శ్రీశైలం ఆలయంలో నాణ్యత తనిఖీలు!

శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయంలో నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారులు   ప్రసాదాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించారు.  ఫుడ్ సేఫ్టీ అధికారులు షేక్ ఖాశీంవలి, ఓవీ రాముడు గురువారం లడ్డూ తయారీని పరిశీలించారు. లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్న పదార్ధాలు, ఆలయానికి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను వారు పరిశీలించారు. అలానే లడ్డూ కౌంటర్‌ల వద్ద భక్తులకు అందిస్తున్న లడ్డులను పరిశీలించారు.  తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో  కల్తీ నెయ్యి వినియోగం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో  ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా  ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత, ప్రసాదాల్లో ఉపయోగించే వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  

తెలంగాణలో 7139 వరి కొనుగోలు కేంద్రాలు!

తెలంగాణ వ్యాప్తంగా 7139  వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకటీ రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  వరి సాగు ముందుగా పూర్తయిన నిజామాబాదు, నల్గొండ జిల్లాల్లో ముందుగా కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇక రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు.   ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు.

నాకు మండిందంటే అణుబాంబు వేస్తా!

తమ దేశం మీద దక్షణ కొరియాగానీ, ఆ దేశ మిత్రపక్షమైన అమెరికాగానీ దాడి చేయడానికి ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. 'ఒకవేళ శత్రువులు మా దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా సాయుధ బలగాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే వాటిపై నిస్సంకోచంగా అణ్వాయుధాలతో దాడి చేస్తాం' అని కిమ్ పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియా రాజధాని పాగ్యాంగ్‌లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని కిమ్ సందర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్  'ఒకవేళ ఉత్తర కొరియా మాపై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అమెరికా కూటమితో కలిసి ఎదుర్కొంటాం. ఆ రోజుతో ఉత్తర కొరియాలో కిమ్ పాలన ముగుస్తుంది' అని వ్యాఖ్యానించారు. ఇందుకు బదులు ఇస్తూ కిమ్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు మరింత దారుణమైన స్థితికి చేరుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా వైపు వదులుతోంది. 

కేసీఆర్ ను కేటీఆర్ ఏదైనా చేసి ఉండొచ్చు.. మళ్లీ నోరు జారిన కొండా సురేఖ

కొండా సురేఖ సంయమనం కోల్పోయారా? సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ వెనుక కేటీఆర్ ఉన్నారన్న అనుమానంతో ఆమె విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యల రచ్చ హోరెత్తి పోతోంది. అసలే హైడ్రా కూల్చివేతలతో ఇంటా బయటా వెల్లువెత్తుతున్న వ్యతిరేకతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రేవంత్ సర్కార్ కు ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యలు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ సర్కార్, పార్టీ ప్రతిష్ఠ మంటగలిసే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితి రేవంత్ కు ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు.  నష్ట నవారణకు చేసిన ప్రయత్నాలు ఫలించే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. తాజాగా కేసీఆర్ ను కేటీఆరే ఎదో చేసి ఉంటారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శల పేరుతో ఆమె సినీ హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలు చోట్ల కొండా సురేఖ దిష్టిబొమ్మలు సైతం దగ్ధం చేశారు. మొత్తం తెలుగు సినీ పరిశ్రమ కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టింది. సోషల్ మీడియాలో సురేఖ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.  ఈ నేపథ్యంలోనే కొండా సురేష్ సమంతకు, నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కూడా నష్ట నవారణ చర్యలకు ఉపక్రమించింది. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాఫణ చెప్పినందున ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోరారు. అయితే సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో తాను మాట్లాడిన మాటలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పిన కొండా సురేఖ, కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేదేలే అంటున్నారు.  గత కొన్ని రోజులుగా కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తనపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ కు సమర్ధిస్తున్నారంటూ సురేఖ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారిని వేధించారనీ కూడా విమర్శలు చేశారు. ఓ వైపు ఆ రచ్చ అలా కొనసాగుతుండగానే.. కొండా సురేఖ మరో సారి నోరు జారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితం నుంచి దూరంగా ఉండడానికి కూడా కేటీఆరే కారణమని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఆయనను ఏదో చేసి ఉంటారని వ్యాఖ్యానించారు.  కేటీఆర్ అధికార కాంక్షతో కేసీఆర్ ను ప్రజాజీవితంలోకి రాకుండా అండర్ గ్రౌండ్ లో బంధించి ఉంటారని కొండా సురేఖ అన్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదన్న ఆమె ఆయన కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ కేసీఆర్ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద కొండా సురేఖ తీరు కాంగ్రెస్ సర్కార్ కు రోజుకో తలనొప్పి తీసుకువస్తున్నది. కాంగ్రెస్ లోనే ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో ఆమె మంత్రి పదవికి ఎసరు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలలోనే ఓ చర్చ జోరుగా సాగుతోంది.  

ఇదే ‘వారాహి డిక్లరేషన్’

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ని ప్రకటించారు. ఇదిగో ఇదే వారాహి డిక్లరేషన్. 1) ఏ మతానికి, ఏ  ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి. 2) సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.  3) సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి. 4) సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. 5) సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి. 6) ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధ్రువీకరించే విధానాన్ని తీసుకురావాలి. 7) ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.

సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి... వారాహి సభలో పవన్ కళ్యాణ్!

తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి, తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకుని, తన దీక్షను విరమించారు. అనంతరం గురువారం సాయంత్రం ఆయన తిరుపతిలో వారాహి సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటించేవారంతా ఒక్క తాటిమీద నిలబడి బలంగా తయారవ్వాలని అన్నారు. తన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోనని అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించేవాడు మత వివక్ష చూపించడు అని వారాహి సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను కౌలు రైతులకు సహాయం చేసేటప్పుడు మతం చూడలేదని.. క్రైస్తవులు, ముస్లిం రైతులకు సహాయం చేశానని ఆయన చెప్పారు. సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కడికి చులకనగా మారిందని, సనాతన ధర్మంపై దాడి చేస్తే దేశంలో సెక్కులరిస్టులు స్పందించరు.. కానీ ఇతర మతాలపై దాడి చేస్తే దేశ వ్యాప్తంగా అంతా స్పందిస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇతర మతాలపై దాడి చేస్తే అన్ని కోర్టులు స్పందిస్తాయి గానీ, సనాతన ధర్మంపై దాడి జరిగితే ఎవరూ స్పందించరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి అంతా ఐక్యం కావాలి. శ్రీరాముడిని దేశమంతా పూజిస్తుంది.. అదే శ్రీరాముడిని చెప్పులతో కొడితే మౌనంగా ఉంటాం. రాముడిపై అసత్య ప్రచారాలు చేసినా మౌనంగా ఉంటాం. దేశ మూల సంస్కృతికి వెన్నుముక శ్రీరాముడు.. రాముడు ఉత్తరాది వాడా? రాముడికి ప్రాంతం ఉంటుందా? కొందరు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త సిద్దాంతాలు తెరపైకి తెస్తున్నారు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్‌కి పవన్ కళ్యాణ్ తమిళంలోనే సమాధానం చెప్పారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సనాతన ధర్మంతోనే తన జీవితం ముడిపడి ఉందన్న పవన్ కళ్యాణ్, తాను హిందువునని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని అన్నారు.  ‘‘ధర్మం కోసమే ఇప్పటివరకు నిలబడ్డా.. ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు.. అన్ని మతాలను సమానంగా చూస్తా.. నా కుమార్తె తిరుమలకు తీసుకెళ్లినందుకు డిక్లరేషన్ ఇప్పించా. తిరుమలలో నా చిత్తశుద్ధిని చూపించా. నన్ను విమర్శించే వాళ్లు ఒకటే గుర్తుంచుకోండి. పరాజయాలు పొందినా వెనక్కి తగ్గను. సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉంది’’ అన్నారు. జగన్‌కి ఈసారి 11 సీట్లు సరిపోలేదని, ఈసారి ఎన్నికల్లో జగన్‌ను ఒక సీటుకు పరిమితం చేస్తామని అన్నారు. 

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా!

అక్కినేని నాగార్జున మీద, నటి సమంత మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తీరిగ్గా తాను చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఆమె చేసిన దారుణమైన వ్యాఖ్యలు మాత్రం క్షమార్హం కాదని ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు. ఒక మంత్రి హోదాలో వుండి, మహిళ అయి వుండి, తన రాజకీయ అంశాలలో సినిమావాళ్ళని లాగి, దారుణమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ తన పరువు పోగొట్టుకున్నారు. అయితే, పెదవి దాటని మాటకు నువ్వు రాజువి.. పెదవి దాటిన మాటకు నువ్వు బానిసవి అన్నట్టుగా తన నోటి నుంచి వచ్చిన మాటలు కొండా సురేఖని అంత సులభంగా వదిలేలా లేవు. కొండా సురేఖ కామెంట్ల వల్ల పరువు నష్టానికి గురైన అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో గురువారం కొండా సురేఖ మీద పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే నాగార్జున కొండా సురేఖను శిక్షించాలని కోరారే తప్ప, డబ్బును డిమాండ్ చేయనట్టు తెలుస్తోంది.

ఈ ఫైర్ అప్పుడేమైంది జూనియర్?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్య విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలను హీరో  జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఖండించారు. ఘాటు మాటలతో కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. టాలీవుడ్ నుంచి  అందరి కంటే ముందుగా   కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ , అక్కినేని కుటుంబం, సమంతకు మద్దతుగా నిలిచిన ఎన్టీఆర్ ను పలువురు ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నిజమైన  హీరోలా స్పందించారంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆయన హీరోయిజం సెలెక్టివ్ ఇష్యూస్ కేనా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలకు గట్టి రిటార్డ్ ఎటువైపు నుంచీ రాదన్న నమ్మకం ఉంటేనే ఎన్టీఆర్ హీరోయిజం బయటకు వస్తుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కొండా సురేఖ కామెంట్లపై స్పాంటేనియస్ గా స్పందించి నాగార్జున కుటుంబానికి, సమంతకు మద్దతుగా గట్టిగా గొంతు వినిపించడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంతో తన స్పందనను పెద్ద సీరియస్ గా తీసుకోదన్న నమ్మకంతోనే అని అంటున్నారు. ఎందుకంటే గతంలో  ఏపీలో జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చినప్పుడుగానీ, లేక సొంత మేనత్త నందమూరి భువనేశ్వరిపై వైసీపీయులు అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. అప్పట్లో ఆయన స్పందన సాదా సీదాగా, ఎదో స్పందించక తప్పదన్న రీతిగా ఉండటాన్ని ఇప్పుడు ఎత్తి చూపుతూ, నాటి ఆయన స్పందనకు సంబంధించి వీడియోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు.   ఇది కూడా చదవండి తాత మీద ప్రేమ  మాటలకే పరిమితమా ఉత్తర కుమార!  

‘సుప్రీం’లో లడ్డూ కేసు రేపటికి వాయిదా!

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టులో గురువారం జరగాల్సిన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. సుప్రీం కోర్టు ధర్మాసనం మరో కేసులో బిజీగా వున్నందున లడ్డూ వివాదం కేసు విచారణ శుక్రవారం ఉదయం పదిన్నరనకు వాయిదా పడింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేయాలా? అనే అంశం మీద సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్నీ గురువారం నాడు చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. తిరుమల స్వామివారం భక్తులు కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ... మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలుచేసిన పిల్‌లపై బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?

మంత్రి కొండాసురేఖకు సినీ హీరో నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నట్టు తెలుస్తోంది. కెటీఆర్ వర్సెస్ కొండాసుురేఖ వివాదంలో హీరో నాగార్జున కుటుంబాన్ని తెరమీదకు తేవడం పట్ల సినీ , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సమంత పేరును ఈ వివాదంలో లాగినప్పటికీ ఆ తర్వాత కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి మొదలు ప్రతీ ఒక్కరూ నాగార్జున కుటుంబానికి బాసటగా నిలిచారు. నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్ లో లేనప్పటికీ ట్విట్టర్ వేదికగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి  ప్రధాన కారణమైన అక్కినేని ప్రతిష్టను దిగ జార్చిన కొండసురేఖపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నాగార్జున సిద్దమయ్యారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది. 

అమ్మా గజ్జలా.. ఇక దయచెయ్!

సాధారణంగా ప్రభుత్వం మారితే, పాత ప్రభుత్వం ద్వారా పదవులు పొందినవారు రాజీనామా చేస్తూ వుంటారు. అది మర్యాద. కానీ  కొంతమంది మర్యాదని కోరుకోరు. పదవిలోంచి ఊడబెరికే వరకూ ఆ కుర్చీనే పట్టుకుని వేలాడతారు. అలాంటివారే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి. ఈమె కరడుగట్టిన వైసీపీ నాయకురాలు. నోరు తెరిచారంటే ఎదుటివారి చెవుల్లోంచి రక్తం కారడం ఖాయం. ఈ అర్హత వున్నందువల్లే ఆమెకు ఈ పదవి దక్కింది. ఈ పదవిలో ఉన్నంతకాలం ఆమెకు రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఎంతమాత్రం స్పందించలేదు. జగన్ ప్రభుత్వం సర్దుకున్న తర్వాత న్యాయంగా అయితే విజయక్ష్మి తన పదవికి రాజీనామా చేయాలి. కానీ ఆమె ఆ పని చేయకుండా.. నాది రాజ్యాంగబద్ధమైన పదవి. నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ముంబై హీరోయిన్ జెత్వానీ విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంతం మొత్తం చురుగ్గా పనిచేస్తుంటే, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి చాలా విచిత్రంగా స్పందించారు. జెత్వానీ కేసును పరిశీలించాల్సిన అవసరం మహిళా కమిషన్‌కి లేదని స్పష్టంగా చెప్పారు. ఆమె ముంబైకి చెందిన యువతి కాబట్టి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. జెత్వానీ కేసు వైసీపీ నాయకులకు, జగన్‌కి చుట్టుకుంటోంది కాబట్టి విజయలక్ష్మి ఇలా స్పందించి వుంటారు. పాలనను గాడిలో పెట్టే పనిలో వున్న చంద్రబాబు గజ్జల విజయలక్ష్మి గురించి సీరియస్‌గా పట్టించుకోలేదు. మొత్తానికి ఆయన పట్టించుకుని విజయలక్ష్మిని పదవిలోంచి తీసేశారు. అయితే విజయలక్ష్మి మాత్రం తగ్గేదేలే అన్నట్టు హైకోర్టును ఆశ్రయించారు. తనను పదవి నుంచి తొగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. అయితే హైకోర్టు మాత్రం విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టేసింది. దరిమిలా విజయలక్ష్మి పదవీకాలం ముగిసింది.

బెజవాడ దుర్గమ్మకి బంగారు కిరీటం

అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. సుమారు 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు సౌరభ్ గౌర్తెలిపారు. గురువారం నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించే భక్తులకు దర్శనమివ్వనున్నారు.  అలాగే, కడపకు చెందిన సీఎం రాజేష్ అనే భక్తుడు అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు కానుకలుగా అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను అందించారు. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మతల్లికి తొలి రోజున నాలుగుకోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో బతుకమ్మ ప్రత్యేకమైన పండుగ

తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్టా, పువ్వు అన్నిటికీ ఒక చరిత్ర ఉంటుంది.  కాకతీయ సామ్రాజ్య పాలకులు చెరువులను అభివృద్ధికి ప్రతీకలుగా భావించి తెలంగాణ అంతటా చెరువులను తవ్వించారు. ప్రజలు సుభిక్షంగా ఉండేది చెరువుల వల్లే కాబట్టి అందరూ కలిసి ఏడాదికోసారి చెరువులకు పూలతో కృతఙ్ఞతలు చెప్పేవారు.  అప్పటినుండి ఈ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ చిరు మార్పులతో ఆ నాటి పండుగను నేటికీ జరుపుతున్నారు.   బతుకమ్మ పండుగ జరిపే నాటికి వర్ష ఋతువు ముగిసి చెరువులు, కుంటలు నిండి, రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది.  బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి.  లయబద్దమైన పాద కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలుగల పాటలతో రసరమ్య మోహనరాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది.  ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను పెంపొందించే పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది. దీన్ని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇది నవరాత్రులకు ముందు రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటారు. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యమైన రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వేడుకగా చేసుకుంటారు.  మొదటి రోజు-ఎంగిలి పూల బతుకమ్మ : మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని 'పెత్రామస' అని కూడా అంటారు. ఈ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. రెండో రోజు- అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మ వేడుక జరుగుతుంది. ఈ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడో రోజు-ముద్దపప్పు బతుకమ్మ : మూడో రోజు ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ : ఈ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి బతుకమ్మకు నివేదిస్తారు. ఐదో రోజు- అట్ల బతుకమ్మ : ఈ రోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ : ఆరవ రోజైన ఆశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారని ఏమి తినరని అంటారు. అందుకే నైవేద్యమేమి సమర్పించరు. ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ : ఈ రోజు వేపకాయల బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ : ఈ రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమి మహా పర్వదినం రోజున బతుకమ్మకు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు.  గ్రామీణ ప్రాంతాల్లో పూసిన పూలన్నిటిని సేకరించి, ఇంద్రధనస్సుల్లా పేర్చడం బతుకమ్మ వేడుకల్లో ప్రధాన క్రతువు.  వాటిల్లో బంతి, చామంతి, గునుగు, సీతజడ, గుమ్మడి, తంగేడు, గడ్డి పూలు ఇలా అన్ని రకాల రంగు రంగుల పూలను శిఖరంగా పేర్చి, ఆ పైన గొబ్బెమ్మను ఉంచి, మహిళలంతా కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం  సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక అనుబంధాల సమాహారం.  ఇవి అందంగా వర్ణరంజితంగా కనిపిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తాయి.  గునుగు పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంన్ ఫ్లమెటరీ  గుణాలు వుంటే గుణాలు వుంటే బంతి ఎన్నో అనారోగ్యాలను నివారిస్తుంది. చామంతి కాల్షియమ్, ఫోలేట్, ఇనుము, జింక్ వంటి ఎన్నో పోషకాలను అందిస్తుంది. వైరస్ ను అరికట్టడంలో, గాయాలను మాన్పడంలో గడ్డి పువ్వు దోహదపడుతుంది. అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని కలిసి, ఆడి, పాడుతారు. మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను వెనక్కి తీసుకుని, మహిళలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటారు. మహిళలు దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తారు.   బతుకమ్మ పండుగ ఫలహారాలలో పుష్కలమైన ఖనిజ, విటమిన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.  తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే, ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ,  నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మను పూజిస్తారు.  గ్రామీణ ప్రాంతాల్లో పూసిన పూలన్నిటిని సేకరించి, ఇంద్రధనస్సుల్లా పేర్చడం బతుకమ్మ వేడుకల్లో ప్రధాన క్రతువు.  వాటిల్లో బంతి, చామంతి, గునుగు, సీతజడ, గుమ్మడి, తంగేడు, గడ్డి పూలు ఇలా అన్ని రకాల రంగు రంగుల పూలను శిఖరంగా పేర్చి, ఆ పైన గొబ్బెమ్మను ఉంచి, మహిళలంతా కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం  సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక అనుబంధాల సమాహారం.  ఇవి అందంగా వర్ణరంజితంగా కనిపిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తాయి.  గునుగు పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంన్ ఫ్లమెటరీ  గుణాలు వుంటే గుణాలు వుంటే బంతి ఎన్నో అనారోగ్యాలను నివారిస్తుంది. చామంతి కాల్షియమ్, ఫోలేట్, ఇనుము, జింక్ వంటి ఎన్నో పోషకాలను అందిస్తుంది. వైరస్ ను అరికట్టడంలో, గాయాలను మాన్పడంలో గడ్డి పువ్వు దోహదపడుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తిని పెంచారు.  తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం విదేశాలలో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.                                                                                              -  కైలాస్ నాగేష్  

హైడ్రా ఆర్డినెన్స్.కి గవర్నర్ ఆమోదం!

హైడ్రా కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ వర్మ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధతతో పాటు  రక్షణ కూడా ఉంటుంది. ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ను 6 నెలలలోపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అప్పటివరకు హైడ్రాకు గవర్నర్ ఆమోదించిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా ఉండబోతోంది.ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో  హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ కు ఇప్పుడు గవర్నర్ ఆమోదముద్ర పడింది.  గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ప్లే గ్రౌండ్స్ సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరిత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి ఎన్ ఓసీల జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.

‘వంశధార’ను పూర్తి చేస్తాం!

శ్రీకాకుళం జిల్లా జీవనాడి వంశధార ప్రాజెక్టు రెండవ దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని, అలాగే ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను ఆధునికీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  వంశధార కార్యాలయ ఆవరణలో వంశధార ప్రాజెక్టు రూపశిల్పి దివంగత సిఆర్ఎం పట్నాయక్, అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్యల విగ్రహాలను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రులు మాట్లాడారు.  త్వరలోనే నాగావళి వంశధార నదుల అనుసంధానాన్ని కూడా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.  అలాగే  నేరడి బ్యారేజ్‌కి సంబంధించి ఒడిశాతో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఒడిశా ముఖ్యమంత్రిని కలిసేలా ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేకుండా నేరడి బ్యారేజ్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.