పొంగులేటి నివాసాలపై ముగిసిన ఈడీ సోదాలు
posted on Sep 28, 2024 @ 10:20AM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పొంగులేటికి చెందిన పలు కార్యాలయాలలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో చేసన ఈ సోదాలలో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి క్రిప్టో, హవాలా ద్వారా లగ్జరీ వాచ్‌లు కొనగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే కేసులో పొంగులేటి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు.
ఢిల్లీ నుంచి వచ్చి ఈడీ అధికారులు 16 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు నిర్వహించాయి. హైదరాబాద్ లోని పొంగులేటి నివాసాలు, కార్యాలయాలలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు పొంగులేటి నివాసాలపై తనిఖీలు నిర్వహించడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పుడు మళ్లీ సోదాలు నిర్వహించాయి. అయితే ఈడీ సోదాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బీజేపీ రాజకీయ వేధింపులలో భాగమే ఈ సోదాలు అని విమర్శలు గుప్పిస్తున్నది. కేంద్రంలోని మోడీ సర్కార్ తన రాజకీయ కక్ష సాధింపునకు ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని విమర్శిస్తున్నది.
ఇలా ఉండగా మంత్రి పొంగులేని వినాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈడీ నిర్వహించిన సోదాలలో పెద్ద ఎత్తున సొమ్ము బయటపడినట్లు తెలుస్తోంది. అనధికారిక సమాచారం మేరకు పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ నిర్వహించిన సోదాలలో బయటపడిన సొత్తు లెక్కించేందుకు రెండు కౌంటింగ్ మిషన్లను ఈడీ అధికారులు వినియోగించినట్లు చెబుతున్నారు. పొంగులేటి నివాసాలు, కార్యాలయాలు, ఆయన బంధువుల నివాసాలు సహా మొత్తం 15 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం (సెప్టెంబర్ 27) ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకూ సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పొంగులేటి కీలక మంత్రి కావడంతో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రం నుంచి ఈడీ అధికారులు నేరుగా రంగ ప్రవేశం చేశారు. ఇక్కడి ఈడీ అధికారులకు ఈ దాడుల గురించి కనీస సమాచారం కూడా లేదని చెబుతున్నారు.