ప్రజారాజ్యమే జనసేన అయ్యింది.. చిరంజీవి భాష్యం
posted on Feb 10, 2025 9:07AM
మెగా స్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనక దూరం కాలేదు. ఈ విషయాన్ని చిరంజీవే గతంలో స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కోసమే.. లేదా ఉభయతారకంగా కలిసి వస్తుందనో కానీ ఆయన ఆ సినిమా విడుదలకు ముందు ఆ సినీమా పోస్టర్ తో కూడిన ఓ ఆడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
అది ఆ సినిమాలో ఆయన డైలాగ్ అయితేనేం.. అక్కడ నుంచి ప్రతి సందర్భంలోనూ చిరంజీవి రాజకీయాలకు కేంద్ర బిందువుగానే ఉన్నారు. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాల వరకూ ఆయన ఫేమ్ ను పాపులారిటీని రాజకీయాల కోసవ వాడుకునేందుకు అన్ని పార్టీలూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే చిరంజీవి మాత్రం తామరాకు మీద నీటి బొట్టు చందంగా అందరికీ సమదూరంలో ఉంటున్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నుంచీ ఆయన ఒకింత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన గతంలో తాను ప్రారంభించి కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్రజారాజ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాను ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీయే ఇప్పుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ నోట జనసేన నినాదం రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
తాజాగా లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఫిబ్రవరి 9)జరిగింది. ఆ ఈవెంట్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన జై జనసేన అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రజారాజ్యం ప్రస్తావన చేశారు. అందుకు కారణం లేకపోలేదు. ఆ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగం ప్రారంభించగానే ప్రేక్షకులు పెద్ద ఎత్తున జై జనసేన నినాదాలు చేశారు. దీంతో ఆయన కూడా వారితో గొంతు కలిపారు. జై జనసేన అని నినాదం చేయడమే కాకుండా.. తాను ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందిందని భాష్యం చెప్పారు. చిరు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మెగాభిమాల్లో ఆనందం వ్యక్తం అవుతుంటే.. రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక నుంచి చిరు ప్రత్యక్షంగా జనసేన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరో వైపు ఆయన బీజేపీవైపు కూడా మొగ్గు చూపుతున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఉంది. దీంతో ముందుముందు చిరంజీవి సెంట్రిక్ గా బీజేపీ, జనసేనల రాజకీయ కార్యకలాపాలు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి నోట జై జనసేన నినాదం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.