బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు తెలుగుదేశం పార్టీయే పోటీ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్పేసే లేదంటూ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ బీరాలు పలికింది. అయితే ఆ పార్టీ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలన్న ఆశలకు తెలుగుదేశం పార్టీయే గండి కొట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఖమ్మంలో నిర్వహించిన సభకు అశేష జనం  హాజరై ఆ సభను దిగ్విజయం చేశారు. అప్పటి వరకూ విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం నామమాత్రమన్న భావన సర్వత్రా ఉండేది. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం పార్టీపై ప్రజలలో విశ్వాసం చెక్కు చెదరలేదనీ, క్యాడర్ ఇన్ టాక్ట్ గా తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉందని చెబుతూ వచ్చారు. కేవలం క్యాడర్ కు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం వల్లే తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి అంతంత మాత్రమేనన్న భావన ప్రజలలో నెలకొందని తెలుగుదేశం నాయకత్వం నమ్మింది. 2023 డిసెంబర్ లో చంద్రబాబు నాయుడు ఖమ్మం వేదికగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనసందోహాన్ని చూసి తెలంగాణలే మేమేం తోపులం అని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఒక్క సారి ఉలిక్కిపడింది. సరే ఆ తరువాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. అయితే నాడు ఖమ్మం సభతో తెలంగాణలో తెలుగుదేశం బలం ఏమిటన్నది అందరికీ తెలిసి వచ్చింది.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకువస్తానని ప్రకటించారు. అందుకోసం కార్యాచరణ సైతం సిద్ధం చేశారు. తరచూ హైదరాబాద్ వచ్చి రాష్ట్ర పార్టీ పరిస్థితిపై చర్చిస్తాననీ, సమీక్షిస్తాననీ, నెలకొసారి అయినా రాష్ట్రంలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు.  దీంతో వివిధ కారణాలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని వీడి వేర్వేరు పార్టీలలో సర్దుకున్న వారిలో పలువురు నేతలు సొంత గూటికి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. వీరిలో అత్యధికులు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నవారే కావడం  గమనార్హం. వీరిలో మొదటిగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయిన తీగల కృష్ణారెడ్డి ఆ భేటీ అనంతరం తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడమే కా కుండా రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి చంద్రబాబు మార్గదర్శకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంచలన ప్రకటన చేశారు. తీగలే కాకుండా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. తన మనవరాలి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికే ఆయనను కలిసినట్లు చెప్పినా.. మల్లారెడ్డి కూడా త్వరలో తెలుగుదేశం గూటికి చేరుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షపదవికి ఆయన కూడా రేసులో ఉండే అవకాశం ఉందంటున్నారు. వీరే కాకుండా నందిగం కృష్ణారావు వంటి వారు కూడా బీఆర్ఎస్ ను వీడి సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.   ఈ సందర్భంగా పరిశీలకులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదని, తెలంగాణ ఉద్యమ వేడి, తెలంగాణ సాధించుకున్న సంబరాల మధ్య జరిగిన 2014 ఎన్నికలలో కేడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 20పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు కూడా తెలంగాణ సంతుల్య అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిందేనన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో ఉందని చెబుతున్నారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి అంతా  ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే  జరిగిందని గుర్తు చేస్తున్నారు.  హైటెక్ సిటీ,సైబరాబాద్ వంటివి చంద్రబాబు పాలనలోనే వచ్చాయని చెబుతున్నారు.     తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పటి టీడీపీ నాయకుడే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్, బాబు మంత్రివర్గాలలో పనిచేసారు. ఈనాటి తెలంగాణ నాయకుల్లో అత్యధికులు ఒకప్పటి టీడీపీ నుంచివచ్చినవారే. వారి మాతృసంస్థ టీడీపీ నే. తెలంగాణను పీడిస్తున్న పటేల్,పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఎన్టీఆర్ తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందారు. ఇక చంద్రబాబు వచ్చిన తరువాత ఐటీ పరిశ్రమ అభివృద్ధి జరిగి మధ్యతరగతి ప్రజలను ఉన్నత స్థాయికి ఎదిగారు. సైబరాబాద్ నిర్మాణంతో నగరం విస్తరణలో పాటు సాంకేతిక పెరిగింది. పర్యాటక ప్రాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉపాధి ఇచ్చే కామధేనువుగా మారింది. ఆ విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు. అందుకే జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు తెలంగాణలో చంద్రబాబుకు మద్దతుగా వెల్లువెత్తిన ఆందోళనలు రాష్ట్రంలో తెలుగుదేశంకు ఉన్న మద్దతును, బలాన్ని చాటాయి. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో పలువురు నేతలు సైకిలెక్కేయడానికి సిద్ధపడ్డారు. ముందు ముందు మరింత మంది తెలంగాణ నేతలు హోం కమింగ్ అంటూ ప్రస్తుతం వారు ఉన్న పార్టీలను వదిలి తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమని తీగల కృష్ణారెడ్డి మాటలను బట్టి అవగతమౌతోంది.  తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రానున్న రోజులలో మారనున్నాయని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇచ్చేది తెలుగుదేశం పార్టీయేనని అంటున్నారు.  ఇది కూడా చదవండి.. తెలంగాణలో తెలుగుదేశం.. అదే ఆదరణ.. అదే ప్రభంజనం

ఈ ఏడాది ఇద్దరికి ఫిజిక్స్ నోబెల్!

ఫిజిక్స్.లో విశేష కృషి చేసినందుకు ఈ సంవత్సరం ఇద్దరికి నోబెల్ బహుమతి దక్కింది. జాన్ జె. హోప్ఫిల్డ్, జెర్రీ ఈ. హింటన్లకు ఈ ప్రతిష్ఠాత్కక పురస్కారం లభించింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్ మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకు ఈ అత్యున్నత పురస్కారం వీరిద్దరినీ వరించింది. గత సంవత్సరం ఫిజిక్స్.లో ఈ బహుమతి ముగ్గురిని వరించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్ సైంటిస్ట్ పియర్ అగోస్తి, హంగేరియన్ సంతతి వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్-స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్ హ్యులియర్ ఈ బహుమతి అందుకున్నారు. 1901 నుంచి ఇప్పటివరకు 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. మెడికల్ విభాగంతో మొదలైన నోబెల్ బహుమతుల ప్రకటన అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. నిన్న (సోమవారం) వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నేడు (మంగళవారం) ఫిజిక్స్.లో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం కెమిస్ట్రీ, గురువారం లిటరేచర్ విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్టోబర్ 14న ఎకనామిక్స్ నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. స్వీటన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, బిజినెస్‌మన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల అమెరికన్ డాలర్లు) నగదు అందుతుంది. ఈ బహుమతులను ఈ ఏడాది డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.

నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేసిన నాంపల్లి కోర్టు 

మంత్రి కొండాసురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది.  నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో నాగార్జున కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా  నాగార్జున  దాఖలు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 7న ప్రత్యేక విచారణ జరిగింది. తన మాటలను కొండాసురేఖ ఉపసంహరించుకున్నప్పటికీ నాగార్జున సీరియస్ గానే ఉన్నారు.  నాగార్జున అడ్వకేట్  ఇప్పటికే జడ్జికి ఇద్దరు సాక్ష్యుల స్టేట్ మెంట్ ఇవ్వనున్నట్టు సమాచారమిచ్చారు. నాగార్జున వెంట  ఆయన భార్య అమల, కుమారుడు నాగ చైతన్య కూడా కోర్టుకు వచ్చారు.  కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును అభ్యర్థించారు. 

పవన్ వర్సెస్ ఉదయనిథి స్టాలిన్.. ఎవరు బెటరంటే?

లడ్డూ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల ప్రస్తావన తెరమీదకు వచ్చింది. నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఏవోవో మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయనీ వ్యాఖ్యలలో పవన్ కల్యాణ్ పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా సనాతన ధర్మం అనడంతో ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే పవన్ కల్యాణ్ ను ఉద్దేశించేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు ప్రకాశ్ రాజ్ తన వ్యాఖ్యలతో ఒక విధంగా ఇరు రాష్ట్రాల మధ్యా రచ్చకు కారణమయ్యారని చెప్పవచ్చు.  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలకు ఒక సారూప్యత ఉంది. రెండు రాష్ట్రాలలోనూ సినీమా, రాజకీయాలకు విడదీయరాని, విడదీయలేని సంబంధం ఉంది. తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా పని చేశారు. వీరు తమ పదవీ కాలంలో ఆయా రాష్ట్రాలలో రాజకీయాలనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలను ప్రభావితం చేశారు. తమిళనాట ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా జయలలిత కూడా తనదైన ముద్ర వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తరువాత తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబునాయుడు ముందుండి నడిపిస్తున్నారు. ఇక సినీ రంగం నుంచే రాజకీయ ప్రవేశం చేసిన కరుణానిథి కూడా తమిళనాడు రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. ఆయన వారసుడిగా స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవలే ఆయన కుమారుడు ఉదయనిథి స్థాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉమ ముఖ్యమంత్రిగా ఉన్నారు.  ఇప్పుడు రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులదీ సినీమా నేపథ్యమే. అయితే ఉదయనిథి స్టాలిన్ రాజకీయ ప్రవేశం నుంచి ఎదిగి ఉపముఖ్యమంత్రి పదవీ చేపట్టడం వరకూ ఆయన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండదండలు, మార్గదర్శకత్వం ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయాలలో ప్రతి అడుగూ ఆయనకు ఆయన నిర్దేశించుకుని వేసినదే. ఆయనకు రాజకీయంగా ఎవరి అండదండలూ లేవు.   2014 ఎన్నికల నాటికే పవన్  కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే అగ్రతాంబూలం అంటూ ఆ నాడు పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అప్పటి ప్రధాని అభ్యర్థి, బీజేపీ నేత మోడీతో కలిసి రాష్ట్రంలో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు.  ఇక 2019 ఎన్నికల నాటికి వచ్చే సరికి ఆయన ఎన్నికల బరిలో దిగారు. అయితే ఫలితం మాత్రం ప్రతికూలంగా రావడమే కాకుండా, స్వయంగా తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలోనూ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. పార్టీ తరఫున గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా  ఆ తరువాత అప్పటి అధికార పార్టీ వైసీపీలోకి జంప్ చేసేశారు. అయితే అంతటి ఘోర పరాజయాన్ని కూడా తట్టుకుని ఆయన జనసేనను ముందుకు నడిపించారు.   2024 ఎన్నికల నాటికి గట్టిగా పుంజుకున్నారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత ఏర్పడేందుకు మధ్యవర్తిత్వం నెరిపారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదరడంలో కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా ఆ ఎన్నికలలో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో పార్టీని గెలిపించి వంద శాతం ఫలితాన్ని సాధించారు.  ఒక రకంగా ఉదయనిథి  తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుని ఎదిగితే.. పవన్ కల్యాణ్ మాత్రం స్వశక్తిని నమ్ముకుని ఒంటరిగా రాజకీయ అడుగులు వేసి ఈ స్థాయికి చేరుకున్నారు.  అందుకే పరిశీలకులు పవన్ కల్యాణ్ ఈజ్ ఫార్ బెటర్ దేన్ ఉదయనిధి అంటున్నారు. 

ఇకపై ‘ఎమ్మెల్యే వినేష్ ఫొగాట్’!

కుస్తీ క్రీడాకారిణి, కాంగ్రెస్ నాయకురాలు వినేష్ ఫొగాట్ హర్యానా ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జులానా నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. ప్యారిస్ ఒలింపిక్స్.లో 100 గ్రాముల బరువు పెరిగిన కారణంగా పతకాన్ని కోల్పోయిన ఆమె, ఎన్నికలలో కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చినా, చివరకు నిలదొక్కుకుని విజయం సాధించారు. ఒక దశలో ఆమె కౌంటింగ్ సమయంలో తాను ఓడిపోవడం ఖాయమనుకుని కౌంటింగ్ స్టేషన్ నుంచి కూడా వెళ్ళిపోయారు. అయితే తరువాతి రౌండ్స్.లో ఆమెకు ఓట్లు పెరిగి విజయం సాధించారు. ఈ స్థానంలో తనకు ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కవితారాణి మీద ఫొగాట్ విజయం సాధించారు.

ఉమ్మడి కడప జిల్లాలో ఫ్యాన్ కు ఉక్కపోత.. ఒక్కటొక్కటిగా చేజారుతున్న మునిసిపాలిటీలు!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రతిష్ట మసకబారింది. ఆ పార్టీకి గట్టి పట్టున్న రాయలసీమలో సైతం ఇటీవలి ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అయితే కొద్దిగా దెబ్బతిన్నా కడప జిల్లాలో మాత్రం ఏదో పరువు దక్కింది అనిపించుకోగలిగింది.  జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టు నిలుపుకున్నా.. ఆయన సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం గత పదేళ్లుగా ప్రతినిథ్యం వహిస్తూ వస్తున్న కమలాపరంలో పట్టు కోల్పోయారు. ఘోర పరాజయం పాలయ్యారు.   అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కడప జిల్లాలో వైసీపీ ప్రభ వేగంగా మసక బారిపోతోంది. జిల్లాలోని మునిసిపాలిటీలు ఒకదాని వెంట ఒకటిగా వైసీపీ చేజారుతున్నాయి.  కడప, ప్రొద్దుటూరు, రాజంపేట.. ఇలా అన్ని మునిసిపాలిటీల్లోనూ అదే పరిస్థితి కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. క్యాడర్ సంగతి సరే సరి వారెప్పుడో పార్టీకి దూరం అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్ మేనమాప పదేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన కమలాపురం మునిసిపాలిటీ కూడా చేజారిపోతోంది. ఇలా జిల్లాలో ఒక్కటంటే ఒక్క మునిసిపాలిటీ కూడా వైసీపీకి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. చివరాఖరికి కడప కార్పొరేషన్ లోనూ అదే పరిస్థితి. అంతేందుకు పులివెందుల మునిసిపల్ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం తలుపుతడుతున్న పరిస్థితి. అయితే తెలుగుదేశం నుంచి వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనీ, అందుకే పులివెందులలో ప్రస్తుతానికి వైసీపీ సేఫ్ గా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు తాజాగా కమలాపురం మునిసిపల్ చైర్మన్  మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి చేరికతో కమలాపురం మునిసిపాలిటీలో వైసీపీ మైనారిటీ అయిపోయింది. గతంలోనే పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజా చేరికలతో కమలాపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం మెజారిటీ లో ఉంది. దీంతో  కమలాపురం మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైనట్లే.  

కాశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బీజేపీ హవా!

జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హర్యానాలోఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. మొదట కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. అటు జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 12.40 గంటల వరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ ఆధిక్యం, గెలుపు స్థానాలు కలిపి బీజేపీ 48 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 35 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి దూసుకెళ్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, బీజేపీ 28, పీడీపీ 2, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ, బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి.

సీనియర్ న్యాయవాది సుంకరకు సతీ వియోగం!

రాజస్థాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్నదుర్మరణం పాలయ్యారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బెజవాడ్ బార్ కౌన్సిల్ కు చెందిన 78 మంది న్యాయవాదులు స్టడీ టూర్ నిమిత్తం రాజస్థాన్ వెళ్లారు. ఈ తెల్లవారు జామున జోధ్ పూర్ టోల్ గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్యోత్స మరణించారు.  జ్యోత్స్న కూడా న్యాయవాది. అమరావతి రైతులకు మద్దతుగా ఆమె గట్టిగా నిలబడ్డారు. మహిళా సాధికారత కోసం కృషి చేశారు. ఆమె మరణం పట్ల మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  అలాగే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కూడా సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుంకర రాజేంద్రప్రసాద్‌కి సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన న్యాయవాదులు త్వరగా కోరుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

పోలవరానికి కేంద్రం 2800 కోట్ల వరం!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2800 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఏ పద్దు కింద ఈ నిధులు విడుదలయ్యాయన్న స్పష్టమైన సమాచారం లేదు. అయితే ప్రాజెక్టు అధికారులు మాత్రం పాత  పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద రూ. 800 కోట్లు, పనులు చేపట్టేందుకు  అడ్వాన్సుగా రూ. 2000 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ హయాంలో ఐదేళ్లుగా అతీగతీ లేనట్లుగా నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత పరుగులు తీస్తున్నాయి. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది.  

జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డే కారణమా?

జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల జడివాన కురిపించడానికి ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్.. ఏడేళ్ల పసిపాప హత్య ఉదంతాన్ని కూడా కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించడానికి వాడుకోవడానికి రెడీ అయిపోయారు. ఇందు కోసం ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి పుంగనూరు పర్యటనకు రెడీ అయిపోయారు. అయితే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి జగన్ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకునేలా చేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  ఏడేళ్ల చిన్నారి అస్పియా గత నెల 29న అదృశ్యమైంది. ఆ తరువాత ఆమె మృతదేహం ఒక సమ్మర్  స్టోరేజ్ ట్యాంక్ లో లభ్యమైంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే వైసీపీ మాత్రం తెలుగుదేశం పాలనలో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా తయారైందంటూ గగ్గోలు పెట్టింది.  అయితే ఈ సంఘటనపై వేగంగా స్పందించిన పోలీసు యంత్రాంగం ఇద్దరు అనుమా నితులను అరెస్టు చేసింది. ప్రభుత్వం కూడా బాలిక తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా బాలిక హత్య వెనుక ఆర్థిక కారణాలున్నాయని తేలింది. బాలిక తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపార లావాదేవీలలో ఉన్న గొడవల కారణంగా ఆయనపై కక్ష పెంచుకున్న వారు బాలికను హత్య చేశారని వెల్లడైంది. ఈ లోగానే మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే  వైసీపీ నేతలు బాలిక పేరు, వివరాలు వెల్లడించారు. సున్నితమైన ఇటువంటి విషయాలలో బాధితురాలి పేరు వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధనను ఉల్లంఘించారు. రాజకీయ విమర్శలను పట్టించుకోకుండా పోలీసులు మాత్రం బాలిక హత్య కేసు ఛేదించే విషయంలో ముందుకు సాగారు. అయితే వీటిని వేటినీ పట్టించుకోకుండా ఒక శవం దొరికింది.. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని చెండాడేయవచ్చు అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుంగనూరు పర్యటనకు సిద్ధమైపోయారు.  బుధవారం (అక్టోబర్ 9) న ఆయన పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ లోగానే చిన్నారి హత్య కేసులో రాజకీయ లబ్ధి సాధ్యంకాదన్న విషయం తేలిపోయింది. పైపెచ్చు ఈ సమయంలో జగన్ పుంగనూరులో పర్యటిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తధ్యమని భావించిన పెద్దిరెడ్డి జగన్ ను పర్యటన రద్దు చేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఇప్పటికే పుంగనూరులో పెద్దరెడ్డి ఆయన కుమారుడి పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. బాలిక హత్య కేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించడం, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి స్పష్టమైన భరోసా లభించడంతో జగన్ పర్యటన వల్ల ప్రయోజనం ఉండదని నిర్దారించుకున్నా పెద్దిరెడ్డి జగన్ పర్యటనకు  రాకుండా అడ్డుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.