కిరణ్ రాయల్ పై వైసీపీ ఆరోపణలు.. అంబటి, గోరంట్ల మాధవ్ లు గుర్తు లేరా?
posted on Feb 10, 2025 @ 9:53AM
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల నుంచి ఆయనను దూరంగా ఉండాలని జనసేన అధేశించింది. పార్టీ తరఫున కిరణ్ రాయల్ పై విచారణకు ఆదేశించడమే కాకుండా విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.
ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలతో జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కిరణ్ రాయల్ కూడా ఘాటుగానే స్పందించారు. తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ అని స్పష్టంగా పేర్కొనడంతో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడం తాత్కాలిక నిర్ణయమేనని స్పష్టం చేసినట్లైంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో జనసేన చాలా పారదర్శకంగా వ్యవహరించిందనే చెప్పాలి. శనివారం సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ కు సంబంధించి వీడియోలు వైరల్ కాగానే.. జనసేన ఆయనపై విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టింది.
అయితే ఈ వ్యవహారంలో వైసీపీ ఓవర్ యాక్షన్ వెగటు పుట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కిరణ్ రాయల్ వ్యవహారంలో వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా ఇష్టారీతిగా రెచ్చిపోతోంది. అదే సమయంలో ఆ పార్టీలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రమోషన్లు ఇస్తూ.. కిరణ్ రాయల్ విషయంలో మాత్రం జనసేనపై విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గతంలో వచ్చిన ఆరోపణలు, ఒక మహిళతో ఆయన అసభ్య సంభాషణ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అంబటి రాంబాబుపై ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా, ఈ ఆరోపణల తరువాతే జగన్ అంబటిని మంత్రిగా ప్రమోట్ చేశారు. అదే విధంగా ఆ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయం కూడా అంతే. ఎంపీగా ఉండి ఆయన చేసిన ఛండాలం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. దీనిపై జగన్ ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా.. ఇప్పడు అదే గోరంట్ల మాధవ్ ను వైసీపీ జాతీయ అధికార ప్రతినిథిని చేసి అందలం ఎక్కించారు.
ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో జనసేన విచారణకు ఆదేశించింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. విచారణలో ఆయన తప్పు చేసినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటుంది. కానీ అంత వరకూ ఆగకుండా వైసీపీ చేస్తున్న గగ్గోలు సిగ్గు చేటని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.