ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపులకు 300 కోట్లు విడుదల
posted on Aug 24, 2024 @ 10:57AM
జగన్ హయాంలో పథకాల అమలు తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సాగింది. పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, వాటి కోసం అంటూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు జగన్. అలా పేరుగొప్ప ఊరుదిబ్బ చందంగా జగన్ హయాంలో అమలైన పథకం ఆరోగ్య శ్రీ. ఆర్భాటంగా పథకాల ప్రకటనే తప్ప ఆ పథకాల అమలుకు కావలసిన సొమ్ముల విడుదలలో మొండి చేయి చూపడంతో జగన్ హయాంలో ఆరోగ్య శ్రీ అమలు తూతూ మంత్రంగానే సాగింది. వందల కోట్లు అప్పు చేసి జగన్ సర్కార్ చేస్తున్నదేమిటయ్యా అంటే విడతల వారీగా ప్రభుత్వోద్యోగుల వేతనాలు చెల్లించడం. ఇప్పటికే అమలు చేస్తున్న బటన్ నొక్కుడు కార్యక్రమాలకు అరకొరగా నిధులు పందేరం చేయడం మాత్రమే.
జగన్ విధానాల డొల్ల తనానికి బకాయిలు పేరుకు పోయి ఆరోగ్య శ్రీ పథకం ఓ నిదర్శనం.
ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయడానికి చేతులు రాని జగన్.. సరిగ్గా ఎన్నికలకు ముందు మాత్రం ఆర్భాటంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పాతిక లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమలు కాని పథకానికి పరిమితి ఎంత పెంచితే మాత్రం నష్టం ఏమిటన్న రీతిలో జగన్ సర్కార్ తీరు ఉండేది.
జగన్ హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందంటే అతిశయోక్తి కాదు. గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో కొంచం ఆలస్యంగానైనా, అంటే ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును మూలన పడేశారు. ఈ విషయంపై ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే ప్రస్తుతం జగన్ సర్కార్ నిర్వాకం తెలుగుదేశం కూటమికి భారంగా మారింది. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లిస్తే తప్ప ఆ సేవలు అందించలేమంటూ ఆస్పత్రులు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబు సర్కార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అనుబంధ ఆస్పత్రులకు పెండింగ్ బయాయిల చెల్లింపుల కోసం 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. విడతల వారిగా బకాయిలన్నీ చెల్లించేందకు నిర్ణయం తీసుకుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాజీ ప్రశక్తే లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వాల విధి అని చాటారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పేదలకు ఆరోగ్య సేవలు నిరాటంకంగా అందాలన్న లక్ష్యంతో నిధులు విడుదల చేశారు.