు వంటి విషయాలలో అలసత్వం కూడదన్న ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు తిరుమలలో వరుస తనిఖీలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం (ఆగస్టు 24) తెల్లవారు జామున తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కృష్ణ తేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, క్యూలైన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటించారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వారికి వివరించారు. కంపార్ట్ మెంట్లలో టీటీడీ అందిస్తున్న ఉప్మా నాణ్యత గురించి ఆరా తీశారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించి, కంపార్ట్మెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు, సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కంపార్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. వీక్యుసి కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే, మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్ ల లోకి ప్రవేశించే మార్గాల వద్ద కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేయడాన్ని గమనించి, డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఐటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు, స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.