ఆర్జీవీ విచారణకు మళ్లీ డుమ్మా?
posted on Feb 10, 2025 9:24AM
రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు మరో సారి డుమ్మా కొట్టనున్నారా? అమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ ఆయనను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు రామ్ గోపాల్ వర్మ సోమవారం (ఫిబ్రవరి 10) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో రామ్ గోపాల్ వర్మ మూవీ ప్రమోషన్స్ కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ సీఐడీకి సమాచారం ఇచ్చారు.
మూవీ ప్రమోషన్స్ తో పాటు ’ నెల 28న సినీమా విడుదల కూడా ఉందనీ, అందుకు విచారణకు హాజరయ్యేందుకు తనకు ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. అయితే రామ్ గోపాల్ వర్మ వినతిపై సీఐడీ స్పందించలేదు. దీంతో ఆయన విచారణకు హాజరౌతారా? డుమ్మా కొడతారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒక వేళ ఆయన విచారణకు హాజరు కాకుంటే మరో సారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా సోషల్ మీడియాలో పోస్టులపై రామ్ గోపాల్ వర్మ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు యాంటిసిపేటరీ బెయిలు ఇచ్చిన కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టు భావిస్తే బెయిలు రద్దౌతుంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ శనివారం (ఫిబ్రవరి 8) ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా పోలీసులు ఆయనను 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి, అవసరమైతే మళ్లీ పిలుస్తాం రావాలని పేర్కొని పంపించారు. ఆ విచారణ పూర్తి అవ్వగానే సీఐడీ పోలీసులు ఆయనను నోటీసులు ఇచ్చి సోమవారం (ఫిబ్రవరి 10) విచారణకు రావాల్సిందిగా కోరారు.
ఈ మేరకు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వర్మ సీఐడీ విచారణకు హాజరు కాలేనంటూ సీఐడీకి సమాచారం ఇచ్చారు. సీఐడీ ఆయన వినతిని అంగీకరిస్తుందా? లేక మరోసారి నోటీసులు జారీ చేస్తుందా? అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒక వేళ సీఐడీ నోటీసులను బేఖాతరు చేసి రామ్ గోపాల్ వర్మ విచారణకు గైర్హాజరైతే బెయిలు రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.