పిన్నెల్లికి కండీషన్డ్ బెయిల్!
posted on Aug 23, 2024 @ 3:16PM
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హై కోర్టుకండీషన్డ్ బెయిల్ మంజూరు చేసింది . ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లోనూ పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. ఏపీలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, హత్యయత్నం కేసులు నమోదయ్యాయి.
దీంతో పిన్నెల్లిని పోలీసులు జూన్ లో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ పిన్నెల్లి జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి బెయిలు పిటిషన్ పై గురువారం (ఆసగ్టు 22) వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం (ఆగస్టు 23) వెలువరించింది. హైకోర్టును ఆశ్రయించడానికి ముందు జిల్లా కోర్టు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ను రెండు సార్లు కొట్టివేసిన సంగతి విదితమే.
అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా చెలరేగిపోయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో, డిప్రషన్ లో కూరుకుపోయారు. పల్నాడు పులిని అంటూ విర్రవీగిన ఆయన ఇప్పుడు పిల్లిలా మారిపోయారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి.. ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను బెయిలు మంజూరు చేయండి చాలు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.