ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశి
posted on Sep 17, 2024 @ 12:02PM
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేదెవరో తేలిపోయింది. మంత్రి అతిశి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో కేజ్రీవాల్ తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన క్షణం నుంచీ నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మంగళవారం (సెప్టెబర్ 17) సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఆ సందర్భంగా తన రాజీనామా లేఖను ఆయనకు అందజేస్తారు. కాగా మంగళవారం ఉదయం జరిగిన ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఆప్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా అతిశిని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అతిశి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.
కేజ్రీవాల్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన అతిశి ఉన్నత విద్యావంతురాలు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టయిన తరువాత ఆమెను కేజ్రీవాల్ కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తరువాత కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు.
అప్పటి నుంచీ ఆమె ఆప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా, పార్టీని కూడా ముందుండి నడిపించారు. కాగా ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రభుత్వం తరఫున జాతీయ జెండాను ఎగుర వేసేందుకు కేజ్రీవాల్ ఆమెకు అవకాశం ఇచ్చారు. కాగా కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేసిన తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ భార్య సహా పలువురి పేర్లు వినిపించినప్పటికీ కేజ్రీవాల్ అతిశీనే ఎంపిక చేశారు.