అనుకున్నదే అయ్యింది.. జగన్ తిరుమల టూర్ ఆగింది!
posted on Sep 27, 2024 @ 3:51PM
అనుకున్నట్లే జరిగింది. డిక్లరేషన్ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు కావడానికి కారణమైంది. జగన్ టీటీడీ కోరినట్లు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారని.. ఆయన గురించి తెలిసిన వారెవరూ అనుకోలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ అడుగులు పడ్డాయి. భూమన కరుణాకరరెడ్డి వంటి నాస్తికుడికి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మానికి వ్యతిరేకి అని చెప్పలేం కానీ ఆయన కచ్చితంగా హిందువు అయితే కాదు. ఇది జగమెరిగిన సత్యం.
కానీ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం తిరుమలలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఆయన హిందూ ధర్మానికి బద్ధ విరోధి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఈ మేరకు గత ఐదేళ్లలో హిందూ సమాజం మొత్తం తిరుమలలో జగన్ చేస్తున్న అరాచకాలపై గగ్గోలు పెట్టింది. తీరు మార్చుకోవాలని సూచించింది. జగన్మోహన రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో అన్యమత ప్రచారం మొదలు, ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో చెప్పనలవి కాదు. జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ రక్షణ కోసం కాదు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగీ తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దారుణగా దెబ్బతీశాయి. వారిని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు సహా జరిగిన అపచారాలకు లెక్కేలేదు.
తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేశారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన చెప్పిన దాని కల్లా తలూపుతూ టీటీడీ ఒక ధార్మిక సంస్థ అన్న విషయాన్నే మరిచి పోయింది. ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దోపిడీయే. తిరుమల వెంకన్నకు భక్తులు నిలువుదోపిడీ ఇస్తారు. అయితే జగన్ హయాంలో భక్తులకు ఆ అవకాశం లేకుండా కొండపైకి వచ్చిన భక్తులను టీటీడీయే నిలువు దోపిడీ చేసేసిందంటే అతిశయోక్తి కాదు. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి దప్పికలు తీర్చేందుకు గతంలో సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణ ఆగిపోయింది. కనీసం జలప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది.
ఇదంతా ఒకెత్తు అయితే, గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి. ఇలా తిరుమల కొండపై జగన్ హయాంలో దేవునికి జరగని అపచారం లేదు. ఉద్దేశ పూర్వకంగా తిరుమల దేవునికి జగన్ హయాంలో అపచారం జరిగింది. ఇప్పుడు అదే కొండపైకి ఎమ్మెల్యే హోదాలో జగన్ వెళ్లడానికి డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిన పరిస్థితి ఇప్పడు జగన్ కు ఎదురైంది. అయితే ఓట్ల కోసం తప్ప హిందూ దేవాలయాలక వెళ్లే ప్రసక్తే లేదని చెప్పే జగన్ ఎప్పుడో ఐదేళ్ల తరువాత జరిగే ఎన్నికలలో లబ్ధి కోసం ఇప్పుడు తిరుమల వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇస్తారని పరిశీలకులు అంటున్నారు. అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు.