పేట్ బషీర్ బాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ 

మాదకద్రవ్యాలకు తెలంగాణ రాజధాని అడ్డాగా మారింది. గోవా నుంచి  మత్తు పదార్థాలను  తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఎండిఎంఏ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.  కారులో హైదరాబాద్  పేట్ బషీర్బాద్ కు కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఇటీవల డ్రగ్స్  కు అలవాటు పడ్డ వారు ఎక్కువయ్యారు. యువత టార్గెట్ గా డ్రగ్స్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న పాన్ షాప్ లలో మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. డ్రగ్స్ నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. 

పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం!

టట్టటాయ్.. బ్రేకింగ్ న్యూస్.. టట్టటాయ్... ఫ్లాష్ న్యూస్.. పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం... మన పవన్ కళ్యాణ్ ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అవును.. నిజంగానే అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఆ అనాథాశ్రమం పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీకు చాలా ఇంట్రెస్ట్.గా వుంది కదూ! అబ్బ... ఆశ, దోశ, అప్పడం, వడ... ఇంత హాట్ న్యూస్ మొత్తాన్నీ వెంటనే చెప్పేస్తామా ఏంటి? ముందు పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెబుతాం. ఆ తర్వాతే ఆ అనాథాశ్రమం గురించి చెబుతాం... ఏమంటారు? ఆ.. మీరేమంటారూ? ఎక్కువగా సాగదీయకుండా ప్రొసీడైపొమ్మంటారు... అంతేగా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పవర్‌స్టార్‌తో సినిమాలు తీయడానికి, కోట్లకు కోట్లు డబ్బు ఇవ్వడానికి రెడీగా వున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఆ డబ్బు వద్దంటే వద్దు...  ప్రజాసేవే నాకు ముద్దు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని పెట్టారు. ఎన్నో అవమానాలు భరించారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు. త్యాగాల త్యాగరాజు ఆయన. ఎన్ని బాధలు పడితేనేం... మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన దానధర్మాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన మరో గొప్పపని అనాథాశ్రమాన్ని స్థాపించడం. మొన్నీమధ్యే వరద బాధితుల కోసం ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.  అప్పుడు ఆయన్ని చాలామంది ఆపద్బాంధవుడు అని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనాథ రక్షకుడు కూడా అయ్యారు. ఏ ఆధారం లేక.. పట్టించుకునేవారే లేక.. ఏం చేయాలో అర్థం కాక, దిక్కూమొక్కూ లేకుండా వున్నవారిని ఆ అనాథాశ్రమంలోకి తీసుకుంటున్నారు. నా అనేవాళ్ళు లేనివారికి నేనున్నానంటూ తన చేతిని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఆనందంతో మురిసిపోతున్నారు. కొంతమంది కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతున్నాయి. కొంతమంది ఆయన కాళ్ళమీద పడిపోతున్నారు. ఇంకొంతమంది ఆయన్ని గాఠ్ఠిగా కౌగిలించుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఊరికే వుండటం లేదు. తమకు తెలిసిన మరికొంతమందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేర్చుతున్నారు.  అలాంటి అనాథలందరితో పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం కళకళలాడుతోంది. ఇంతకీ అనాథాశ్రమం అంటే, నిజంగా దిక్కూమొక్కూ లేనివాళ్ళని అక్కున చేర్చుకునే అనాథాశ్రమం అనుకున్నారా? కాదండీ బాబూ... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దిక్కూమొక్కూ లేని రాష్ట్రంగా చేసినవాళ్ళని దగ్గరకి చేర్చుకునే అనాథాశ్రమం. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీనే అనాథాశ్రమంగా మార్చేశారు. జగన్ పార్టీలో అనాథల్లా దిక్కూమొక్కూ లేకుండా పడి వున్నవాళ్ళందర్నీ తన పార్టీలో చేర్చుకుంటున్నారు. జగన్ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నాయకులు చాలామంది అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేశారు. ఇప్పుడు ఆ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో వాళ్ళందరూ అధికారంలేని అనాథలుగా మారిపోయారు. సంపాదించింది చాలక, ఇంకా సంపాదించే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారి అధికార ఆకలిని పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమం పుణ్యమా అని జగన్ పార్టీలో వున్న అనాథలందరికీ మంచి ఆశ్రయం దొరుకుతోంది. పవన్ కళ్యాణ్ ఇలాగే అలాంటివాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ వుంటే, కొంతకాలానికి పవన్ కళ్యాణ్ పార్టీని ‘జనసేన’ అనరు... ‘జగన్ సేన’ అంటారు!

లడ్డూ వివాదం.. కేసీఆర్ మౌనం జగన్ కోసమేనా?

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించని రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ గాంధీ కూడా లడ్డూ ప్రసాదం వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిచేందుకు వీల్లేదన్నారు.  అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ వివాదంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. ఆయనే కాదు ఆ పార్టీకి చెందిన ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. సమయం అయినా కాకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నంత కాలం నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారు అంటూ పదే పదే తనను తానే ఓ పెద్ద హిందూ వాదిగా ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డూ వివాదం విషయంలో మౌనంగా ఉండటం బీఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది.  కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడూ, అధికారం కోల్పోయిన తరువాత కూడా యాజ్ణాలు చేశారు. హిందూ ధర్మానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకోవాలని తహతహలాడారు. అటువంటి కేసీఆర్ తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో అనూహ్యంగా మౌనాన్ని ఆశ్రయించారు.  అయితే నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారంటూ ప్రకటనలు గుప్పించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈ విషయంలో మాత్రం స్పందించడం లేదు.  లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ఈ అంశాన్నే హైలైట్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ అంశంపై స్పందించాయి. కానీ పరమ భక్తుడిని అని చెప్పుకునే కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. బీఆర్ఎస్ నేతలెవరూ కూడా స్పందించలేదు.  బహుశా తన మౌనం వల్ల జగన్ కు ఏమైలా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే జగన్, కేసీఆర్ ల రాజకీయ స్నేహబంధం తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావడానికి అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన వంతు సహకారం అందించారు. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి సాగర్ డ్యాం వద్ద హంగామా సృష్టించి జగన్ తన వంతు సాయం చేశారు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందనుకోండి అది వేరే సంగతి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ విజయం సాధించబోతున్నారంటూ..కేసీఆర్ జోస్యం చెప్పి ఏదో మేరకు జగన్ కు సాయపడేందుకు కేసీఆర్ శతథా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదనుకోండి. ఇక ఇప్పుడు లడ్డూ వివాదం విషయానికి వస్తే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో జగన్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పాతాళానికి పతనమైంది. ఈ తరుణంలో కేసీఆర్ తన మౌనం ద్వారా ఏదో మేరకు జగన్ కు ప్రయోజనం లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనను తాను పరమ భక్తుడిగా ప్రకటించుకునే కేసీఆర్ దేవుడికి సంబంధించిన అంశంలో కూడా రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.  

 కల్తీ లడ్డూపై జనసేన అగ్రహం...జగన్ దిష్టిబొమ్మ దహనం

తిరుపతిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. తిరుపతిలో కల్తీ లడ్డూ తయారీకి పాల్పడ్డ  గత వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.  తిరుపతి లడ్డూ కల్తీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో జరిగిన ఈ కల్తీ గూర్చి విని భక్తులు మనోవేదనకు గురయ్యారు.  పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.  కమిషన్లకు కక్కుర్తిపడ్డ వైసీపీ నాయకులు ఈ కల్తీకి పాల్పడ్డారని జనసేన నేతలు అంటున్నారు. వైసీపీ నేతల దిష్టి బొమ్మలను జనసేన నేతలు చెప్పులతో కొట్టి దహనం చేశారు. జగన్ దిష్టి బొమ్మను వారు రహనం చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు పలువురు జనసేనలో చేరిన నేపథ్యంలో జనసేననేతల చేపట్టిన ఈ ఆందోళన వల్ల కూటమి మరింత బలోపేతమైంది. 

వైసీపీ నుంచి వలసల వరద!

ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అన్న బేధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పుట్టి మునిగిపోతోంది. ఆ పార్టీ నుంచి వలసల వరద వెల్లువెత్తుతోంది. ఆ వలసల వరద ధాటికి వైసీపీ గేట్లు పగిలిపోతున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి  చేరిపోతున్నారు. దీంతో వైసీపీ బైసీపీగా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలా పార్టీ రాష్ట్రంలో ఉనికి మాత్రంగానైనా నిలిచే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. అంతెందుకు జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల అయితే వైసీపీలో జగన్ వినా మరెవరూ మిగిలే పరిస్థితి కనిపించడం లేదని కుండబద్దలు కొట్టేశారు. చివరాఖరికి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా వైసీపీని వీడడం ఖాయమని షర్మిల జోస్యం చెప్పారు. ఆ జోస్యం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం వైసీపీ నుంచి జనసేనలోకి క్యూకడుతున్న నేతల జాబితా చూస్తుంటే వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని చెప్పకతప్పదంటున్నారు పరిశీలకులు. సీఎం నుంచి మాజీ సీఎంగా డిమోట్ అయిన క్షణం నుంచీ జగన్ నోట తరచుగా పదవులు శాశ్వతం కావు అన్న సూక్తి వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో వలసలను చూస్తుంటే జగన్ మాటలు ఆయన పార్టీ నేతలు బాగా వంటబట్టించుకున్నారని అనక  పదవి ఎటూ శాశ్వతం కాదు.. కనీసం అధికారం ఉన్న పార్టీ పంచనో, కూటమిలోనో ఉంటే బెటర్ కదా అనుకుంటున్నట్లున్నారు. అందుకే జగన్ కు, ఆయన పార్టీకీ గుడ్ బై చెప్పేసి జనసేనాని చెంతకు చేరిపోతున్నారు. సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కిలారు రోశయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చిన్నదేమీ కాదు.. కొండవీటి చాంతాడులా అలా సాగుతూనే ఉంటుంది.  ఇలా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్న వారిలో 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలైన వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే నియోజకవర్గంలో తమకు పెద్ద ప్రాధాన్యత ఉండే అవకాశాలు లేవని తెలిసీ వారు జగన్ తో తెగతెంపులు చేసుకుంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. ఇక వైపీపీ నుంచి జనసేనలోకే పెద్ద సంఖ్యలో నేతలు ఎందుకు వలస వెడుతున్నారంటే.. తెలుగుదేశం వైసీపీ నంచి చేరికలకు తలుపులు మూసేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య వంటి వారి చేరికలు, చేరికలకు ముహూర్తాలు ఖరారైపోగా ఇంకా ఈ జాబితాలో మాజీ మంత్రి విడదల రజనీ, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి వంటి పేర్లు కూడా చోటు చేసుకోనున్నాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజలలో బాగా పాపులర్ అయిన కేతిరెడ్డి తాను వైసీపీని వీడే ప్రశక్తే లేదని చేసిన ప్రకటనను పరిశీలకులు విశ్వసించడం లేదు. ప్రస్తుతం కాకపోయినా రేపో తరువాతో ఆయనా వైసీపీకి బైబై చెప్పేయడం ఖాయమంటున్నారు.  అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ వంటి వారు కూడా జగన్ పార్టీకి జెల్ల కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు.  రానున్న రోజుల్లో వైసీపీని వీడే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందనీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ వలసల క్యూలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. 

తేనెటీగల దాడిలో ఇద్దరు కూలీలు మృతి, ముగ్గురి  పరిస్థితి విషమం

రాజమౌళి  ‘ఈగ’చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో విలన్  క్యారెక్టర్లో సుదీప్ నటించాడు. హీరో నానిని హత్య చేస్తే మరో జన్మలో నాని ఈగ రూపంలో జన్మిస్తాడు. హీరోయిన్ సమంతకు ఈ విషయం తెలిసిపోతుంది. హీరో ఈగ, సమంతలు కల్సి సుదీప్ ను హత్య చేస్తారు. .ఈగను అగ్నికి అహుతి చేయాలని ప్రయత్నించి తానే ఆ మంటల్లో అహుతి అవుతాడు సుదీప్.   అది రీల్ స్టోరీ. ఇది  మాత్రం రియల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులు చేసుకునే కూలీలను తేనెటీగలు  దాడి చేసి హత్య చేశాయి.  లక్షలాది తేనెటీగలు ;పొలం పనులకు వచ్చిన ఇద్దరు కూలీలను పొట్టనబెట్టుకున్నాయి.   ఎప్పటి మాదిరిగా సద్దిమూట కట్టుకుని పొలం పనులకు వచ్చిన ఈ కూలీల బతుకు అదే రోజు తెల్లారిపోయింది. తాము వెంట తెచ్చుకున్న సద్ది మూటే  వారికి చివరి  మెతుకులయ్యాయి.    ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో కిల్లరి కాంతమ్మ, కిల్లరి కిష్టప్ప ఉన్నారు. వీరిరువురు భార్య భర్తలు.  మరో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కెజీహెచ్ కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేయడంతో ప్రస్తుతం అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. నేరం జరగగానే పోలీసులు సీన్లో ఎంటరయ్యారు.తేనెటీగల దాడి వివరాలను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.   

వరద బాధితుల కోసం భారీగా విరాళాలు!

ఆంధ్రప్రదేశ్‌లో  వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.   అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్   రూ.67,29,398 చెక్కును ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కి అందించింది.  అలాగే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించారు.  అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అలాగే టాలీవుడ్‌ యువ నటుడు  హైపర్‌ ఆది  3 లక్షల రూపాయలు  విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి చెక్కు అంద చేశారు.

నేడే ఢిల్లీ సీఎంగా ఆతిషి ప్రమాణం!

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్   మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు  మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం  సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  అతిషితోపాటు ఆమె కేబినెట్‌‌లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్,  సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, ముఖేశ్ అహ్లావత్‌లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

తిరుమలలో సంప్రోక్షణకు సీఎం ఆదేశం!

తిరుమల పవిత్రతను పునరుద్ధరించే విషయంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ  హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత పవిత్రమైన లడ్డూ అపవిత్రం కావడాన్ని తీవ్రంగా  పరిగణించారు. లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో తిరుమల అపవిత్రం అయిందని భావించిన సీఎం క్షేత్రాన్ని పవిత్రం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో తొలుత లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని ఆదేశించారు.

వర్షాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

భారత వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్ ఎలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తగూడెం, నిర్మల్, అసిఫీబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఈ రోజు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు అంటే ఆదివారం నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

గ్యాస్ పైప్ లైన్ లీక్!

యానాం వద్ద గోదావరి నదిలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. యానాం సమీపంలోని దరియాల తిప్ప, బలుసు తిప్ప మధ్య గోదావరి నదిలో ఈ గ్యాస్ లీక్ ను గుర్తించారు.  ఈ రోజు తెల్లవారు జామునుంచి గోదావరి నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి ఎగసి వస్తోంది. దీంతో చుట్టుపక్కల కిలో మీటర్ల మేర గ్యాస్ వ్యాపించింది. ఏ క్షణంలోనైనా మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళలను వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ ను అరికట్టేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా  చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  ఉమ్మడి తూర్పుగోదావరి  జిల్లాలో   గ్యాస్ లీక్ ఘటనలు, గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 

లడ్డూ వివాదం.. అన్ని రాష్ట్రాలూ అలెర్ట్!

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కర్నాటక సర్కార్  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అధీనంలోని  అన్ని ఆలయాలలో నందినీ నెయ్యినే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వం అయితే తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపింది. మరో వైపు రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం నాణ్యతను పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఆదేశించింది. దీంతో రాజస్థాన్ లోని అన్ని ఆలయాలను తనిఖీ చేయాని ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 26 వరకూ రాజస్థాన్ లోని అన్ని ఆలయాలలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రసాదం నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపుతారు.  

ఎన్ఐటీ పాట్నాలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య

పాట్నా ఎన్ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విద్యార్థిని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కన్పించింది. మృతురాలి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. విద్యార్థిని మరణించడంతో తోటి విద్యార్థులు భారీ సంఖ్యలో క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఎన్ఐటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఇలాంటి ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. 

తిరుమల లడ్డూ ఎఫెక్ట్.. ప్రసాదాల తయారీకి నందినీ నెయ్యే వాడాలి.. కర్నాటక సర్కార్ ఆదేశాలు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి  వినియోగం ఎఫెక్ట్ తో కర్నాటక సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రసాదం తయారీకి నందిని నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.   తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు అవశేషాలు వెలుగుచూశాయని, నాణ్యత తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంతో కర్ణాటక తాజా ఆదేశాలిచ్చింది. ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం తిరుమల లడ్డూ వివాదంతో అలర్ట్ అయ్యింది.   తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన  ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీలో తమిళనాడు ఫుడ్ సేప్టీ అధికారులు విస్తృతంగా తనీఖీలు నిర్వహించారు. దిండిగల్ లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్‌ సేకరిం సేకరించి ల్యాబ్‌కు పంపారు.  అధికారులు.   పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు చెబుతున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. కాగా టీటీడీ నెయ్యి వివాదంపై   ఏఆర్ డెయిరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డెయిరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది.  

తిరుమల లడ్డూ వివాదం.. జగన్ హయాంలో దేవాలయాలపై దాడుల కొనసాగింపేనా?

జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ  నాణ్యత నాసిరకంగా ఉండటానికి కారణంపై ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి తెరలేపాయి. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లుగా ఆయన చేసిన ఆరోపణలు పూర్తి విస్తవాలు అనడానికి నిదర్శనంగా ల్యాబ్ రిపోర్టులను తెలుగదేశం నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి బయటపెట్టారు. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.   చంద్రబాబు లడ్డూ తయారీలో నాణ్యతపై చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పడు జాతీయ స్థాయిలో  అత్యంత ప్రధానమైన అంశంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వ హయాంలో అరచకాలకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా కర్నాటక మిల్క్ ఫెడరేషన్  సరఫరా చేస్తున్న నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి వేరే వ్యక్తులకు కాంట్రాక్టు ఇవ్వడం.. నెయ్యి నాణ్యతను పట్టించుకోవడం మానేయడం వల్లనే లడ్డూ క్వాలిటీ దెబ్బతిందంటూ జాతీయ చానెళ్ల పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. టీవీల్లో చర్చలు పెట్టడంతో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.   సాయంత్రం నుంచే జాతీయ స్థాయిలో తిరుమల లడ్డు టాపిక్ ట్రెండ్ అయింది. ఒక దశలో ఇండియాలో నంబర్ వన్ టాపిక్‌గా మారింది. దీంతో పాటుగా జగన్ పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగానే కాదు  ప్రపంచం నలుమూలల నుంచీ శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమల దేవుడి ప్రసాదం అయిన లడ్డూను పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు జరిగిందని వెల్లడి కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వైసీపీపై మరీ ముఖ్యంగా జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీజేపీ, కేంద్రం కూడా ఈ విషయాన్ని యమా సీరియస్ గా తీసుకున్నాయి. హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారంపై, నెయ్యి కల్తీపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు.  ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ తరఫున ఇటీవలి సార్వత్రిక ఎన్నకలలో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాధవీలత ఏకంగా తిరుమలలో అత్యాచారం జరిగింది. ఇక హైందవ యుద్ధం మొదలౌతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఒక తిరుమల లడ్డూ ప్రసాదమేనా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక దేవాలయాలలో ప్రసాదం విషయంలో కూడా ఇటువంటి అపచారాలు జరిగాయా అన్న అనుమానాలు భక్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. తిరపతి అలివేలు మంగాపురంలోని అమ్మవారి ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, చిన్న తిరుమతి, అన్నవరం సత్యనారాయణ స్వావి వారి దేవాలయం, సింహాచలం అప్పన్న ఆలయం.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధీనంలోని దేవాలయాలలో కూడా ప్రసాదాల తయారీలో ఇటువంటి అపచారం జరిగి ఉంటుందా అన్న భక్తుల అనుమాలను నివృత్తి చేయడానికి అన్ని ఆలయాలలో ప్రసాదాల నాణ్యతపై పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.  కలియుగ దైవంగా హిందువులు  విశ్వసించే తిరమల దేవుడి ప్రసాదం తయారీలోని జగన్ హయంలో ఇంతటి అపచారం జరిగిందంటే... రాష్ట్రంలోని ఇతర దేవాలయాలలో అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదని పలువురు అంటున్నారు. ఈ సందర్భంగా అన్నవరం దేవాలయంలో ప్రసాదం నాణ్యతపై గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. . కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరుమలతో సహా రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలలో ప్రసాదాల తయారీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు, దేవుడి విగ్రహాల ధ్వంసం జరిగిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న అన్ని ఆలయాలలో ప్రసాదం తయారీపై సమగ్ర విచారణ జరిపిస్తేనే జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వెలుగులోనికి వస్తాయని అంటున్నారు.      జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది.   జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం బయటకు రావడంతో జనం జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను గుర్తు చేసుకుంటున్నారు.  జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులన్నీఎత్తి చూపుతూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.