మన ఫోన్లు పేలవన్న గ్యారంటీ ఏంటి?
posted on Sep 18, 2024 @ 11:45AM
మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను పూర్తిగా స్వాధీనం చేసుకుందని బాధపడిపోతూనే వుంటాం. అయినా మనం మన చేతిల్లో ఫోన్లు వదలం. నిద్ర లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకు మాత్రమే కాదు.. ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా మన ఫోన్ మనల్ని అంటిపెట్టుకుని వుండాల్సిందే. మన జీవితంలో భాగమైపోయిన, మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని అంతం చేయగలదు. ఏదో ఒకరోజు ఆ ఫోను బాంబులాగా ఢామ్మని పేలిపోయి మన పేరు ముందు ‘స్వర్గీయ’ అనే పదాన్ని చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పరిస్థితులు, టెక్నాలజీ అంత దారుణంగా తయారయ్యాయి మరి.
లెబనాన్‌కి చెందిన తీవ్రవాద గ్రూప్ ‘హెజ్‌బొల్లా’ సభ్యులు ఉపయోగించే పేజర్లు రెండ్రోజుల క్రితం పేలిపోయాయి. ఆ పేలుళ్ళ ధాటికి తొమ్మిదిమంది హెచ్‌బొల్లా గ్రూప్ మిలిలెంట్లు అక్కడికక్కడే చనిపోయారు. హెజ్‌బొల్లా గ్రూప్ కొద్ది నెలల క్రితమే ఆ పేజర్లను తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. అయితే మొస్సాద్ స్పై ఏజెన్సీ పేజర్లను తయారు చేసిన సంస్థతో కుమ్మక్కై తమకు సరఫరా చేసే పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చిందని హెజ్‌బొల్లా గ్రూప్ ఆరోపిస్తోంది. పేలుళ్ళకు కారణమైనవారిని వదిపెట్టమని హెచ్చరించింది. పేజర్లను తయారు చేసిన సంస్థ మాత్ర తమకు ఏ పాపమూ తెలియదని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికా మాత్రం, ఈ పేలుళ్ళకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ గొడవని అలా వుంచితే, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులలో పేలుడు పదార్థాలు అమర్చి, ఎప్పుడు పేల్చుకోవాలంటే అప్పుడు పేల్చుకోవచ్చనే విషయం స్పష్టమవుతోంది. అలాంటి అవకాశం వున్నప్పుడు మన చేతిలో వున్న ఫోన్ కూడా ఒక మినీ బాంబ్ అని మనం ఎందుకు అనుమానించకూడదు?
మనం ఉపయోగించే ఫోన్లకి, మన శత్రుదేశం చైనాకి అవినాభావ సంబంధం వుంటుంది. ఫోన్ల మీద మేడిన్ చైనా అని వున్నా, వుండకపోయినా ఆ ఫోన్ తయారీ దశలో ఎక్కడో ఒకచోట చైనాతో లింక్ వుండే వుంటుంది. మన ఇండియా అంటే అగ్గిమీద గుగ్గిలం అయిపోతూ వుండే చైనా మన దేశానికి సరఫరా అయ్యే ఫోన్లలో ఏ చిన్న బాంబు నిక్షిప్తం చేసిందో ఏం పాడో! అసలే ఆ చైనావాళ్ళు మహా ముదుర్లు. విశ్వామిత్ర సృష్టి చేయడంలో ఆరితేరినవాళ్ళు. మన ఫోన్లో ఏ చిప్పు లాగానో, ఏ తీగ లాగానో కనిపించే బాంబుని సెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏ దుర్ముహూర్తానో అది పేలినా పేలవచ్చు. అతిగా భయపడుతున్నట్టు, బయపెడుతున్నట్టు అనిపించినా, తాజాగా పేజర్ల పేలుడు జరిగిన నేపథ్యంలో మన చేతిలో వున్న ఫోన్‌ని కూడా అనుమానించడంలో తప్పు కాదేమో!