గంగమ్మని అదుపుచేసిన అపర భగీరథుడు కన్నయ్య నాయుడు!
posted on Sep 17, 2024 8:29AM
అక్టోబర్ 2, 2009. ఈ తేదీ బహుశా ఎవరు గుర్తుపెట్టుకున్నా, గుర్తుపెట్టుకోకపోయినా కర్నూలు ప్రజలకు మాత్రం నిద్రలో లేపి అడిగినా ఠక్కున గుర్తొస్తుంది. ఆరోజు కృష్ణానది వరద విలయానికి చిగురుటాకులా వణికిపోయిన కర్నూలు నగరం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది. దాదాపు 50 మందికి పైగా ఆ వరదల్లో మృత్యువాతపడ్డారు. వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇదంతా అందరికీ గుర్తుంటుంది. కానీ, ఆ వరదల్లో 250 గ్రామాలు, రెండు నగరాల ప్రజలు జలసమాధి కాకుండా కాపాడిన ఒక యోధుడు వున్నాడంటే నమ్ముతారా? ఇది సినిమా స్టోరీ కాదు. కృష్ణమ్మ సాక్షిగా ప్రాణాలకు తెగించి శ్రీశైలం బ్యారేజ్ కొట్టుకుపోకుండా కాపాడి, లక్షలమంది ప్రాణాలకు తన ప్రాణం అడ్డుగా వేసిన యోధుడాయన. ఆయనే నాగినేని కన్నయ్య నాయుడు. మొన్న తుంగభద్ర గేట్లు కొట్టుకు పోయినప్పుడు, డ్యామ్‌కు ఇంకా వరద కొనసాగుతుండగానే గేట్లు అమర్చి, వేలమంది రాయలసీమ రైతుల గుండెల్లో ఆందోళన తొలగించిన మహామనిషి. నిన్నమొన్నటి ప్రకాశం బ్యారేజ్ వరదల్లో బోట్లు ఢీకొని విరిగిన కౌంటర్ వెయిట్‌లను కేవలం ఐదు రోజుల్లోనే యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి, యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్‌లను అమర్చిన కర్మయోగి, ధీశాలి! ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు. గుజరాత్ సహా దక్షిణ భారత దేశంలో 90 శాతం డ్యామ్‌లు ఆయన చెయ్యి పడకుండా పూర్తి కాలేదంటే అతిశయోక్తి కాదు.
ఆరోజు అక్టోబర్ ఒకటో తేదీ 2009. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఊహించనంత వర్షపాతం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంటోంది. క్రమక్రమంగా వరద ఉద్ధృతమై, డ్యామ్ కొట్టుకుపోయేంత ప్రవాహం. ఎందుకలా జరిగిందో తెలియదుగానీ, డ్యామ్ అధికారులు ఒక్కరు కూడా అందుబాటులో లేరు. ఒకరు సెలవులో, మరొకరు మరో ఊరిలో. ఇలా ఏవేవో కారణాలతో ఏ ఒక్క అధికారీ డ్యామ్ వద్ద లేరు. కేవలం సూపర్‌వైజర్ మాత్రమే వున్నాడు. గేట్లు ఎత్తి వరదను కిందకి వదిలే అధికారం ఆయనకి లేదు. ఇక పై అధికారులు ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకుని అధికారులు బయల్దేరారు. కానీ, వెళ్ళేసరికి మరుసటి రోజు మధ్యాహ్నం అయింది. అంటే, అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం అప్పటికే వరదమరింత ఉద్ధృతమయ్యి, రిజర్వాయర్ లెవల్ దాటి ఒక మీటరు ఎత్తులో వరద ప్రవహిస్తోంది. అప్పుడు పరుగుపరుగున గేట్లు ఎత్తే ప్రయత్నం జరిగింది. నాలుగో నంబర్ గేటు ఎత్తగానే ఆ వరద ధాటికి ఒక్కసారిగా ఎనిమిది రోప్స్ తెగిపోయాయి. ఏం చేయాలో అధికారులకు అర్థంకాలేదు. ఒకవేళ డ్యామ్ ఇలాగే వదిలేస్తే లక్షలమంది ప్రాణాలు వరదలో కలిసిపోతాయి. ఎలాగైనా వరదను కంట్రోల్ చేయాలి. అప్పుడు ఒక వ్యక్తి గుర్తొచ్చారు వారికి. వెంటనే ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి హైదరాబాద్‌లో వున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి అక్కడకి వెళ్ళేలోపు ఏమైనా జరగొచ్చు. ప్రభుత్వం అప్రమత్తమై హెలికాప్టర్ని సిద్ధం చేసింది. కానీ, దట్టమైన మేఘాలు ఉండటం వల్ల హెలికాప్టర్ కర్నూలుకు చేరుకునే పరిస్థితి లేదు. మరోవైపు అంతకంతకూ వరద పెరుగుతూనే వుంది. అప్పటికే డ్యామ్ కొట్టుకుపోతుందనే వార్త రాష్ట్రం అంతా వ్యాపించింది. ఏం జరుగుతోందోనని ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఆ డ్యామ్ పరిసర ప్రాంత ప్రజలు. అప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టింది. ఇక చేసేది లేక హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంగుండానే డ్యామ్ వద్దకు బయల్దేరి వచ్చేసరికి 3వ తేదీ ఉదయం పదిన్నరకి గాని రాలేకపోయారు. అప్పటికే డ్యామ్ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందంటే, డ్యామ్ మొత్తం ఆ వరద ధాటికి వణుకుతోంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క డ్యామ్ మొత్తం ఊగిపోతుందీ అంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో. ఇక కొద్ది నిమిషాల్లోనే డ్యామ్ కొట్టుకుపోయి వరదంతా గ్రామాల మీద పడుతుంది అనేలాంటి పరిస్థితి అక్కడి అధికారులను కలవరపెడుతోంది. కానీ, ఫోన్ అందుకుని అక్కడకి వచ్చిన ఆ ఒక్కడు మాత్రం ఆలోచనల్లో పడ్డారు. ఒకపక్క ఆ డ్యామ్‌లో శవాలు కొట్టుకొస్తున్నాయి. భయంతో ప్రభుత్వ సిబ్బంది ఎవరూ ముందుకు రావడం లేదు. వెంటనే మనసులో నేను కూడా ఈ శవాల్లో కొట్టుకుపోతే నా కుటుంబాన్ని నువ్వే పోషించు దేవుడా అంటూ దణ్ణం పెట్టుకున్నారాయన. వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కడే డ్యామ్ గేట్లను ఎత్తడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది? డ్యామ్‌ను ఎలా కాపాడగలిగారు? ఇదే అసలైన మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయన ఎందుకంటున్నారు? ఆయన మాటల్లోనే విందాం..
అపర భగీరథుడు కన్నయ్య నాయుడితో ‘తెలుగువన్’ ఇన్‌పుట్ ఎడిటర్ శుభకర్ మేడసాని చేసిన ఎక్స్.క్లూజివ్ ఇంటర్వ్యూ ఈ లింక్ ద్వారా చూడండి.