మంత్రి సురేఖపై ముప్పేట దాడి.. కాంగ్రెస్‌కు మరో తలనొప్పి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటికీ నేతల మధ్య అంతర్గత విబేధాల కారణంగా పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో పార్టీకి మంచి పేరు తీసుకొస్తున్నాయి అనుకునేలోగా హైడ్రా విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భాగ్యనగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రారంభంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయంలోనూ , మరికొందరి బడాబాబుల అక్రమ నిర్మాణాలు కూల్చివేత సమయంలో హైడ్రాపై ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. రేవంత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని సర్వత్రా పొగడ్తలు వినవచ్చాయి. కానీ రోజుల వ్యవధిలో పరిస్థితి మారిపోయింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల ఇండ్లకూల్చివేత హైడ్రాపైనే కాకుండా రేవంత్ సర్కార్ పై కూడా తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు హైడ్రా తీరును తప్పుబడుతున్నారు. దీంతో విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్ సర్కార్ ను, కాంగ్రెస్ ను ఇరుకుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. హైడ్రా విషయంపై రెండు రోజులుగా అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతోపాటు సినీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేశాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతోపాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ట్రోలింగ్స్‌పై హరీష్‌రావు స్పందిస్తూ.. కొండా సురేఖను ఉద్దేశించి చేసిన పోస్టులు సమర్థనీయం కాదన్నారు. అయితే, కేటీఆర్ వీటిపై స్పందిచకపోవడంతో ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. కేటీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటుచేయడంతో పాటు.. కేటీఆర్ వారిని వేధించారనీ ఆరోపించారు. కొందరు హీరోయిన్లు కెరీర్ ను వదులుకుని వివాహం చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ వేధింపులే కారణం అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. దీనిపై ఎవరైనా హీరోయిన్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా అనే ప్రశ్నకు మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. వాళ్లెవరూ బయటకురారని, ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై విచారణ చేస్తుందన్నారు. ఇదే సమయంలో సమంత, నాగచైతన్య విడాకులపై కూడా కొండా సురేఖ ఆరోపణలు చేశారు. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అన్నారు. ఈ విషయం అందిరికీ తెలుసు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు.
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున, ఆయన సతీమణి అమలతోపాటు సమంత కూడా స్పందించారు. వీరితోపాటు మరికొందరు టాలీవు్ సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. నాగార్జున ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున పేర్కొన్నారు. నాగార్జున భార్య అమల కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. రాజకీయ స్వలాభం కోసం ఇంత భయంకరమైన ఆరోపణలు చేయడం, మామూలు ప్రజలను వేటగా మార్చుకోవడం కూడా షాకింగ్‌గా అనిపిస్తోంది. రాహుల్ గాంధీ గారు.. మీరు నిజంగా మానవత్వాన్ని నమ్మితే మీ నాయకులను ఆపండి. అలాగే మీ మినిస్టర్ చేసిన ఘోరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మా కుటుంబానికి క్షమాపణలు చెప్పేలా చేయండి. ఈ దేశ ప్రజలను కాపాడండి.. అంటూ రాహుల్ గాంధీకి కూడా అమల ఓపెన్‌గా రిక్వెస్ట్ పెట్టారు.
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సమంత కూడా స్పందించారు. ఒక అమ్మాయిగా పుట్టడం, బయటికి వచ్చి పనిచేయాలని అనుకోవడం, అమ్మాయిలను ఆటబొమ్మల్లాగా కాకుండా మనుషులుగా ఎక్కువగా ట్రీట్ చేయని గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి ముందుకు సాగడం, ప్రేమలో పడడం, ప్రేమ నుండి బయటపడడం, అయినా నిలబడి పోరాడడం.. ఇవన్నీ అంత సులభం కాదు. దీనికోసం చాలా శక్తి, ధైర్యం కావాలి. ఈ ప్రయాణం నన్ను ఎలా మలిచింది అనే విషయంపై నేను గర్వపడుతూనే ఉంటాను మంత్రి గారు.. దయజేసి దానిని చిన్నచూపు చూడకండి. మినిస్టర్‌గా మీరు మాట్లాడే మాటలు జనాల్లోకి ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచించండి అంటూ కొండా సురేఖ పేరును ప్రస్తావిస్తూ సమంత లేఖ విడుదల చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లీగల్ నోటీసు పంపారు. అబద్దాలు, అసత్యాలతో దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు. సురేఖ వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మంత్రి హోదాలో ఉండి ఆమె ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొంటున్నారు.
మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలనేకాక.. టాలీవుడ్ నూ కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టగా.. ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొండా సురేఖ క్షమాపణలు చెబుతారా? ఎదురుదాడికి దిగి వివాదం మరింత తీవ్రరూపం దాల్చడానికి కారణం అవుతారా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే అది ఈ వివాదం సర్దుమ ణగడానికి సరిపోతుందని పరిశీలకులు భావించడం లేదు.