ఆంధ్రాలో అప్పుల అప్పలమ్మలు ఎక్కువే!
posted on Oct 11, 2024 @ 2:15PM
యథారాజా తథా ప్రజా అన్నట్టుగా పాలించేవాళ్ళు ఏది చేస్తే, పాలించబడేవాళ్ళు కూడా అదే చేస్తారు. ఈ పార్టీ... ఆ పార్టీ... ఈ రాష్ట్రం... ఆ రాష్ట్రం అని కాకుండా దేశంలో ప్రతి ఒక్క ప్రభుత్వమూ అప్పుల మీదే బండి లాగిస్తోంది. జానానికి ఉచితాలు అలవాటు చేసిన నాయకులు అప్పులు చేసి మరీ గొప్పలు చెప్పుకుంటున్నారు. దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తూ ఉచితాలు ఇవ్వడం తమ గొప్పతనంగానో, తన తాతలు సంపాదించిన ముల్లెని పంచుతున్నట్టుగానో బిల్డప్పు ఇచ్చుకుంటూ బతికేస్తున్నారు. ఈ జనం కూడా ప్రభుత్వం అప్పులు చేస్తోందో, అల్లాడి చస్తుందో మాకెందుకు... మా ఉచితాలు మాకు కావాలి అన్నట్టుగా వున్నారు. అందుకే దేశం అప్పుల కుప్పలా తయారైంది. దేశం సంగతి అలా వుంచితే, దేశ ప్రజలు కూడా అప్పులు చేయడంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. అక్షరమాలలో అగ్రస్థానంలో వున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అప్పులు చేయడంలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్టు ఇటీవల కేంద్రం వెల్లడించిన నివేదిక చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు దాటిన వారిలో ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది అప్పులు చేయడం ద్వారానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు కేంద్రం ఇటీవల విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే వెల్లడించింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం మంది అప్పుల అప్పారావులే అన్నమాట! సాధారణంగా పట్టణాలు అభివృద్ధి చెందాయి, గ్రామాలు అభివృద్ధి చెందలేదు అని అనుకుంటూ వుంటాం. కానీ, అప్పులు చేసే విషయంలో పట్టణాల్లో వుండే జనం కంటే గ్రామాల్లో వున్న జనమే ఫార్వర్డ్.గా వున్నారట. పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు 4.3 శాతం ముందున్నారట. అలాగే పట్టణాల్లో వుండే మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వున్న మహిళలే ఎక్కువగా అప్పులు చేస్తున్నారట. ఓవరాల్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ అప్పులు చేస్తున్నారట. అప్పులు చేసే విషయంలో అప్పుల అప్పారావుల కంటే అప్పుల అప్పలమ్మలదే అప్పర్ హ్యాండ్ అని అర్థమవుతోంది. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, అప్పులు చేయడంలో తెలుగు మహిళలే దేశంలో అన్ని రాష్ట్రాల మహిళల కంటే ముందంజలో వున్నారట. ఇక ప్రభుత్వాలు చేసే అప్పుల విషయాన్ని మరోసారి ప్రస్తావించుకుంటే, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల మీద కంటే, దక్షిణాది రాష్ట్రాల ప్రజల నెత్తినే ఎక్కువ అప్పుల భారం వుందట.