వైసీపీ ‘కాపు’రంలో మిగిలేది ముగ్గురేనా?
posted on Sep 18, 2024 @ 10:29AM
వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ కు రాష్ట్రంలో గాలి ఆడటం లేదు. ఇంత కాలం వైసీపీకి ‘కాపు’ కాసిన నేతలు కూడా దూరం జరుగుతున్నారు. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీని వీడుతున్నారు. అలాంటి వారిలో ఇంత కాలం జగన్ కు సన్నిహితంగా ఉన్న వారే ముందుగా బయటకు వస్తుండటం విశేషం.
ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని, గుంటూరు జిల్లా కు చెందిన కిలారు వెంకటరోశయ్యలు, జగన్ కు, వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇరువురూ కూడా వారి వారి నియోజకవర్గాలలో బలమైన నేతలే. ఇరువురూ కూడా జగన్ కు సన్నిహితులుగా ముద్రపడిన వారే. అయితే ఎన్నికల ఫలితాల తరువాత కొంత కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వీరు.. ఆ తరువాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ సందర్భంగా వారు జగన్ తీరు పట్ల కొన్ని సునిశిత వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇప్పుడు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయభాను పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారు. ఉదయభాను వైఎస్సార్ హయాం నుంచి ఆయనకు, ఆయన తరువాత జగన్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక సారి కాంగ్రెస్ నుంచి, ఆ తరువాత రెండో సారి వైసీపీ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయభాను అప్పటి నుంచి జగన్ పట్ల, వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తిగానే ఉన్నారు. అయితే జగన్ సామినేని ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. అదేమిటంటే జనసేనానిని పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయాలని, అయితే అందుకు సామినేని ఉదయభాను అంగీకరించలేదు. దాంతో జగన్ ఆయనను దూరం పెట్టారు. పవన్ పై ఇష్టారీతిన విమర్శలు, వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోవడానికి రెడీ అయిన పేర్నినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఇప్పుడు సామినేని ఉదయభాను జనసేన గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే సామినేని ఉదయభాను జనసేన నాయకుడు నాగబాబుతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా ఉదయభాను జనసేనలో చేరికను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సామినేని ఉదయభానుకు కీలక పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అదలా ఉంచితే..కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లే మిగిలేటట్లు ఉన్నారు. వారు వైసీపీకి ‘కాపు’ కాయగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారు తమ నోటి దురుసుతో ప్రజలలో ప్రతిష్ట కోల్పోయారు.