ముడా భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్ 

ముడా భూ కుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. సమాచార హక్కు చట్టం క్రింద ముడా కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో కర్నాటక గవర్నర్ విచారణకు అనుమతించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్రింద సిద్దరామయ్యపై విచారణ కొనసాగుతోంది.  లోకాయుక్తలో కూడా సిద్ద రామయ్యపై ఫిర్యాదు దాఖలైంది.   గవర్నర్ ఆదేశం ప్రకారం సిద్దరామయ్యపై విచారణ ప్రారంభమైంది.  తనపై  విచారణను  సవాల్ చేస్తూ   సిద్దరామయ్య  హైకోర్టు నాశ్రయించారు.  అయితే హైకోర్టు సిద్దరామయ్య పెట్టుకున్న అర్జీని తిరస్కరించింది.    ముడా భూ కుంభకోణంలో సిద్దరామయ్య కుటుంబీకులే లాభ పడ్డారని సామాజిక కార్యకర్తలు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య సుప్రీంకోర్టు నాశ్రయించనున్నట్లు తెలుస్తోంది.   

ఏపీలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు. పదవులు అందుకున్నవారిలో ముగ్గురు జనసేన పార్టీకి చెందినవారు, ఒకరు బీజేపీకి చెందిన వారు వున్నారు. 1. అబ్దుల్ అజీజ్ (వక్ఫ్ బోర్డు), 2. అనిమిని రవినాయుడు (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్), 3. బత్తుల తాతయ్య బాబు (ఏపీ హౌసింగ్ బోర్డు), 4. బొరగం శ్రీనివాసులు (ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్), 5. దామచర్ల సత్య (ఏపీ మారిటైమ్ బోర్డు), 6. దీపక్ రెడ్డి (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్), 7. దినకర్ లంక (బీజేపీ) - (20 పాయింట్స్ ఫార్ములా), 8. కర్రోతు బంగార్రాజు (ఏపీ మార్క్.ఫెడ్), 9. మన్నే సుబ్బారెడ్డి (ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్), 10. మంతెన రామరాజు (ఆంధ్ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్), 11. నందం అబద్దయ్య (ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 12. నూకసాని బాలాజీ (ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 13. కొనకళ్ళ నారాయణ (ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ), పి.ఎస్.మునిరత్నం (వైస్ ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ), 14. పీలా గోవింద సత్యనారాయణ (ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 15. పిల్లి మాణిక్యాలరావు (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 16. పీతల సుజాత (ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్), 17. తమ్మిరెడ్డి శివశంకర్ (ఆంధ్రప్రదేశ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్), 18. తోట మెహర్ సీతారామ సుధీర్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్), 19. వజ్జా బాబూరావు (ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్), 20. వేములపాటి అజయ్ కుమార్ (ఏపీ టౌన్‌షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.

రోజాకి పంచ్ పడిందిగా.. పరువు పోయిందిగా!

అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఏంటో వైసీపీ నాయకురాలు రోజాని చూస్తే అర్థమవుతుంది. ఏ విషయంలో అయినా నోరు వేసుకుని పడిపోతూ, అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి రోజా ప్రయత్నిస్తూ వుంటారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ విషయంలో కూడా ఆమె తన నోటికి పనిచెప్పారు. సోమవారం నాడు తన సొంత యూట్యూబ్ ఛానల్లో కర్ణకఠోరంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆమె తన యూట్యూబ్ ఛానల్లోనే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే, ‘తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది?’. దీనికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ఫొటోలు పెట్టి మూడు ఆప్షన్లు ఇచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ తప్పు అని 7 శాతం, చంద్రబాబు తప్పు అని 20 శాతం, జగన్‌దే తప్పు అని 73 శాతం ఓట్లు పడ్డాయి. మరో ప్రశ్న ఏమిటంటే, ‘వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది?’ ఈ ప్రశ్నకు చంద్రబాబు పాలన బాగుందని 80 శాతం మంది ఓట్లు వేస్తే, వైఎస్ జగన్ పాలన బాగుందని 20 శాతం మంది అన్నారు. రోజా పెట్టిన ఈ ఓటింగ్‌లో వైఎస్ జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ పోలింగ్ నిలిపివేయకుండా ఉంచడం విశేషం. పోలింగ్ సంగతి అలా వుంటే, పోలింగ్ కింద వున్న కామెంట్లు అయితే మామూలుగా లేవు. రోజాని, జగన్‌కి దారుణంగా తిడుతున్నారు. ఆ తిట్లను మనందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇవ్వడం లేదు. ఇలా పోలింగ్ పెట్టడం ద్వారా అడిగి మరీ తన్నించుకుంటున్న రోజాకి అభినందనలు.  ఆర్కే రోజా తన యూట్యూబ్ ఛానల్ని సంవత్సరం క్రితం ప్రారంభించారు. తాను దగ్గినా, తుమ్మినా కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేశారు. వెయ్యికి పైగా వీడియోలు వున్నాయి. కాకపోతే ఛానల్ డిస్క్రప్షన్ చూస్తే మాత్రం జాలి కలిగేలా వుంది. ఎందుకంటే, దాంట్లో రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగానే వుంది. పాపం రోజా తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేదని అర్థమవుతోంది. 

నెయ్యి కల్తీపై సిట్ విచారణ!

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవో ఈ సాయంత్రంలోగా విడుదలయ్యే అవకాశం ఉంది.  కాగా లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో డీజీపీ ద్వారకాతిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చంద్రబాబుతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం కూడా వీరు మరో సారి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీల్లో సీట్ చీఫ్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజి ఐజి సర్వసేష్ట త్రిపాఠిని నియమించారు. సిట్ డిఐజిగా విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి, సీట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు.

రఘురామ  టార్చర్ కేసులో విజయపాల్ కు బెయిల్ నిరాకరణ 

ఉండి ఎమ్మెల్యే రఘురామ    కస్టోడియల్   టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న మాజీ అదనపు ఎస్పి విజయపాల్ కు చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం తిరస్కరించింది.  కస్టోడియల్ టార్చర్ కేసులో  ఎవన్ గా ఉన్న ఐపిఎస్ అధికారి పిఎస్సార్ ఆంజనేయులు జెత్వాని కేసులో సస్పెండ్ అయ్యారు. ఎ 3గా మాజీ సిఎం జగన్  ఉన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో న్యాయస్థానం బెయిల్ కు నిరాకరించింది ఎమ్మెల్యే రఘురామ ఇచ్చిన ఫిర్యాదుమేరకు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టోడియల్ టార్చర్ లో రఘురామ తీవ్రగాయాలకు గురైనట్టు సుప్రీం కోర్టు అభిప్రాయన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి హైకోర్టు వాయిదావేసింది. 

ధాన్యం మొత్తం కొంటాం.. ఉత్తమ్!

రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ  పౌర సరఫరాల శాఖామంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందు కోసం తెలంగాణ వ్యాప్తంగా  7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   మంగళవారం ఉదయం మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 2023-24 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోనీ జాయింట్ కలెక్టర్ లు,జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో  సమీక్షా సమావేశం నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు.  

కాళేశ్వరం నిర్మాణ సంస్థకు నో క్లియరెన్స్ సర్టిఫికేట్ 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికేట్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కారు వేసిన ఈ కమిషన్  రద్దు చేయాలని ఇప్పటికే బిఆర్ఎస్ న్యాయస్థాన్ని ఆశ్రయించింది. రద్దు చేయడం కుదరదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో విజెలెన్స్ శాఖ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక విచారణ చేపడుతున్న కమిషన్ కు చేరకముందే నిర్మాణ సంస్థకు ఇచ్చిన  క్లియరెన్స్  సర్టిఫికేట్ ను ప్రభుత్వం రద్దు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు కుంగిపోవడంతో తిరిగి అదే సంస్థ మరమ్మత్తులు చేసిన తర్వాతే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది.  ఈ ప్రాజెక్టులో పని చేసిన ఇంజినీర్లకు ప్రభుత్వం నిలుపుదల చేసింది. డ్యామ్ సేప్టీ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం భావిస్తుంది. బహిరంగ విచారణకు ఈ బ్యారేజికి చెందిన ఆరుగురు ఇంజినీర్లు విచారణ కమిషన్ ముందు హాజరుకానున్నారు. బుధవారం నుంచి ఈ నెల 25 వరకు కమిషన్ విచారణ జరగనుంది.  ఇప్పటికే 15 మంది ఇంజినీర్లను కమిషన్ విచారించింది. ప్రభుత్వానికి విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక తర్వాత బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

3న తిరుమలలో పవన్ ‘వారాహి సభ’!

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..  11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష  చేపట్టిన విషయం విదితమే. స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి  ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆయన తన దీక్షను తిరుమలలో విరమించనున్నారు.  అందు కోసం అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమల చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం దీక్షను విరమిస్తారు.  3న తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 

కర్నూలులో హైకోర్ట్ బెంచ్.. సీఎం గ్రీన్ సిగ్నల్!

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రదిపాదనను కేంద్రానికి పంపుతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు.   రాజ‌ధాని అమరావతిలో   బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా వంద ఎకరాల్లో ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెడతామని స్పష్టం చేశారు.

ఆంధ్రాతో పోలిక ఎందుకు హరీషూ!

బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇంకా రాజకీయాల్లోనే వున్నారు. ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికే అన్నట్టుగా ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ఉనికిని నిరూపించుకోవడానికే తప్ప విషయం ఏమీ లేదన్నట్టుగా ఏవో నాలుగు కామెంట్లు చేసి మీడియా సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. అధికారులు రెచ్చిపోవద్దు’’ అని  ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన తన స్టేట్‌మెంట్‌ని అక్కడతో ఆపితే బాగుండేది. దాన్ని ఇంకొంచెం సాగదీస్తూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు. ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు. అధికారంలో వున్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంది’’ అన్నారు.  అయినా, తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకు ఎందుకో అర్థం కావడం లేదు. అలా పోల్చదల్చుకుంటే పక్క రాష్ట్రంతో ఎందుకు... తమ పార్టీ పదేళ్ళ పాలనతో పోల్చి చెప్పొచ్చు కదా. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో నాయకులు, వాళ్ళకి అనుకూలంగా అధికారులు ఈ ప్రభుత్వం శాశ్వతంగా వుంటుందనుకుని రెచ్చిపోయారు. చివరికి ఏమైంది? ప్రజలు బాగా బుద్ధిచెప్పారు. తమను తామే ఉదాహరణగా చెప్పుకుంటే సరిపోయేదానికి హరీష్ రావు పక్క రాష్ట్రంలో  విషయాలను ప్రస్తావించడం ఎందుకో! అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు జగన్ పాలన అదిరిపోయేలా సాగిందని, మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం వుందని కేసీఆర్ ఆమధ్య కనపడినవాళ్ళందరికీ చెప్పారు. మరి ఇప్పుడు హరీష్ రావేమో వైసీపీ పాలనలో అధికారం శాశ్వతంగా వుంటుందనుకుని అధికారులు రెచ్చిపోయారు అంటున్నారు. హరీష్ రావు ఇలా జగన్ ప్రభుత్వాన్ని తెగిడితే మామయ్య కేసీఆర్ హర్టవుతారు కదా! ఈ చిన్న లాజిక్‌ని హరీష్ రావు ఎలా మిస్సయ్యారో!

పెద్దిరెడ్డి, ఆర్కే రోజా దర్శనం టిక్కెట్ల స్కామ్!

జగన్ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్ మాల్ చేసి మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకొన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ వాళ్లు శ్రీవారి సొమ్మును దోచుకున్నారని ఆయన విమర్శించారు. దైవసేవ సేవచేయాల్సిన మాజీ ఈవో ధర్మారెడ్డి జగన్ పార్టీ నాయకుల సేవలో తరించారని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. "పర్యాటకశాఖకు ప్రతిరోజూ 1000 దర్శనం టికెట్లు ఇస్తారు. వాటిలో 800 టికెట్లు మాజీమంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో నిర్వహించే 'కళాధర్ ట్రావెల్స్'కి ఇచ్చేవారు. హైదరాబాద్, బెంగళూరు, కడప, కర్నూలు, గంగావతి ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ టికెట్లు అమ్మేవారు. ఒక్క కళాధర్ ట్రావెల్స్.కి మాత్రమే  అన్ని టికెట్లు ఇవ్వడంలో రహస్యం, అంతర్యం ఏమిటి?" అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఈ 800 టికెట్లను రద్దీని బట్టి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకూ అమ్మేవారని వర్ల ఆరోపించారు.  ఒక్క కళాధర్ ట్రావెల్స్ వారికే అన్ని టికెట్లు ఇవ్వడం ఏమిటి? అని వర్ల ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పర్యాటక శాఖ మంత్రి రోజా విషయానికి వస్తే.. నిజానికి ఆమె మంత్రి అయిన తర్వాత శ్రీవారి దర్శనాల్లో అందినంత డబ్బు దండుకోవడం మాత్రమే కాదు. ఎమ్మెల్యేగా వున్నప్పుడు కూడా నెలనెలా లక్షలాది రూపాయలు అక్రమ మార్గాల్లో దండుకునే వారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు నెలకు ఒకసారి  ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలకు అదనంగా, ఆ ఒక్క సందర్భంలో ఎమ్మెల్యే వెంట వచ్చే భక్తులను భారీ సంఖ్యలో అనుమతించేవారు. ప్రోటోకాల్ దర్శనం టిక్కెట్ ధర బ్లాక్ మార్కెట్‌లో ఒక్కొక్కటి 20 వేల వరకు కూడా పలుకుతూ వుంటుంది. ఈ టికెట్లను తాను ఏర్పాటు చేసుకున్న దళారీ ఉద్యోగుల ద్వారా రోజా విక్రయించి దండుకునేవారని ఆరోపణలున్నాయి. అలాగే బుక్ మై దర్శన్ పోర్టల్ ద్వారా కూడా టిక్కెట్ల బుక్కింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు.

ముంబై నటి జెత్వానీ కేసు.. కుక్కల రిమాండ్ రిపోర్టులో సస్పెండైన ఐపీఎస్ అధికారుల పేర్లు

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తులో సోమవారం (సెప్టెంబర్ 23) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్  రిమాండ్ రిపోర్ట్‌లో  ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురినీ అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.  ఈ ముగ్గురినీ కూడా నిందితులుగా ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు కోర్టు అక్టోబర్ 4 వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  ఈ కేసు వెలుగులోకి రాగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు రెండు రోజుల కిందట డెహ్రాడూన్ లో అరెస్టు  చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ ను పపోలీసులు ఈ తెల్లవారు జామున న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి కుక్కల విద్యాసాగర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.   కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు విమానంలో ముంబై వెళ్లి మరీ కాదంబరి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చారు. అయితే ఆయన ఫిర్యాదుకు ఒక రోజు ముందే పోలీసు అధికారులు ముంబైకి విమానం టికెట్ బుక్ చేసుకోవడంతో  ఉద్దేశ పూర్వకంగానే జత్వానీని అరెస్టు చేసి వేధించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తేల్చుకున్నారు. వైసీపీ సర్కార్ పతనమై ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నటి కాదంబరి జత్వానీ  ఇబ్రహీం పట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ను నిందితుడిగా గుర్తించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, పార్టీ అగ్రనేతల ప్రోద్బలంతోనే ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ అడ్డగోలుగా వ్యవహరించి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధించారని గుర్తించారు. ఇప్పటికే విశాల్ గున్ని తన మూడు పేజీల వాంగ్మూలంలో దాదాపుగా తనపై ఎవరెవరు ఒత్తిడి చేసిందీ పూసగుచ్చినట్లు వివరించారు.