జగన్ జెండా పీకేయడం ఖాయం.. బాలినేని ఉవాచ!
posted on Sep 16, 2024 @ 2:49PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండా పీకేయడానికి రెడీ అయిపోయారా? వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇక లాంఛనమేనా? అన్న అనుమానాలు గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయిన జగన్ ఆ లాంఛనం పూర్తి చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయన సోదరి షర్మిల అడ్డుపడుతున్నారనీ వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఆ కారణంతోనే జగన్ అడపదడపా ఆందోళనలకు, తన హయాంలో అడ్డగోలుగా అక్రమాలకు, దాడులకు, దౌర్జన్యాలకూ పాల్పడి ఇప్పుడు అరెస్టయిన వారిని పరామర్శించేందుకు తప్ప తాడేపల్లి ముఖమే చూడటం లేదని అంటున్నారు. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై అక్కడ నుంచి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివప్రసాద్ ద్వారా కాంగ్రెస్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారనీ అంటున్నారు. అయితే నిన్నటి వరకూ ఇవి కేవలం ఊహాగాన సభలు మాత్రమే. అయితే ఇప్పుడు జగన్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయిపోయారని, ఇవ్వాళ కాకుంటే రేపు ఆ లాంఛనం పూర్తికావడం ఖాయమనీ తేలిపోయింది. జగన్ విలీన ప్రయత్నాల గురించి ఆ పార్టీ సీనియర్ నేత, స్వయంగా జగన్ కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డే కుండబద్దలు కొట్టేశారు.
ఏదో లోపాయికారీ సంభాషణల్లోనే, వ్యక్తిగత బాతాఖానీలోనో ఆయనీ మాటలు చెప్పలేదు. పార్టీలోని తన వర్గం వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనీ మాటలు చెప్పారు. అసలు ఇప్పటికే విలీన ప్రక్రియ పూర్తై ఉండేదనీ, కానీ జగన్ సోదరి షర్మిల గట్టిగా అడ్డుపడటంతో అది వాయిదా పడిందని బాలినేని చెప్పారు. ఇప్పుడు కాకపోతే రేపు, ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది.. వైసీపీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడానికి కూడా డీకే శివకుమార్ మధ్యవర్తిత్వమే కారణం. ఇప్పుడు జగన్ కూడా సోదరి బాటనే అనుసరిస్తూ.. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆయననే ఆశ్రయించారు. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చినా, షర్మిల అభ్యంతరం కారణంగా విలీన ప్రక్రియకు బ్రేక్ పడిందని బాలినేని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం, అటు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్రపోషిస్తుండటంతో బలమైన జాతీయ పార్టీ అండ లేకుండా మనుగడ కష్టమన్న భావనకు జగన్ రావడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో జాతీయ పార్టీ సాయం లేనిదే బతికి బట్టకట్టటం కష్టమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ మనుగడ పూర్తిగా భాగస్వామ్య పక్షాలు అందునా తెలుుగదేశంపై ఆధారపడి ఉంది. సొంతంగా పూర్తి బలం లేని బీజేపీ ప్రభుత్వ మనుగడ విషయంలో తెలుగుదేశం, జేడీయూలపైనే ఆధారపడి ఉంది.
బీజేపీ అయితే జేడీయూ కన్నా తెలుగుదేశం పార్టీనే విశ్వసనీయ ప్రతిపక్షంగా భావిస్తోంది. చంద్రబాబు విజన్, విశ్వసనీయత కారణంగా అకారణంగా, రాజకీయ లబ్ధి కోసం ఆయన కూటమి నుంచి వైదొలిగే అవకాశాలు లేవనీ, ఆయన కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కేంద్రంలోని కూటమి ప్రభుత్వం భంగం వాటిల్లేలా వ్యవహరించనంత వరకూ చంద్రబాబు కూటమికి మద్దతుగానే ఉంటారన్నది బీజేపీ నమ్మకం. ఆ కారణంగానే జగన్ కు కేసుల నుంచి రక్షణ విషయంలో బీజేపీ ఏ మాత్రం సహకారం అందించే అవకాశాలు లేవు.
అదే సమయంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ పంచన చేరితే.. తనపై కేసుల విచారణ వేగవంతం కాకుండా కేంద్రంపై పొలిటికల్ ప్రెషర్ తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్దేశంతోనే జగన్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తహతహలాడుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలన్నీ నూటికి నూరు పాళ్లూ వాస్తవమే అనడానికి తాజాగా బాలినేని తన అనుచరులు, అనుకూల కార్పొరేటర్లతో జరిపిన సమావేశంలో వైసీపీ కాంగ్రెస్ విలీనం నిజమేనని చెప్పడమే తార్కాణం.