అంతా సజ్జల కనుసన్నలలోనే.. జత్వానీ కేసులో బలపడుతున్న అనుమానాలు!
posted on Sep 18, 2024 @ 9:52AM
సినీ నటి కాదాంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ లు అడ్డంగా బుక్కైపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి మరీ వారి చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారు. జత్వానీని అరెస్టు చేయడం, ముంబై నుంచీ తీసుకురావడం వరకూ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణాతాతా, విశాల్ గున్నీలు.. పోలీసుల్లా కాకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా వ్యవహరించిన తీరు దిగ్భ్రమ కొలుపుతోంది. విశాల్ గున్నీ మూడు పేజీల వాంగ్మూలంతో.. ఈ ఐపీఎస్ లను వెనకుండి నడిపించింది అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది సందేహాలకు అతీతంగా తేలిపోయింది.
జత్వానీ కేసులో జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ల ప్రమేయానికి సంబంధించి అత్యంత కీలక ఆధారాలను గూగుల్ టేకౌట్ ద్వారా దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ కేసులో జత్వానీ ఫిర్యాదు మేరకు నిందితుడు కుక్కల విద్యాసాగరరావు పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు సాంకేతికతను ఉపయోగించారు. కుక్కల విద్యాసాగర్ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయన ఆనుపానులు కనుగొనే ప్రయత్నంలో గూగుల్ టేకౌట్‌ను ఉపయోగించడంతో మొత్తం గుట్టు బయటపడింది.
జత్సానీని ముంబై నుంచి తీసుకువచ్చే రోజు అంటే ఫిబ్రవరి 2న విద్యాసాగర్ ముంబైలోనే విశాల్ గున్నీతోనే ఉన్నట్లు వెల్లడైంది. తాడేపల్లి ప్యాలెస్ స్కెచ్ మేరరు జెత్వానీ కదలికలు, అమె నివాసం వంటి విషయాలు తెలిసిన వ్యక్తిగా విద్యాసాగర్ కూడా ముంబై వెళ్లినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కుక్కల విద్యాసాగరరావు కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో సజ్జల ప్రమేయంపై కూడా స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే.. హోంమంత్రి అనిత.. జత్వానీ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదనీ, ఈ కేసులో సలహాదారులు, సూత్రధారులను వదిలిపెట్టే ప్రశక్తే లేదని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే.. ముగ్గురు ఐపీఎస్ లనూ సస్పెండ్ చేసిన తరువాత కూడా కేసు నమోదుకు జాప్యం ఎందుకన్న అసహనం తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు జనాలలో కూడా వ్యక్తం అవుతోంది. అలాగే సజ్జలపై కూడా కేసు నమోదు చేయాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన దాష్టీకాలకు కాదంబరి జత్వానీ కేసు పరాకాష్టగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కాదంబరి జత్వానీ విషయంలో ముగ్గురు ఐపీఎస్ లూ వ్యవహరించిన తీరు.. అత్యంత అమానవీయం, అమానుషం. వారి తీరు ఐపిఎస్ చరిత్రకే మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. జగన్ హయాంలో అరాచకాలను తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా మంది జత్వానిలు వెలుగు చూస్తాయని పరిశీలకులు అంటున్నారు. జత్వానీ కేసు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి లాండ్ మార్క్ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.