ఐఏఎస్‌లను అయ్య.. ఐపీఎస్‌లను కొడుకు ముంచారు!
posted on Sep 16, 2024 @ 2:14PM
అధికారులు అధికారంలో ఉన్న వారితో అంటకాగి.. వారి కోసం అడ్డగోలు పనులు చేస్తే పర్యవసానం అనుభవించక తప్పదని పలు మార్లు రుజువైంది. తాజాగా కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కూడా ఆ అధికారులు నిబంధనలను పట్టించుకోకుండా ఏలిన వారి కళ్లల్లో ఆనందం చూడడమే తమ జన్మకు సార్థకత అన్నట్లు ప్రవర్తించిన కారణంగానే ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు.
సాధారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలా మంది సవిల్ సర్వీసెస్ గోల్ గా ఎంచుకోవాలని భావిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన వారు యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు. సివిల్స్ సాధించడం కోసం వారెలా కృషి చేశారు. రోజుకు ఎన్నిగంటల పాటు చదివారు. ఎలా విజయం సాధించారు ఇత్యాది విషయాలను ఎంతో ఆసక్తిగా వింటారు. చదువుతారు. అయితే అలా సివిల్స్ సాధించి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు తమ స్థాయికి తగని పనులు చేస్తే మాత్రం ప్రజలలో వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పరపతి, పలుకుబడి ఉండదు. ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పరిస్థితి కూడా అదే.
జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిల సస్పెన్షన్ ఆర్డర్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతకం చేశారు. వీరు ముగ్గురూ కూడా గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాధికారులుగా కాక వైసీపీ కార్యకర్తలుగా పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విశ్లేషకులు వీరిని ఐపీఎస్ లుగా కాకుండా వైపీఎస్ లుగా అభివర్ణించేవారు. అయితే ఇప్పుడు మాత్రం వారు తమ స్థాయికి తగని, నిబంధనలు అంగీకరించని రీతిలో వైసీసీ అగ్రనాయకత్వం మెప్పు కోసం అడ్గగోలుగా వ్యవహరించారనడానికి తిరుగులేని సాక్ష్యం దొరకడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం అనేది ప్రభుత్వానికి అంత తేలిక ఏమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకూ ఐఏఎస్ లేదా ఐపీఎస్ లు సస్పెండైన ఘటన ఇది రెండోది మాత్రమే. ఇంతకు ముందు గుజరాత్ లో షహ్రాబుద్దీన్ కేసులు ఇలా అధికారులు సస్పెండయ్యారు. ఆ తరువాత ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండయ్యారు. ఏపీలో తాజాగా సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ లూ అధికారులు తాము చేసిన తప్పిదం కారణంగానే అడ్డంగా బుక్కయ్యారు.
సినీనటి కాదంబరి జత్వానీపై వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేయడానికి ముందే ఐపీఎస్ అధికారులు ఆమెను అరెస్టు చేయడానికి ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ ముగ్గురు అధికారుల సస్పెన్ష్ ఆర్డర్ ను బట్టి అప్పటి ఐంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పటి విజవాడ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సీఎంవో కార్యాలయానికి పిలిపించుకుని కాదంబరి జత్వానీని ముంబై నుంచి తీసుకురావలసిందిగా ఆదేశించారు. కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలూ పరిశీలించకుండానే, శ్రద్ధ పెట్టకుండానే జత్వానీని ముంబై నుంచి తీసుకురావడాన్ని తీవ్రమైన అధికార దుర్వినియోగంగా ప్రస్తుత ప్రభుత్వం భావించి వారిపై సస్సెన్షన్ వేటు వేసింది.
అంతుకు ముందే డీజీపీ నివేదిక ఆధారంగా ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ముగ్గురు ఐపీఎస్ లను సర్కార్ సస్పెండ్ చేసింది. కొసమెరుపేంటంటే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ క్విడ్ ప్రొకొకు సహకరించి ఐఏఎస్ అధికారులు కొందరు జైలు పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అడ్డగోలుగా కేసులు, అరెస్టులకు పాల్పడి ఐపీఎస్ అధికారులు సస్పెండయ్యారు. ఇప్పుడు జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు పర్యవసానం అనుభవించక తప్పదు. విచారణ ఎదుర్కొని దోషులుగా తేలితే కటకటాల పాలు కాకా తప్పదు.