దేవరగట్టు ఉత్సవంలో 70 మందికి గాయాలు!

దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం వల్ల 70 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. కర్నూలు జిల్లా హోళగుంద సమీపంలోని దేవరగట్టులో ప్రతి ఏటా దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ప్రజలు కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇది ఈ ప్రాంతంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతి సంవత్సరం జరిగే ఈ బన్నీ ఉత్సవం సందర్భంగా గతంలో ఎన్నోసార్లు కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా వున్నాయి. అయినప్పటికీ ఈ సంప్రదాయం ఆగలేదు. ఈ సంవత్సరం భారీ స్థాయిలో బన్నీ ఉత్సవం జరిగింది. ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. 70 మంది ఈ సందర్భంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమించిందని సమాచారం. ఈ సంవత్సరం ఇలా జరిగిందని వచ్చే సంవత్సరం జనం ఆగరు. కర్రలతో కొట్టుకోవడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో షరా మామూలే.

జ‌గ‌న్ తీరు.. వైసీపీ బేజారు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ అనాలోచిత‌ నిర్ణ‌యాలు ఆ పార్టీ శ్రేణుల‌ను ఆందోళనకు గురి చేయడమే కాదు, ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది వైసీపీ నేత‌ల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. ఓ అప‌రిచితుడిలా జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ నేత‌ల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చెప్పినా వినే మ‌న‌స్త‌త్వం జ‌గ‌న్‌ది కాదు. గ‌డిచిన ఐదేళ్ల‌లో అధికారంలో ఉండ‌టంతో ఆయ‌న ఆడింది ఆట‌ పాడింది పాట అన్నట్లుగా సాగింది. ప్ర‌స్తుతం జగన్ అధికారంలో లేరు. ఆయన పార్టీకి కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు. అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా ప్రభుత్వాన్నీ, పార్టీనీ నడిపిన జగన్ ఇప్పుడు రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ఈ విషయాన్నివైసీపీ నేతలో స్వయంగా అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. జగన్ తీరు పట్ల  ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.  అధికారంలో ఉన్న‌ప్పుడు అన్ని పార్టీల నేత‌లను చెడామాడా తిట్టేసిన నేతల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది‌. వ్యూహాల్లేకుండా, అడ్డగోలు నిర్ణయాలతో  త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును జగన్ నాశనం చేస్తున్నారని ప‌లువురు వైసీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జగన్ తీరుతో విసుగు చెంది పలువురు ఇఫ్పటికే పార్టీని వీడారు. మరి కొందరు వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.  అయినా జ‌గ‌న్ డోంట్ కేర్ అంటూ పేర్కొంటుండ‌టం పార్టీలో మిగిలిన నేతలు, శ్రేణుల్లో మ‌రింత ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది.  జ‌గ‌న్  ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రాజ‌కీయాలు చేయ‌డం ఏమాత్రం తెలియ‌ద‌ని వైసీపీ నేత‌లు బాహాటంగానే అంటున్నారు. రాజ‌కీయాల్లో అవ‌స‌ర‌మైన చోట త‌గ్గాలి.. ఆధిప‌త్యం చెలాయించాల్సిన‌ చోట ప‌ట్టువిడ‌వ‌కుండా పోరాడాలి.. అదే స‌మ‌యంలో త‌మ‌ను న‌మ్ముకున్న వారికి ర‌క్ష‌ణ‌గా ఉండాలి. కానీ, జ‌గ‌న్  మాత్రం ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో తాను చెప్పిందే చేయాలి అన్న‌ట్లుగా పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు ఇస్తున్నారు‌. గ‌త ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉండ‌టంతో జ‌గ‌న్ చెప్పిన‌ట్లు విన్న వైసీపీ నేత‌లు.. ప్ర‌తిప‌క్షంలోనూ జ‌గ‌న్ అదే వ్య‌వ‌హార‌శైలితో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్య‌ర్ధుల నియోజ‌క‌వ‌ర్గాలు మార్చ‌వ‌ద్ద‌ని జ‌గ‌న్‌కు వైసీపీ సీనియ‌ర్ నేతలు ప‌దేప‌దే సూచించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం నియోక‌వ‌ర్గాల అభ్యర్థులను ఇష్టారీతిగా మార్చేశారు.  ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మికి అదికూడా ఓ కార‌ణం. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఓ ఆరు నెల‌ల స‌మ‌యం ఇద్దామ‌ని, ఆ త‌రువాత వారి ప‌నితీరులో లోపాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్దామ‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చేసిన సూచనలను జగన్ ఇసుమంతైనా ఖాతరు చేయకుండా  చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క్షణం  నుంచే విమ‌ర్శ‌లు చేయ‌డంతో జనంలో జగన్ పట్ల, వైసీపీ పట్లా ఉన్న వ్యతిరేకత మరింత ఎక్కువైందని వైసీపీ నేతలే అంటున్నారు.   విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు ఆ పార్టీ నేత‌ల‌కే ఆగ్ర‌హాన్ని తెప్పించింది. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌వారికి స‌హాయం చేయాల్సిందిపోయి అధికారంలోకి కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం జ‌గ‌న్ రాజ‌కీయ అజ్ణానానికి నిద‌ర్శ‌మ‌న్న భావన వైసీపీలోనే వ్యక్తమైంది.   వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఆ ప్రాంతంలో జ‌గ‌న్ నామ‌మాత్రంగా ప‌ర్య‌టించారు.. అలాకాకుండా వ‌ర‌ద‌ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారిని ప‌రామ‌ర్శించి ఆర్ధిక స‌హామ‌యో, ఇత‌ర రూపాల్లో స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తే బాగుండేది. కానీ, జ‌గ‌న్ మాత్రం అలాంటి ప‌నులేమీ చేయ‌కుండా త‌న సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌భుత్వంపై బుద‌ర‌జ‌ల్లే ప్ర‌య‌త్నానికే ప్రాధాన్య‌త‌నిచ్చాడు. దీనికితోడు వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం అందించిన ఆర్థిక స‌హాయం విష‌యంలోనూ జ‌గ‌న్, అనుకూల మీడియా అస‌త్య‌ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో మ‌రింత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణమైందని అంటున్నారు.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించిన స‌మ‌యంలో ఈవీఎంలు బెస్ట్ అని చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ఈవీఎంల వ‌ల్ల‌నే ఓడిపోయామ‌ని చెబుతుండ‌టంతో ఆయ‌న‌లో రాజ‌కీయ అవ‌గాహ‌నలేమిని స్ప‌ష్టంగా తెలియ‌జేస్తున్నద‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు.  హ‌రియాణా ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌లు ఈవీఎంల‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. ఏపీలోనూ అదే ప‌ద్ద‌తిలో జ‌రిగింద‌ని చెబుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతికే మొగ్గు చూపాలని జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు. అయితే 2019లో మాత్రం ఈవీఎంలను స‌మ‌ర్ధించిన జ‌గ‌న్‌.. ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హ‌రియాణా ఎన్నిక‌ల్లో ఈవీఎంల గురించి జ‌గ‌న్ మాట్లాడ‌టంతో ఆయ‌న ఇండియా కూట‌మిలోకి వెళ్లేందుకు చూస్తున్నారా అన్న చ‌ర్చ మొదలైంది. ఇప్ప‌టికే ఎన్డీయేలో జగన్ కు స్థానం లేకుండా పోయింది. బీజేపీ కూడా గతంలో జగన్ పట్ల ఉన్న సానుకూలత కనబరచడం లేదు. ఇక  ఇండియా కూట‌మిలోకి వెళ్లేందుకు జ‌గ‌న్ చేస్తున్న ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆయన సొంత చెల్లెలు షర్మిల మొదట్లోనే గండి కొడుతున్నారు.  దీంతో రెండింటికి చెడ్డ రేవ‌డిలా జగన్, వైసీపీ ప‌రిస్థితి ఉంది.  జ‌గ‌న్ తీరులో మార్పురాకుంటే రాబోయే కాలంలో వైసీపీ క‌నుమ‌రుగు కావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

గూడ్స్.ని ఢీకొన్న భాగమతి ఎక్స్.ప్రెస్!

భాగమతి ఎక్స్.ప్రెస్ చెన్నై సమీపంలో ఆగివున్న గూడ్స్ ట్రైన్.ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు బోగీలు కాలిపోయాయి. పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా దర్భంగా  వెళ్లాల్సిన భాగమతి ఎక్స్.ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని కోచ్‌లు చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని కోచ్‌లు ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. రెండు కోచ్‌లో కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇంత దారుణమైన ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరూ మరణించలేదు. పది మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును భాగమతి ఎక్స్.ప్రెస్ ఢీకొన్నప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. వారందరినీ సమీపంలో వున్న ఆస్పత్రులకు తరలించారు.

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌ ఖాయం‌.. కొండా సురేఖపై వేటు తథ్యం?

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం కుద‌ర‌డం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. దీంతో మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారికి నిరాశే ఎదుర‌వుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు అవుతోంది. అయినా పూర్తిస్థాయి కేబినెట్ లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేబినెట్ విస్త‌ర‌ణ‌కు రేవంత్ రెడ్డికి   పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ద‌స‌రా త‌రువాత  ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే విష‌యంపై టీపీసీసీ చీఫ్  మ‌హేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ద‌స‌రా త‌రువాత ఎట్టి ప‌రిస్థితుల్లో కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని చెప్ప‌డంతో.. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారు త‌మ ప్ర‌య‌త్నాల‌ను మ‌రోసారి షురూ చేశారు. అయితే, ఈసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణంలో మంత్రి కొండా సురేఖ‌కు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో మ‌రో బీసీ ఎమ్మెల్యేను మంత్రిగా తీసుకుంటార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.   ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మ‌యంలో ఆయ‌న‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో మొత్తంగా తెలంగాణ కేబినెట్‌లో 12 మంది కొలువుదీరారు. కేబినెట్‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి న‌లుగురు, బీసీ, ఎస్సీ సామాజిక వ‌ర్గాల నుంచి ఇద్ద‌రు చొప్పున‌, ఎస్టీ, క‌మ్మ‌, వెల‌మ సామాజిక వ‌ర్గాల నుంచి ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. మ‌రో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం కేబినెట్‌లో నాలుగు ఉమ్మ‌డి జిల్లాల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించ‌లేదు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆ నాలుగు జిల్లాల‌కు క‌చ్చితంగా చోటు క‌ల్పించాల్సి ఉంటుంది. మ‌రో వైపు కేబినెట్ విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే జిల్లాల వారిగా ఆశావ‌హ ఎమ్మెల్యేలు అధిష్టానానికి విన్న‌వించుకున్నారు. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారి పేర్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలోనే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధిష్ఠానం కూడా సామాజిక వ‌ర్గాల వారిగా, జిల్లాల వారిగా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల్సిన వారి పేర్ల‌ను  ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది.  మొత్తం ఆరు బెర్త్ లు ఖాళీ ఉండ‌గా.. ప్ర‌స్తుతం జ‌ర‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో నాలుగు మంత్రి ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తార‌ని తెలుస్తోంది. వీరిలో ఏఏ సామాజిక వ‌ర్గాల వారికి అవ‌కాశం క‌ల్పిస్తార‌నే ఆంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చర్చ జరుగుతోంది.  మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ‌పై వేటు ప‌డుతుంద‌ని కొద్ది రోజులుగా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఆమె కేటీఆర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడే స‌మ‌యంలో హీరో నాగార్జు కుటుంబంపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నాగచైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణ‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాక బాలీవుడ్ హీరోయిన్ల ప్ర‌స్తావ‌న తెస్తూ కేటీఆర్ పై విమ‌ర్శ‌లు చేశారు. సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించాయి. హీరో నాగార్జున, ఆయ‌న కుటుంబం మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుంది.  టాలీవుడ్‌ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖ‌లు నాగార్జున‌కు మ‌ద్ద‌తుగా నిలిచి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఓ విధంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై యుద్ధ‌ భేరి మోగించిన‌ట్ల‌యింది. వివాదం పెద్ద‌ది కావ‌డంతో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను కొండా సురేఖ వెన‌క్కు తీసుకున్నారు. హీరోయిన్ స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయినా శాంతించ‌ని నాగార్జున ఆమెపై నాంప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఇటీవ‌ల నాగార్జున‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు  నాంప‌ల్లి కోర్టుకు హాజ‌ర‌య్యారు. తాజాగా కేటీఆర్ సైతం కొండా సురేఖపై నాంప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా కొండా సురేఖ వ్యాఖ్య‌లు చేశార‌ని కోర్టులో పిటీష‌న్ వేశారు. వీటికి సంబంధించి నాంప‌ల్లి కోర్టు కొండా సురేఖ‌కు నోటీసులు  జారీ చేసింది. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌లో ఆమె మంత్రి ప‌ద‌వి పోవ‌టం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీలోనూ చ‌ర్చ మొద‌లైంది. ఈ విష‌యంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొలిగించే ఆలోచ‌న‌లో అదిష్టానంకు లేద‌ని చెప్పారు. తాజా విష‌యంపై ఆమెను అధిష్టానం వివ‌ర‌ణ కూడా కోర‌లేద‌ని, ఇదంతా రాజ‌కీయంగా కొండా సురేఖ‌పై బీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న అస‌త్య ప్ర‌చారం అన్నారు. కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో భావోద్వేగానికి గురై ఆమె నాగార్జున కుటుంబానికి సంబంధించి వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆ త‌రువాత త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకున్నార‌ని గుర్తుచేశారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణంలో కొండా సురేఖపై వేటు ప‌డుతుంద‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తేల్చిచెప్పారు. మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డికూడా కొండా సురేఖ‌కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని, దీంతో ఆమెకు మంత్రి ప‌ద‌వికి వ‌చ్చిన ప్ర‌మాద‌మేమీ లేద‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు.

బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు!

కృష్ణా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంలో బెజవాడ కనకదుర్గమ్మ జలవిహారాన్ని ప్రభుత్వం రద్దు  చేసింది. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు శనివారం (అక్టోబర్ 12)తో ముగుస్తాయి. ఆ సందర్భంగా దుర్గమ్మవారు హంసవాహనంపై కృష్ణా నదిలో విహరించడం ఆనవాయితీ. అయితే ఆ జలవిహారాన్ని ప్రభుత్వం నదిలో వరద పోటు కారణంగా రద్దు చేసింది.  ప్రతి ఏటా విజయ దశమి రోజున బెజవాడ కనకదుర్గమ్మను  రాజరాజేశ్వరి దేవిగా  అలంకరించి కృష్ణానదిలో తెప్పోత్సవం, హంసవాహన సేవ నిర్వహిస్తారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. అయితే కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో  ఈ ఏడాది తెప్పోత్సవం  రద్దైంది. 

నందిగం సురేష్ ఫైన్.. మళ్లీ జైలుకు!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ గురువారం తనకు ఛాతీలో, భుజంలో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు అధికారులు ఆయనను హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించిన సంగతి తెలిసిందే.   జీజీహెచ్ లో వైద్యలు ఆయన పరీక్షలు నిర్వహించారు. సిటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ సహా అన్ని చికిత్సలూ చేసిన తరువాత ఆయన ఆరోగ్యం బాగుందని నివేదిక ఇచ్చారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తరలించారు. నందిగం సురేష్ ను ఆస్పత్రికి తీసుకువచ్చిన సంగతి తెలిసి పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. 

నిహాన్ హిడాంక్యోకు నోబెల్ శాంతి పురస్కారం

అణ్వాయుధాలు, అణుయుద్ధాలు లేని ప్రపంచాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకు 2024 నోబెల్ శాంతి బహుమతి లభించింది.   నాగసాకి అణుబాంబు దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నే సంస్థ నిహాన్ హిడాంక్యో. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పోరాడుతున్న ఈ గ్రూప్ ను నోబెల్ కమిటీ అత్యున్నత శాంతి బహుమతిని ప్రకటించింది. అణ్వాయుధాలను మళ్లీ వాడకూడదన్న డిమాండ్ తో నిహాన్ హిడాంక్యో సంస్థ పలు ప్రదర్శనలు నిర్వహించింది. అణ్వాయుధ రహిత సమాజం కోసం పోరాడుతున్న నిహాన్ హిడాంక్యో కృషికి గుర్తింపుగా ఆ సంస్థను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించింది. 

అయ్యో పాపం.. రూపాయి..!

ప్రపంచ దేశాల్లో మన ఇండియా రేంజే వేరు. మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇంకా కొద్ది సంవత్సరాలు ఆగితే మన ఇండియా ప్రపంచంలోనే ఒక అగ్ర దేశంగా అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలూ గట్రా జరిగితే, మా మధ్య గొడవలు పరిష్కరించండి మహాప్రభో అని అన్ని దేశాలూ మన దేశం వైపే చూస్తాయి... ఇవన్నీ మన దేశంలోని రాజకీయ నాయకులు చెప్పే మాటలు.. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో మన పరిస్థితి ఏంటో మన రూపాయిని అడిగితే చెబుతుంది. శుక్రవారం నాడు మన రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం  84.05 రూపాయలకు చేరింది. పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల రూపాయికి ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. 

జీఎస్టీలో అవకతవకలు.. కేసీఆర్ పై ఈడీ కేసు

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ప్రజా జీవితంలో ఎక్కువగా కనిపించకుండా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ముఖం చాటేస్తున్నారు. ఎక్కడా బయట కనిపించకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టిన సమయంలో కూడా ఆయన బయటకు రాలేదు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే గొంతెత్తి విమర్శించారు. కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు. అయితే ఆయనపై తాజాగా ఈడీ కేసు నమోదు అయ్యింది. ఇప్పుడైనా కేసీఆర్ మౌనం వీడి గొంతెత్తుతారా లేదా అని బీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఈడీ కేసీఆర్ పై ఎందుకు కేసు నమోదు చేసిందంటూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఎస్టీ చెల్లింపులలో 46 కోట్ల మేర అవకతవలు జరిగినట్లు గుర్తించిన ఈడీ  కేసీఆర్ పై కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఇదే విషయంపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.  ఇందుకు సంబంధించి ఇప్పుడో ఇహనో ఈడీ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు

జాఫర్ భయ్  తన చెల్లెలు అప్సర్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.  కాని చేతిలో చిల్లి గవ్వలేదు. సమస్య పరిష్కారానికి మౌలానా దగ్గరికి వస్తాడు జాఫర్ భాయ్.  జాఫర్ భాయ్: సలాంవాలేకూం మౌలానా సాబ్  మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్ కైరియత్ , కైసే హై ఆప్  జాఫర్ భాయ్: అలమ్ దు లిల్లా జీ మౌలానా సాబ్ . మేరీ బెహన్ కా షాదీ కర్నా హై . జెహేజ్ కా ఇంతెజామ్ నై వుహా . సొల్యూషన్ బతాయియే   మౌలానా: ఇస్లాంలో నిఖా( పెళ్లి) అత్యంత సులభతరం . ఖర్చులు వీలయినంతగా  తగ్గించాలి. ఈ మధ్యకాలంలో నిఖాలు అత్యంత విలాసవంతంగా జరుగుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చావు దగ్గరవుతుంది. వయసులో ఉన్నప్పుడే నిఖా  చేయాలి.అపుడు  యుక్త వయసులో ఉన్నప్పుడే  వారి పిల్లలు పెద్దవారు అవుతారు.  ప్రయోజకులు అవుతారు.   పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు చేయకండి.  డబ్బులేనప్పుడు తమ తాహతును బట్టీ   నిఖా  చేసేయండి. ఖర్చు తగ్గుతుంది. షరియత్ లో గోరింటాకు వేడుకలు అట్టహాసంగా జరుపుకోవడం నిషిద్దం .  నిఖాను సులభతరం చేయాలి.  ఇస్లాం ప్రకారం బరాత్ కు  చోటే లేదు. వరకట్నం ఇవ్వాలన్న నియమం ఇస్లాంలో లేదు.  పెళ్లికి ఆరు నెలల ముందే సంబరాలు ప్రారంభిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.ఇవి కూడా నిషేధం. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడే వలీమా(డిన్నర్) ఘనంగా చేసుకోవచ్చు. నేను వెయ్యి రూపాయల మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే కెపాసిటీ ఉంటుంది.  కాని అవతలి వ్యక్తి లక్ష రూపాయల మొబైల్ ఫోన్ కొన్నాడని మనం కొనాల్సిన అవసరం లేదు. వ్యక్తుల స్థితి గతులను బట్టీ పెళ్లిళ్లు చేయాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది మరి.  పెళ్లిళ్లు చేయాలి కానీ   మెహర్ (వరకట్నం) అమ్మాయి తరపున తండ్రి ప్రకటించాల్సి ఉంటుంది. తండ్రి లేనప్పుడు బాబాయ్, మామయ్య మెహర్ ప్రకటించాల్సి ఉంటుంది. అబ్బాయి వాళ్లు మెహర్ అడుగుతారు. అప్పుడు అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి తరపున వారితో సామరస్యంగా చర్చించుకోవాలి. ఇస్లాంలో అమ్మాయి తండ్రి వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు. అమ్మాయికి  కనీస అవసర వస్తువులు ఇవ్వొచ్చు. బైక్, ఎయిర్ కూలర్, మంచం, ఆల్మారా వంటివి అబ్బాయి తరపున వాళ్లు అడగొచ్చు. అయితే అమ్మాయి తరపు వాళ్లు ఇష్టంగా ఒప్పుకుంటే మాత్రమే. బలవంతంగా వసూలు చేయకూడదు అంటూ మౌలానా జాఫర్ బయ్ కు  వివరించాడు.  - బదనపల్లి శ్రీనివాసాచారి 

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా!

ఇప్పటి వరకు రతన్ టాటా ఛైర్మన్‌గా వున్న టాటా ట్రస్ట్స్ బాధ్యతలను నోయెల్ టాటాకు ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా అప్పగించినట్టు తెలుస్తోంది. రతన్‌ టాటా కన్నుమూసే వరకు టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు. అలాగే ఐదు ట్రస్టులు కలసి వున్న టాటా ట్రస్ట్స్.కి కూడా ఛైర్మన్‌గా వున్నారు. ఈ ఐదు ట్రస్టులలో కీలకమైనవి, ఎక్కువ వాటాలు వున్నవి సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌. మరొకటి సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌. ఈ రెండు ట్రస్టులకే కంపెనీలో 52 శాతం వాటాలు వున్నాయి. మొత్తం ఐదు ట్రస్టులకు కలిపి కంపెనీలో 67 శాతం వాటాలు వున్నాయి. ఇప్పుడు ఆ ట్రస్ట్స్ మొత్తానికి నోయెల్ టాటా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే హోల్డింగ్ కంపెనీ బాధ్యతలను టాటా సన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టాటా సన్స్.కి చంద్రశేఖరన్ ఛైర్మన్‌గా వున్నారు. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ని నియమించే విషయంలో 13 మంది ట్రస్టీలు ఏకాభిప్రాయం తీసుకున్నారు. వారంతా నోయెల్ టాటానే టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.  రతన్‌ టాటా సవతి తల్లి సిమోన్‌ టాటాకి నోయెల్‌ టాటా కుమారుడు. నోయెల్ టాటాకి టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం వుంది. ఆయన టాటా కంపెనీలోని బోర్డుల్లో రకరకాల హోదాల్లో పని చేశారు. 

నందిగం సురేష్‌కి హార్ట్ ఎటాక్?

గుంటూరు జైల్లో వున్న బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ భుజం, ఛాతీ నొప్పిగా వుందని అనడంతో జైలు అధికారులు ఆయన్ని గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. భుజం విపరీతంగా నొప్పి పుట్టడంతోపాటు ఛాతీలో కూడా నొప్పిగా వుందని, హార్టెటాక్ కావచ్చన్న అనుమానంగా వుందని నందిగం సురేష్ చెప్పడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. నందిగం సురేష్‌కి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అయితే జైలు అధికారులు మాత్రం ఇది హార్టెటాక్ కాకపోవచ్చని, నందిగం సురేష్‌ని అరెస్టు చేసిన సమయంలో కూడా ఆయనకు భుజం నొప్పి వుందని అంటున్నారు. వైసీపీ అధికారంలో వుండగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన కేసుతోపాటు మరియమ్మ అనే మహిళను హత్య చేసిన కేసులో నిందితుడైన నందిగం సురేష్ రిమాండ్‌లో వున్నారు. నందిగం సురేష్‌ది  హృదయ సంబంధ అనారోగ్యం కాదని నిర్ధారించుకున్న తర్వాత ఆయన్ని తిరిగి జైలుకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రాలో అప్పుల అప్పలమ్మలు ఎక్కువే!

యథారాజా తథా ప్రజా అన్నట్టుగా పాలించేవాళ్ళు ఏది చేస్తే, పాలించబడేవాళ్ళు కూడా అదే చేస్తారు. ఈ పార్టీ... ఆ పార్టీ... ఈ రాష్ట్రం... ఆ రాష్ట్రం అని కాకుండా దేశంలో ప్రతి ఒక్క ప్రభుత్వమూ అప్పుల మీదే బండి లాగిస్తోంది. జానానికి ఉచితాలు అలవాటు చేసిన నాయకులు అప్పులు చేసి మరీ గొప్పలు చెప్పుకుంటున్నారు. దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తూ ఉచితాలు ఇవ్వడం తమ గొప్పతనంగానో, తన తాతలు సంపాదించిన ముల్లెని పంచుతున్నట్టుగానో బిల్డప్పు ఇచ్చుకుంటూ బతికేస్తున్నారు. ఈ జనం కూడా ప్రభుత్వం అప్పులు చేస్తోందో, అల్లాడి చస్తుందో మాకెందుకు... మా ఉచితాలు మాకు కావాలి అన్నట్టుగా వున్నారు. అందుకే దేశం అప్పుల కుప్పలా తయారైంది. దేశం సంగతి అలా వుంచితే, దేశ ప్రజలు కూడా అప్పులు చేయడంలో అభివృద్ధి పథంలో  పయనిస్తున్నారు. అక్షరమాలలో అగ్రస్థానంలో వున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అప్పులు చేయడంలో కూడా దేశంలోనే  అగ్రస్థానంలో వున్నట్టు ఇటీవల కేంద్రం వెల్లడించిన నివేదిక చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు దాటిన వారిలో ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది అప్పులు చేయడం ద్వారానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు కేంద్రం ఇటీవల విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే వెల్లడించింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం మంది అప్పుల అప్పారావులే అన్నమాట! సాధారణంగా పట్టణాలు అభివృద్ధి చెందాయి, గ్రామాలు అభివృద్ధి చెందలేదు అని అనుకుంటూ వుంటాం. కానీ, అప్పులు చేసే విషయంలో పట్టణాల్లో వుండే జనం కంటే గ్రామాల్లో వున్న జనమే ఫార్వర్డ్.గా వున్నారట. పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు 4.3 శాతం ముందున్నారట. అలాగే పట్టణాల్లో వుండే మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వున్న మహిళలే ఎక్కువగా అప్పులు చేస్తున్నారట. ఓవరాల్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ అప్పులు చేస్తున్నారట. అప్పులు చేసే విషయంలో అప్పుల అప్పారావుల కంటే అప్పుల అప్పలమ్మలదే అప్పర్ హ్యాండ్ అని అర్థమవుతోంది. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, అప్పులు చేయడంలో తెలుగు మహిళలే దేశంలో అన్ని రాష్ట్రాల మహిళల కంటే ముందంజలో వున్నారట. ఇక ప్రభుత్వాలు చేసే అప్పుల విషయాన్ని మరోసారి ప్రస్తావించుకుంటే, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల మీద కంటే, దక్షిణాది రాష్ట్రాల ప్రజల నెత్తినే ఎక్కువ అప్పుల భారం వుందట.

విజయవాడలో లోకోపైలట్ ను  ఇనుపరాడ్డుతో హత్య చేసిన సైకో 

విజయవాడ రైల్వేస్టేషన్ లో లోకో పైలట్ ను సైకో చంపేశాడు. ఇనుపరాడ్డుతో లోకోపైలట్ పై శుక్రవారం తెల్లవారు జామున దాడి చేశాడు. దుర్గ గుడి దగ్గర ఈ సైకో ఆటో డ్రైవర్ పై హత్యాయత్నం చేశాడు. పోలీసులు అదుపులో తీసుకుని రైల్వేస్టేషన్ లో వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడో నెంబర్ ప్లాట్ ఫామ్ పై లోకో పైలట్ పై దాడి చేసి హత్య చేశాడు. అయితే అటు రైల్వే పోలీసులు, ఇటు విజయవాడ పోలీసులు కానీ స్పందించలేదు. సైకోను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గంజాయికి అలవాటుపడ్డ సైకో ఈ హత్యకు పాల్పడినట్టు సమాచారం.హత్యకు గురైన లోకో పైలట్ ఇతనే. 

యూట్యూబర్ పై శాంతి లైంగిక ఆరోపణలు

యూట్యూబర్ దాసరి  విజ్ఞాన్ పై  లైంగిక ఆరోపణలు చేస్తూ ఎపి ఎండోమెంట్ కమిషనర్ శాంతి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను గత కొంత కాలంగా ఈ యూట్యూబర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. శాంతికి పుట్టిన బిడ్డ తన బిడ్గ కాదని  శాంతి భర్త కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆయన హోంమంత్రి అనితను కల్సి వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే ఈ వివాదం సద్దుమణగకముందే  యూట్యూబర్ దాసరి  విజ్ఞాన్ విడుదల చేస్తున్న మార్ఫింగ్ వీడియోలు ఆమె పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. 

ఆంధ్రా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇలా తయారయ్యారేంటి?

విభజన కారణంగా 40 శాతం, జగన్ కారణంగా 60 శాతం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల నుంచి త్వరగా బయటపడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలని ఆశిస్తున్నారా? ఎక్కువగా ఆశించకండి.. ఎందుకంటే ఎక్కువగా ఆశపడటం ఎందుకు... మళ్ళీ నిరాశకు గురవటం ఎందుకు? రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. కానీ, ప్రభుత్వానికి సహకరించడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిన జగన్ అండ్ కో, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జనం మీద పగబట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా వుండటానికి ఏం చేయాలో అవన్నీ చాపకింద నీరులా చేస్తూనే వున్నారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయేవిధంగా, పెట్టుబడిదారులు వెనకడుగు వేసే విధంగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. జగన్ అండ్ కో పరిస్థితి ఇలా వుంటే, కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రా ముఖం చూడటానికే ఇష్టం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయినవాళ్ళ నుంచే నిరాదరణను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఏనాటికి అభివృద్ధి చెందుతుందో ఏంటో! రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర కేడర్‌కి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో ఉండిపోయారు. అదేవిధంగా తెలంగాణ కేడర్‌కి, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రలో వుండిపోయారు. ఆంధ్రలో వున్న తెలంగాణ అధికారులు ఎప్పుడెప్పుడు తెలంగాణకు వెళ్ళిపోవాలా అని ఎదురుచూస్తూ వున్నారు. తెలంగాణంలో వున్న ఆంధ్ర అధికారులు ఆంధ్ర పేరు చెబితేనే గిట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం ఇష్టం లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి కేటాయించినా కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తెలంగాణలో కొనసాగుతున్నారు. వారిలో వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, ప్రశాంతి... ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వున్నారు. వీరిలో కొంతమంది వేరే రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ, ఆంధ్రా కేడర్ అధికారులు. మరికొందరు ఆంధ్రా ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన స్వచ్ఛమైన ఆంధ్రులు. చట్టపరంగా, న్యాయంగా అయితే, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళాలి. కానీ, మేం వెళ్ళబోం అంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్)ని ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళందరూ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజాగా వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కే వెళ్ళి తీరాలని కేంద్రానికి చెందిన డిపార్ట్.మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశించింది. సాధారణంగా అయితే డీఓపీటీ ఆదేశిస్తే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చప్పుడు చేయకుండా చెప్పినట్టు వినాలి. కానీ, ఆంధ్రాకి వెళ్ళాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రాకి వెళ్ళడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. డీఓపీటీ ఆదేశాల మీద కూడా కోర్టును ఆశ్రయించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి, వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళడానికి అధికారులు బాధపడిపోతున్నారు. అలాగే ఏపీలో వున్న తెలంగాణ కేడర్ వాళ్ళు ఆనందోత్సాహాలతో తెలంగాణకు వస్తున్నారు. అక్కడి వారు ఇక్కడికి వస్తున్నారుగానీ, ఇక్కడి వాళ్ళు అక్కడకి వెళ్ళడానికి బాధపడిపోతున్నారు. మిగతా రాష్ట్రాల్లో పుట్టిపెరిగి, ఆంధ్రా కేడర్‌కి ఎంపికైన వాళ్ళ సంగతి అలా వుంచితే, ఆంధ్రాలో పుట్టి పెరిగిన రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి కాటా, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి లాంటి వాళ్ళు కూడా సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి విముఖత చూపించడం చాలా బాధాకరమైన విషయం. విభజన కారణంగా నష్టపోయిన తమ సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు పాత్రను పోషించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా ఈ అధికారులు వ్యవహరిస్తూ వుండటం దురదృష్టకరం. ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాల్సిందే అనే పరిస్థితి వస్తే, వీళ్ళు ఏపీలో బాధ్యతలు తీసుకున్నా పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేస్తారా అనే సందేహాలు వున్నాయి.

టార్గెట్ ప‌వ‌న్‌.. దువ్వాడ శ్రీ‌నివాస్‌, దివ్వెలమాధురి కొత్త డ్రామా!

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి ప్రేమ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది.   ఏజ్‌తో ప‌నిలేదు మేం ప్రేమపక్షులం అంటూ బ‌హిరంగంగా వారిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇటీవల తిరుప‌తిలో పెద్ద ర‌చ్చే చేశారు.  ఫొటో షూట్ తో తిరుమ‌ల కొండ‌పై వారు చేసిన ర‌చ్చ అంతాఇంతాకాదు. దీంతో మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భ‌క్తుల నుంచి విమ‌ర్శ‌లు ఎదురైనా డోంట్ కేర్.. మా ప్రేమ ఇలానే ఉంటుందంటూ నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. వీరిద్ద‌రూ వైసీపీలోనే ఉన్నారు. వీరి ఓవ‌ర్ యాక్ష‌న్‌కు వైసీపీ అధిష్టానం   అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం ఇసుమంతైనా చేయ‌డం లేదు. ప్ర‌జా జీవితంలో ఉన్న నేత‌లు ఎవ‌రైనా కాస్త సంస్కారవంతంగా ఉండాలి.  ఫ్యామిలీ ప‌రంగా ఎన్ని అంత‌ర్గ‌త విబేధాలుఉన్నా స‌భ్య‌స‌మాజంలో వారి ప్ర‌వ‌ర్త‌న న‌లుగురు మెచ్చుకునేదిలా ఉండాలి. కానీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, దివ్వెల మాధురిల‌కు అవేమీ ప‌ట్ట‌డం లేదు. వైసీపీ అధిష్టానం కూడా మంద‌లించ‌డం లేదు.  దీనికితోడు వీరు మీడియాలో ఇటీవ‌ల  వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ హ‌ల్‌చ‌ల్ చేసేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌ముఖ చానెల్ ఇంట‌ర్వ్యూలో వారిద్ద‌రూ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేశారు. ప‌వ‌న్ డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేయాలంటూ డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వ్య‌వ‌హారం తెలుగు  డైలీ సీరియ‌ల్ త‌ర‌హాలో  ఫుల్ స్టాప్ అనేదే లేకుండా కొన‌సాగుతోంది. వారిద్ద‌రికి సంబంధించి రోజూ ఏదోఒక ఎపిసోడ్ తెర‌పైకి వ‌స్తూనే ఉంది. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో అంత‌ర్గ‌త విబేధాలు తారాస్థాయికి చేరాయి.  ఎన్నిక‌ల త‌రువాత వారి కుటుంబ విబేధాలు  రోడ్డెక్కాయి. ఇళ్ల‌పై దాడులు, కోర్టు కేసులు, విడాకుల వ‌ర‌కు దువ్వాడ శ్రీ‌నివాస్‌, వాణిల వ్య‌వ‌హారం వెళ్లింది. దీనికి కార‌ణం మాధురి అని వాణి, ఆమె కుమార్తెలు ఆరోపిస్తున్నారు. టెక్కలిలోని ఓ ఇంటిలో శ్రీ‌నివాస్‌, మాధురి ఉంటుండ‌టంతో వాణి, ఆమె కూతుళ్లు నిల‌దీశారు. ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వారు అక్కడే బైఠాయించి నిర‌స‌న దీక్ష‌  చేశారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ త‌రువాత దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి బ‌హిరంగానే వారి మధ్య సంబంధాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటామ‌ని చెప్పి అంద‌రికీ షాకిచ్చారు. వాణి నుంచి విడాకులు కోరుతూ శ్రీ‌నివాస్ కోర్టుకు వెళ్లారు. విడాకుల ప్ర‌క్రియ పూర్త‌వ్వ‌గానే మేమిద్ద‌రం పెళ్లి చేసుకుంటామ‌ంటూ  ఏదో గొప్ప‌ప‌ని  అన్న‌ట్లుగా వారు  చెబుతున్నారు. ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్లో ఇటీవ‌ల శ్రీ‌నివాస్, మాధురి మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా జీవితాన్ని, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను వేరువేరుగా చూడాలంటూ   ఆ చానల్ వేదికగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. తమ వ్య‌వ‌హారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ ని విమ‌ర్శిస్తున్నార‌ని, మ‌మ్మ‌ల్ని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అది త‌ప్పుకాదా అంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న‌ది త‌ప్పుకాన‌ప్పుడు మేము చేసేది కూడా త‌ప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. మాది త‌ప్ప‌ని అనేవాళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేయాలని చెబుతూ.ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల వ్య‌వ‌హారం.. లేటు వ‌య‌సులో తమ ఘాటు ప్రేమాయ‌ణం ఒక్క‌టే అని చెప్పుకు ప్ర‌య‌త్నం చేశారు. వీరి వ్యాఖ్య‌లపై ప‌వ‌న్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం వాస్త‌వ‌మే. కానీ, ప‌వ‌న్ తో విడిపోయిన వారు ఎప్పుడైనా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారా...?  లేదు. ఎవ‌రి జీతాల్లో వారు నిమ‌గ్న‌మ‌య్యారు. కానీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వ్య‌వ‌హారం అలాకాదు. శ్రీ‌నివాస్ భార్య‌, ఆయ‌న ఇద్ద‌రు పిల్ల‌లు అభ్యంత‌రం చెబుతున్నారు. మాధురి ఎంట్రీతోనే శ్రీ‌నివాస్ త‌ప్పుదారి ప‌ట్టాడ‌ని, అత‌న్ని మాయ‌చేసి మాధురి వ‌ల‌లో వేసుకుంద‌ని ఆరోపిస్తున్నారు. అలాంట‌ప్పుడు శ్రీ‌నివాస్, మాధురి ల‌వ్ ట్రాక్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారాన్ని పోల్చ‌డ‌మేమిట‌ని జ‌న‌సైనికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌మ‌ని చెప్పినా జ‌గ‌న్ స‌స్పెండ్ చేయ‌లేద‌ని, అది కుటుంబ వ్య‌వ‌హార‌మ‌ని చెప్పార‌ని దువ్వాడ‌ శ్రీ‌నివాస్  చెప్పుకొచ్చారు. త‌మ నాయ‌కుడు గొప్ప వ్య‌క్తి అంటూ భజ‌న‌కూడా చేశారు. వాస్తవానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దువ్వాడ శ్రీ‌నివాస్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి ఉంటే.. శ్రీ‌నివాస్ లాంటి వారు వైసీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్లంద‌రినీ స‌స్పెండ్ చేయాల్సి వ‌స్తుంది.  అదే చేస్తే పార్టీ మ‌నుగ‌డే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే జ‌గ‌న్ భ‌య‌పడి ఉంటార‌ని  నెటిజ‌నులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురిలు త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్నిప‌వ‌న్ క‌ల్యాణ్ పెళ్లిళ్ల‌తో పోల్చ‌డం చూస్తుంటే వారి పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్ధ‌మ‌వుతోందని నెటిజనులు అంటున్నారు. 

ఎపిలో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు 

గత వైసీపీ ప్రభుత్వం మద్యం షాపుల్లో చీప్ లిక్కర్ విక్రయాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడింది.  వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఎపి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.  దీనిలో భాగంగా ఇటీవల 3,336 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం షాపు పొందేందుకు దరఖాస్తు ఫీజ్ రెండు లక్షలుగా కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.   ఇప్పటివరకు దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయి.   వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.400కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాతి దశలో గీత కార్మికులకు 10 శాతమైన 340 షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈ నెల 11 వ తేదీ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు  తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి భారీగా టెండర్లు వచ్చాయి. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులొచ్చాయి.