యాంటీ ఇంకంబెన్సీయే కాదు.. అంతకు మించి!

ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ పై దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో సందేహానికి తావు లేకుండా రుజువు చేశాయి. మోడీ సర్కార్ కు అంటే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ప్రజలు పూర్తిగా అంగీకరించలేకపోయారన్నదానికీ ఈ ఎన్నికల ఫలితం నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే 2014, 2019 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ కు తిరుగులేని మెజారిటీ ఇచ్చి, కాంగ్రెస్ ను విపక్ష హోదా కోసమే ఇబ్బంది పడేలా తీర్పు ఇచ్చారు. అదే ప్రజలు 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ను బలమైన ప్రతిపక్షంగా ఎన్నుకున్నారు. అదే సమయంలో గతానికి భిన్నంగా మోడీ సర్కార్ మనుగడ కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి కల్పించారు.  అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఒకటి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం కాగా, మరొకట హర్యానా. ముందుగా హర్యానా విషయానికి వస్తే.. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది.  అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి శరాఘాతం కానున్నాయని ఎగ్జిట్ పోల్స్ సందేహాలకు అతీతంగా వెల్లడించాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5న ఒకే విడతలో జరిగాయి. ఫలితాలు ఈ నెల 8న విడుదలౌతాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హర్యానాలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 55 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయన్నది ఎగ్జిట్ పోల్స్ ఫలితం. చెబుతోంది. అంటే సింపుల్ మెజారిటీ కంటే దాదాపు 10 స్థానాలు అధికంగా కాంగ్రెస్ గెలుచుకోనుంది. ఇక పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 32 స్థానాలకు పరిమితమౌతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పదేళ్ల బీజేపీ పాలనకు ఎండ్ కార్డ్ పడినట్లే. అయితే ఈ సారి గమనించాల్సిన విషయమేంటంటే హర్యానాలో బీజేపీ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల పెల్లుబికిన ఆగ్రహం కూడా జనం ఈ స్థాయిలో స్పందించడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో మూడు దశలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 5, 25, అక్టోబర్ 1న మూడు విడతలుగా జరిగిన పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి జమ్మూ కాశ్మీర్ లో ప్రతికూల ఫలితం రావడం ఖాయమని తేలింది. అయితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. వాస్తవానికి 2018 నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రం పాలనలోనే ఉంది.   ఆర్టికర్ 370 రద్దు రాష్ట్రంలో తమకు భారీగా లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావించింది. అయితే ఫలితం అందుకు భిన్నంగా ఉండబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో సింపుల్ మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన 46 స్థానాలను అటు కాంగ్రెస్ కూటమి కానీ, ఇటు బీజేపీ కూటమి కానీ సాధించే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాలలోనూ బీజేపీకి ఎదురుదెబ్బతప్పదని తెలడంతో బీజేపీలో ఆందోళన వ్యక్తమౌతోంది. అసలే కేంద్రంలో ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మద్దతుతో నడుస్తున్న నేపథ్యంలో హర్యానా, జమ్మూ కాశ్మీర్ లలో  ఎగ్జిట్ పోల్స్ నిజమై ప్రతికూల ఫలితాలు వస్తే బీజేపీ చిక్కులు మరింత పెరుగుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

డోన్ట్ వర్రీ.. అయాం సేఫ్.. రతన్ టాటా!

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ముంబైని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో రతన్ టాటా తన ఆరోగ్యం మీద ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘నా ఆరోగ్యం గురించి ఇటీవల పుకార్లు వ్యాపించాయని నాకు తెలుసు. ఈ వాదనలు నిరాధారమైనవని అందరికీ హామీ ఇవ్వాలనుకుంటున్నాను. నా వయస్సు సంబంధిత అనారోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను ఉత్సాహంగా వున్నాను. కొంతమంది గౌరవనీయ మీడియా ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండవలసిందిగా అభ్యర్థిస్తున్నాను’’ అని రతన్ టాటా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

టీడీపీలోకి మల్లారెడ్డి.. డేట్ ఫిక్స్!?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమైంది. ఆయన టీడీపీలోకి చేరే డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మల్లారెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిసినట్టు సమాచారం. తన మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించడం కోసమే  చంద్రబాబును కలుస్తున్నట్టు కలరింగ్ ఇచ్చినప్పటికీ మల్లారెడ్డి అసలు ఉద్దేశం టీడీపీలో చేరడమేనని తెలుస్తోంది. .

ధర్మాన దర్శనం లేక డైలమాలో సిక్కోలు వైసీపీయులు!

సుదీర్ఘమైన రాజకీయ అనుభవం,  ప్రసంగాలతో ప్రత్యర్ధులను కట్టిపడేసే పదునైన స్వరం,  రాష్ట్ర రాజకీయాలను సైతం శాశించిన ఆ ప్రస్థానం  ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉంది. ఈ ఉప్పోద్గాతం అంతా.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసిపి నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురించి.  శ్రీకాకుళం జిల్లా వైసిపి నేతలకు పెద్ద దిక్కుగా, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు దర్శనం లేక ప్రస్తుతం డైలమాలో ఉన్నారు సిక్కోలు నేతలు.  దిశా నిర్దేశం చెయ్యాల్సిన నేత.. కనిపించకుండా, వినిపించకుండా, వినిపించుకోకుండా  పోవడం ఇప్పుడు వారిలో అంటే సిక్కోలు నేతల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.  రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే ప్రాంతంగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ కుటుంబాలు రెండు.  ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే,  ఆ తరువాతి స్థానం ధర్మాన కుటుంబానిదే. వీటిలో కింజారపు కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండగా.. ధర్మాన కుటుంబం తొలుత కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండింటిలో  కింజరాపు కుటుంబం..  గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ.. విజయాలు, మెజారిటీలలో తమ రికార్డును తామే తిరగరాస్తూ వస్తోంది.  ఇప్పుడు వచ్చిన తిప్పలు సిక్కోలు వైసిపి నేతలకే.  శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. రెండు సార్లు నరసన్నపేట నుంచి, మూడు సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీచేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ చేతిలో ఓడిపోయారు. ధర్మానతో పోలిస్తే గొండు శంకర్ రాజకీయాల్లో  చాలా చాలా జూనియర్. అంతటి జూనియర్ చేతిలో పరాజయాన్ని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోతున్నారు.  దీంతో ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుండి ధర్మాన కనిపించజకపోవడం.. అయన దర్శనం కూడా ఎవ్వరికీ లభించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని  ధర్మాన ప్రసాదరావు గతంలోనే ప్రకటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని,   ఎన్నికల్లో తన కుమారుడికి శ్రీకాకుళం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైసీపీ అధినేత జగన్ ససేమిరా అనడంతో అయిష్టంగా, అనివార్యంగా ధర్మాన ప్రసాదరావు పోటీచేయాల్సి వచ్చింది.  పోటీలో ధర్మాన ఘోరంగా ఓడిపోయారు. అంతే అతరువాత  తరువాత సుషుప్తావస్థలోకి చేరిపోయారు. చకచకా జరిగిన ఈ పరిణామాల ఈ నేపధ్యంలో  ఆయన ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసి తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రితో పాటు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. పార్టీలో ఏ మాత్రం క్రీయాశీలంగా లేరు. ప్రస్తుతం తన స్థానాన్ని కుమారుడితో భర్తీ చేసే ప్లాన్‌లో ధర్మాన ప్రసాదరావు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్యాడర్ మాత్రం నడిపించే నాయకుడు లేక తికమకపడుతోంది. ధర్మాన దర్శనం క్యాడర్ కు లభిస్తుందా.. లేదా బయట ప్రచారంలో ఉన్న నూతన నాయకత్వంలో శ్రీకాకుళం వైసిపి ముందుకు వెళ్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

దువ్వాడ, మాధురి.. ఇక అంతా ఓపెన్!

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి సంబంధ బాంధవ్యాలపై తీవ్ర దుమారం రేగిన విషయం అందరికీ తెలిసిందే. కట్టుకున్న భార్య దువ్వాడ వాణిని కాదని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కలిసి వుంటున్నారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, మాధురితో కలిసి బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. శ్రీవారిని దర్శించుకుని జంటగా బయటకు వచ్చిన వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.ఈ సమయంలో మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కోలాహలం వేళ ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి కనిపించారు. ఇటీవలి కాలంలో మూడు స్తంభాలాట తరహాలో జరిగిన  వివాదం తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంటగా కెమెరా కంటికి చిక్కడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇటీవల భార్యా పిల్లలతో వివాదం తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఓపెన్ అయిపోయారు... ఏ ఇంటి విషయంలో అయితే దువ్వాడ వాణి పట్టుబడుతోందో ఆ ఇంటిని దివ్వెల మాధురి పేరిట రిజిస్టర్ చేసేశారు. తనకు దువ్వాడ శ్రీనివాస్ మూడు కోట్లు బాకీ వున్నారని, అందుకే ఆ బాకీ కింద ఈ ఇంటిని తనకు రాసేశారని దివ్వెల మాధురి చెబుతుంటే, దువ్వాడ వాణి మాత్రం ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు అంటూ చెబుతున్నారు. ఎప్పటికైనా దివ్వెల మాధురిని ఆ ఇంటి నుంచి బయటకి పంపేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇంత రచ్చ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా ఓపెన్ అయిపోయారు. దివ్వెల మాధురితో మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు.  దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. స్కూటీపై షికార్లు చేస్తున్న ప్రేమ జంటను చూస్తుంటే ముచ్చటగా వుందని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ ఇద్దరినీ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఏపీకి వరుస తుపాన్లు ముప్పు!

ఆంధ్రప్రదేశ్ కు ఈ నెలలో మరో మూడు తుపాన్ల ముప్పు ఉంది. భారత వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ఈ నెల 10 తరువాత ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా మూడు తుపాన్లు రాబోతున్నాయి. వీటిలో అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాను, బంగాళాఖాతంలో ఏర్పడే రెండు తుపాన్ల కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో  పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది.  దీనికి తోడు ఈ నెల 10 తరువాత రాష్ట్రంలో వరుస తుపాన్లతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా జిల్లాల యాంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీకి తరలనున్న సినీపరిశ్రమ?

సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరల నుందా? తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోల నిర్మాణం, షూటింగులు జరుపుకోనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎవరైనా సరే ఔననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో నటి సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల రచ్చ రేవంత్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ గా మారిపోయింది. దీంతో తెలుగుసినీ పరిశ్రమ హైదరాబాద్ లో కొనసాగుతుందా, ఆంధ్రాకు తరలిపోతుందా అన్న చర్చ మొదలైంది. నటుడు నాగార్జునకు మద్దతుగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నిలబడటం, దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ముందు ముందు సినీపరిశ్రమ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సంబంధాలు మరింత చెడే అవకాశం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం  టాలీవుడ్ పెద్దలు  హైదరాబాద్ ను వీడి ఏపీకి పరిశ్రమను తరలించాలని యోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలే అంటున్నాయి. పరిశ్రమను ఏపీకి తరలించే విషయంలో తీవ్ర స్థాయిలో ఆలోచనలు, చర్చలు జరుగుతున్నాయంటున్నారు.  ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సాధించి పెడుతున్న తమ పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి కనీస గౌరవం లేకపోవడం బాధ కలుగుతున్నదని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. దీంతోనే  పరిశ్రమను ఏపీలోని విశాఖ తరలించాలనే ఆలోచన చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దసరా తరువాత ఈ విషయంపై టాలీవుడ్ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలున్నాయంటేన్నారు.  ఇదే జరిగితే హైదరాబాద్ సినీ నిర్మాణ ప్రాభవం పై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది.   అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఆ తరువాత వాటిని ఉపసంహరించుకుని సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  సినీ పరిశ్రమ మొత్తం నాగార్జున కు మద్దతుగా నిలిచింది.  ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ముఖ్యంగా పరిశ్రమకు చెందిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా ఉండడం వల్ల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని, అక్కడ తమకు సముచిత గౌరవం లభిస్తుందని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. అంతే కాకుండా చంద్రబాబు గతంలోనే  పరిశ్రమను విశాఖకు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అక్కడకు తరలివేళ్లేందుకు యోచిస్తున్నారు.  తమకు విశాఖలో  స్థలాలు కేటాయిస్తే స్టూడియోలు నిర్మించుకుంటామని కొందరు పెద్దలు ఇప్పటికే ప్రకటించారు కూడా.  తమకు గౌరవం లేనిచోట  ఉండలేమని అంటున్నారు.  అన్నిటికీ మించి తెలుగుసినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడానికి ముఖ్య కారకుడు నాగార్జున తండ్రి, నటసామ్రాట్ అక్కినేనే అన్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయనే అప్పటిలో మద్రాసును వదిలి హైదరాబాద్ కు వచ్చి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు. అంతే కాకుండా తనతో సినిమాలు చేయాలననుకునే వారెవరైనా సరే హైదరాబాద్ కు రావలసిందేనని కచ్చితంగా చెప్పారు.  అంటే నాడు టాలీవుడ్ హైదరాబాద్ తరలిరావడానికి తొలి అడుగు వేసింది అక్కినేని కుటుంబమే. అటువంటి అక్కినేని కుటుంబాన్నే అవమానిస్తే ఎలా సహించేది అంటూ టాలీవుడ్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తం మీద సినీ పరిశ్రమ రేవంత్ సర్కార్ పై విశ్వాసాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో టాలీవుడ్ కు స్పష్టమైన హామీ ఇచ్చి సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోతే పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోవడం ఖాయమని అంటున్నారు.  అదే సమయంలో టాలీవుడ్ కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన హెచ్చరికలను బట్టి అటువంటి యోచన ఏదీ రేవంత్ సర్కార్ కు లేదని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.  ‘కొండా సురేఖపై టాలీవుడ్ నుంచి ఇంకొక్క మాట వచ్చినా సహించేది లేదు. ఆమె ఒంటరి కాదు.ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇక మాట్లాడొద్దు’ అని మంత్రి పొన్న ప్రభాకర్ మీడియా సమావేశం పెట్టి మరీ టాలీవుడ్ ను హెచ్చరించారు.  దీంతో టాలీవుడ్ పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తమిళనాట ఏపీ ఫార్మ్యులా.. పవన్ పొలిటికల్ స్కెచ్!?

ప‌వ‌న్ క‌ల్యాణ్.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఈ పేరు మారుమోగుతోంది. తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదం విష‌యంలో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. ఏపీలో సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన‌సాగుతున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న ఉన్న‌ట్లుండి త‌మిళనాడు రాజ‌కీయాల‌పై దృష్టిసారించిన‌ట్లు క‌నిపిస్తోంది. పవ‌న్ వ్యూహం వెనుక బిగ్ స్కెచ్ ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వ‌చ్చే ఏడాది చివ‌రిలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఆ ఎన్నిక‌ల నాటికి తాను అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకునేలా ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచి క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కీ.. ప‌వ‌న్ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషించ‌బోతున్నారు.. ఏపీలో ఫార్ములాను త‌మిళ‌నాట ప్ర‌యోగించ‌బోతున్నారా.. ప‌వ‌న్ త‌మిళ రాజ‌కీయం అక్క‌డి సినీ ఇండ‌స్ట్రీపై ఎలాంటి ప్ర‌భావం చూప‌బోతుందో  అన్నన చర్చ మొదలైంది. ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీచేశాయి. ఈ క్ర‌మంలో అసెంబ్లీ, పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సార‌ధ్యంలోని జ‌న‌సేన పార్టీ వంద‌శాతం స్టైక్ రేట్ తో విజ‌యం సాధించింది. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌వ‌న్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  ఏపీలో వైసీపీ దారుణ ఓట‌మికి చంద్ర‌బాబుతోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ దికూడా కీల‌క భూమిక‌. చంద్ర‌బాబు వ్యూహం, ప‌వ‌న్ దూకుడుతో వైసీపీ కేవ‌లం ప‌ద‌కొండు స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యిని వినియోగించిన‌ట్లు లాబ్ రిపోర్టులు వ‌చ్చాయి. తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే దేశ‌వ్యాప్తంగానే కాక‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొలుస్తారు. అలాంటి తిరుమ‌ల‌లో జ‌గ‌న్ హ‌యాంలో క‌ల్తీ నెయ్యి వాడార‌నే విష‌యం పెద్ద దుమారాన్నే రేపింది. అప‌చారం జ‌రిగినందుకు క్ష‌మించ‌మ‌ని కోరుతూ ప‌వ‌న్  ప‌ద‌కొండు రోజుల‌ పాటు ప్రాయ‌శ్చిత్త దీక్ష‌  చేప‌ట్టారు. తిరుమ‌ల కొండ‌పై దీక్ష‌ను విర‌మించి  తిరుప‌తిలో వారాహి సభ  నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో వారాహి డిక్లరేషన్ చేస్తూ సనాతన ధర్మం గురించి ప‌వ‌న్ మాట్లాడారు. ఇదే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేద‌ని సీరియస్‌గానే ప‌వ‌న్‌ వార్నింగ్ ఇచ్చారు.  వారాహి స‌భ‌లో ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌ జ‌రిగింది.. త‌మిళ‌నాడులో అయితే పవన్ వ్యాఖ్యలు రాజ‌కీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై  ఉదయనిధి స్టాలిన్ స్పందించకపోయినా.. డీఎంకే పార్టీ, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా రియాక్టయ్యారు. పవన్ కళ్యాణ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. దీనికి తోడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై త‌మిళ‌నాడులో కేసు కూడా న‌మోదైంది. ఇదంతా ఒకెత్తయితే.. త‌మిళ‌నాడు గురించి ప‌వ‌న్ మాట్లాడిన ప్ర‌తి మాట వెనుక వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది. త‌మిళ‌నాట మ‌రో ఏడాదిన్న‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా చేసుకొని ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచే త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ని,  ఆయ‌న వెనుక బీజేపీ పెద్ద‌లు ఉన్నార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్త‌వానికి. త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నది.  కానీ, సాధ్యం కావటం లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకేతో పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లినా పెద్ద‌గా ఫ‌లితం ద‌క్క‌లేదు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ విడిగా పోటీ చేసింది. క‌నీసం ఒక్క‌సీటును కూడా ద‌క్కించుకోలేక పోయింది. దీనికితోడు కాంగ్రెస్‌, డీకేఎం కూట‌మి 39 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో తమిళనాడులో బీజేపీ అన్నామలైను హైలెట్ చేసింది. అన్నామ‌లైకు రాష్ట్ర వ్యాప్తంగా విప‌రీతమైన క్రేజ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అది ఓటుగా మారలేదు. దీంతో   బీజేపీ ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మిళ‌నాడులో ప్ర‌యోగించాల‌ని భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హిందుత్వం పేరుతో ఎంట్రీ ఇస్తే.. అక్క‌డి సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో ప‌వ‌న్ సైతం త‌మిళ రాజ‌కీయాల‌పై దృష్టి కేంద్రీక‌రించారు. హిందుత్వం పేరుతో త‌మిళ‌నాడులోని హిందువుల‌ను ఏక‌తాటిపైకి తీసుకురావ‌డంతో పాటు.. ఏపీలో ప్ర‌యోగించిన ఫార్ములాను త‌మిళ‌నాడులో ప్ర‌యోగించాల‌ని ప‌వ‌న్, బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. ఏపీలో ఎన్నిక‌ల ముందు బీజేపీ, టీడీపీని ఒకేతాటిపైకి తీసుకురావ‌డంలో ప‌వ‌న్ పాత్ర కీల‌మైంది. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులో డీఎంకేకు గ‌ట్టి పోటీదారుగా ఉన్న అన్నాడీఎంకే, ఇత‌ర పార్టీల‌ను బీజేపీ ప‌క్క‌కు తీసుకొచ్చేలా ప‌వ‌న్ పావులు క‌దుపుతున్నారు. సినీ హీరో విజ‌య్ కొత్త పార్టీని స్థాపించిన విష‌యం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామ‌ని ఇప్ప‌టికే విజ‌య్ చెప్పారు. విజ‌య్ కు త‌మిళ‌నాట మంచి క్రేజ్ ఉంది. డీఎంకే పార్టీ, విజ‌య్ పార్టీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీల‌ను ఎన్డీయే కూట‌మిలోకి తీసుకొచ్చేలా ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టినట్లు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో డీఎంకే పార్టీకి బద్ధశత్రువైన.. అన్నాడీఎంకే పార్టీ గురించి ప‌వ‌న్ వ‌రుస‌ ట్వీట్లు చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.  అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంజీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రోవైపు డీఎంకే, విజ‌య్ పార్టీలు ఎక్కువ‌గా క్రిస్టియ‌న్, ముస్లీం ఓట్ల‌పై దృష్టిసారించాయి. దీంతో ఎన్డీయే కూట‌మి ఆధ్వ‌ర్యంలో హిందుత్వ ఓట్ల‌ను టార్గెట్ చేయడమే బీజేపీ  లక్ష్యంగా చెబుతున్నారు‌. ఈ క్ర‌మంలో అన్నామ‌లైతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్   సేవ‌ల‌ను కూడా బీజేపీ వినియోగించుకోబోతుంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే రంగంలోకి దిగ‌డంతో త‌మిళ‌నాట రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. మ‌రి ప‌వ‌న్ టార్గెట్ రీచ్ అవుతారా.. ప‌వ‌న్ ద్వారా బీజేపీ అనుకున్న ల‌క్ష్యానికి చేరుకుంటుందా  అనేది వేచి చూడాల్సిందే.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు కలిసి రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం(అక్టోబర్ 6)  తిరుమల శ్రీవారిని మొత్తం 86వేల 859 మంది దర్శించుకున్నారు. వారిలో 37వేల 173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 63లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం(అక్టోబర్ 7) అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. 

మెరీనా బీచ్‌లో ఎయిర్‌ షో సందర్భంగా నలుగురి మృతి

చెన్నై మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన 'మెగా ఎయిర్ షో'  సందర్భంగా విషాదం ఏర్పడింది. ఎయిర్ షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు వచ్చారు. ఎయిర్ షో ముగిశాక వారు తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడింది. దాంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉక్కపోత, ఎండవేడిని తట్టుకోలేక ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరొకరు హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. అస్వస్థతకు గురైన దాదాపు 230 మందిని చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మృతులు శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్బాబు, దినేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఎయిర్ షోకు దాదాపు 13 లక్షలమందికి పైగా సందర్శకులు హాజరైనట్లు అంచనా. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకే ఎయిర్ షో ముగిసినప్పటికీ, సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించడానికీ ఇబ్బంది ఎదురైంది. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. మెరీనా బీచ్ సమీపంలోని లైట్స్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న మెట్రో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన తర్వాత తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడంతో.. ప్లాట్ ఫామ్‌ల మీద నిలబడటానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది.

బీఆర్ఎస్ రాజ‌కీయ క్రీడ‌లో పావు నాగార్జున?

తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని కుటుంబం గురించి తెలియ‌నివారు ఉండ‌రు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గురించి కూడా ప్ర‌స్తావిస్తుంటారు. టాలీవుడ్‌కు, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు వీరు ఎన్నో సేవ‌లు అందించారు.   అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అంటే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ అక్కినేని నాగార్జున‌ సైతం అంతే స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ప‌లు విధాలుగా ఎంతో మందికి ఉపాధి క‌ల్పించిన.. క‌ల్పిస్తున్న వ్య‌క్తిగా నాగార్జున‌కు మంచి పేరుంది. రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా అన్ని పార్టీల నేత‌ల‌తో నాగార్జున స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆయ‌న్ను నాగార్జున ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు  తెలిపారు. అయితే, ఇటీవ‌ల కాలంలో రేవంత్ స‌ర్కార్ తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జున‌కు చెందిన‌ ఎన్ క‌న్వెన్ష‌న్ కొంత‌భాగం చెరువు భూమిని ఆక్ర‌మించి నిర్మించార‌ని గుర్తించి అధికారులు కూల్చివేశారు. ఈ విష‌యంపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో బీఆర్ఎస్ నాగార్జున‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు ముందుకు రాలేదు. కేటీఆర్, నాగార్జున‌కు మంచి సంబంధాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ నాగ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడితే.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్ ఎన్వెన్ష‌న్ కూల్చివేత విష‌యంలో నోరు మెద‌ప‌లేదు.  ఇటీవ‌ల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఓ ప్ర‌భుత్వ కార్యక్ర‌మంలో మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు పాల్గొన్నారు. అయితే, హ‌రీశ్ రావు, కేటీఆర్‌ డీపీతో ఉన్న బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు  సోష‌ల్ మీడియాలో సురేఖ‌, ర‌ఘునంద‌న్ రావుపై అస‌భ్య‌క‌ర పోస్టులు చేశారు. దీనిపై  హ‌రీశ్‌రావు స్పందించి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. కొండా సురేఖ ఈ అంశంపై తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ ఎందుకు స్పందించ‌లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోవ‌టానికి కార‌ణం కేటీఆర్ అని, కేటీఆర్ కార‌ణంగా చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ కు అర్ధంతరంగా ఫుల్ స్గాప్ పెట్టేశారనీ అన్నారు. డ్ర‌గ్స్ విష‌యంలోసైతం కేటీఆర్‌పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మంత, నాగ‌చైత‌న్య విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డంతో హీరో నాగార్జున నాగచైత‌న్య‌, అమ‌ల‌తో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌, నాని, వెంక‌టేశ్‌, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ వంటి టాలీవుడ్ ప్ర‌ముఖులు కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. స‌మంత సైతం మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. త‌మను మీ అవ‌స‌రాల‌కోసం రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినీ ఇండ‌స్ట్రీతో పాటు బీఆర్ఎస్ నేత‌లు  కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దీంతో కాంగ్రెస్ పెద్ద‌లు అల‌ర్ట్ కావ‌టంతో ఆమె దిగొచ్చి.. త‌న వ్యాఖ్య‌లను వెన‌క్కు తీసుకున్నారు. స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ, కేటీఆర్ ను మాత్రం వ‌దిలేది లేద‌ని హెచ్చ‌రించారు. అయితే,  స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు.  హీరో నాగార్జున మాత్రం కొండా సురేఖ‌ను వ‌దిలేది లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి సెల‌వులో ఉండ‌టంతో నాంప‌ల్లి కోర్టు విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. దీనికి తోడు సురేఖ‌పై 100కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని నాగార్జున చెప్పారు. పరువు నష్టం దావాలు కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతాయన్న విషయం తెలుసని.. అయినా, ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని, తానొక బలమైన వ్యక్తినని, కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే కారణమని అభిప్రాయపడ్డారు. అయితే, కొండా సురేఖ విష‌యంలో నాగార్జున అతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ వాద‌న కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారుతున్నారని, ఈ అంశంపై మంత్రి వెన‌క్కు త‌గ్గినా నాగార్జున అదే విష‌యాన్ని ప‌ట్టుకొని రాద్దాంతం చేయాల‌ని చూస్తున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నాగార్జున తీరుపై టాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల‌ు సైతం విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు.  నాగార్జున‌కు కేటీఆర్‌, కేసీఆర్ ల‌తో మంచి సంబంధాలు ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారి ప్రోద్భ‌లంతోనే నాగార్జున అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్  రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం టాలీవుడ్ హీరోల‌ను వాడుకోవ‌టం కొత్తేమీ కాద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. ఇదే స‌మ‌యంలో నాగార్జునపై కేసు న‌మోదైంది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు నాగార్జున‌పై కేసు నమోదు చేశారు. కొండా సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉపసంహరించుకుని క్ష‌మాప‌ణ‌లు చెపపినా, నాగార్జున మాత్రం కేటీఆర్ సూచ‌న‌ల‌తో ముందుకెళ్తూ అన‌వ‌స‌రంగా చిక్కుల్లోపడుతున్నారని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బీఆర్ఎస్  ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారొద్ద‌ని వారు సూచిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకున్నందున నాగార్జున ఇప్పటికైనా  ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయడం మంచిదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

రేవంత్ దెబ్బ‌కు కాంగ్రెస్‌లో క‌ట్ట‌ప్ప‌లు విల‌విల‌!

కాంగ్రెస్ పార్టీలో క‌ట్ట‌ప్ప‌ల జాబితా ఎక్కువే ఉంటుంది.. ఇప్పుడ‌నే కాదు.. గ‌తంలోనూ ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌మ‌నే ట్యాగ్ త‌గిలించుకొని ఇత‌ర పార్టీల‌కు స‌హాయ‌ స‌హ‌ కారాలు అందించ‌డం వారికి అల‌వాటుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం త‌రువాత కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు కేసీఆర్ తో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చారు. పైకి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో ద‌శాబ్దాలుగా ఉంటున్నాం, పార్టీకి ఎన‌లేని సేవ‌లు అందించామ‌ని చెప్పుకుంటూ పెత్త‌నం చెలాయించేవారు. అధికారంలోలేని ప‌దేళ్ల కాలంలో వీరి ఆట‌లు సాగాయి. కానీ, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెర‌ వెనుక పార్టీకి ద్రోహం చేస్తున్న‌వారికి చెక్‌పెడుతూ వ‌స్తున్నారు. బీఆర్ఎస్ ప‌దేళ్ల‌ హయాంలో కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉండ‌టంతో పాటు.. త‌మ స‌న్నిహితుల‌కు ప్ర‌భుత్వం నుంచి కాంట్రాక్టులు ఇప్పించుకొని ల‌బ్ధిపొందారు. రేవంత్ రెడ్డి అలాంటి వారి గుట్టును ర‌ట్టు చేస్తుండ‌టంతో ల‌బోదిబోమంటున్నారు. రేవంత్ సీఎం అయిన త‌రువాత సీనియ‌ర్‌, జూనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోతూ పార్టీ బ‌లోపేతంతోపాటు..ప్ర‌భుత్వంలోనూ వారి సేవ‌ల‌ను వినియోగించుకుం టున్నారు. కానీ, కొంద‌రి తీరులో మాత్రం మార్పురావ‌డం లేద‌ని పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువులు, నాళాలు ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారిపై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సినీ న‌టుడు నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత జరిగింది. పార్టీల‌ కు అతీతంగా, ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారు అని చూడ‌కుండా చెరువు, నాళాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. దీనికితోడు చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్‌ల‌ను కూడా కూల్చేస్తామ‌ని రేవంత్ ప‌లుసార్లు ప్ర‌స్తావించారు. మ‌రోవైపు.. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ కూల్చివేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కిలోమీట‌ర్ల‌ పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. చాదర్‌ఘాట్‌ మూసీ పరీవాహక ప్రాంతాల్లోని మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కిం గ్ చేశారు. ఇందులో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్ల కూల్చివేత‌లు చేప‌ట్టారు. అయితే, కొంద‌రు స్థానికులు మూసి ప‌రివాహ‌క ప్రాంతంలోని త‌మ ఇళ్ల‌ను కూల్చివేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు సైతం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని బాధితుల‌కు అండ‌గా నిల‌వ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్నది.  మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ఇళ్ల‌ను కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని, ఇళ్ల‌ను కూల్చాలంటే ముందుగా బుల్డోజ‌ర్లు త‌మ‌పై నుంచి పోనివ్వాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని నేత‌లు స‌వాళ్లు చేశారు. దీంతో మూసి ప్రాంతంలో కూల్చివేత‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెద్ద‌ ర‌చ్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుంద‌రీక‌ర‌ణ పనుల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో వెనుక‌డుగు వేసేది లేద‌ని తేల్చి చెప్పారు. ఇళ్లు న‌ష్ట‌పో యిన వారికి డ‌బుల్ ఇళ్లు ప్ర‌భుత్వం క‌ట్టించి ఇస్తుంద‌ని, ప‌రిహారం కూడా అందించేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తామ‌ని, అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో అనేకమంది పెద్దలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని చెబుతూ  వారి పేర్లను కూడా ప్రస్తావించారు. ఆయన అలా ప్రస్తావించిన పేర్లలో బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రాంచందర్‌రావు పేరు కూడా ఉంది. కేవీపీ అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్నారని రేవంత్ అన్నారు.   కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ పేరు నే రేవంత్‌ ఉటంకించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియ‌ర్ లీడ‌ర్ని అని ఆ లేఖలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. పార్టీకి చెడ్డ పేరు వస్తే, తన కాంగ్రెస్ రక్తం సహించదు అని పేర్కొన్న కేవీపీ,  తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించండి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి,  సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని  ఆ లేఖలో స్పష్టం చేశారు.  అయితే, కేవీపీ లేఖ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్‌ నైన నా ఫామ్ హౌస్ నే కూల్చేస్తావా అన్న హెచ్చరికను రేవంత్ కు పంపినట్లు ఉందని  కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అయితే అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ రేవంత్ కేవీపీ పేరును ప్ర‌స్తావించ‌డం వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉంద‌న్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిం దన్న ఆరోపణలున్నాయి. వాటిని రేవంత్ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు కేవీపీ అన్ని విధాలుగా సహకారం అందించారనీ, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉండటంతోనే   రేవంత్ కేవీపీ పేరు ప్రస్తావిస్తూ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   గతంలో కూడా రేవంత్‌ కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు.   కేవీపీ, కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం కావడంతో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేవీపీ కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.   ఇప్ప‌టికే కేవీపీ వ్య‌వ‌హారాన్ని రేవంత్ అధిష్ఠానం దృష్టికి తీసు కెళ్లార‌ని.. బీఆర్ ఎస్ హయాంలో కేవీపీ కేసీఆర్ కు ఏ విధంగా అండ‌గా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారో వివ రించారని  కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  హైకమాండ్ అనుమతితోనే రేవంత్  అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో కేవీపీ కూడా ఉన్నారని వెల్లడించారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో సీనియ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతూ ప‌దేళ్ల‌ పాటు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారికంగా స‌హ‌కారం అందించిన కొంద‌రు సీనియర్ల ను రేవంత్ టార్గెట్ చేశారనీ, వారిలో  కేవీపీ కూడా ఒక‌ర‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. మొత్తానికి కేవీపీ ఎపిసోడ్ తో  కాంగ్రెస్ పార్టీ లోని క‌ట్ట‌ప్ప‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దయింది. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన యువతి మీద అత్యాచారం జరిపాడన్న ఆరోపణ మీద జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో, ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా వచ్చిన నేషనల్ అవార్డును అవార్డుల కమిటీ రద్దు చేసిసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ ఎంపిక అయ్యారు. తిరుచిట్రంబళం అనే తమిళ సినిమాలోని ‘మేఘం కరుకాథ’ అంటూ సాగే పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆయన్ని ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల 8న ఆయన అవార్డు అందుకోవలసి వుంది. నేషనల్ అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దుపై సందిగ్ధం ఏర్పడింది. అవార్డు అందుకోవడం కోసం జానీ మాస్టర్‌కి బెయిల్ ఇచ్చినందుకు ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యాచారం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డుల కార్యక్రమంలో కనిపించడానికి సిగ్గు వుండాలి లాంటి ఘాటు విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దయింది.

కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేబినెట్ నుంచి ఉద్వాసనేనా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉంది. ఆమెపై చర్యలకు సిద్ధమౌతోంది. నటి సమంతపై ఆమె చేసిన వ్యాఖ్యల వేడి హస్తినను తాకింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమంతపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించారు. రాజకీయ విమర్శలలో మహిళలను ఎలా లాగుతారని రాహుల్ గాంధీ కొండా సురేఖను నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమంతపై చేసిన  వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ కొండా సురేఖను ఆదేశించారు. ఆమె కూడా క్షణం ఆలస్యం చేయకుండా తన వివరణను రాహుల్ కు పంపారు. ఆమె సుదీర్ఘ వివరణపై ఇంకా రాహుల్ నుంచి ఎటువంటి స్పందనా వెలువడ లేదు.  అయితే సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల అనంతరం అన్ని వైపులనుంచీ ఆమెపై విమర్శల దాడి జరిగింది. ఇంత జరిగినా జరుగుతున్నా.. కొండా సురేఖకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ సహచరులెవరూ పెద్దగా స్పందించలేదు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగత హోదాలో చేశారంటూ కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. తన వ్యాఖ్యలకు కొండా సురేఖ మాత్రమే కాకుండా క్యాబినెట్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణగాలంటే, కొండా సురేఖ వ్యాఖ్యల ప్రభావం కాంగ్రెస్ సర్కార్ పై పడకుండా ఉండాలంటే ఆమెపై చర్యలు తీసుకోవడమే మార్గమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.  టీపీసీసీ చీఫ్ రంగంలోకి దిగి వివాదానికి ముగింపు పలకడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు కనిపించదు. కొండా సురేఖ ఒక  అడుగు తగ్గి సమంతకు క్షమాపణలు చెప్పడమే కాకుండా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా ఆమెపై వెల్లువెత్తుతున్న విమర్శల హోరు ఇసుమంతైనా తగ్గలేదు. టాలీవుడ్ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించింది.  ఇక విషయాన్ని హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకుని ఆమె వివరణ కోరడంతో సురేఖపై వేటు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఆమె వివరణ ఇవ్వడంతో ఇక చర్యలే తరువాయి అని కాంగ్రెస్ వర్గాలు కూడా అంటున్నాయి. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అయితే కేబినెట్ నుంచి మాత్రం కొండా సురేఖకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయని అంటున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం ద్వారా ఈ వివాదం ప్రభావం ప్రభుత్వంపై పడకుండా నివారించినట్లౌతుందనీ, ఆ తరువాత ఈ విషయంలో కొండా సురేఖ తన వ్యక్తిగత హోదాలో పోరాడాల్సి ఉంటుందని పరివీలకులు విశ్లేషిస్తున్నారు.   

హీరో చంపిన వ్యక్తి దయ్యంలా మారాడా?

రేణుకాస్వామి అనే తన అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ కొంతకాలంగా విచారణ ఖైదీగా బళ్లారి జైలులో వున్నారు. దర్శన్ గత కొన్నిరోజులుగా రాత్రుళ్ళు నిద్రపోవడం లేదని తెలుస్తోంది. తాను చంపిన రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని, అందువల్ల భయంతో తనకు నిద్ర పట్టడం లేదని దర్శన్ జైలు అధికారులకు చెబుతున్నారని తెలుస్తోంది. తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, అందువల్ల తనను బెంగళూరు జైలుకి తరలించాలని కోరినట్టు సమాచారం. అర్ధరాత్రి సమయంలో దర్శన్ గట్టిగా కేకలు వేస్తున్నాడని తోటి ఖైదీలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా దర్శన్ ఆడుతున్న నాటకమని కొందరు అంటున్నారు. బెంగళూరు జైలుకు మారడం కోసమే దర్శన్ ఇవన్నీ చెబుతున్నారని అంటున్నారు. ఒకవేళ రేణుకాస్వామి దయ్యంగా మారినట్టయితే బెంగళూరు జైలుకు రాడా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్‌ VS తమిళ్ సాంబార్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత  పవన్ కల్యాణ్‌పై తమిళనాడులోని మధురైలో కేసు నమోదైంది.  తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్  తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిథి మారన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ  ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు మధురైలో కేసు నమోదైంది. వారాహి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని  ఎవరూ నిర్మూలించలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో  సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి,  సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని అన్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో వంజినాథన్ అనే న్యాయవాది పవన్ కల్యాణ్‌పై మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.  తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ విమర్శలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.